జూన్‌ 11.. (సినీ చరిత్రలో ఈరోజు)

* థ్రిల్లర్‌ సినిమాలకు నాంది..


ఓ నిశ్శబ్ద చిత్రం... కానీ నిశ్శబ్దంగానే ఓ వినూత్నమైన ఒరవడికి నాంది పలికింది. ఇప్పుడు అందరూ గొప్పగా చెప్పుకునే థ్రిల్లర్‌ సినిమాలనే ఓ ప్రత్యేకమైన జోనర్‌కి శ్రీకారం చుట్టింది. అదే ‘ద లాడ్జర్‌: ఎ స్టోరీ ఆఫ్‌ ద లండన్‌ ఫాగ్‌’. దీన్ని తీసింది ఎవరో తెలుసా? ‘మాస్టర్‌ ఆఫ్‌ సస్పెన్స్‌’గా ప్రపంచవ్యాప్తంగా పేరొందిన దిగ్దర్శకుడు ‘ఆల్‌ఫ్రెడ్‌ హిచ్‌కాక్‌’. ఆయన తీసిన ఈ సినిమా ఇదే రోజు విడుదలై ప్రపంచ సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రతి మంగళవారం రాగి రంగు జుట్టుతో అందంగా ఉండే అమ్మాయిలను చంపే ఓ సీరియల్‌ కిల్లర్‌ కథతో తీసిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది.

* భూమికి వచ్చిన గ్రహాంతర వాసి..


వేరే గ్రహం నుంచి ఓ అంతరిక్ష నౌక భూమికి వచ్చింది. అందులోంచి ఓ గ్రహాంతర వాసి దిగింది. అనుకోకుండా జరిగిన ఓ సంఘటన వల్ల అంతరిక్ష నౌక వెళ్లిపోయింది. ఆ గ్రహాంతర వాసిని కొందరు పిల్లలు ఎవరికీ కనిపించకుండా దాచి, రక్షించారు.... ఆసక్తికరమైన ఈ కథతో వచ్చి, ప్రపంచ ప్రేక్షకులను విశేషంగా ఆకర్షించిన ‘ఇ.టి. ద ఎక్స్‌ట్రా టెర్రెస్టియ్రల్‌’ సినిమా 1982లో ఇదే రోజు విడుదలైంది. ప్రఖ్యాత దర్శకుడు స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌ దీనికి దర్శకుడు. ఈ సైన్స్‌ఫిక్షన్‌ సినిమా విడుదలవుతూనే సంచలనాత్మక విజయం సాధించింది. అంతవరకు స్టార్‌వార్స్‌ పేరిట ఉన్న వసూళ్ల రికార్డును బద్దలు కొట్టి, మరో పదకొండేళ్ల వరకు అత్యధికంగా ఆర్జించిన చిత్రంగా నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా 619 మిలియన్‌ డాలర్లు రాబట్టింది. ఈ సినిమా షేర్‌ ద్వారా అప్పట్లో స్పీల్‌బర్గ్‌కి రోజు 5 లక్షల డాలర్లు వచ్చిపడ్డాయి.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.