జూన్‌ 13.. (సినీ చరిత్రలో ఈరోజు)

* యువ జంట... కాసుల పంట!


ఎక్కడ 6 మిలియన్‌ డాలర్లు?

ఎక్కడ 395 మిలియన్‌ డాలర్లు?
పెట్టుబడికి ఇన్ని రెట్ల లాభాలను ఓ సినిమా ఆర్జించిందంటే దాని గురించి తప్పక చెప్పుకోవలసిందే.
అదే... ‘గ్రీజ్‌’ (1978).

ప్రముఖ హాలీవుడ్‌ నటుడు జాన్‌ ట్రవోల్టా హీరో అయితే, అందాల తార ఓలివియా న్యూటన్‌జాన్‌ హీరోయిన్‌. ఇక సినిమా మ్యూజికల్‌ రొమాంటిక్‌ కామెడీ. అంటే ప్రేమ, రొమాన్స్, పాటలు, డ్యాన్స్‌లతో కూడిన సినిమా. ఇక హిట్‌ కాకుండా ఎలా ఉంటుంది? కథ విషయానికి వస్తే... వేసవి సెలవుల్లో ఓ అబ్బాయి, ఓ అమ్మాయి బీచ్‌లో మొదటిసారిగా ఒకరికొకరు పరిచయమవుతారు. ప్రేమలో పడతారు. ఆపై సెలవులన్నీ ఆనందంగా గడిపేస్తారు. తర్వాత ఎవరి ఇళ్లకు వాళ్లు వెళ్లిపోతారు. అయితే అనుకోకుండా ఇద్దరూ ఒకే స్కూల్లో చేరుతారు. అబ్బాయి ‘గ్రీజర్స్‌’ అనే గ్యాంగ్‌కి లీడర్‌ అయితే, అమ్మాయి ‘పింక్‌ గర్ల్స్‌’ అనే గ్యాంగ్‌కి లీడర్‌. ఈ రెండు గ్రూపులకు ఒకరంటే ఒకరికి పడదు. ప్రతి చోటా పోటీ పడుతుంటారు. పాటలైనా, డ్యాన్స్‌లైనా, ఆటలైనా, వ్యాయామాలైనా, చదువైనా పోటాపోటీగా ముందుకురుకుతుంటారు. ఒకరికంటే మరొకరు ఆధిపత్యం సాధించాలని ప్రయత్నిస్తుంటారు. ఈ వైరుధ్యాల మధ్య కలుసుకున్న ఆ అబ్బాయి, ఆ అమ్మాయి ఎలా స్పందించారు? తమ మధ్య సమ్మర్‌ ప్రేమను కొనసాగించారా? గ్రూపుల మధ్య ఉన్న పరస్పర వైరం, పోటీల వల్ల వాళ్ల ప్రేమ ఏమయింది? ఇలా... కథంతా యువతరాన్ని ఉర్రూతలూగించేదే. దాంతో ఇది ప్రపంచ వ్యాప్తంగా సినీ అభిమానులను ముఖ్యంగా యువతను విపరీతంగా ఆకర్షించింది. కాసుల పంటతో పాటు అవార్డులను కూడా అందుకుంది.

* దుమ్ము దులిపిన బాండ్‌


జేమ్స్‌బాండ్‌ సినిమాలంటే ప్రపంచమంతా ఆసక్తే. వాటి కోసం సినీ అభిమానులు ఎదురుచూస్తుంటారు. బాండ్‌ సినిమాల్లో పదహారోది అయిన ‘లైసెన్స్‌ టు కిల్‌’ 1989లో విడుదలైంది. బాండ్‌ పాత్రలో టిమోతీ డాల్టన్‌ నటించిన ఆఖరి చిత్రం ఇది. తన స్నేహితుడిని చంపిన డ్రగ్స్‌ మాఫియా అధినేతను జేమ్స్‌బాండ్‌ ఎలా ఎదుర్కొన్నాడనేదే కథ. సుమారు 32 మిలియన్‌ డాలర్ల వ్యయంతో తీసిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 156 మిలియన్‌ డాలర్లు వసూలు చేసింది. బాండ్‌ సృష్టికర్త ఇయాన్‌ ఫ్లెమింగ్‌ రాసిన రెండు చిన్న కథలు, ఓ నవలలోని అంశాల ఆధారంగా దీన్ని మలిచారు.

* సాలీడు వీరుడి విజయం


మామూలుగా సాలీడు కుడితే ఏమవుతుంది? చురుక్కుమంటుంది. మహా అయితే ఓ దద్దురొస్తుంది. అదే... హాలీవుడ్‌లో అయితే, కాసుల పంట కురుస్తుంది! సీక్వెల్‌ సినిమాల పరంపర కొనసాగుతుంది!! ‘స్పైడర్‌మ్యాన్‌’తో అదే జరిగింది. మ్యూజియం చూడ్డానికి వెళ్లిన ఓ కుర్రాడిని, జన్యుక్రమం మార్చిన సాలీడు కుట్టగానే అది కామిక్‌ కథగా మారి ఆకట్టుకుంది. ఆ కథనే వెండితెరపైకి తీసుకొచ్చేసరికి డాలర్ల వర్షం కురిసింది. స్టాన్‌లీ, స్టీవ్‌ డిట్కో అనే ఇద్దరు కలిసి మార్వెల్‌ కామిక్‌ పుస్తకాల కోసం రాసిన స్పైడర్‌ మ్యాన్‌ కథ ఆధారంగా ఇప్పటి వరకు పది లైవ్‌యాక్షన్‌ సినిమాలు వచ్చి విజయవంతమయ్యాయి. 1969 నుంచి ఈ సినిమాలు వెండితెరపై సాలెగూడును అల్లుతూనే ఉన్నాయి. ప్రేక్షకులను ఆ గూడులోకి ఆకర్షిస్తూనే ఉన్నాయి. అలా వచ్చిన సినిమాల పరంపరలో ఒకటి ‘ది ఎమేజింగ్‌ స్పైడర్‌మ్యాన్‌’ (2012) ఒకటి. దీన్ని 230 మిలియన్‌ డాలర్లతో తెరకెక్కిస్తే ప్రపంచవ్యాప్తంగా 757.9 మిలియన్‌ డాలర్లు ఆర్జించింది.

* కిల్లర్స్‌ మధ్య ప్రేమ


కొన్ని సినిమా కథలు చిత్రంగా ఉంటాయి. ఆ వైవిధ్యమే ఆ సినిమాల విజయానికి బాటలు వేస్తుంది. ‘ప్రిజ్జీస్‌ హానర్‌’ (1985) సినిమా అలాంటిదే. కథ సంగతికి వస్తే... కిరాయికి హత్యలు చేసే ఓ హంతకుడు. ఓ పెద్ద మాఫియా గ్రూపుకి అనుసంధానంగా పనిచేస్తుంటాడు. మరో నేరసామ్రాజ్యానికి అనుసంధానంగా మరో కిరాయి హంతకురాలు పని చేస్తుంటుంది. ఇద్దరికీ ఒకరి గురించి మరొకరికి తెలియదు. ఓ పెళ్లిలో కలుసుకుని ప్రేమలో పడిపోతారు. ఆ తర్వాత వాళ్ల డాన్స్‌ వాళ్లకి వేర్వేరు పనులు అప్పగిస్తారు. అవి ఎలాంటివంటే తమ ప్రేమను కొనసాగించాలంటే, ఆ పనులు ఆపేయాలి. ఇంతకు మించిన డ్రామా ఏముంటుంది? మాఫియా ముఠాలు, నేరాల నేపథ్యం, వాటి మధ్యలో ఇద్దరు హంతకుల ప్రేమ... కావలసినంత వినోదం. పైగా ఇది కామెడీ డ్రామా సినిమా. అందుకనే ఈ సినిమా నవ్వులు పంచుతూ విజయవంతమైంది. ఆస్కార్, గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డులు గెలుచుకుంది. మేటి హాస్య సినిమాల్లో ఒకటిగా పేరు తెచ్చుకుంది.

* ‘సూపర్‌’ నటుడు


కెప్టెన్‌ అమెరికా తెలుసా? పోనీ... హ్యూమన్‌ టార్చ్‌ తెలుసా? ఇద్దరూ సూపర్‌ హీరోలే. మార్వెల్‌ కామిక్స్‌ పుస్తకాలు సృష్టించిన పాత్రలే. ఈ సూపర్‌హీరోల పాత్రలో అలరించిన నటుడే క్రిస్‌ ఎవాన్స్‌. ‘ఫెంటాస్టిక్‌ ఫోర్‌’, ‘అవెంజర్స్‌’, ‘కెప్టెన్‌ అమెరికా’ సినిమాల్లో అతడి నటనకు అభిమానులు జేజేలు పలుకుతారు. ‘నాట్‌ ఎనదర్‌ టీన్‌ మూవీ’, ‘సన్‌షైన్‌’, ‘స్కాట్‌ పిలిగ్రిమ్‌ వెర్సెస్‌ ద వరల్డ్‌’, ‘స్నోపియర్సర్‌’, ‘గిఫ్టెడ్‌’ సినిమాలతో అలరించాడు. దర్శకుడిగా ‘బిఫోర్‌ వుయ్‌గో’ సినిమాతో ఆకట్టుకున్నాడు. మసాచుసెట్స్‌లో 1981 జూన్‌ 13న పుట్టిన క్రిస్టోఫర్‌ రాబర్ట్‌ ఎవాన్స్‌ తల్లి నాటక రంగంలో ఆర్టిస్టిక్‌ డైరెక్టర్‌. తండ్రి వైద్యుడు. సోదరుడు నటుడు. దాంతో చిన్నతనంలోనే అతడి అడుగులు అభినయ రంగం వైపు పడ్డాయి. నాటకాలు, టీవీల ద్వారా నటుడిగా నిరూపించుకుని వెండితెరపైకి దూసుకువచ్చాడు. ‘ఉత్తమ సూపర్‌ హీరో’గా అనేక అవార్డులు అందుకున్నాడు.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.