జూన్‌ 19.. (సినీ చరిత్రలో ఈరోజు)

* హాస్యానికి ఆయన చిరునామా

(జంధ్యాల వర్థంతి-2001)


(ప్రత్యేక వార్త కోసం క్లిక్‌ చేయండి...)

* గబ్బిలం వీరుడి కథ..


అమెరికన్‌ సూపర్‌ హీరోలలో ఒకడైన బ్యాట్‌మేన్‌ సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా పిల్లల్ని, పెద్దల్ని ఆకర్షించాయి. బ్యాట్‌మేన్‌ పాత్ర మొదటి సారిగా అమెరికన్‌ కామిక్‌ పుస్తకాల్లో మొదలైంది. బిల్‌ ఫింగర్‌ అనే రచయిత ఊహల్లోంచి, బాబ్‌ కానే అనే ఆర్టిస్ట్‌ బొమ్మల్లోంచి ఈ పాత్ర రూపుదిద్దుకుంది. డీసీ కామిక్స్‌లో తొలిసారిగా 1939లో ఓ బొమ్మల కథగా మొదలైన ఈ పాత్ర ఆ తర్వాత వెండితెరపైకి దూకింది. వెండితెరపై 1940ల్లోనే ‘బ్యాట్‌మేన్‌’, ‘బ్యాట్‌మేన్‌ అండ్‌ రాబిన్‌’ పేరుతో రెండు సినిమాలు వచ్చాయి. తర్వాత 1960లో టీవీ సీరియల్స్‌గా వచ్చింది. వార్నర్‌ బ్రదర్స్‌ 1989లో బ్యాట్‌మన్‌ సినిమాను తీసింది. దానికి సీక్వెల్‌గా వచ్చిన ‘బ్యాట్‌మేన్‌ రిటర్న్స్‌’ సినిమా 1992లో ఇదే రోజు విడుదలైంది. 80 మిలియన్‌ డాలర్ల వ్యయంతో తీసిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 266.8 మిలియన్‌ డాలర్లు వసూలు చేసింది.

* గ్రహాంతర రోబోల పోరాటం..ఏవేవో గ్రహాల నుంచి వచ్చిన రోబోలతో యుద్ధమంటేనే ఆసక్తికరంగా ఉంటుంది. అలాంటి కథతో ప్రముఖ దర్శకనిర్మాత స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌ నిర్మాణంలో రూపొందిన ‘ట్రాన్స్‌ఫార్మర్స్‌: రివెంజ్‌ ఆఫ్‌ ద ఫాలెన్‌’ సినిమా 2009లో ఇదే రోజు విడుదలైంది. ఇది 2007లో వచ్చిన ‘ట్రాన్స్‌ఫార్మర్స్‌’ చిత్రానికి సీక్వెల్‌. ఆ సినిమాలో దెబ్బతిన్న గ్రహాంతర వాసులు భూమి మీద జీవాన్ని, భూమికి ఆధారంగా ఉన్న సూర్యుడిని కూడా నాశనం చేయడానికి సమకడతారు. వారిని భూవాసులు ఎలా ఎదుర్కొన్నారనేదే కథ. 200 మిలియన్‌ డాలర్ల బడ్జెట్‌తో తయారైన ఇది ప్రపంచవ్యాప్తంగా 836.3 మిలియన్‌ డాలర్లు వసూలు చేసింది. దీని తర్వాత ట్రాన్స్‌ఫార్మర్స్‌ కథకి కొనసాగింపుగా ‘డార్క్‌ ఆఫ్‌ ద మూన్‌’ (2011), ‘ఏజ్‌ ఆఫ్‌ ఎక్స్టింషన్‌’ (2014), ‘ద లాస్ట్‌ నైట్‌’ (2017) సినిమాలు కూడా వచ్చాయి. వీటిలో ‘ఏజ్‌ ఆఫ్‌ ఎక్స్టింషన్‌’ కూడా ఇదే రోజు విడుదలై, బిలియన్‌ డాలర్ల వసూళ్లను రాబట్టడం విశేషం.

* మళ్లీ వచ్చిన మూకీ..


నిశ్శబ్ద కదలికలతో, నలుపుతెలుపుల బాటలో బయల్దేరిన ‘సినిమా’, మాటలు నేర్చుకుని, రంగులద్దుకుని, హంగులతో అలరిస్తున్న కాలంలో మళ్లీ ఓ మూకీ చిత్రంలో నటించాలంటే ఎవరైనా ఆలోచనలో పడతారు. కానీ జీన్‌ డుజార్డిన్‌ అనే ఓ ఫ్రెంచి హాస్య నటుడు అందులో నటించడమే కాదు, ఉత్తమ నటుడిగా ఆస్కార్‌ సహా అనేక అవార్డులు కొల్లగొట్టి అంతర్జాతీయ ఖ్యాతిని అందుకున్నాడు. గోల్డెన్‌గ్లోబ్, బాఫ్తా, స్కీన్ర్‌ యాక్టర్స్‌ గిల్డ్, కేన్స్‌ చిత్రోత్సవం లాంటి ఎన్నో వేదికలపై అవార్డులు పొందాడు. అతడి పుట్టిన (జూన్‌ 19, 1972) రోజు ఈ రోజే.

* అవతార్‌ సుందరి..


ఆమెను జో సల్డానా అని పరిచయం చేస్తే చాలా మందికి తెలియకపోవచ్చు. కానీ ‘అవతార్‌’ సినిమాలో ఒళ్లంతా నీలిరంగుతో, పెద్ద పెద్ద కళ్లతో నటించిన కథానాయిక అని చెబితే వెంటనే గుర్తు పట్టేస్తారు. తాజాగా సంచలనం సృష్టిస్తున్న ‘అవెంజర్స్‌: ఇన్ఫినిటీ వార్‌’ (2018) సినిమాలో కూడా ఆమె నటన ఆకట్టుకుంది. జూన్‌ 19, 1978 జన్మించింది. టీవీ నటిగా ప్రస్థానం ప్రారంభించి ‘సెంటర్‌ స్టేజ్‌’ (2000) సినిమాతో వెండితెరపైకి అడుగుపెట్టింది. ఆపై ‘క్రాస్‌రోడ్స్‌’ (2002), ‘స్టార్‌ట్రెక్‌’ (2009), ‘కొలంబియానా’ (2011), ‘స్టార్‌ట్రెక్‌ ఇన్‌టూ డార్క్‌నెస్‌’ (2013), ‘ఔట్‌ ఆఫ్‌ ఫర్నేస్‌’ (2013), ‘లివ్‌ బై నైట్‌’ (2016) లాంటి సినిమాల ద్వారా గుర్తింపు తెచ్చుకుంది.

* జీవితాన్ని చదివిన నటుడు..


ఆశిష్‌ విద్యార్థి... పరిచయం అవసరం లేని నటుడు. 11 భాషల్లో నటించాడు. ఏ భాషలోకి వెళ్లినా మన నటుడే అనే గుర్తింపును సొంతం చేసుకొన్నారు. ఎక్కువగా ప్రతినాయక పాత్రల్లోనే కనిపిస్తుంటాడు కానీ... ఆయన వ్యక్తిత్వం మాత్రం అందుకు పూర్తి భిన్నం. నిజ జీవితంలో ఆయనది పాజిటివ్‌ వ్యక్తిత్వం. జీవితం గురించి ఎక్కువగా మాట్లాడతాడు. మనలో తెలియంది చాలా ఉంది... దాన్ని కనిపెట్టే పనిలో ఉన్నానని చెబుతుంటాడు. అందుకోసం చుట్టూ ఉన్న ప్రపంచాన్ని, మనుషుల్ని చదివే ప్రయత్నం చేస్తుంటానని చెబుతుంటారు. ఆశిష్‌ విద్యార్థి కేరళలోని తలశేరిలో జూన్‌ 19, 1962లో జన్మించారు. ఆయన తండ్రి గోవింద్‌ విద్యార్థి నాటక రంగానికి చెందినవారు. తల్లి రెబా. ఆమె బెంగాలీ. 1969లో ఆశిష్‌ విద్యార్థి దిల్లీకి వెళ్లారు. అక్కడే చదువుకొన్నారు. చిన్నప్పుడు నాటకాలపై మక్కువ పెంచుకొన్నారు. ఆ తర్వాత టెలివిజన్‌ రంగంలోకి అడుగుపెట్టారు. కన్నడలో చేసిన ‘ఆనంద్‌’ ఆయనకి తొలి చిత్రం. 1991లో సురేష్‌గోపితో కలిసి ‘హైజాక్‌’ అనే చిత్రంలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకొన్నారు. ఆ తర్వాత హిందీలో అవకాశాలొచ్చాయి. అయితే అక్కడ లభించే పాత్రలతో సంతృప్తి చెందని ఆయన దక్షిణాదిలోకి అడుగుపెట్టారు. ముఖ్యంగా ఆయన తెలుగు, తమిళం భాషల్లో ఎక్కువ చిత్రాలు చేశారు. కొన్ని చిత్రాల్లో ప్రతినాయక పాత్రలు, మరికొన్ని చిత్రాల్లో హాస్య ప్రధానమైన పాత్రలూ చేసి మెప్పించారు. 1995లో హిందీలో చేసిన ‘ద్రోహ్‌కాల్‌’ చిత్రంతో ఉత్తమ సహాయ నటుడుగా జాతీయ పురస్కారాన్ని సొంతం చేసుకొన్నారు ఆశిష్‌ విద్యార్థి. తెలుగులో ‘శ్రీరామ్‌’, ‘వందేమాతరం’, ‘అతనొక్కడే’, ‘పోకిరి’, ‘గుడుంబా శంకర్‌’, ‘అలా మొదలైంది’, ‘అతిథి’, ‘చిరుత’, ‘తులసి’, ‘లక్ష్యం’, ‘మిణుగురులు’, ‘కెవ్వు కేక’, ‘ఆటోనగర్‌ సూర్య’, ‘ఆగడు’, ‘నాన్నకు ప్రేమతో’ తదితర చిత్రాలు ఆశిష్‌ విద్యార్థికి మంచి పేరు తీసుకొచ్చాయి. ఈ రోజు ఆయన జన్మదినం.

* అందాల చందమామ..


వన్నె తరగని అందం అంటారు కదా! ఈ మాట కాజల్‌కి అక్షరాలా వర్తిస్తుంది. చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి 11 యేళ్లు అవుతున్నా... ఇప్పటికీ ఆమె తన అందంతో మాయ చేస్తోంది. తనలో అందం మాత్రమే కాదు.. అంతకుమించిన అభినయం కూడా ఉందంటూ తొలి చిత్రాలు ‘లక్ష్మీకళ్యాణం’, ‘చందమామ’తోనే నిరూపించిన ఆమె, ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. తెలుగుతో పాటు, తమిళంలోనూ సత్తా చాటింది. రాజమౌళి దర్శకత్వంలో నటించిన ‘మగధీర’తో ఆమె స్థాయి మరింత పెరిగింది. ‘ఆర్య 2’, ‘డార్లింగ్‌’, ‘మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌’, ‘బృందావనం’, ‘తుపాకీ’, ‘గోవిందుడు అందరివాడేలే’, ‘ఎవడు’, ‘టెంపర్‌’, ‘బ్రహ్మోత్సవం’ తదితర చిత్రాలు కాజల్‌కి మంచి పేరు తెచ్చిపెట్టాయి. కొంతకాలంగా నటనకి ప్రాధాన్యమున్న పాత్రలపై దృష్టిపెడుతోంది కాజల్‌. తన యాభయ్యో చిత్రంగా చేసిన ‘నేనే రాజు నేనే మంత్రి’తో పాటు, ‘అ!’ అనే చిత్రాలు ప్రేక్షకుల్ని అలరించాయి. ‘జనతా గ్యారేజ్‌’తో ప్రత్యేక గీతాలకీ సై అంది. పంజాబీ కుటుంబానికి చెందిన ఆమె 1985లో ముంబైలో జన్మించింది. వినయ్‌ అగర్వాల్, సుమన్‌ అగర్వాల్‌ తల్లిదండ్రులు. ముంబైలోనే మాస్‌ మీడియాలో డిగ్రీ చేసిన కాజల్‌ ‘క్యూ హో గయా నా’ చిత్రంలో చిన్న పాత్రలో మెరిసింది. అప్పట్నుంచి సినిమాలపై మక్కువ పెంచుకొన్న ఆమె దక్షిణాదివైపు దృష్టిపెట్టి రాణించింది. కాజల్‌ ప్రస్తుతం ‘క్వీన్‌’ రీమేక్‌తో పాటు, రవితేజ సరసన ఓ చిత్రంలో నటిస్తోంది. ఈ రోజు కాజల్‌ జన్మదినం.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.