జూన్‌ 2.. (సినీ చరిత్రలో ఈరోజు)

* దర్శక మణి..
మణిరత్నం (పుట్టినరోజు-1956)


భా
రత సినీ చరిత్రలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న దర్శకుడు మణిరత్నం పుట్టిన రోజు. ఆయన శైలే విభిన్నంగా ఉంటుంది. మణిరత్నం తీసిన ప్రేమకథా చిత్రాలు కుర్రాకారు మదిలో చిరస్థాయిగా నిలిచిపోయాయి. దర్శకుడిగా తొలి కన్నడ చిత్రం ‘పల్లవి అనూ పల్లవి’తో పురస్కారం అందుకుని విజయపరంపర కొనసాగించాడు. హిందీ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో పలు చిత్రాలకు దర్శకత్వం వహించారు. తెలుగులో ఆయన తీసిన తొలి చిత్రం ‘గీతాంజలి’ బాక్సాఫీస్‌ వద్ద రికార్డులను తిరగరాసింది. తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయిందీ చిత్రం. అప్పట్లో తెలుగులో ఓ ప్రేమకథా చిత్రాన్ని ఎక్కువ మంది వీక్షించిన సినిమా అది. ఇక ‘రోజా’తో ప్రేమికుల మనసు దోచేశారు. దేశవ్యాప్తంగా చాలా భాషల్లో ఈ చిత్రం విడుదలైంది. ఇది ఆయనకు జాతీయస్థాయి గుర్తింపు తీసుకొచ్చింది. మణిరత్నం ప్రేమ కథలను దేశానికి పరిచయం చేసి అఖండ విజయం నమోదు చేసిన చిత్రం అది. తర్వాత దర్శకుడు రాంగోపాల్‌ వర్మ తీసిన ‘గాయం’ చిత్రానికి కథ రాసిందీ మణిరత్నమే. ‘బొంబాయి’ చిత్రంతో మంచి మెలోడీ హిట్టందుకున్నారు. ‘తాజ్‌ మహల్‌’ లాంటి ఎన్నో చిత్రాలకు కథ రాసి ప్రేక్షకుల మనసులో గుర్తుండిపోయారు. భారత ప్రభుత్వం 2002లో ఆయనను ‘పద్మశ్రీ’ పురస్కారంతో సత్కరించింది. ఇప్పటి వరకు మణిరత్నం ఆరు జాతీయ అవార్డులన కైవసం చేసుకున్నారు. ఎన్నో ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులనూ అందుకున్నారు. ప్రస్తుతం ‘పొన్నియన్‌ సెల్వన్‌’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మణిరత్నం అసలు పేరు గోపాల రత్నం సుబ్రహ్మణ్యం. 1956లో జూన్‌ 2న జన్మించారు.

* వెండితెర వెలుగు...
రాజ్‌కపూర్‌ (వర్ధంతి -1988)


(ప్రత్యేక కథనం కోసం క్లిక్‌ చేయండి)

* పాటల కోయిల...ఇళయరాజా
(పుట్టినరోజు -1943)


(ప్రత్యేక కథనం కోసం క్లిక్‌ చేయండి)

* ప్రతిభావంతుడు...
గుణశేఖర్‌ (పుట్టినరోజు-1964)


మె
గాఫోన్‌ పట్టీ పట్టగానే ఇతని దర్శకత్వ ‘సొగసు చూడతరమా’ అనిపించిన కెప్టెన్‌ గుణశేఖర్‌. ‘లాఠీ’తో ప్రయాణం ఆరంభించిన ఆయన రెండో చిత్రంగా ‘సొగసు చూడతరమా’ తెరకెక్కించి ప్రతిభగల దర్శకుడు అనిపించుకొన్నాడు. ఆ తర్వాత చిన్నారులతో ‘రామాయణం’ తెరకెక్కించి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకొన్నారు. ఈ చిత్రంతోనే ప్రముఖ కథానాయకుడు ఎన్టీఆర్‌ బాలనటుడిగా పరిచయమయ్యాడు. ఆ తర్వాత చిరంజీవితో ‘చూడాలని ఉంది’ తెరకెక్కించి ఘన విజయాన్ని సొంతం చేసుకొన్నారు. ‘మనోహరం’ కూడా గుణశేఖర్‌కి మంచి పేరు తీసుకొచ్చింది. ఆ తర్వాత తెరకెక్కించిన ‘మృగరాజు’ పరాజయాన్ని చవిచూసినా... ‘ఒక్కడు’ సంచలనాల్ని సృష్టించింది. ఆ చిత్రం కోసం వేసిన ఛార్మినార్‌ సెట్టు గురించి పరిశ్రమ జనాలు ప్రత్యేకంగా మాట్లాడుకొన్నారు అప్పట్లో. ఆ వెంటనే మహేష్‌తోనే ‘అర్జున్‌’ తెరకెక్కించారు. ‘సైనికుడు’, ‘వరుడు’, ‘నిప్పు’ ఇలా వరుస పరాజయాలు గుణశేఖర్‌ కెరీర్‌ని దెబ్బతీశాయి. 2015లో ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘రుద్రమదేవి’తో మళ్లీ పుంజుకొన్నారు. ఆ చిత్రానికి దర్శకత్వం వహించడంతో పాటు, స్వయంగా నిర్మించడం విశేషం. తదుపరి ఆయన ‘హిరణ్యకశ్యప’ చిత్రం కోసం సన్నాహాలు చేసుకొంటున్నారు. తెలుగులో భారీ హంగులతో చిత్రాల్ని తీయడంలో ఒక కొత్త ఒరవడిని నాంది పలికిన దర్శకుడిగా గుణశేఖర్‌కి పేరుంది. డి.వి.నరసరాజు, క్రాంతికుమార్, రామ్‌గోపాల్‌ వర్మ తదితర దర్శకుల సహాయ దర్శకుడిగా పనిచేసిన అనంతరం కెప్టెన్‌ కుర్చీ ఎక్కారు గుణశేఖర్‌. ఈ రోజు గుణశేఖర్‌ (జూన్‌ 2, 1964) పుట్టినరోజు.

* సొట్టబుగ్గల చిన్నది...
సోనాక్షి సిన్హా (పుట్టినరోజు-1987)


బా
లీవుడ్‌లో తన నవ్వుతో ఆకట్టుకునే సొట్ట బుగ్గల భామ సోనాక్షి సిన్హా. ‘దబాంగ్‌’ అంటే బాలీవుడ్‌లో గుర్తుచ్చే నటి సోనాక్షి. తొలి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకుని ప్రేక్షకుల మదిలో నిలిచిందీ ముద్దుగుమ్మ. బాలీవుడ్‌లో తొలి చిత్రానికే మొదటి ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు అందుకున్న నటి కూడా. ఈ సినిమాలో పల్లెటూరి అమ్మాయి పాత్రలో నటించేందుకు ఆమె ఏకంగా 30 కిలోల బరువు తగ్గింది. తొలుత ఫ్యాషన్‌ డిజైనర్‌గా బాలీవుడ్‌లో రంగప్రవేశం చేసింది. ప్రముఖ నటుడు జాకీ ష్రాఫ్‌ నటించిన ‘మేరే దిల్‌ లేకే దేఖో’ చిత్రానికి కాస్టూమ్‌ డిజైనర్‌గా పనిచేసింది. తర్వాత ‘ఆజ్‌ మూద్‌ ఇష్క్‌హాలిక్‌ హాయ్‌’ అంటూ తన స్వరాన్ని బాలీవుడ్‌ ప్రేక్షకులకు పరిచయం చేసింది. ఆ తర్వాత తెలుగులో రవితేజ, అనుష్కలు నటించిన ‘విక్రమార్కుడు’ చిత్రాన్ని హిందీలో ‘రౌడీ రాథోర్‌’ చిత్రంతో అక్షయ్‌ కుమార్‌ సరసన నటించి మెప్పించింది. ‘గో గో గోవిందా’ అంటూ ప్రభుదేవాతో కలసి డ్యాన్స్‌లో ఇరగదీసింది. ఈ పాట అప్పట్లో ఆమెకు మంచి క్రేజ్‌ తెచ్చింది. ఇక రాజమౌళి తీసిన ‘మర్యాద రామన్న’ చిత్రం బాలీవుడ్‌లో ‘సన్‌ ఆఫ్‌ సర్దార్‌’ పేరుతో రీమేక్‌ అయింది. ఆ చిత్రంలో అజయ్‌ దేవగన్‌తో కలసి నటించి తెలుగు ప్రేక్షకులకు కూడా మంచి ఉత్సాహాన్ని నింపింది. రణ్‌వీర్‌ సింగ్‌ ‘లుటేరా’లో రొమాంటిక్‌ పాత్రలో నటించి ప్రేమను పండించింది. బాలీవుడ్‌లో ఇంతవరకు అతి తక్కువ చిత్రాలు చేసిన వెంటనే ఒక అగ్ర కథానాయకుడి సినిమాలో ఎవరూ నటించలేదు. కానీ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌తో కలసి ‘లింగా’లో నటించేందుకు అవకాశం కొట్టేసిందీ భామ. ఈ సినిమాలో పల్లెటూరి అమాయకత్వంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ప్రస్తుతం ఆమె ‘రేస్‌ 3’లో ఓ ప్రత్యేక పాత్రలో కనిపించేందుకు సిద్ధమవుతుంది. ఇప్పుడు ‘హ్యాపీ ఫిర్‌ భాగ్‌ జాయేగీ’లో నటించింది. తాజాగా ‘కళంక్‌’ నటించింది. బాలీవుడ్‌ షాట్‌గన్‌ శత్రుఘ్న సిన్హా, ప్రముఖ నటి పూనమ్‌ సిన్హాల ముద్దుల కుమార్తె ఈమె. సోనాక్షి సిన్హా జూన్‌ 2, 1987లో జన్మించింది. ఇవాళ ఆమె పుట్టినరోజు.

* సంచలన సినిమా..


ప్ర
ఖ్యాత హాలీవుడ్‌ దర్శకుడు స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌ తీసిన ‘షిండ్లర్స్‌ లిస్ట్‌’ సినిమాపై ఇండోనేషియా బ్యాన్‌ విధించింది (1994). అమెరికా చరిత్రకు సంబంధించిన కథాంశంతో, ‘షిండ్లర్స్‌ ఆర్క్‌’ అనే నవల ఆధారంగా స్పీల్‌బర్గ్‌ తీసిన ఈ సినిమా సంచలనం సృష్టించింది. 22 మిలియన్‌ డాలర్ల బడ్జెట్‌తో తీసిన ఈ సినిమా 321.2 మిలియన్‌ డాలర్లు ఆర్జించింది. ఏడు ఆస్కార్, ఏడు బాఫ్తా, మూడు గోల్డెన్‌గ్లోబ్‌ అవార్డులను గెలుచుకుంది. మేటి అమెరికన్‌ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. అదే సమయంలో వివాదాస్పదమైంది కూడా.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.