జూన్‌ 4 .. (సినీ చరిత్రలో ఈరోజు)

* గాన గంధర్వుడు

(బాలసుబ్రహ్మణ్యం పుట్టిన రోజు-1946)(ప్రత్యేక కథనం కోసం క్లిక్‌ చేయండి)

* సినీ గీతాల్లో మరువలేని ముద్ర

(ఆరుద్ర వర్థంతి)


(ప్రత్యేక కథనం కోసం క్లిక్‌ చేయండి)

* చలాకీ నటి

(ప్రియమణి పుట్టిన రోజు-1984)


ఉత్తమ నటిగా జాతీయ పురస్కారం పొందిన కథానాయిక ప్రియమణి. దక్షిణాదిలోని నాలుగు భాషలతో పాటు... హిందీలోనూ నటించి పేరు తెచ్చుకొంది. బెంగుళూరులో 1984 జూన్‌ 4న పుట్టిన ఈమె తొలినాళ్లలో మోడల్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ‘ఎవడే అతగాడు’తో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ చిత్రం పరాజయాన్ని చవిచూడటంతో ప్రియమణి తమిళం, మలయాళ భాషలపై దృష్టిపెట్టింది. 2006లో వచ్చిన ‘పెళ్లైన కొత్తలో’ చిత్రంతో ప్రియమణి తెలుగు ప్రేక్షకులకు బాగా నచ్చేసింది. తెలుగులో తొలి విజయాన్ని సొంతం చేసుకొన్న ఆమె ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. రాజమౌళి దర్శకత్వం వహించిన ‘యమదొంగ’లో నటించింది. ఆ తర్వాత ‘హరే రామ్‌’, ‘ద్రోణ’, ‘మిత్రుడు’, ‘ప్రవరాఖ్యుడు’, ‘గోలీమార్‌’, ‘రగడ’, ‘రాజ్‌’, ‘క్షేత్రం’, ‘చారులత’ తదితర చిత్రాల్లో నటించింది. జయాపజయాలతో సంబంధం లేకుండా ఆమె ప్రయాణం కొనసాగింది. ప్రకాష్‌రాజ్‌ దర్శకత్వం వహించిన ‘మన ఊరి రామాయణం’ ఆమెలోని అత్యుత్తమ నటనని బయటపెట్టింది. తమిళ చిత్రం ‘పరుత్తివీరన్‌’లో నటనకిగానూ ప్రియమణికి జాతీయ పురస్కారం లభించింది. ప్రియమణి ప్రస్తుతం కన్నడ భాషలో ఎక్కువ సినిమాలు చేస్తోంది. హిందీలో షారుఖ్‌ఖాన్‌ కథానాయకుడిగా నటించిన ‘చెన్నై ఎక్స్‌ప్రెస్‌’లో ప్రత్యేకగీతం చేసి అదరగొట్టింది. 2017లో బెంగుళూరుకి చెందిన ఈవెంట్స్‌ ఆర్గనైజర్‌ ముస్తఫారాజ్‌ని ప్రేమ వివాహం చేసుకుంది ప్రియమణి.

* అలరించిన కథానాయకుడు

(వేణు పుట్టిన రోజు-1976)


‘స్వయంవరం’తో బాణంలా దూసుకొచ్చిన కథానాయకుడు వేణు తొట్టెంపూడి. ఇదే చిత్రంతో త్రివిక్రమ్‌ రచయితగా మంచి గుర్తింపును తెచ్చుకొన్నాడు. హైదరాబాద్‌లో 1976 జూన్‌ 4న పుట్టిన వేణు ధార్వాడలో ఇంజినీరింగ్‌ పూర్తి చేశాడు. అనంతరం నటనపై దృష్టిపెట్టాడు. భారతీరాజా దర్శకత్వంలో తొలి సినిమా మొదలైనా.. ఆ తర్వాత ప్రొడక్షన్‌ సమస్యల వల్ల ఆ చిత్రం ఆగిపోయింది. తన స్నేహితుడు వెంకట శ్యామ్‌ప్రసాద్‌ స్థాపించిన ఎస్‌.పి.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ‘స్వయంవరం’ చేశారు. కె.విజయభాస్కర్‌ దర్శకత్వం వహించిన ఆ చిత్రం ఆయనకి ఘన విజయాన్ని అందించింది. ఆ వెంటనే ‘చిరునవ్వుతో’ సినిమాతో మరో విజయాన్ని అందుకొన్నాడు. ‘హనుమాన్‌ జంక్షన్‌’, ‘పెళ్లాం ఊరెళితే’ చిత్రాలతో వేణు పేరు మార్మోగిపోయింది. ప్రధాన కథానాయకుడిగా పేరు తెచ్చుకొన్నాడు. అయితే ఆ తర్వాత సరైన విజయం దక్కలేదాయనకి. ‘చింతకాయల రవి’, ‘దమ్ము’ చిత్రాల్లో కీలక పాత్రల్లో మెరిశారు. కానీ వేణుకి మాత్రం పెద్దగా పేరు తీసుకురాలేదు. ‘రామాచారి’ తర్వాత ఆయన సినిమాలకి దూరంగా ఉన్నారు.

* భలే సినిమా..


చూసి చూడాల్సిన సినిమాల్లో ఒకటిగా పేరతెచ్చుకున్న ‘మిసెస్‌ మినివర్‌’ సినిమా తొలి ప్రదర్శన (1942) జరిగింది. ఓ నవల ఆధారంగా విలియం వైలర్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం రెండో ప్రపంచ యుద్ధం వల్ల ఇంగ్లండ్‌లో ఓ మారుమూల పల్లెలో ఉండే గృహణి జీవితం ఎలా ప్రభావింతమైందో చెబుతుంది. సినిమా ఆరు అకాడమీ అవార్డులు గెలుచుకుంది. స్ఫూర్తిదాయకమైన 40 చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. లైబ్రరీ ఆఫ్‌ కాంగ్రెస్‌లోని నేషనల్‌ ఫిల్మ్‌ రిజిస్ట్రీలో ఎప్పటికీ భద్రపరిచి ఉండేలా నిలిచింది.

* విలక్షణ నటి..


అందాల తారగా, సాహస వనితగా, మానవతావాదిగా ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది ఏంజెలీనా జోలీ. ఒక అకాడమీ అవార్డు, రెండు స్కీన్ర్‌ యాక్టర్స్‌ గిల్డ్‌ అవార్డు, మూడు గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డులు గెలుచుకుని హాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం అందుకునే నటిగా ఎదిగింది. కాలిఫోర్నియాలో 1975 జూన్‌ 4న పుట్టిన జోలీ చిన్నప్పుడే తండ్రితో కలసి ‘లుకింగ్‌ టు గెటౌట్‌’ (1982) సినిమాలో కనిపించింది. ‘సైబోర్గ్‌2’ (1993)లో తొలిసారి నటించింది. ‘గర్ల్‌ ఇంట్రెప్టెడ్‌’ (1999)తో ఉత్తమ సహాయనటిగా ఆస్కార్‌ అందుకుంది. ‘లారా క్రాఫ్ట్‌: టూంబ్‌ రైడర్‌’ (2001)తో ఆమె పేరు మార్మోగింది. ‘మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ స్మిత్‌’, ‘వాంటెడ్‌’, ‘సాల్ట్‌’, ‘మాలిఫిసియంట్‌’ సినిమాల ద్వారా పేరు తెచ్చుకుంది. దర్శకురాలిగా, నిర్మాతగా, రచయితగా మారింది. మానవతా వాదిగా ‘హ్యుమానిటేరియన్‌ అవార్డు’ అందుకుంది.

(ప్రత్యేక కథనం కోసం క్లిక్‌ చేయండి)

* దర్శకుడి పెళ్లి..


‘టైటానిక్‌’, ‘అవతార్‌’, ‘టెర్మినేటర్‌2’ చిత్రాల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన దర్శక, నిర్మాత జేమ్స్‌ కేమరాన్‌ 2000లో ఇదే రోజు నటి అమిస్‌ (38)ని పెళ్లాడారు. ప్రపంచంలోని 100 మంది ప్రభావశీలుర జాబితాల్లో ఆయన కూడా ఒకరని ప్రముఖ పత్రిక ‘టైమ్స్‌’ పేర్కొంది. వైవాహిక పరంగా ఐదు పెళ్లిళ్లు చేసుకున్నాడు. అమిస్‌తో నాలుగో వివాహం.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.