జూన్‌ 8.. (సినీ చరిత్రలో ఈరోజు)

* ఆల్‌రౌండర్‌


నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా ఆల్‌రౌండ్‌ ప్రతిభని ప్రదర్శించిన సినీ ప్రముఖుడు గిరిబాబు. ప్రకాశం జిల్లా, రావినూతలలో జన్మించిన ఆయన అసలు పేరు ఎర్రా శేషగిరిరావు. 1973లో చిత్ర రంగ ప్రవేశం చేశారు. పలు చిత్రాల్లో హాస్య ప్రధానమైన పాత్రలు, ప్రతినాయక పాత్రలు పోషించి మెప్పించారు. ఇప్పటిదాకా సుమారు 600 చిత్రాల్లో నటించారు గిరిబాబు. దర్శకనిర్మాతగా సింహగర్జన, మెరుపుదాడి, రణరంగం, ఇంద్రజిత్, నీ సుఖమే నే కోరుతున్నా తదితర చిత్రాల్ని రూపొందించారు. గిరిబాబు తనయుడు రఘుబాబు ప్రస్తుతం ప్రముఖ హాస్య నటుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్నారు. గిరిబాబు పుట్టినరోజు నేడు.

(ప్రత్యేక కథనం కోసం క్లిక్‌ చేయండి...)

* యాక్షన్‌ చిత్రాల దర్శకుడు


ఎన్టీఆర్, కృష్ణ, చిరంజీవి, శోభన్‌బాబు, రజనీకాంత్, విష్ణువర్ధన్‌... ఇలా అగ్ర కథానాయకులందరితోనూ చిత్రాల్ని తెరకెక్కించిన దర్శకుడు కేఎస్‌ఆర్‌ దాస్‌. తెలుగులో బాండ్‌ తరహా చిత్రాల్ని తీర్చిదిద్ది కొత్త ట్రెండ్‌కి శ్రీకారం చుట్టిన ఘనత ఆయనది. కృష్ణ కథానాయకుడిగా తెరకెక్కించిన ‘మోసగాళ్లకి మోసగాడు’ వివిధ దేశాల్లో, వివిధ భాషల్లో అనువాదమై తెలుగు సినిమా ఖ్యాతిని పెంచింది. కృష్ణ కథానాయకుడిగానే 30 సినిమాల్ని తెరకెక్కించారు కె.ఎస్‌.ఆర్‌.దాస్‌. యాక్షన్‌ చిత్రాలతో మాస్‌ ప్రేక్షకులకి దగ్గర చేసి కథానాయకుల ఇమేజ్‌ని పెంచిన ఘనత దాస్‌ సొంతం. నెల్లూరు జిల్లా, వెంకటగిరిలో 1936 జనవరి 5న జన్మించిన కేఎస్‌ఆర్‌ దాస్‌ తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో పలు చిత్రాల్ని తెరకెక్కించారు. 76 యేళ్ల వయసులో అనారోగ్యంతో చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 2012 జూన్‌ 8న తుదిశ్వాస విడిచారు.

* అనగననగా ఓ సాగరకన్య


సాగరకన్య పాత్రంటే తెలుగు ప్రేక్షకులకు వెంటనే గుర్తొచ్చే నటి శిల్పాశెట్టి. ఆమె ఆ పాత్రతో అభిమానుల మనసులో అంతలా ఒదిగిపోయింది. ‘సాహసవీరుడు సాగరకన్య’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది. శిల్పాశెట్టి హిందీ, తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకాదరణ పొందింది. మోడల్‌గా తన జీవితాన్ని ప్రారంభించి నటిగా, నిర్మాతగా, వ్యాపారవేత్తగా ఎన్నో అవకాశాలు చేజిక్కించుకుంది. బాలీవుడ్‌లో ‘బాజీగర్‌’ సినిమాతో చిత్రసీమలో అడుగిడింది. తొలి చిత్రంలో అద్భుతమైన నటనతో మెప్పించింది. ఆ తర్వాత ‘మై కిలాడీ తూ అనారీ’ చిత్రం బాలీవుడ్‌లో ఆమెను నిలిపేలా చేసింది. మళ్లీ వరుసగా పరాజయాలను మూటకట్టుకుంది. అప్పుడొచ్చింది ‘దడ్కన్‌’ సినిమాలో అవకాశం. ఆ చిత్రం కలెక్షన్ల సునామీ సృష్టించింది. ‘పర్దేశీ బాబు’ నాటకంతో అభిమానుల మన్ననలు పొందింది. ఎయిడ్స్‌ బాధితుల కథ ఆధారంగా తెరకెక్కిన ‘ఫిర్‌ మిలేంగే’తో అంతర్జాతీయస్థాయి గుర్తింపు పొందింది. ‘బిగ్‌బాస్‌’ కార్యక్రమంతో మంచి పేరు తెచ్చుకుంది. ‘దిక్షియాయూన్‌’ చిత్రంతో నిర్మాతగా మారింది. జంతు సంరక్షణకు పాటుపడుతోంది. ఐపీఎల్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టు యజమానిగా వ్యవహరిస్తోంది. యోగా శిక్షకురాలిగా ప్రసిద్ధి పొందింది. యోగాసనాలతో కూడిన సీడీలను విడుదల చేసింది. భారతీయ వంటలపై ఓ పుస్తకాన్ని కూడా వెలువరించింది. శిల్పాశెట్టి జూన్‌ 8, 1972లో కర్ణాటకలోని మంగళూరులో జన్మించింది. ఇవాళ ఆమె పుట్టినరోజు.

(ప్రత్యేక కథనం కోసం క్లిక్‌ చేయండి...)

* దెయ్యాలుంటే... పట్టేస్తాం!


బజార్లోకి వెళితే ఎన్నో దుకాణాలు కనిపిస్తాయి. కానీ ‘ఇచ్చట దెయ్యాలను పట్టుకోబడును’ అనే బోర్డు పెట్టుకున్న దుకాణాన్ని ఎక్కడైనా చూస్తామా? అలాంటి దుకాణాన్నే తెరిచారు, ముగ్గురు ప్రొఫెసర్లు. ముగ్గురూ కొలంబియా యూనివర్శిటీలో పారానార్మల్‌ సైకియాట్రిస్ట్‌లే. వీళ్ల ప్రయోగాలు వికటించడంతో యూనివర్శిటీ వీళ్లను ఉద్యోగాల నుంచి తొలగిస్తుంది. దాంతో వాళ్లు దెయ్యాలుంటే పట్టుకుంటామంటూ ఓ దుకాణాన్ని తెరుస్తారు. దాని పేరే ‘ఘోస్ట్‌ బస్టర్స్‌’. వినడానికే విచిత్రంగా ఉన్న ఈ కథతో అదే పేరుతో 1984లో వచ్చిన హాలీవుడ్‌ సినిమా ఎంతగా విజయవంతమైందంటే దానికి సీక్వెల్స్‌గా రెండు సినిమాలు రావడమే కాదు, మరొకటి 2020లో రాబోతోంది కూడా. అత్యాధునిక పరికరాల సాయంతో దెయ్యాల ఉనికి కనిపెడతామని, వాటిని ఆయా ప్రదేశాల నుంచి పట్టుకుని తీసుకుపోతామని వీళ్లు పెట్టిన దుకాణానికి విపరీతమైన గిరాకీ ఏర్పడుతుంది. మొదట వీళ్లను పోలీసులు జైల్లో పెట్టినా, న్యూయార్క్‌లో అంతుపట్టని దెయ్యాల బెడద పెరగడంతో విడుదల చేస్తారు. హాస్యప్రధానంగా సాగే ఈ సినిమాను 30 మిలియన్‌ డాలర్లతో తీస్తే అది ప్రపంచ వ్యాప్తంగా 295.2 మిలియన్‌ డాలర్లు వసూలు చేసింది. ‘100 ఏళ్లు... 100 నవ్వులు’ జాబితాలో చోటు సంపాదించింది. జాతీయ చలన చిత్ర గ్రంథాలయంలో స్థానం పొందింది. దీనికి సీక్వెల్స్‌గా 1989లో ఒకటి, 2016లో ఒకటి సినిమాలు వచ్చాయి. రెండు టీవీ సీరియల్స్‌ కూడా వచ్చాయి.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.