మార్చి 30.. (సినీ చరిత్రలో ఈరోజు)

* స్మార్ట్‌గా ఉన్నావన్నారు..

‘జయం’తో అవకాశమిచ్చారు!


పడిలేచిన కెరటం నితిన్‌. ఆరంభంలోనే ఘన విజయాల్ని సొంతం చేసుకున్నాడు. స్టార్‌ హీరోల సమాన స్థాయిలో క్రేజ్‌ వచ్చింది. అగ్ర దర్శకులందరితోనూ కలిసి సినిమాలు చేశాడు. అలాంటి నటుడు వరుసగా డజనుకి పైగా సినిమాలతో పరాజయాల్ని చవిచూస్తాడని ఎవరైనా ఊహిస్తారా? నితిన్‌ విషయంలో అదే జరిగింది. ఇక అందరూ ఆయన పనైపోయిందని మాట్లాడుకున్నారు. కానీ నితిన్‌ మాత్రం పట్టువదలని విక్రమార్కుడిలా విజయం కోసం పోరాటం చేశాడు. పరాజయాలు ఎదురైన కొద్దీ మరింత కసితో పనిచేశాడు. అదే ఆయన్ని మళ్లీ నిలబెట్టింది. ‘ఇష్క్‌’తో ఎట్టకేలకి ఆయన తన ఖాతాలో మరో విజయం వేసుకున్నాడు. అప్పట్నుంచి ఆయన మళ్లీ విజయాల పరంపర కొనసాగిస్తూ వస్తున్నారు. ‘గుండె జారి గల్లంతయ్యిందే’, ‘అఆ’ చిత్రాలు ఆయన్ని మరో స్థాయిలో నిలబెట్టాయి. వెంకీ కుడుముల దర్శకత్వంలో వ‌చ్చిన  ‘భీష్మ’ మంచి విజ‌యం అందుకుంది. చంద్రశేఖర్‌ యేలేటి దర్శకత్వంలో మరో సినిమా చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. ప్ర‌సు్తం రంగ్ దే చిత్రంలో న‌టిస్తున్నారు. వెంకీ అట్లూరి తెర‌కెక్కిస్తున్నారు. యువతరంలో మంచి క్రేజ్‌ని సంపాదించుకున్న కథానాయకుల్లో నితిన్‌ ఒకడు. ఆయన మార్చి 30, 1983లో జన్మించారు. ఆయన తండ్రి సుధాకర్‌ రెడ్డి సినిమా పంపిణీదారుడు కావడంతో ఇంట్లో సినీ వాతావరణమే ఉండేదట. నచ్చిన సినిమాని కనీసం రెండు మూడు సార్లైనా చూసేవాడట. పవన్‌కల్యాణ్‌ ‘తొలిప్రేమ’ చిత్రాన్ని చూశాకే కథానాయకుడు కావాలనే కోరిక పుట్టిందని చెబుతుంటాడు నితిన్‌. ఆ చిత్రాన్ని థియేటర్లో 28 సార్లు చూశారట. తనలో మొదట కథానాయకుడు కావాలనే ఆలోచనకి బీజం పడింది కూడా ‘తొలిప్రేమ’ తీసిన దర్శకుడు కరుణాకరన్‌ వల్లేనట. ‘కరుణాకరన్‌ మా నాన్నకి స్నేహితుడు. దాంతో తరచుగా ఆయన మా ఇంటికి వచ్చేవాడు. ఒక రోజు నన్ను చూసి స్మార్ట్‌గా ఉన్నావు, నిన్ను పెట్టి సినిమా తీస్తా’ అన్నారని నితిన్‌ గుర్తు చేసుకుంటుంటారు. ఆయన సరదాగా అన్నాడనిపించినా... నితిన్‌ మనసులో నిజంగానే హీరో అయితే బాగుంటుందేమో అనే కోరిక కలిగిందట. అయితే ‘నువ్వు నేను’ సినిమా చూడటానికి వెళ్లిన నితిన్‌ని అక్కడే తేజ చూసి ‘నేను జయం సినిమా తీస్తున్నా. అందులో నటిస్తావా’ అని అడిగారట. అలా 2002లో ‘జయం’తో కెమెరా ముందుకొచ్చారు నితిన్‌. ఆ తర్వాత ‘దిల్‌’తో మరో విజయాన్ని అందుకున్నారు. రాజమౌళితో ‘సై’ చేసి విజయాన్ని అందుకుని కథానాయకుడిగా మరో స్థాయికి ఎదిగారు. 2005 నుంచి వరుస పరాజయాల్ని చూసినప్పటికీ వెనక్కి తగ్గలేదు. ప్రయత్న లోపం లేకుండా సినిమాలు చేశారు. పరిస్థితులను ఎదురొడ్డి నిలిచినవాడే గెలుపు వాకిట నిలుస్తాడన్ననట్లుగా ‘ఇష్క్‌’తో ఓ విజయాన్ని అందుకొన్నారు.  ఈరోజు నితిన్‌ పుట్టినరోజు.

(ప్ర‌త్యేక వార్త కోసం క్లిక్ చేయండి)

* నటన విలక్షణం (నూతన్‌ ప్రసాద్‌ వర్థంతి-2011)(ప్రత్యేక కథనం కోసం క్లిక్‌ చేయండి...)

* హ్యారీపాటర్‌ చిత్రాల నటుడు


ప్రపంచ వ్యాప్తంగా పిల్లల్ని, పెద్దల్ని సమానంగా ఆకట్టుకున్న ‘హ్యారీ పాటర్‌’ సినిమాలు చూసిన వారికి అతడు గుర్తుండే ఉంటాడు. ఆ సినిమాల్లో రుబియస్‌ హ్యాగ్రిడ్‌ పాత్రలో కనిపించే ఆ నటుడే రోబీ కోల్‌ట్రేన్‌. అలాగే జేమ్స్‌బాండ్‌ సినిమాలైన ‘గోల్డెన్‌ ఐ’, ‘ద వరల్డ్‌ ఈజ్‌ నాట్‌ ఇనఫ్‌’ చిత్రాల ద్వారా కూడా ఈ నటుడు చిరపరిచితుడే. స్కాట్‌లాండ్‌లో 1950 మార్చి 30న పుట్టిన ఇతడు నాటకాల ద్వారా నటుడయ్యాడు. ఆపై టీవీల్లో ఆకట్టుకున్నాడు. ‘ఫ్లాష్‌ గార్డన్‌’, ‘డెత్‌ వాచ్‌’, ‘బల్హామ్, గేట్‌వే టుద సౌత్‌’, ‘స్క్రబ్బర్స్‌’, ‘క్రల్‌’, ‘ద సూపర్‌గ్రాస్‌’, ‘డిఫెన్స్‌ ఆఫ్‌ ద రీల్మ్‌’, ‘ఆబ్సల్యూట్‌ బిగినర్స్‌’, ‘మోనాలిసా’, ‘ద ఫ్రూట్‌ మెషీన్‌’లాంటి సినిమాలలో వేర్వేరు పాత్రల్లో మెప్పించాడు. 

  * నటన...నాట్యం...


నటుడిగా, డ్యాన్సర్‌గా కూడా ఉర్రూతలూగించాడు జేమ్స్‌ కాగ్నీ. వేదికల మీద, వెండితెర మీద కూడా తనదైన ముద్ర వేశాడు. కంగుమని మోగే కంఠస్వరం, ఉత్సాహంతో వేసే స్టెప్పులు, విలక్షణమైన నటనతో అతడు ప్రపంచ ప్రేక్షకులను అలరించాడు. ఆస్కార్‌ సహా ప్రతిష్ఠాత్మకమైన ఎన్నో అవార్డులను అందుకున్నాడు. ‘ద పబ్లిక్‌ ఎనిమీ’, ‘టాక్సీ’, ‘ఏంజెల్స్‌ విత్‌ డర్టీ ఫేసెస్‌’, ‘ద రోరింగ్‌ ట్వంటీస్‌’, ‘వైట్‌ హీట్‌’లాంటి సినిమాల్లో అటు నటన, ఇటు నాట్యాలతో ఆకట్టుకున్నాడు. హాలీవుడ్‌ స్వర్ణయుగంలో మేటి నటుడిగా ఇతడిని అమెరికన్‌ ఫిల్మ్‌ ఇనిస్టిట్యూట్‌ గుర్తించింది. న్యూయార్క్‌లో 1899 జులై 17న ఏడుగురు సంతానంలో రెండోవాడిగా పుట్టిన ఇతడు, బాల్యంలో పేదరికాన్ని అనుభవించాడు. ఉపాధి కోసం ఎన్నో పనులు, ఉద్యోగాలు చేసిన ఇతడు ఓ లైబ్రరీలో పనిచేస్తుండగా ఓ కళాకారుడు గమనించి నటుడిగా రాణిస్తావని చెప్పి ప్రోత్సహించాడు. చిన్నప్పుడే ట్యాప్‌డ్యాన్స్‌ నేర్చుకున్న ఇతడు ఓ పక్క నృత్య ప్రదర్శనలు ఇస్తూనే నాటకాల్లో నటుడిగా కూడా రాణించాడు. ఆపై వెండితెర అవకాశాలు పొంది అంచెలంచెలుగా ఎదిగాడు. విలక్షణ నటుడిగా ఆకట్టుకున్న ఇతడు న్యూయార్క్‌లో 1986లో తన 86వ ఏట మరణించాడు. ఈరోజు ఇతడి వర్థంతి.
                                                                                  


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.