మే 12.. (సినీ చరిత్రలో ఈరోజు)


* ఎన్టీఆర్, జమునల నటనకు గీటురాయి

(‘తోడు నీడ’ విడుదల)


ఎన్టీఆర్, జమున, భానుమతి ప్రధాన తారాగణంగా విడుదలైన ‘తోడు నీడ’ సినిమా శతదినోత్సవం జరుపుకుంది. ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో పల్లెటూరి అనుబంధాలు, ఆత్మీయతలకు అద్దం పడుతుందీ చిత్రం. ఎన్టీఆర్, ఆదుర్తితో కలిసి చేసిన సినిమాలు రెండే రెండు. వాటిలో ఇది రెండోది. యాభై నాలుగేళ్ల క్రితం 1965లో విడుదలైన ఈ సినిమాను ఇప్పుడు చూసినా నిత్యనూతనంగా కనిపించడం విశేషం.

(మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి...)

 * కదనుతొక్కిన కథనం


సినిమా అంటే కథే కాదు, కథనం కూడా. కథను చెప్పే తీరు, అందుకు ఎంచుకున్న ఎత్తుగడలు, నడిపించిన విధానం... ఇవన్నీ బాగుంటే అది ఓ మేటి సినిమాగా నిలిచిపోతుంది. అదే జరిగింది, ‘పల్ప్‌ ఫిక్షన్‌’ (1994) సినిమాలో. ఈ సినిమాలో బ్రూస్‌విల్లీస్, జాన్‌ ట్రవోల్టా, శామ్యూల్‌ ఎల్‌. జాక్సన్, ఉమా థర్మన్‌లాంటి హేమాహేమీలు నటించినా, ఆ సినిమా స్క్రీన్‌ప్లే, టెక్నిక్‌లకే ఎక్కువ ప్రాచుర్యం లభించింది. నాలుగు విడివిడి కథలను ఎక్కడా గందరగోళం లేకుండా చూపిస్తూనే, వాటిని కలిపి చెప్పిన తీరుకు అంతర్జాతీయంగా గుర్తింపు లభించింది. ఎన్నో ప్రపంచ చిత్రోత్సవాల్లో పురస్కారాలతో పాటు, ఆస్కార్‌ లాంటి ప్రతిష్ఠాత్మకమైన అవార్డులను కూడా ఈ సినిమా దక్కించుకుంది. ప్రముఖ దర్శకుడు క్వెటిన్‌ టరంటినో తీసిన బ్లాక్‌బస్టర్‌ సినిమాల్లో ఇది ఉత్తమమైనదిగా పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత వచ్చిన ఎన్నో సినిమాలకు స్ఫూర్తిగా ప్రభావం చూపించిన ఈ సినిమా, 8.5 మిలియన్‌ డాలర్ల వ్యయంతో నిర్మితమై 213.9 మిలియన్‌ డాలర్ల వసూళ్లు కురిపించింది.

* బాక్సాఫీస్‌ పాయిజన్‌!


మూడో సినిమాకే ఆస్కార్‌ అందకున్న ఓ అందాల నటి, ఆపై అన్ని సినిమాలూ విఫలం కావడంతో ‘బాక్సాఫీస్‌ పాయిజన్‌’ అనే పేరు తెచ్చుకుంది. అవకాశాలు అంతంత మాత్రంగా ఉన్న తరుణంలో తిరిగి తన అదృష్టాన్ని తానే తిరగరాసుకుని మళ్లీ వెండితెరపై వెలిగింది. ఆ నటే కేథరీన్‌ హెప్‌బర్న్‌. అరవై ఏళ్ల నటనా ప్రస్థానంలో ఉత్తమ నటిగా 4 ఆస్కార్‌ అవార్డులు అందుకున్న రికార్డు ఈమెదే. హాలీవుడ్‌లో మేటి నటిగా ప్రాచర్యం పొందింది. కాలేజీ రోజుల్లోనే నటి కావాలని కోరుకుని నాటక రంగంలో తర్ఫీదు పొంది నాలుగేళ్లలో మంచి నటిగా పేరు తెచ్చుకుని వెండితెర నుంచి ఆహ్వానాలు అందుకుంది. మూడో సినిమా ‘మార్నింగ్‌ గ్లోరీ’ (1933)తోనే ఆస్కార్‌ అవార్డు అందుకుంది. కానీ ఆపై అయిదేళ్ల పాటు విజయం ఆమెకు మొహం చాటేసింది. ఆ దశలో ఆమె తన విజయాలకు తానే బాట వేసుకోవడం విశేషం. ఫిలిప్‌ బ్యారీ అనే రచయిత చేత తన కోసమే ఓ మంచి నాటకం ‘ద ఫిలడెల్ఫియా స్టోరీ’ రాయించుకుని కాపీ రైట్లు దక్కించుకుంది. అందులో తనే ప్రధాన పాత్ర పోషిస్తూ నాటకాన్ని విరివిగా ప్రదర్శించింది. ఆ నాటకానికి విపరీతమైన క్రేజ్‌ ఏర్పడడంతో హాలీవుడ్‌ దాన్ని సినిమాగా మలచడానికి సిద్ధపడింది. అయితే తనను హీరోయిన్‌గా బుక్‌ చేసుకుంటేనే రైట్స్‌ అమ్ముతానని షరతు పెట్టింది. ఆ సినిమా విజయవంతం కావడంతో ఆమె తిరిగి బిజీ స్టార్‌ అయిపోయింది. ‘ద ఆఫ్రికన్‌ క్వీన్‌’, ‘గెస్‌ హూస్‌ కమింగ్‌ టు డిన్నర్‌’, ‘ద లయన్‌ వింటర్‌’, ‘ఆన్‌ గోల్డెన్‌ పాండ్‌’ లాంటి సినిమాలతో మంచి గుర్తింపుతో పాటు మూడు ఆస్కార్లు అందుకుంది. నాటకాలు, టీవీ సినిమాలతో నటనను కొనసాగిస్తూ 87 ఏళ్ల వయసులో కూడా నటించి మెప్పించింది. అమెరికాలో 1907 మే 12న పుట్టిన ఈమె, తన 96వ ఏట 2003 జూన్‌ 29న మరణించింది.

* అరుదైన నటుడు


‘ప్రపంచంలోనే ప్రభావశీలురైన మేటి 100 మంది జాబితా’లో ఒకడిగా అంతర్జాతీయ పత్రిక ‘టైమ్‌’ గుర్తించిన నటుడు రామి సయిద్‌ మాలెక్‌. ఈజిప్ట్‌ నుంచి అమెరికా వచ్చిన వలసదారుల కుటుంబానికి చెందిన ఇతడు విలక్షణ నటుడిగా అమెరికాలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందడం విశేషం. కాలిఫోర్నియాలో 1981 మే 12న పుట్టిన ఇతడు ‘నైట్‌ ఎట్‌ ద మ్యూజియం’ ట్రయాలజీ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఉత్తమ నటుడిగా ఎన్నో అవార్డులు అందుకున్నాడు. అమెరికా టీవీల్లో 2015లో మొదలై ఇప్పటికీ ప్రసారమవుతున్న ‘మిస్టర్‌ రోబోట్‌’లో నటించి ‘ప్రైమ్‌ టైమ్‌ ఎమ్మీ’ సహా ఎన్నో అవార్డులు పొందాడు. బ్రిటిష్‌ గాయకుడు ఫ్రెడ్డీ మెర్క్యురీ బయోపిక్‌ ‘బొహెమియన్‌ రాప్సొడీ’ (2018)లో నటించినందుకు ఆస్కార్, గోల్డెన్‌ గ్లోబ్, స్క్రీన్‌ గిల్డ్, బ్రిటిష్‌ ఎకాడమీ అవార్డులను ఒకేసారి పొందడం విశేషం.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.