మే 13 (సినీ చరిత్రలో ఈరోజు)...

* పవర్‌ఫుల్‌ సెలబ్రిటీ!


నిండా పాతికేళ్లు లేని ఓ కుర్రాడు...

-ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన ప్రముఖుడు అనే గుర్తింపు పొందాడు!

-ప్రపంచంలోనే అత్యంత ప్రభావశీలుర జాబితాలో స్థానం సంపాదించాడు!!

- నాలుగేళ్లలో అతడు నటించిన 5 సినిమాలు ప్రపంచవ్యాప్తంగా 3.3 బిలియన్‌ డాలర్లను వసూలు చేశాయి!!!

ఇన్ని ఘనతలు పొందిన ఆ యువనటుడే రాబర్ట్‌ ప్యాటిన్‌సన్‌. పేరు వినగానే ‘హ్యారీపాటర్‌ అండ్‌ ద గోబ్లెట్‌ ఆఫ్‌ ఫైర్‌’లో సెడ్రిక్‌ డిగ్గొరీ పాత్ర గుర్తొస్తే మంచి సినిమా పరిజ్ఞానం ఉన్నట్టే. లేదా ‘ట్విలైట్‌ శాగా’ సినిమాల్లో వాంపైర్‌ ఎడ్వర్డ్‌ కల్లెన్‌ పాత్ర జ్ఞాపకానికి వచ్చినా సినిమాలంటే ఆసక్తి ఉన్నట్టే. ఈ సినిమాల్లో అతడి నటన అంతర్జాతీయ ప్రేక్షకులకు తెగ నచ్చేసింది మరి. టైమ్‌ మ్యాగజైన్‌ ‘100 మోస్ట్‌ ఇన్‌ఫ్ల్యుయన్షియల్‌ పీపుల్‌ ఇన్‌ ద వరల్డ్‌’గా గుర్తించినా, ఫోర్బ్స్‌ పత్రిక ‘మోస్ట్‌ పవర్‌ఫుల్‌ సెలబ్రిటీ ఇన్‌ ద వరల్డ్‌’గా కీర్తించినా కారణం ఆ ప్రేక్షకాదరణే. లండన్‌లో 1986 మే 13న పుట్టిన ఇతగాడు, చదువుకునే రోజుల్లోనే మోడలింగ్‌లో మెరిసి, నాటకరంగంలో మెప్పించి, టీవీల్లో మురిపించి, వెండితెరపైకి దూసుకొచ్చాడు. ‘లిటిల్‌ యాషెస్‌’, ‘రిమెంబర్‌ మి’, ‘వాటర్‌ ఫర్‌ ఎలిఫెంట్స్‌’, ‘కాస్మోపోలిస్‌’, ‘ద రోవర్‌’, ‘మ్యాప్స్‌ టు ద స్టార్స్‌’, ‘ద లాస్ట్‌ సిటీ ఆఫ్‌ జెడ్‌’, ‘గుడ్‌టైమ్‌’లాంటి సినిమాల ద్వారా కూడా మంచి నటుడిగా ముద్రవేశాడు. నటుడిగానే కాదు, గాయకుడిగా, సంగీత కర్తగా కూడా ప్రవీణుడే. ప్రతిష్ఠాత్మకమైన అవార్డులు, పురస్కారాలు అందుకున్న ఇతడు యువతరానికి స్ఫూర్తిదాయకంగా ముందుకు సాగుతున్నాడు.

* బహుముఖంగా ప్రతిభ చూపి...


నటుడు, రచయిత, కమేడియన్, నిర్మాత, రాజకీయ విశ్లేషకుడు, టీవీ వ్యాఖ్యాత... ఇన్ని రకాలుగా ముద్ర వేసిన వాడు స్టీఫెన్‌ టైరోన్‌ కోల్బెర్ట్‌. ‘ద కోల్బెర్ట్‌ రిపోర్ట్‌’ కార్యక్రమం ద్వారా వ్యంగాత్మక హాస్యాన్ని పండిస్తూ ఏళ్ల తరబడి బుల్లితెర ప్రేక్షకులను అలరించాడు. స్కిట్లు, సీరియల్స్‌ ద్వారా టీవీ రంగంలో ఎన్నో అవార్డులు అందుకున్నాడు. రచయితగా ఇతడు రాసిన ‘ఐయామ్‌ అమెరికా’ పుస్తకం బెస్ట్‌సెల్లర్‌గా నిలిచింది. వాషింగ్టన్‌లో 1964 మే 13న 11 మంది సంతానంలో కడపటివాడుగా పుట్టిన ఇతడు చిన్నప్పుడే అనుకరణ, నటన రంగాలవైపు ఆకర్షితుడయ్యాడు. ‘నోబడీ నోస్‌ ఎనీథింగ్‌’, ‘ద గ్రేట్‌ న్యూ వండర్‌ఫుల్‌’, ‘బివిచ్డ్‌’, ‘ద లవ్‌గురు’, ‘మాన్‌స్టర్స్‌ వెర్సెస్‌ ఎలియన్స్‌’, ‘ద హాబిట్‌: ద డిసొలేషన్‌ ఆఫ్‌ స్మగ్‌’, ‘టూ ఫన్నీ టు ఫాల్‌’లాంటి సినిమాల ద్వారా కూడా మెప్పించాడు.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.