మే 16 (సినీ చరిత్రలో ఈరోజు)...

* గీత రచనలో ‘జాతీయ’ స్థాయి!
 సుద్దాల అశోక్‌తేజ (పుట్టినరోజు)


నేలమ్మ నేలమ్మ... అంటూ మట్టి పరిమళాల్ని వెదజల్లిన కలం అది. ఒకటే జననం ఒకటే మరణం... అంటూ పోరాట స్ఫూర్తినీ రగిలించింది. నువు యాడికెళ్తే ఆడికొస్త సువర్ణా... అంటూ కొంటె బాణాల్నీ విసురుతుంది. నీలి రంగు చీరలోన సందమామ నీర జాణ...అంటూ మెలోడీ గీతాలతో మది మదినీ దోస్తుంది. ‘వచ్చిండే మెల్ల మెల్లగా వచ్చిండే...’ అంటూ ఎవ్వర్నయినా ‘ఫిదా’ చేసిన ఆ కలం సుద్దాల అశోక్‌తేజది. శ్రీశ్రీ, వేటూరి తర్వాత ‘నేను సైతం...’ అంటూ తెలుగు పాట కీర్తి పతాకాన్ని జాతీయస్థాయిలో రెపరెపలాడించిన ఘనత సుద్దాలది. ‘ఠాగూర్‌’ చిత్రం కోసం సుద్దాల రాసిన నేను సైతం... పాటకి జాతీయ పురస్కారాన్ని సొంతం చేసుకున్నారు సుద్దాల. 24 యేళ్ల సినీ ప్రయాణంలో 1200పై చిలుకు సినిమాల్లో 2400పైగా పాటల్ని రచించిన ఘనత ఆయనది. గరం గరం పోరి నా గజ్జల సవ్వారి... అంటూ పాటందుకొన్న సుద్దాల కలం... ఎప్పటికప్పుడు పదును పోసుకొంటూ వచ్చింది. ఇప్పటికీ యువతరాన్ని ఉర్రూతలూగించేలా పాటలు రాస్తున్నారు సుద్దాల. విప్లవ భావాలైనా, జానపదమైనా, శృంగార రసాన్ని ఒలికించాలాన్నా... సెంటిమెంట్‌ గీతమైనా... ఆయన కలం నుంచి జాలువారిందంటే చాలు.. అది కొన్నాళ్లపాటు శ్రోతల మదిలో నిలిచిపోవల్సిందే. నటుడు ఉత్తేజ్‌ మేనమామ అయిన సుద్దాల అశోక్‌తేజ పూర్వాశ్రమంలో ఉపాధ్యాయుడు. తన మేనల్లుడు, నటుడు ఉత్తేజ్‌ ప్రోద్భలంతో సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. తనికెళ్ల భరణి ప్రమేయంతో తన తొలిపాటని ‘నమస్తే అన్న’లో రాశారు. ఆ తరువాత నుంచి ఆయన వెనుదిరిగి చూడలేదు. కృష్ణవంశీ, దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన సినిమాలతోపాటు... శ్రీహరి కథానాయకుడిగా నటించిన పలు చిత్రాల్లో వరుసగా పాటలు రాస్తూ శ్రోతల్ని అలరిస్తూ వచ్చారు. తండ్రి, స్వాతంత్య్ర సమర యోధుడైన సుద్దాల హనుమంతు, డా.సి.నారాయణరెడ్డి రచించిన పాటల స్ఫూర్తితో పాఠశాల రోజుల నుంచే కలం కదిలిస్తూ వచ్చిన సుద్దాల అశోక్‌తేజ... ‘ఒసేయ్‌ రాములమ్మ’ సినిమాకి సి.నారాయణరెడ్డితో కలిసి పాటలు రాశారు. అది తన జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే ఓ మధురమైన ఘట్టం అని చెబుతుంటారు సుద్దాల. సినిమా ఎలాంటి పాట కోరుకొంటే అలాంటి పాట రాసేలా తనని తాను మలచుకొన్నా అంటారాయన. కొంతకాలం కిందట ‘ఫిదా’ కోసం రాసిన వచ్చిండే పాటతో పాటు... ‘బేవర్స్‌’ కోసం తల్లీ తల్లీ అంటూ రాసిన గీతాలు యువతరంతో పాటు.. పెద్దవాళ్లని కూడా ఉర్రూతలూగించాయి. ఈ రోజు సుద్దాల పుట్టినరోజు.

(ప్రత్యేక కథనం కోసం క్లిక్‌ చేయండి...)

* తొలి ఆస్కార్‌ వేడుకలు!

ప్రపంచ వ్యాప్తంగా ప్రతిష్ఠాత్మకంగా భావించే ఆస్కార్‌ అవార్డుల వేడుక మొట్ట మొదటి సారిగా ఎప్పుడు జరిగిందో తెలుసా? ఆస్కార్‌ తొలి వేడుకలు 1929, మే 16న లాస్‌ ఏంజెలిస్‌లోని హాలీవుడ్‌ రూజ్‌వెల్ట్‌ హోటల్‌లో జరిగాయి. ‘అకాడమీ ఆఫ్‌ మోషన్‌ పిక్చర్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్సెస్‌’ సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలో 1927, 1928 సంవత్సరాల్లో వచ్చిన సినిమాలకు ఆస్కార్‌ అవార్డులను ప్రదానం చేశారు. అప్పట్లో ఈ వేడుకలకు టికెట్‌గా 5 డాలర్లను (2018 లెక్కలకు సరిచేస్తే ఈ మొత్తం 73 డాలర్లకు సమానం) నిర్ణయించారు. ఆనాటి వేడుకకు 270 మంది హాజరయ్యారు. రేడియోలో కానీ, టీవీలో కానీ ప్రసారం జరగని ఏకైక ఆస్కార్‌ వేడుక అదే. ఎందుకంటే రేడియో బ్రాడ్‌కాస్టింగ్‌ ప్రక్రియ 1930లో కానీ అందుబాటులోకి రాలేదు. ఈ వేడుకల్లో 12 విభాగాల్లో బహుమతులు ఇచ్చారు. ఈ బహుమతుల్లో అధిక భాగాన్ని ‘సెవెంత్‌ హెవెన్‌’, ‘సన్‌రైజ్‌’ సినిమాలు పంచుకున్నాయి. ఇవి రెండూ చెరో మూడు ఆస్కార్లు అందుకున్నాయి. మరో రెండు ఆస్కార్‌లను ‘వింగ్స్‌’ సినిమా అందుకుంది. ఉత్తమ నటుడిగా ఎమిల్‌ జానింగ్స్‌ (ద లాస్ట్‌ కమాండ్‌), ఉత్తమ నటిగా జానెట్‌ గేనర్‌ (సన్‌రైజ్‌) నిలిచారు. ప్రముఖ హాస్యనటుడు చార్లీచాప్లిన్‌కు ‘ద సర్కస్‌’ సినిమాకు గాను గౌరవ పురస్కారాన్ని అందించారు. అప్పట్లో అకాడమీ అవార్డ్స్‌ అని పిలిచే ఈ వేడుక మొత్తం వ్యవహారం 15 నిమిషాల్లో ముగిసింది.

* యాక్షన్‌ డ్రామా


కాలిఫోర్నియా మ్యాగజైన్‌లో వచ్చిన ఓ వ్యాసం ఆధారంగా సినిమాను తీస్తే అది ఆస్కార్‌ సహా అనేక ప్రతిష్ఠాత్మక అవార్డులు అందుకోవడంతోపాటు, కాసుల వర్షం కురిపించింది. అదే ‘టాప్‌గన్‌’ (1986). టోనీ స్కాట్‌ దర్శకత్వంలో యాక్షన్‌ డ్రామా సినిమాగా తెరకెక్కిన ఈ సినిమాలో టామ్‌క్రూజ్‌ నటించాడు. విమానాల శిక్షణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో యాక్షన్‌ దృశ్యాలు, విమానాల విన్యాసాలు అద్భుతమనిపిస్తాయి. దీన్ని 15 మిలియన్‌ డాలర్ల వ్యయంతో చిత్రీకరిస్తే 356.8 మిలియన్‌ డాలర్ల వసూళ్లు సాధించింది.

* వడ్రంగి కొడుకు...
జేమ్స్‌బాండ్‌!


యిదో జేమ్స్‌బాండ్‌గా ప్రపంచ సినీ ప్రేక్షకులకు పరిచయమై నాలుగు సినిమాలతో అలరించిన పియర్స్‌ బ్రాస్నన్‌ పుట్టిన రోజు ఇవాళే. ఐర్లాండ్‌లోని ఓ చిన్న గ్రామంలో 1953 మే 16న పుట్టిన పియర్స్‌ బ్రెంన్‌ బ్రాస్నన్‌ అడుగులు, పదహారేళ్ల వయసు నుంచే నటనా రంగంవైపు పడ్డాయి. లండన్‌లోని డ్రామా సెంటర్‌లో నటన నేర్చుకున్న బ్రాస్నన్‌ నాటకాల ద్వారా పేరు సంపాదించి టీవీల్లోకి వచ్చాడు. అప్పట్లో ‘రెమింగ్టన్‌ స్టీలే’ (1982-1987) అనే రొమాంటిక్‌ కామెడీ సిరీస్‌ ద్వారా ఇంటింటి వీక్షకులను ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత సినిమాల్లోకి ప్రవేశించి ‘ద ఫోర్త్‌ ప్రోటోకాల్‌’, ‘మిసెస్‌ డౌట్‌ఫైర్‌’లాంటి సినిమాల్లో నటించాడు. జేమ్స్‌బాండ్‌గా 1994లో అవకాశం వచ్చింది. ఆ పాత్రలో 1995 నుంచి 2002 వరకు వచ్చిన ‘గోల్డెన్‌ ఐ’, ‘టుమారో నెవర్‌ డైస్‌’, ‘ద వరల్డ్‌ ఈజ్‌ నాట్‌ ఇనఫ్‌’, ‘డై ఎనదర్‌ డే’ సినిమాలతో ప్రపంచ సినీ అభిమానులకు ఆకట్టుకున్నాడు. బాండ్‌ పాత్ర తర్వాత ‘డాంటేస్‌ పీక్‌’, ‘ద థామస్‌ క్రౌన్‌ ఎఫైర్‌’, ‘మామ్మామియా’, ‘ద ఘోస్ట్‌ రైటర్‌’, ‘ద నవంబర్‌ మ్యాన్‌’ లాంటి సినిమాలలో నటించాడు.

వడ్రంగి పని చేసే థామస్‌ బ్రాస్నన్‌కు పుట్టిన ఇతడు, ఒడిదుడుకుల బాల్యాన్నే గడిపాడు. ఊహ తెలియని రోజుల్లోనే నాన్న వదిలిపెట్టేస్తే అమ్మ చేయి పట్టుకుని అమ్మమ్మ, తాతయ్యల దగ్గర ఎదిగాడు. అమ్మ లండన్‌లో నర్స్‌గా పనిచేస్తుంటే బోర్డింగ్‌ స్కూల్స్‌లో చదువుకున్నాడు. సవతి తండ్రి విలియం, బ్రాస్నన్‌కు 11 ఏళ్ల వయసులో చూపించిన బాండ్‌ సినిమా ‘గోల్డ్‌ఫింగర్‌’ అతడిపై తీవ్ర ప్రభావం చూపించింది. ఎప్పటికైనా నటుడిని కావాలనుకున్నాడు. ఆ కోరికే అతడితో పాటు పెరిగి పెద్దదై అతడిని నటుడినే కాదు, జేమ్స్‌బాండ్‌గా కూడా మార్చేసింది.

* ఐదేళ్లకే నటన...
పదిహేనేళ్లకు తార!

మెగాన్‌ ఫాక్స్‌... ఓ శృంగార తార. ఓ అందాల నటి. ఓ మోడల్‌ మెరుపు. ఓ అవార్డుల పంట. అంతర్జాతీయ పత్రికలన్నీ ఆమె ఫొటోను ముఖచిత్రంగా వేసుకోడానికి ముచ్చటపడిపోయేవి. వేసుకోవడమే కాదు ‘సెక్స్‌ సింబల్‌’గా ఆమెను అభివర్ణిస్తూ ఆర్టికిల్స్‌ రాసేవి. ప్రతిష్ఠాత్మకమైన ఎన్నో అవార్డులు, మరెన్నో పురస్కారాలు ఆమెను వరించి వచ్చాయి. ఆకట్టుకునే ఆమె అందాన్ని, అలరించే ఆమె అభినయాన్ని ‘ట్రాన్స్‌ఫార్మర్స్‌’ సినిమాల్లో చూసి ప్రపంచ సినీ అభిమానులు సంబరపడిపోయారు. అమెరికాలోని టెన్నెస్సీలో 1986 మే 16న పుట్టిన మెగాన్‌ డినైస్‌ ఫాక్స్‌ చిన్నప్పటి నుంచీ చురుకే. ఐదేళ్లకే డ్యాన్స్‌ నేర్చుకుంది. పదేళ్లకల్లా బోలెడు ప్రదర్శనలిచ్చి అవార్డులు అందుకుంది. పదమూడేళ్లకల్లా మోడలింగ్‌లో మెరిసింది. పదిహేనేళ్ల వయసులో సినిమా అవకాశం వచ్చింది. ‘హాలీడే ఇన్‌ ద సన్‌’ (2001) సినిమాతో వెండితెరంగేట్రం చేసింది. ఆపై ఇటు బుల్లితెర, అటు వెండితెరలపై ఆకట్టుకుంది. ‘కన్ఫెషన్స్‌ ఆఫ్‌ ఎ టీనేజ్‌ డ్రామా క్వీన్‌’, ‘ట్రాన్స్‌ఫార్మర్స్‌’, ‘ట్రాన్స్‌ఫార్మర్స్‌: రివెంజ్‌ ఆఫ్‌ ద ఫాలెన్‌’, ‘జెన్నిఫర్స్‌ బాడీ’, ‘టీనేజ్‌ మ్యుటెంట్‌ నింజా టర్టిల్స్‌’, ‘ద డిక్టేటర్‌’, ‘దిసీజ్‌ 40’లాంటి సినిమాలతో అలరించింది.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.