మే 23 (సినీ చరిత్రలో ఈరోజు)...

* వెండితెరపై దర్శకేంద్రజాలం...
రాఘవేంద్రరావు (పుట్టినరోజు-1942)


క దృశ్యకావ్యం... ఒక కళాఖండం. - ఇలాంటి మాటలు ఎంతో అనుభూతికి గురయితే తప్ప వినిపించవు. కానీ కె.రాఘవేంద్రరావు సినిమా సినిమాలు చూసిన ప్రతిసారీ ఏదో ఒక సందర్భంలో ఈ మాట గుర్తుకొస్తుందంటే అది అతిశయోక్తి కాదు. ఒక ఫ్రేమ్‌ని ఒక పెయింటింగ్‌లా ఎలా తీర్చిదిద్దాలో ఆయనకి తెలిసినట్టు మరెవ్వరికీ తెలియదేమో. కమర్షియల్‌ సినిమా అనే మాటకి కొత్త అర్థం చెప్పిన దర్శకుడు కె.రాఘవేంద్రరావు. భారతీయ చిత్ర పరిశ్రమ ఎంతో మంది దర్శకుల్ని చూసుంటుంది. కానీ కె.రాఘవేంద్రరావు ప్రత్యేకం. ఆయన ఫ్రేమ్‌ అంటే వెండితెర సైతం మురిసిపోతుంటుంది. తెలుగుతో పాటు, హిందీ, కన్నడ భాషల్లో సినిమాలు తీసిన కె.రాఘవేంద్రరావు శతాధిక చిత్ర దర్శకుల్లో ఒకరు. నిర్మాతగా కూడా ఆయన పలు చిత్రాలు చేశారు. ‘బాహుబలి’ చిత్రాల నిర్మాణాంలో భాగస్వామ్యమయ్యారు. అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకాదరణ పొందిన ఆ చిత్రాలకి సమర్పకులుగా వ్యవహరించారు కె.రాఘవేంద్రరావు. వెండితెరపై ఇంద్రజాలం ప్రదర్శించిన దర్శకుడు కావడంతో ఆయన దర్శకేంద్రుడుగా ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకొన్నారు. సీనియర్‌ దర్శకులు కోవెలమూడి సూర్యప్రకాష్, కోటేశ్వరమ్మ దంపతులకి మే 23, 1942న.. కృష్ణా జిల్లా, కంకిపాడు మండలానికి చెందిన కోలవెన్ను గ్రామంలో జన్మించారు కె.రాఘవేంద్రరావు. బి.ఎ చదువుకున్న ఆయన తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ, మొదట్లో సహాయ దర్శకుడిగా పనిచేశారు. శోభన్‌బాబు, వాణిశ్రీ జంటగా నటించిన ‘బాబు’తో దర్శకుడిగా పరిచయమయ్యారు. ఆ తర్వాత ‘జ్యోతి’ చేసి పేరు తెచ్చుకున్నారు. తొలినాళ్లలో కథానాయిక ప్రాధాన్యమున్న చిత్రాలు చేసినా.. ఆ తర్వాత హీరోయిజంపై దృష్టిపెట్టారు. ప్రతి అగ్ర కథానాయకుడు ఒక్కసారైనా కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో సినిమా చేయాలని ఆశపడేంతగా ఆయన తెరపై హీరోయిజాన్ని చూపించారు. ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు, శోభన్‌బాబు, కృష్ణ, కృష్ణంరాజు, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, రాజశేఖర్‌ వంటి సీనియర్లు మొదలుకొని... నవతరంలో మహేష్‌బాబు, అల్లు అర్జున్, నితిన్, మనోజ్‌ల వరకు పలువురు కథానాయకులతో సినిమాలు తీసి విజయాలు అందుకొన్నారు కె.రాఘవేంద్రరావు. అడవిరాముడు, సింహబలుడు, కేడీనెంబర్‌ 1, డ్రైవర్‌ రాముడు, వేటగాడు, భలే కృష్ణుడు, ఘరానా దొంగ, రౌడీరాముడు కొంటె కృష్ణుడు, దేవత, జస్టిస్‌ చౌదరి, కొండవీటి సింహం, బొబ్బిలి బ్రహ్మన్న, అపూర్వ సహోదరులు, కొండవీటి రాజా, భారతంలో అర్జునుడు, అగ్నిపుత్రుడు, దొంగరాముడు, ఆఖరి పోరాటం, కూలీ నెం 1, రౌడీఅల్లుడు, సుందరకాండ, అల్లరి మొగుడు, ఘరానా మొగుడు, అల్లరి ప్రియుడు, ముగ్గురు మొనగాళ్లు, ముద్దుల ప్రియుడు, పెళ్లి సందడి, అన్నమయ్య, ఇద్దరుమిత్రులు, శ్రీమంజునాథ, శ్రీరామదాసు... ఇలా చెప్పుకోదగ్గ సినిమాలు ఆయన కెరీర్‌లో ఎన్నో. తరాలు మారినా సరే... ఆయన ప్రేక్షకుల అభిరుచులకి తగ్గ సినిమాలు తీయడంలో దిట్ట.

రొమాంటిక్‌ కామెడీ, ఫాంటసీ, మెలోడ్రామా, యాక్షన్‌ థ్రిల్లర్, జీవిత కథలు... ఇలా ఆయన వెండితెరపై టచ్‌ చేయని అంశం లేదేమో. సినిమా అంతా ఒకెత్తైతే... పాటలు మరో ఎత్తు అనేలా ఆయన దర్శకత్వం సాగుతుంటుంది. పండ్లు, పూల నేపథ్యంలో పాటల్ని తెరకెక్కిస్తూ వెండితెరని ఒక పెయింటింగ్‌లా మార్చేస్తుంటారు. కథానాయికలు రెట్టింపు అందంతో కనిపిస్తుంటారు. ప్రతి కథానాయిక రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఒక్కసారైనా సినిమా చేయాలని ఆశపడుతుందంటే అతిశయోక్తి కాదు. ఇటీవల వరుసగా తీసిన ‘శిరిడీసాయి’, ‘ఓం నమో వేంకటేశాయ’ చిత్రాలతో ఆయన భక్తి ప్రధానమైన కథలపైనే దృష్టిపెట్టినట్టు అర్ధమవుతోంది. కె.రాఘవేంద్రరావు బుల్లితెరపై కూడా తనదైన ముద్ర వేశారు. ‘శాంతినివాసం’ అనే ధారావాహికకి రచయితగా, దర్శకత్వ పర్యవేక్షకుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. కోయిలమ్మ, సై సై సయ్యారే, అగ్నిసాక్షి చిత్రాల వెనక కూడా రాఘవేంద్రరావు ఉన్నారు. యాభయ్యేళ్లుగా సాగుతున్న తన సినీ ప్రయాణం... అందులో అనుభవాల్ని రంగరించి, నేటి తరానికి ఒక పాఠంగా ‘సౌందర్య లహరి’ని తీసుకొచ్చారు. తనతో కలిసి పనిచేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులతో కలిసి ఇందులో కె.రాఘవేంద్రరావు పంచుకొన్న అనుభవాలు బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించాయి. 2014లో ఎన్టీఆర్‌ జాతీయ పురస్కారంతోపాటు... బి.ఎన్‌.రెడ్డి జాతీయ పురస్కారం పురస్కారాల్ని అందుకొన్నారు కె.రాఘవేంద్రరావు. ‘బొబ్బిలి బ్రహ్మన్న’, ‘అల్లరి ప్రియుడు’, ‘పెళ్లిసందడి’, ‘అన్నమయ్య’ చిత్రాలకి ఉత్తమ దర్శకుడిగా నంది పురస్కారాలు స్వీకరించారు. పెళ్లిసందడి’ చిత్రంలో ఒక పాట నృత్య దర్శకత్వానికిగానూ ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా కూడా నంది అందుకొన్నారు. రాఘవేంద్రరావుకి భార్య సరళతోపాటు, తనయుడు ప్రకాష్‌ కోవెలమూడి, కూతురు మాధవి ఉన్నారు. ప్రకాష్‌ తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ దర్శకుడిగా సినిమాలు తీస్తున్నారు. ఈ రోజు కె.రాఘవేంద్రరావు పుట్టినరోజు.

(ప్రత్యేక కథనం కోసం క్లిక్‌ చేయండి...)

* లాహిరి లాహిరి లాహిరిలో...
వైవీఎస్‌ చౌదరి (పుట్టినరోజు-1965)


వై.
వి.ఎస్‌.చౌదరి. - ఈయన చేసింది తక్కువ సినిమాలే అయినా... తెలుగు చిత్ర పరిశ్రమపై తనదైన ముద్ర వేశారు. దర్శకుడిగానే కాకుండా... రచయితగా, నిర్మాతగా, పంపిణీదారుడిగా, ఆడియో కంపెనీ అధినేతగా, ప్రదర్శనకారుడిగా ఆయన పరిశ్రమతో విడదీయలేని అనుబంధాన్ని కొనసాగిస్తున్నారు. ఎన్టీఆర్‌కి వీరాభిమాని అయిన చౌదరి, ఆయన స్ఫూర్తితోనే చలన చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. కృష్ణాజిల్లా, గుడివాడలో 23 మే 1965లో ఒక మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన వైవీయస్‌ చౌదరికి చిన్నప్పట్నుంచే సినిమాలపై ఆసక్తి ఏర్పడింది. చదువుకొనే వయసులోనే ఎన్టీఆర్‌ అభిమాన సంఘాన్ని స్థాపించి దానికి అధ్యక్షుడిగా వ్యవహరించారు. ఆ తర్వాత అందరి సినిమాలు చూస్తూ... వాటిలో లోటుపాట్లు, మంచి చెడులు.... ఏ సినిమా ఎంత వసూళ్లు సాధిస్తుందో స్నేహితుల దగ్గర చెప్పేవాడట. ఇంజినీరింగ్‌ చదువుకోవడం కోసం మద్రాసు వెళ్లిన ఆయన, సినిమాలపై ఇష్టంతో చదువుని పక్కనపెట్టి అక్కడే ఎడిటింగ్‌ విభాగంలో చేరారు. ఆ తర్వాత సహాయ దర్శకుడిగా ప్రయాణం ప్రారంభించారు. ఎన్టీఆర్‌తో పలు చిత్రాలు తీసి విజయాలు అందుకొన్న కె.రాఘవేంద్రరావు అంటే చౌదరికి ఎంతో అభిమానం. దాంతో ఆయన ఎలాగైనా రాఘవేంద్రరావు దగ్గర సహాయ దర్శకుడిగా చేరాలనుకొన్నారు. కానీ అప్పటికే ఆయన దగ్గర చాలామంది ఉండటంతో కుదరదని చెప్పారు. అయినా పట్టు వదలకుండా వారం రోజులపాటు ఆయన ఇంటి దగ్గరే నిలబడి సహాయ దర్శకుడిగా అవకాశం సంపాదించారు. అలా ‘పట్టాభిషేకం’, ‘కలియుగ పాండవులు’, ‘సాహస సామ్రాట్‌’, ‘అగ్నిపుత్రుడు’, ‘దొంగరాముడు’, ‘జానకిరాముడు’, ‘రుద్రనేత్ర’, ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ చిత్రాలకి పనిచేశారు చౌదరి. ఆ తర్వాత వైజయంతీ మూవీస్‌లో చేరి ‘అశ్వమేథం’, ‘గోవిందా గోవిందా’ చిత్రాలకి కో డైరెక్టరుగా పనిచేశారు. ‘క్రిమినల్‌’, ‘గులాబి’, ‘నిన్నే పెళ్లాడతా’ చిత్రాల తర్వాత నాగార్జున అవకాశం ఇవ్వడంతో ఆయన నిర్మాణంలో ‘శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి’ చిత్రం చేశారు చౌదరి. ఒక ముఖ్యపాత్రలో ఏఎన్నార్‌... ప్రధాన పాత్రధారులుగా కొత్తవాళ్లతో తెరకెక్కిన ఆ చిత్రం ఘన విజయం సాధించింది. ఆ తర్వాత నాగార్జునే ‘సీతారామరాజు’ చేసే అవకాశం ఇచ్చారు. అది కూడా విజయవంతమైంది. ఆ చిత్రం తర్వాత మహేష్‌బాబుతో ‘యువరాజు’ చేశాడు. కానీ అది పరాజయం పాలైంది. ఆ ఫలితం చూసి, నిర్మాతలెవ్వరూ సినిమాలు చేయడానికి ముందుకు రాకపోవడంతో ‘బొమ్మరిల్లు వారి’ పేరుతో సొంత నిర్మాణ సంస్థని స్థాపించి స్వీయ దర్శకత్వంలో ‘లాహిరి లాహిరి లాహిరిలో’ చిత్రం చేశారు. విజయం అందుకొన్నారు. ఆ తర్వాత చేసిన ‘సీతయ్య’, ‘దేవదాసు’ చిత్రాలతోనూ తనదైన ప్రత్యేకతని ప్రదర్శించిన వైవీఎస్‌ చౌదరికి ‘ఒక్కమగాడు’, ‘సలీమ్‌’ చిత్రాలు చేదు ఫలితాల్ని ఇచ్చాయి. నిర్మాతగా చేసిన ‘నిప్పు’ కూడా పరాజయాన్నే మిగిల్చింది. సాయిధరమ్‌ తేజ్‌ని ‘రేయ్‌’తో తెరకు పరిచయం చేశారు. కానీ ఆ చిత్రం కూడా పరాజయాన్నే మిగిల్చింది. అప్పట్నుంచి సినిమాలకి దూరంగా ఉంటున్నారు వైవీయస్‌ చౌదరి. త్వరలోనే ఆయన కొత్త సినిమా కోసం మెగాఫోన్‌ చేతపట్టబోతున్నారని సమాచారం. వెంకట్, చాందిని, చందు, ఆదిత్య ఓం, అంకిత, రామ్, ఇలియానా, సాయిధరమ్‌ తేజ్, సయామీఖేర్‌ తదితర నటుల్ని తెరకు పరిచయం చేసింది చౌదరినే. ‘నిన్నే పెళ్లాడతా’ సమయంలో అందులో ఒక కీలక పాత్రలో నటించిన గీతని ప్రేమించి, ఆమె తల్లిదండ్రుల్ని ఒప్పించి పెళ్లి చేసుకొన్నారు చౌదరి. వీరికి అమ్మాయిలు యుక్త చౌదరి, ఏక్తా చౌదరి ఉన్నారు. ఈరోజు వైవీయస్‌ చౌదరి పుట్టినరోజు.

* హోటల్లో ఏం జరిగింది?


హోటల్లో దిగిన వారందరూ వింతగా ప్రవర్తిస్తుంటారు. విపరీతంగా ప్రతిస్పందిస్తూ చివరికి హింసాత్మకంగా మారిపోతుంటారు. అలాంటి చరిత్ర కలిగిన ఆ హోటల్‌కి కేర్‌టేకర్‌ ఉద్యోగం కోసం ఓ రచయిత, అతడి భార్య, కొడుకు వస్తారు. వచ్చిన దగ్గర్నుంచి అన్నీ భయంకరమైన అనుభవాలే. రచయిత క్రూరుడిగా మారిపోతాడు. కొడుకు కళ్ల ముందు గతం, వర్తమానం, భవిష్యత్తు కూడా కనిపిస్తుంటాయి. అంతక్రితం అదే హోటల్‌కి కేర్‌టేకర్‌గా వచ్చిన వ్యక్తి తన భార్యను, సంతానాన్ని చంపేసి, తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో వీళ్లకి ఏం జరిగింది?... ఇది చాలదూ, ఓ భయానక సినిమాను తెరకెక్కించడానికి? అది ప్రేక్షకులను అలరించడానికి? అందుకనే ‘ద షైనింగ్‌’ (1980) మేటి హారర్‌ సినిమాగా పేరు తెచ్చుకుంది. స్టీఫెన్‌ కింగ్‌ అనే రచయిత 1977లో రాసిన నవల విపరీతమైన పాఠకాదరణ పొందడంతో దాని ఆధారంగా అదే పేరుతో ఈ సినిమాను తీశారు. ప్రముఖ దర్శకుడు స్టాన్లీ కుబ్రిక్‌ తీసిన ఈ సినిమాను జాతీయ సినీ లైబ్రరీలో భద్రపరిచారు.

* మై నేమ్‌ ఈజ్‌
సెకండ్‌ జేమ్స్‌బాండ్‌!


ప్ర
పంచ వ్యాప్తంగా ఆకట్టుకున్న జేమ్స్‌బాండ్‌ సినిమాల్లో సీన్‌కానరీ తర్వాత ఆ పాత్ర పోషించిన ఇంగ్లిష్‌ నటుడు రోజర్‌మోర్‌. జేమ్స్‌బాండ్‌ పాత్రను సృష్టించిన ఇయాన్‌ఫ్లెమింగ్‌ నవలల ఆధారంగా 1973 నుంచి 1985 వరకు తీసిన ఏడు సినిమాల్లో బాండ్‌గా నటించాడు. బాండ్‌గా తొలి చిత్రం ‘లివ్‌ అండ్‌ లెట్‌ డై’. మోర్, బ్రిటిష్‌ ప్రభుత్వం తరఫున ఎలిజబెత్‌ రాణి చేతుల మీదుగా ప్రతిష్ఠాత్మక పురస్కారమైన ‘నైట్‌హుడ్‌’ అందుకున్నాడు. యూనిసెఫ్‌ గుడ్‌విల్‌ అంబాసిడర్‌గా వ్యవహరించాడు. బాండ్‌ సినిమాల కంటే ముందుగానే టీవీ, సినిమా రంగాల్లో చిర పరిచితుడు. లండన్‌లో 1927 అక్టోబర్‌ 14న పుట్టిన ఈ తెర గూఢచారి తండ్రి జార్జి ఆల్‌ఫ్రెడ్‌ మోర్‌ ఓ పోలీసు. తల్లి కలకత్తాలో పుట్టిన ఇంగ్లిషు వనిత. చదువు అయిన తర్వాత ఓ యానిమేషన్‌ స్కూల్లో చేరితే అక్కడ పొరపాటు చేయడంతో తొలగించారు. ఓ సినిమా దర్శకుడి ఇంట్లో దొంగతనం కేసును తండ్రి జార్జి పరిష్కరిస్తే ఆ పరిచయంతో రోజర్‌మోర్‌కు ఆ దర్శకుడు ‘సీజర్‌ అండ్‌ క్లియోపాత్రా’ (1945) సినిమాలో ఓ ఎక్స్‌ట్రా వేషం ఇచ్చాడు. అదే అతడి మొదటి సినిమా అయినా, అమ్మాయిలను ఆకర్షించడాన్ని గమనించిన ఆ దర్శకుడు రోజర్‌మోర్‌ను ఓ యాక్టింగ్‌ స్కూల్లో చేర్పించాడు. పద్దెనిమిదేళ్ల వయసులో రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో రోజర్‌మోర్‌ను సైన్యంలోకి తీసుకున్నారు. యుద్ధం తర్వాత తిరిగి సినిమా రంగానికి వచ్చి ‘పెర్‌ఫెక్ట్‌ స్ట్రేంజర్స్‌’ (1945), ‘గైటీ జార్జి’, ‘ట్రోటీ ట్రూ’ లాంటి సినిమాల్లో చిన్న చిన్న వేషాలు వేశాడు. తర్వాత అమెరికా వచ్చి కొన్ని టీవీ సీరియల్స్‌లో పాల్గొన్నాడు. ఎంజీఎం నిర్మాణ సంస్థతో ఒప్పందం కుదిరి ‘ద లాస్ట్‌ టైమ్‌ ఐ సా ప్యారిస్‌’ (1954) సినిమాలో ఎలిజబెత్‌ టేలర్‌ సరసన నటించాడు. ఆపై ‘ఇంటరెప్టెడ్‌ మెలోడీ’, ‘ద కింగ్స్‌ థీఫ్‌’, ‘డయానే’, ‘ద మిరాకిల్‌’ లాంటి సినిమాల్లో నటిస్తూనే ఎన్నో టీవీ సీరియల్స్‌లో నటించాడు. తర్వాత జేమ్స్‌బాండ్‌ పాత్రలో మెరిశాడు. బాండ్‌ సినిమాలతో పాటు ఇతర సినిమాల్లో కూడా నటించాడు. బాండ్‌ సినిమాలకు ఓ సరికొత్త స్టైల్‌ను, ఓ హాస్య చతురతను, చిలిపితనాన్ని జోడించిన రోజర్‌మోర్‌ 2017 మే 23న తన 89 ఏళ్ల వయసులో మరణించాడు.

* సాహసం శాయరా...
‘జోన్స్‌’ డింభకా!


ఒళ్లు గగుర్పొడిచే సాహసాలను కళ్లింతింత పెట్టుకుని చూడాలనుకునే ప్రేక్షకుల ఉత్సాహాన్ని ఉరకలెత్తించాయి ‘ఇండియానా జోన్స్‌’ సినిమాలు.

రాసింది ప్రముఖ హాలీవుడ్‌ దర్శక నిర్మాత, కథకుడు జార్జీ లూకాస్‌!
తీసింది అద్భుత చిత్రాలను అందించిన ప్రముఖ దర్శకుడు స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌!
నటించింది యాక్షన్‌ హీరో హారిసన్‌ ఫోర్డ్‌!

ఇంత మంచి కాంబినేషన్‌తో వచ్చిన ఈ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. కాసుల వర్షం కురిపించాయి. ఇంతవరకు నాలుగు సినిమాలు రాగా, ఐదోది నిర్మాణంలో ఉంది. ‘రైడర్స్‌ ఆఫ్‌ ద లాస్ట్‌ ఆర్క్‌’ (1981), ‘టెంపుల్‌ ఆఫ్‌ డూమ్‌’ (1984), ‘ద లాస్ట్‌ క్రుసేడ్‌’ (1989), ‘కింగ్‌డమ్‌ ఆఫ్‌ ద క్రిస్టల్‌ స్కల్‌’ (2008) సినిమాలు ఇంతవరకు వచ్చాయి. ఐదో సినిమా 2021లో విడుదల కానుంది. వీటిలో రెండోదైన ‘ఇండియానా జోన్స్‌ అండ్‌ ద టెంపుల్‌ ఆఫ్‌ డూమ్‌’ సినిమా 1984 మే 23న, తొలి సినిమా ‘రైడర్స్‌ ఆప్‌ ద లాస్ట్‌ ఆర్క్‌’ సినిమాకు ప్రీక్వెల్‌గా వచ్చింది. ఉత్తర భారత దేశంలో పిల్లలను ఎత్తుకుపోయి బలిచ్చే దుండగులను ఎదుర్కొని, అద్భుత మహిమలు ఉన్న ఓ వజ్రాన్ని హీరో ఇండియానా జోన్స్‌ ఎలా దక్కించుకున్నాడనే కథాంశంతో వచ్చిన ఈ సినిమాను 28.2 మిలియన్‌ డాలర్ల బడ్జెట్‌తో తీయగా, 333.1 మిలియన్‌ డాలర్లను వసూలు చేసింది.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.