మే 27.. (సినీ చరిత్రలో ఈరోజు)

* అక్కినేని, భానుమతి...
దుమ్ము దులిపిన చిత్రం...‘అంతస్తులు’


క్కినేని నటన, కృష్ణకుమారి అందం, భానుమతి అభినయం, గుమ్మడి పాత్ర పోషణ... అలరించే పాటలు... ఆకట్టుకునే కథ... ఇన్ని ఉంటే ఆ సినిమా విజయభేరి మోగించకుండా ఎలా ఉంటుంది? అందుకే నాటికీ, నేటికీ చక్కని చిత్రంగా పేరు తెచ్చుకుంది ‘అంతస్తులు’. ఇంతటి ఆదరణ పొందిన ఈ సినిమా సంగతులేంటి?

(ప్రత్యేక వార్త కోసం క్లిక్‌ చేయండి...)

* సూపర్‌ ప్రమాదం!


గా
లిలోకి రివ్వుమంటూ ఎగిరి ఆకట్టుకున్న సూపర్‌మ్యాన్‌... అంతరిక్షంలోకి సైతం దూసుకుపోగలిగే సూపర్‌మ్యాన్‌... అవసరమైతే భూమిని వెనక్కి తిప్పి గతాన్ని మళ్లీ రప్పించగలిగే సూపర్‌మ్యాన్‌... తన అపూర్వ శక్తులతో దుష్టుల పనిపట్టి అందరినీ కపాడిన సూపర్‌మ్యాన్‌... కేవలం మంచానికి మాత్రమే పరిమితమయ్యేలా మార్చేసిన రోజు ఇది. ‘సూపర్‌మ్యాన్‌’ పాత్ర ద్వారా ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న క్రిస్టోఫర్‌ రీవ్, వర్జీనియాలో గుర్రపు పందాల్లో పాల్గొంటూ దురదృష్టవశాత్తూ 1995లో ఇదే రోజు పడిపోయి గాయపడ్డాడు. మెడ నుంచి శరీరం మొత్తం చచ్చుపడిపోయి కదలలేని స్థితికి వచ్చాడు. అయినా నిరాశ పడకుండా జీవితం పట్ల సానుకూల దృక్పథంతో చక్రాల కుర్చీ నుంచే పుస్తకాలు రాసి, సినిమాలు సైతం తీయగలగడం ద్వారా ‘నిజమైన సూపర్‌మ్యాన్‌’ అనిపించుకోగలడం విశేషం.

* విలక్షణ నటుడు


క్రి
స్టోఫర్‌ ఫ్రాంక్‌ కరన్‌డిని లీ... ‘సర్‌’ క్రిస్టోఫర్‌లీగా మారడం వెనుక, 70 ఏళ్ల పాటు నటుడిగా, గాయకుడిగా, రచయితగా సాగిన ఆయన సుదీర్ఘ ప్రస్థానం ఉంది. ఆ ప్రయాణంలో అడుగడుగునా నేర్చుకునే తత్వం, తనను తాను మార్చుకునే తత్వం స్ఫుటంగానే కనిపిస్తాయి. ‘సర్‌’ అనేది బ్రిటిష్‌ ప్రభుత్వం ఆయన సేవలకు ఇచ్చిన గౌరవ పురస్కారం. చాలా హాలీవుడ్‌ సినిమాల్లో విలన్‌గా, క్రూరుడిగా ఆయనను చూసిన ఆనాటి ప్రేక్షకులు భయపడేవారంటే ఆయా పాత్రల్లో ఆయనెంత చక్కగా ఇమిడిపోయారో అర్థం చేసుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఆకట్టుకున్న ‘ద లార్డ్‌ ఆఫ్‌ద రింగ్స్‌’, ‘ద హోబిట్‌’, ‘ద మ్యాన్‌ విత్‌ ద గోల్డెన్‌ గన్‌’, ‘స్టార్‌వార్స్‌’లాంటి చిత్రాలు ఆయనకు అంతర్జాతీయ ఖ్యాతిని తీసుకువచ్చాయి. ముఖ్యంగా పాకిస్థాన్‌ స్థాపకుడు మొహమ్మద్‌ అలీ జిన్నా బయోపిక్‌ ‘జిన్నా’(1998)లో ఆయన నటన అత్యున్నత ప్రమాణాలను అందుకుంది. ఈయన రెండు దశాబ్దాల పాటు డ్రాకులా పాత్రలే ధరించడం విశేషం. లండన్‌లో 1922 మే 27న పుట్టిన క్రిస్టోఫర్‌లీ వెండితెరపై విలక్షణ నటుడిగా తనదైన ముద్ర వేసి 2015 జూన్‌ 7న తన 93వ ఏట మరణించారు.

* జూ నుంచి తప్పించుకుంటే?


కొ
న్ని జంతువులు జంతు ప్రదర్శన శాల (జూ) నుంచి తప్పించుకుని అడవిలోకి పారిపోతే ఏమవుతుంది? ఏముందీ, హాయిగా ఉంటాయంటారా? తప్పు. జూలోనే పుట్టి పెరిగిన జంతువులకు అడవిలో వేటాడ్డం ఎలా తెలుస్తుంది? జూలో సమయానికి ఆహారం వచ్చిపడిపోతుంది. అలా వచ్చేపోయే వారిని చూస్తూ కాలం గడిపేవి కాస్తా, అడవిలో కొత్తగా జీవించాల్సి రావడం కష్టమే. ఈ ఆలోచనే ఓ సినిమాకి నాంది పలికింది. అదే ‘మడగాస్కర్‌’. కంప్యూటర్‌ యానిమేటెడ్‌ అడ్వెంచర్‌ కామెడీ సినిమాగా 2005లో విడుదలైన ఇది ప్రపంచ వ్యాప్తంగా పెద్దల్ని, పిల్లల్ని ఆకర్షించింది. డ్రీమ్‌వర్క్స్‌ సంస్థ నుంచి ఎరిక్‌ డార్నెల్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా, 75 మిలియన్‌ డాలర్ల పెట్టుబడికి 532.7 మిలియన్‌ డాలర్లు వసూలు చేసింది.

న్యూయార్క్‌లోని సెంట్రల్‌ జూ పార్క్‌లోని కొన్ని జంతువులకు జీవితం బోర్‌ కొడుతుంది. ఎప్పుడూ తినడం, పడుకోవడం, ఉన్నచోటే తిరగడం విసుగెత్తిపోయి వాటిలో అవి మాట్లాడుకుని అక్కడి నుంచి తప్పించుకోవాలనుకుంటాయి. అలా జిరాఫీ, సింహం, జీబ్రా, నీటి గుర్రం ఆలోచించి కొన్ని పెంగ్విన్లు, రెండు చింపాంజీలతో కలిసి సాహసం చేస్తాయి. మరి వాటి ప్రయాణం ఎలా సాగింది? అడవిలో అవి అక్కడే పుట్టి పెరిగిన వన్యప్రాణులతో కలిసిపోగలిగాయా? తిరిగి జూయే నయం అనుకున్నాయా? అనేదే కథ. హాయిగా నవ్వించే ఈ సినిమా విజయం సాధించడంతో దీనికి కొనసాగింపుగా ‘ఎస్కేప్‌ టు ఆఫ్రికా’ (2008), ‘యూరప్స్‌ మోస్ట్‌ వాంటెడ్‌’ (2012), ‘పెంగ్విన్స్‌ ఆఫ్‌ మడగాస్కర్‌’ (2014) సినిమాలు వచ్చాయి


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.