మే 31.. (సినీ చరిత్రలో ఈరోజు)

* సంచలనాలకు చిరునామా..
ఘట్టమనేని కృష్ణ (పుట్టినరోజు)


(ప్రత్యేక వార్త కోసం క్లిక్‌ చేయండి)

* ఓ మంచి హీరో


తె
లుగు హీరో భానుచందర్‌ మే 31, 1953న చెన్నైలో జన్మించారు. ప్రముఖ సంగీత దర్శకుడు మాస్టర్‌ వేణు తనయుడు భానుచందర్‌. తెలుగు, తమిళ భాషల్లో కథానాయకుడిగా మంచి పేరు సంపాదించుకొన్నారు. కె.విశ్వనాథ్, బాలుమహేంద్ర, బి.నర్సింగరావు, కె.బాలచందర్‌ తదితర అగ్ర దర్శకుల సినిమాల్లో నటించిన భానుచందర్‌ నిర్మాతగా, దర్శకుడిగా, రచయితగా కూడా తన ప్రతిభని ప్రదర్శించారు. టెలివిజన్‌ దారావాహికల్లోనూ నటించారు. కరాటేలో బ్లాక్‌ బెల్ట్‌ సంపాదించిన భానుచందర్‌ ఇన్నేళ్ల వయసులోనూ ఎంతో ఫిట్‌గా ఉంటారు. పోరాట సన్నివేశాల్లో ఆయన ప్రతిభ ప్రత్యేకంగా కనిపిస్తుంటుంది.

* బంగారు కమలం


భా
రత జాతీయ చలన చిత్ర అవార్డు(1965)లలో ‘చారులత’ బెంగాలీ సినిమా ‘గోల్డెన్‌ లోటస్‌’ అవార్డును గెలుచుకుంది. ప్రముఖ భారతీయ దర్శకుడు సత్యజిత్‌ రే దర్శకత్వం వహించిన సినిమా ఇది. రవీంద్రనాథ్‌ టాగూర్‌ రాసిన ‘నస్టానిర్‌’ (చెదిరిన గూడు) అనే నవల ఆధారంగా తీసిన ఈ సినిమా బెర్లిన్‌ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ఉత్తమ దర్శకత్వానికి ‘సిల్వర్‌ బేర్‌’ అవార్డు కూడా గెలుచుకుంది.

* హ్యారీ మ్యాజిక్‌


ప్ర
పంచ వ్యాప్తంగా ఆకట్టుకున్న ‘హ్యారీపాటర్‌’ సినిమాల్లో మూడవదైన ‘హ్యారీపాటర్‌ అండ్‌ ద ప్రిజనర్‌ ఆఫ్‌ అజ్‌బెకన్‌’ చిత్రం యునైటెడ్‌ కింగ్‌డమ్‌లో విడుదలైంది (2004). ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 796.7 మిలియన్‌ డాలర్లు ఆర్జించింది.

* విలక్షణ నటుడు


ప్ర
పంచ ప్రఖ్యాత హాలీవుడ్‌ నటుడు క్లింట్‌ ఈస్ట్‌వుడ్‌ (శాన్‌ ఫ్రాన్సికో పట్టణంలో మే 31, 1930) పుట్టారు. నటుడిగా, నిర్మాతగా, సంగీతకారుడిగా, రాజకీయవేత్తగా పేరొందిన ఈస్ట్‌వుడ్, 1960ల్లో వచ్చిన ‘డాలర్స్‌’ ట్రయాలజీ చిత్రాలతో ప్రాచుర్యం పొందారు. ఆ తర్వాత అయిదు చిత్రాలుగా వచ్చిన ‘డర్టీహ్యారీ’ సినిమాల్లో నటనతో గుర్తింపు తెచ్చుకున్నారు. ‘అన్‌ఫర్‌గివెన్‌’ (1992) చిత్రానికి ఉత్తమ దర్శకుడిగా ఆస్కార్‌ అందుకోగా, ఆయన తీసిన ‘మిలియన్‌ డాలర్‌ బేబీ’ (2004) సినిమా ఉత్తమ చిత్రంగా ఆస్కార్‌ గెలుచుకుంది.

* అందచందాల నటి


‘బ్లూ
లగూన్‌’ (1980) చిత్రం ద్వారా ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న నటి బ్రూక్‌ షీల్డ్స్‌ (మే 31, 1965) అమెరికాలో పుట్టారు. బాల్యంలోనే మోడలింగ్‌ చేసిన ఈమె, 12 ఏళ్లకే ‘ప్రెట్టీబేబీ’ (1978) సినిమాలో వేశ్యగా మారిన బాలిక పాత్ర ద్వారా మంచి నటిగా గుర్తింపు పొందింది. ‘ఎండ్‌లెస్‌ లవ్‌’ లాంటి ఎన్నో చిత్రాల్లో అందాల తారగా గుర్తింపు పొందింది. ‘టైమ్‌’, ‘వోగ్‌’ లాంటి అంతర్జాతీయ పత్రికలపై ముఖచిత్రాలతో అభిమానులను అలరించింది.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.