మే 7.. (సినీ చరిత్రలో ఈరోజు)

* విలక్షణ నటి

(పసుపులేటి కన్నాంబ వర్థంతి-1964)(ప్రత్యేక కథనం కోసం క్లిక్‌ చేయండి...)

* మనసు కవి! (ఆత్రేయ జయంతి)


(ప్రత్యేక కథనం కోసం క్లిక్‌ చేయండి...)

* 5000 ఏళ్లకోసారి అవతారం!


‘ధర్మ సంస్థాపనార్ధాయ సంభవామి యుగేయుగే...’ అంటూ భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు. ఆయనే కాదు అవతరించేది... ఈ విశ్వంలో దుష్టశక్తులు ప్రబలి నప్పుడు ప్రతి 5000 ఏళ్లకోసారి ‘ఫిఫ్త్‌ ఎలిమెంట్‌’ కూడా అవతారం దాలుస్తుంది! నమ్మకం కుదరకపోతే ‘ద ఫిఫ్త్‌ ఎలిమెంట్‌’ సినిమా చూస్తే సరి. టికెట్‌ కొనుక్కుని మరీ వెళ్తాం కాబట్టి, నమ్మక తప్పని పరిస్థితులు వెండితెరపై ఆవిష్కారమవుతాయి. అలాంటి పరిస్థితులను అద్భుతమైన గ్రాఫిక్స్‌తో అందించింది కాబట్టే, ‘ద ఫిఫ్త్‌ ఎలిమెంట్‌’ సినిమా ప్రపంచవ్యాప్తంగా వసూళ్ల వర్షం కురిపించింది. కేవలం 90 మిలియన్‌ డాలర్ల వ్యయంతో తీసిన ఈ సినిమా 263.9 మిలియన్‌ డాలర్లను రాబట్టడమే కాదు, ప్రతిష్ఠాత్మకమైన ఎన్నో అవార్డులను కూడా కొల్లగొట్టింది. ఫ్రెంచ్‌ దర్శకుడు లుక్‌ బెస్సన్‌ రాసి, దర్శకత్వం వహించిన ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తి కరమైన అంశం ఉంది. బెస్సెన్‌ ఈ సినిమా కథను తనకు 16 ఏళ్ల వయసు ఉన్నప్పుడే రాయడం మొదలుపెట్టాడు. ఆ కథ అతడికి 38 ఏళ్లు వచ్చిన తర్వాత వెండితెరపై రూపుదిద్దుకుంది.

ఓ టాక్సీ డ్రైవర్‌ ఈ విశ్వాన్ని రక్షించగలడా? తప్పకుండా రక్షిస్తాడు... ఆ డ్రైవర్‌ బ్రూస్‌విల్లిస్‌ అయితే! తన మానాన తను టాక్సీ నడుపుకుంటుంటే ఉన్నట్టుండి ఆకాశంలోంచి కారులోకి వచ్చిపడింది, ‘ఫిఫ్త్‌ ఎలిమెంట్‌’... ఓ అమ్మాయి రూపంలో. అంటే మహిళా అవతారం అన్నమాట. అసలీ ఎలిమెంట్స్‌ ఏంటో తెలుసుకోవాలంటే కథలోకి తొంగి చూడాలి. ఇది భవిష్యత్తులో 23వ శతాబ్దానికి చెందిన కథ. అప్పటికి వాహనాలన్నీ గాలిలో ఎగురుతూ ఉంటాయి. దుష్టశక్తులు ప్రబలిపోతుంటే మానవాళి ఆశ మాత్రం ఒక్కటే... ‘ఫిఫ్త్‌ ఎలిమెంట్‌’. నీరు, నిప్పు, భూమి, గాలి ఎలిమెంట్స్‌కు ప్రతీకగా ఉండే నాలుగు మణులను కలిపేందుకు నింగి నుంచి వస్తున్న ‘ఆమె’ను భూమి మీదకు తీసుకు వస్తుంటే దుష్టశక్తులు ఆ అంతరిక్ష నౌకను నాశనం చేస్తాయి. అయితే కొందరు శాస్త్రవేత్తలు ఆమె డిఎన్‌ఏ ఆధారంగా ‘లీలో’గా ఆమెను సృష్టిస్తారు. ఆమె లేబరేటరీ నుంచి తప్పించుకుని బ్రూస్‌విల్లిస్‌ నడుపుతున్న టాక్సీలోకి పడి అతడి సాయం కోరుతుంది. దుష్టశక్తులను అంతం చేయగలిగే ఆయుధం కోసం వారిద్దరూ అన్వేషించాలి. అక్కణ్ణుంచి అటు దుష్ట శక్తులు, ఇటు ఈమె దివ్యశక్తుల మధ్య పోరాటం మొదలవుతుంది.

* అత్యంత ఖరీదైన సినిమా


ప్రపంచంలో ఇంతవరకు నిర్మించిన సినిమాల్లో అత్యంత ఖరీదైన సినిమా ఏది? ఆ ఘనత ‘పైరేట్స్‌ ఆఫ్‌ ద కరీబియాన్‌: ఆన్‌స్ట్రేంజర్‌ టైడ్స్‌’ (2011)కి దక్కుతుంది. దీని నిర్మాణానికి 378.5 మిలియన్‌ డాలర్ల వ్యయమైంది. అయితే ఇది బాక్సాఫీస్‌ వద్ద విజయవంతమై ఏకంగా 1.046 బిలియన్‌ డాలర్లను వసూలు చేసి సంచలనం సృష్టించింది. ‘పైరేట్స్‌...’ పేరుతో వచ్చిన అయిదు సినిమాలలో ఇది నాలుగోది. తొలి సినిమా 2003లో ‘పైరేట్స్‌ ఆప్‌ ద కరీబియాన్‌: ద కర్స్‌ ఆఫ్‌ ద బ్లాక్‌ పెర్ల్‌’తో మొదలైంది. వాల్ట్‌డిస్నీ సంస్థ అందించిన ఈ సినిమాల్లో రెండోది ‘డెడ్‌మ్యాన్స్‌ ఛెస్ట్‌’ (2006), మూడోది ‘ఎట్‌ వరల్డ్స్‌ ఎండ్‌’ (2007) కాగా అయిదో సినిమా ‘డెడ్‌మెన్‌ టెల్‌ నో టేల్స్‌’ (2017). వీటన్నింటి ఉమ్మడి బడ్జెట్‌ 1.274 బిలియన్‌ డాలర్లయితే, ఇవన్నీ కలిసి సాధించిన వసూళ్లు 4.56 బిలియన్‌ డాలర్లు. వీటన్నింటినీ ‘స్వాష్‌బక్లర్‌’ సినిమాలంటారు. అంటే కత్తి యుద్ధాలు, చారిత్రక కథలు, సాహసాలతో కూడి ఉంటాయన్నమాట. అమెరికా రచయిత టిమ్‌ పవర్స్‌ 1987లో రాసిన హిస్టారికల్‌ ఫాంటసీ నవల ఆధారంగా ఈ సినిమాలను తీశారు. వీటికి కొనసాగింపుగా ఆరో సినిమా కూడా రాబోతోంది.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.