మే 8.. (సినీ చరిత్రలో ఈరోజు)

* దుష్టపాత్రలకి కేరాఫ్‌గా నిలిచి...

(చలపతిరావు పుట్టిన రోజు)


తెలుగు సినిమాల్లో ఒకప్పుడు దుష్ట పాత్రలు అనగానే... చలపతిరావే గుర్తుకొచ్చేవారు. ప్రతినాయకుడిగా, సహనటుడిగా, హాస్య నటుడిగా.. ఒదిగిపోయి తెలుగు ప్రేక్షకులపై ప్రత్యేకమైన ముద్ర వేసిన నటుడాయన. 1300కి పైగా సినిమాల్లో నటించారు. నిర్మాతగా కూడా చిత్రాలు చేశారు. చలపతిరావు అసలు పేరు తమ్మారెడ్డి చలపతిరావు. కృష్ణా జిల్లా, పామర్రు మండలంలోని బల్లిపర్రు ఆయన స్వగ్రామం. మణియ్య, వియ్యమ్మ దంపతులకి జన్మించారు. చిన్నప్పుడే నాటకాలపై ఆసక్తి పెంచుకొన్నారు. స్నేహితులతో కలిసి నాటకాలు ప్రదర్శించేవారట. అలా చదువు కూడా సరిగ్గా సాగలేదు. బాగా ఒడ్డు, పొడుగు ఉండటంతో చలపతిరావు నాటకాల్లో కథానాయకుడిగా నటించేవారట. వందలాది నాటకాలు వేసిన ఆయన ఎన్టీఆర్‌ నుంచి తొలి సినీ అవకాశాన్ని అందుకొన్నారు. తన జీవితంలో ఎన్టీఆర్‌ ప్రభావం బలంగా ఉందని చెబుతుంటారు చలపతిరావు. ఎన్ని దుష్టపాత్రలు వేసినా.. ఆయనకి వ్యక్తిగతంగా ఒక్క చెడు అలవాటు కూడా లేదట. అది ఎన్టీఆర్‌ ప్రభావమే అని చెబుతుంటారు. నిర్మాతలు ఎంతిస్తే అంత తీసుకొనే అలవాటున్న చలపతిరావు... ప్రతినాయకుడిగా వరుసగా సినిమాలు చేశారు. చేసిన పాత్రల ప్రభావం వల్ల మహిళలు కొన్నిసార్లు ఆయన్ని చూసినప్పుడు భయపడేవారట. తెరపై ఎలా కనిపించినా... నిజ జీవితంలో మాత్రం చాలా సరదా వ్యక్తిత్వమని చలపతిరావు గురించి తెలిసినవాళ్లు చెబుతుంటారు. ముగ్గురు పిల్లలు పుట్టాక భార్య చనిపోవడంతో, తన పిల్లలకి అన్నీ తానై పెంచారు. ఎన్టీఆర్, ఆయన సతీమణితో పాటు.. ఎంతమంది ఆత్మీయులు చెప్పినా మరో పెళ్లి చేసుకోలేదాయన. చలపతిరావు తనయుడు ‘అల్లరి’ రవిబాబు విజయవంతమైన దర్శకుడిగా, నిర్మాతగా, నటుడిగా కొనసాగుతున్నారు. ఇద్దరమ్మాయిలు అమెరికాలో స్థిరపడ్డారు. తన తరం నటులు తెరకు దూరమైనా... చలపతిరావు మాత్రం ఇప్పటికీ అవకాశాలు అందుకుంటుంటారు. ఇప్పటికీ ఆయన స్వగ్రామం బల్లిపర్రులో ఇల్లు, రెండెకరాల పొలం ఉంది. పిల్లలంతా ఒక చోట కలిసినప్పుడు ... అందరితో కలిసి స్వగ్రామానికి వెళ్లి వస్తుటారట చలపతిరావు. ఈ రోజు ఆయన (మే 8, 1944) పుట్టినరోజు.

* మళ్లీ వచ్చిన రక్తపిశాచి


అర్థరాత్రి శ్మశానంలో సమాధిలోంచి లేస్తాడు... సూటూ బూటూ వేసుకుని జనాల్లోకి వస్తాడు... అందమైన ఆడపిల్ల కనిపిస్తే కళ్లలోకి కళ్లు పెట్టి చూసి వశీకరణం చేసుకుంటాడు... ఆపై మెల్లగా దగ్గరకి వెళ్లి ఆ అమ్మాయి మెడ మీద కొరికి రక్తం పీల్చుకుంటాడు... అతడొక రక్తపిశాచి! అతడు మెడ కొరికిన అమ్మాయి కూడా రక్తపిశాచిగా మారిపోతుంది!!
ఇంతవరకు చదవగానే ‘డ్రాకులా’ కథ గుర్తొస్తుంది ఎవరికైనా. ఈ కథ ఆధారంగా ఎన్నో నాటకాలు, సినిమాలు రూపొందాయి. అసలీ కథకు మూలం ఎవరు? ఐర్లాండ్‌కు చెందిన బ్రమ్‌ స్టోకర్‌ అనే రచయిత 1897లో రాసిన ‘డ్రాకులా’ నవలతో ఈ సందడంతా మొదలైంది. భయంకరమైన సన్నివేశాలతో రాసిన ఈ నవల బెస్ట్‌సెల్లర్‌గా మారి ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో భాషల్లోకి అనువాదమై పాఠకులను విపరీతంగా ఆకట్టుకుంది. డ్రాకులా పాత్రతో ఎన్నో నవలలు కూడా వెలువడ్డాయి. ఈ కథతో తొలిసారిగా 1921లో వచ్చిన ‘డ్రాకులాస్‌ డెత్‌’ అనే హంగరీ సినిమా నుంచి ఎన్నో సార్లు డ్రాకులా వెండితెరపై కనిపించి భయపెట్టాడు. ఈ సినిమాల పరంపరలో భాగంగా 1958లో ప్రముఖ నటుడు క్రిస్టోఫర్‌ లీ డ్రాక్యులాగా వచ్చిన బ్రిటిష్‌ సినిమా అంతవరకు వచ్చిన చిత్రాలకన్నా కొత్త సాంకేతికతతో, మరింత భయానకంగా రూపుదిద్దుకుంది. టెరెన్స్‌ ఫిషర్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా వ్యాపారాత్మకంగా విజయవంతమవడమే కాకుండా మేటి బ్రిటిష్‌ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.