నవంబర్‌ 10.. (సినీ చరిత్రలో ఈరోజు )

* విలువైన దర్శకుడు!
(క్రిష్‌ పుట్టిన రోజు-1976)


అభిరుచిని కాపాడుకుంటూ సినిమాలు తీయడం ఎల్లవేళలా సాధ్యం కాదు. పైగా సినిమా పూర్తిగా వ్యాపారంగా మారిన పరిశ్రమ. ఇలాంటి చోట... విలువల్ని నమ్ముకుంటూ ప్రయాణం చేయడం చాలా కష్టం. అయితే తన తొలి చిత్రం నుంచీ... నమ్ముకున్న దారిలోనే సినిమాలు తీస్తూ తన అభిరుచిని కాపాడుకుంటూ వస్తున్న దర్శకుడు క్రిష్‌ జాగర్లమూడి. తొలి చిత్రం ‘గమ్యం’లోనే తన ప్రయాణమెలా సాగబోతోందో చెప్పేశారు క్రిష్‌. జీవితం, వాటి తాలుకూ విలువల గురించి హృదయాన్ని హత్తుకునేలా చెప్పారందులో. ఆ చిత్రం మిగిలిన భాషల్లోనూ రీమేక్‌ అయ్యింది. క్రిష్‌కి పలు అవార్డులు, రివార్డులు అందించింది. ‘వేదం’ కూడా ఉత్తమ చిత్రాల జాబితాలో నిలిచింది. ‘కృష్ణం వందే జగద్గురుమ్‌’, ‘కంచె’ చిత్రాలు దర్శకుడిగా క్రిష్‌ స్థాయి ఏమిటో చూపించాయి. తన ప్రతిభతోనే బాలీవుడ్‌లోనూ అవకాశాల్ని చేజిక్కించుకున్నారు. అక్కడ ‘గబ్బర్‌’ తీసి... తెలుగువాడి సత్తా చాటారు. నవంబరు 10, 1976లో గుంటూరు జిల్లాలోని వినుకొండలో జన్మించారు క్రిష్‌. ఆయన తండ్రి జాగర్లమూడి సాయిబాబా. ‘గమ్యం’ కథని తెరకెక్కించడానికి ఎంతోమంది నిర్మాతలు తిరస్కరించడంతో ఆ బాధ్యతని సాయిబాబానే భుజాలపై వేసుకున్నారు. అలా ‘గమ్యం’ పట్టాలెక్కి క్రిష్‌ని దర్శకుడిగా నిలబెట్టింది. తెలుగునాట ఇప్పుడు మల్టీస్టారర్‌ చిత్రాలు జోరుగా వస్తున్నాయి. అయితే ‘వేదం’తో అందుకు బీజం వేసింది మాత్రం క్రిష్‌ అని చెప్పుకోవాల్సిందే. మెగా - మంచు కుటుంబ కథానాయకుల కలయికలో వచ్చిన ‘వేదం’ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆ తరువాత క్రిష్‌ వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. ఓ దశలో మహేష్‌బాబుతో పనిచేసే అవకాశం కూడా వచ్చింది. కానీ.. తృటిలో ఆ అవకాశం చేజారింది. నందమూరి బాలకృష్ణ వందో చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ని విజయపథం వైపు నడిపించారు క్రిష్‌. విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ‘ఎన్టీఆర్‌’ బయోపిక్‌కీ ఆయనే దర్శకుడు. అతి తక్కువ సమయంలోనే రెండు భాగాల్ని పూర్తి చేశారు. ఓ బయోపిక్‌ రెండు భాగాలుగా రావడం, అందులోనూ కేవలం పదిహేను రోజుల వ్యవధిలో రెండో భాగాన్ని విడుదల చేయడం తెలుగు నాట ఓ రికార్డు. బాలీవుడ్‌లో కంగనారనౌత్‌తో ‘మణికర్ణిక’ తెరకెక్కించారు క్రిష్‌. ఈ చిత్రం కూడా విడుదలై బాక్సాఫీసు దగ్గర వసూళ్ల వర్షం కురిపించింది. మరోవైపు నిర్మాతగానూ రాణిస్తున్నారు. బుల్లితెర ధారావాహికల్ని ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ ద్వారా అందిస్తున్నారు. ఆదివారం క్రిష్‌ జన్మదినం. అటు దర్శకుడిగా, ఇటు నిర్మాతగా - తెలుగు నాటే కాదు, బాలీవుడ్‌లోనూ విజయఢంకా మోగిస్తున్న ఈ సృజనాత్మక దర్శకుడికి జన్మదిన శుభాకాంక్షలు అందజేస్తోంది సితార.నెట్‌

(ప్రత్యేక వార్త కోసం క్లిక్‌ చేయండి...)

* ఒంటరి పిల్లాడి సాహసం!


ఓ పెద్ద భవనంలో అందరూ సెలవులకి ఊరికి బయల్దేరుతారు... సమయం మించి పోతున్న హడావుడిలో ఓ ఎనిమిదేళ్ల పిల్లాడిని మాత్రం ఇంట్లోనే మర్చిపోతారు... ఆ పిల్లాడు పొద్దున్నే లేచేసరికి ఇళ్లంతా నిశ్శబం... భవనం మొత్తానికి ఒంటరిగా మిగిలిపోయానని అర్థమవుతుంది... మొదట భయమేసినా ఇంట్లో ఇష్టం వచ్చినట్టు ఉండవచ్చనుకుంటాడు... ఫ్రిజ్‌ నిండా పిజ్జాలు, ఆహారం బోలెడు... టీవీల్లో ఇష్టం వచ్చిన కార్యక్రమాలు చూడవచ్చు... కానీ ఆ ఆనందం ఎంతో సేపు మిగలదు... ఎవరూ లేని ఆ ఇంట్లో దోపిడీకి ఇద్దరు దుండగులు సిద్ధపడుతున్నట్టు తెలుస్తుంది... ఎలా? కానీ ఆ పిల్లాడు మామూలు వాడు కాదు... ఆ దుండగుల పని పట్టాలనుకుంటాడు... దొంగలు ఎలా లోపలికి వచ్చినా వాళ్లకి ఎదురు దెబ్బలు తగిలేలా అద్భుతంగా ఏర్పాట్లు చేసుకుంటాడు... ఇంకేముంది? ఆ దొంగల పాట్లు చూసి ప్రేక్షకులు తెగ నవ్వుకుంటారు! ఈ కథంతా వినేసరికి ‘హోమ్‌ ఎలోన్‌’ సినిమా గుర్తొచ్చే ఉంటుంది. ఇంత సరదా కథ కాబట్టే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా కాసులు కురిపించింది. 18 మిలియన్‌ డాలర్ల ఖర్చుతో సినిమా తీస్తే, 476 మిలియన్‌ డాలర్లు వసూలు చేసింది. ఇందులో ఒంటరి పిల్లాడిగా నటించిన మెకాలే కుల్కిన్‌ రాత్రికి రాత్రి పెద్ద ప్రముఖుడైపోయాడు. క్రిస్‌ కొలంబస్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా వసూళ్ల విషయంలో అప్పట్లో గిన్నిస్‌ రికార్డు కూడా సాధించడం విశేషం. 10 నవంబర్‌న యుఎస్‌ఏలోని లాస్‌ఏంజెల్స్, ఇల్లినాయిస్‌లో ప్రీమియర్‌ షో వేశారు.

* భయంకరమైన ఆట!


భవిష్యత్తులో ఓ రాజ్యం... అందులో కొన్ని జిల్లాలు... ఏటా ఆ జిల్లాల నుంచి ఓ అబ్బాయిని, ఓ అమ్మాయిని ఎంపిక చేసి ఓ భయంకరమైన ఆట ఆడిస్తుంటారు. అందులో ఓడిపోవడం మంటే చనిపోవడమే. చివరకి ఒకరే మిగులుతుంటారు. ఇంతకీ ఆ రాజ్యం ఏమిటి? ఆ ఆట ఏమిటి? ఈ కథాంశంతో సుజానే కోలిన్స్‌ అనే రచయిత్రి రాసిన ‘ద హంగర్‌ గేమ్స్‌’ అనే మూడు నవలలు వచ్చాయి. ఇవి 26 భాషల్లోకి అనువాదమై వేలాది కాపీలు అమ్ముడయ్యాయి. వీటి ఆధారంగా ‘హంగర్‌ గేమ్స్‌’ పేరిట సినిమాలు కూడా వచ్చాయి. వీటిలో ఒకటిగా వచ్చిన ‘ద హంగర్‌ గేమ్స్‌: మోకింగ్‌జే1’ సినిమా 2014 నవంబర్‌ 10న విడుదలై 755 మిలియన్‌ డాలర్లు కురిపించింది. ఈ సినిమాలన్నీ విచిత్ర ఆయుధాలు, అతీత శక్తులు, వింత పోరాటాలతో కూడి అందరినీ ఆకట్టుకున్నాయి.

* అంతరిక్షంలో కాసుల పంట!


8 టెలివిజన్‌ సీరియల్స్‌... 13 చలన చిత్రాలు... మరెన్నో యానిమేషన్‌ సినిమాలు... ఆపై బొమ్మలు, ఆట వస్తువులు, వీడియో గేమ్స్‌... ఇదంతా ‘స్టార్‌ట్రెక్‌’ సందడి! యాభై సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా పెద్దల్ని, పిల్లల్ని ఆకట్టుకున్న కథలివి. అంతరిక్షంలో ప్రయాణాలు, గ్రహాంతర వాసులు, నక్షత్ర మండలాల్లో మహా సామ్రాజ్యాలు, వింత వింత ఆకారాలు, విచిత్రమైన ఆయుధాలు, యుద్ధాలు... ఇవన్నీ ఆ కథల్లో కనిపించి అలరిస్తాయి. సైన్స్‌ ఫిక్షన్‌ కథలుగా అంతరిక్షంలోకి తీసుకుపోయే ఈ కథల పరంపరలో 9వ సినిమాగా వచ్చినదే ‘స్టార్‌ట్రెక్‌: ఇన్సరెక్షన్‌’ (1998). దీన్ని 70 మిలియన్‌ డాలర్ల వ్యయంతో తీస్తే, ప్రపంచవ్యాప్తంగా 117.8 మిలియన్‌ డాలర్లను కురిపించింది.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.