నవంబర్‌ 12.. (సినీ చరిత్రలో ఈరోజు)

* జాకీచాన్‌ ఆనందం

ప్రపంచ వ్యాప్తంగా జాకీచాన్‌ అభిమానులు కొల్లలుగా ఉన్నారు. వారందరితో పాటు జాకీచాన్‌ కూడా పులకించిపోయిన రోజుగా 2016 నవంబర్‌ 12ను చెప్పుకోవచ్చు. ఈరోజు జాకీచాన్‌ తను ఎన్నాళ్లుగానో కలలు కంటున్న ఆస్కార్‌ అవార్డును పొందాడు. ‘‘సినిమా రంగంలోకి ప్రవేశించిన 56 ఏళ్ల తరువాత, 200 పైగా సినిమాలు చేశాక, శరీరంలో ఎన్నో ఎముకలు విరిగాక, ఈ ఆస్కార్‌ అవార్డు రావడం చాలా ఆనందంగా ఉంది’’ అంటూ సంబరపడ్డాడు జాకీచాన్‌. ఆస్కార్‌ అవార్డుల కమిటీ జాకీచాన్‌ సినీ రంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా గౌరవ పురస్కారంగా ఆస్కార్‌ను అందించింది.

* యువరాణి అయిన నటీమణి!

వెండితెరపై నటిగా మెరిసింది... మొనాకో దేశపు యువరాజు మనసు దోచింది... అతడిని పెళ్లాడి ప్రిన్సెస్‌ ఆఫ్‌ మొనాకో అయింది... ఆమే గ్రేస్‌ ప్యాట్రిషియా కెల్లీ. ఉత్తమ నటిగా ఆస్కార్‌ అందుకున్న కెల్లీ.. 1929 నవంబర్‌ 12న ఫిలడెల్ఫియాలో పుట్టింది. నటనా రంగంపై ఆశపడి టీవీలలో మెప్పించి, వెండితెర నటిగా మారింది. ‘ద కంట్రీగర్ల్‌’ సినిమాతో ఆస్కార్‌ అందుకుంది. అంతర్జాతీయంగా అందాల నటిగా పేరొందిన కెలీ, ‘మొగాంబో’, ‘హైనూన్‌’, ‘హై సొసైటీ’, ‘డయల్‌ మి ఫర్‌ మర్డర్‌’, ‘రేర్‌ విండో’ లాంటి సినిమాలతో ప్రపంచ వ్యాప్తంగా పేరు తెచ్చుకుంది.

* కాసులు కురిపించిన నటి! 

 ఓ అమ్మాయి హైస్కూలు చదివేటప్పుడే ముఖానికి రంగేసుకుని రంగస్థలంపై మెరిసింది... టీనేజీకల్లా టీవీల్లో మెప్పించింది... ఆపై వెండితెరపై అడుగుపెట్టి ప్రపంచ ప్రఖ్యాతి పొందింది... నిర్మాతలకు కాసులు కురిపించింది... ఆమే అన్నే జాక్వెలిన్‌ హాథ్‌వే. నవంబర్‌ 12, 1982న అమెరికాలోని బ్రూక్లిన్‌లో జన్మించింది. వెండితెరపై గార్రీ మార్షల్‌ దర్శకత్వంలో 2001న విడుదలైన ‘ది ఫ్రిన్స్‌ డైరీస్‌’లో మియా థెర్మోపోలిస్‌ పాత్రలో నటించింది మెప్పించింది. అదే సంవత్సరం అడ్వెంచర్‌ డ్రామా నేపథ్యంగా తెరకెక్కిన ‘ది అదర్‌ సైడ్‌ హెవెన్‌’ చిత్రంలోను కథానాయికగా చేసింది.


- ఆమె నటించిన సినిమాలన్నీ కలిసి 6.4 బిలియన్‌ డాలర్లను కురిపించాయి!
- ప్రపంచంలోని వందమంది ప్రముఖులలో ఒకరుగా ఫోర్బ్స్‌ పత్రిక ప్రకటించింది!
- ప్రపంచంలోనే అత్యధిక పారితోషికం అందుకున్న తారగా ఓ వెలుగు వెలిగింది!
- ప్రతిష్ఠాత్మకమైన ఆస్కార్, గోల్డెన్‌గ్లోబ్, ఎమ్మీ లాంటి అవార్డులెన్నో ఎగరేసుకుపోయింది!
దేశదేశాల్లో సినీ అభిమానులను అలరించిన ‘ఇంటర్‌స్టెల్లార్‌’, ‘ద డార్క్‌ నైట్‌’ ట్రయాలజీ, ‘ఎలైస్‌ ఇన్‌ ద వండర్‌ల్యాండ్‌’, ‘ఓషన్స్‌8’, ‘ద ప్రిన్సెస్‌ డయరీస్‌’, ‘బ్రైడ్‌ వార్స్‌’, వాలెంటైన్స్‌ డే’ లాంటి సినిమాలతో అందం, అభినయాలతో ఆకట్టుకుంది.

వెండితెరపై నీల్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌!


చంద్రుడిపై అడుగుపెట్టిన మొదటి మానవుడిగా చరిత్ర సృష్టించిన నీల్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌ జీవితం ఆధారంగా తీసిన హాలీవుడ్‌ సినిమా ‘ఫస్ట్‌ మ్యాన్‌’లో ప్రధాన పాత్ర ధరించి అంతర్జాతీయ గుర్తింపు పొందిన నటుడు ర్యాన్‌ గోస్లింగ్‌. ఉత్తమ నటుడిగా గోల్డెన్‌ గ్లోబ్‌ సహా మరెన్నో పురస్కారాలు అందుకున్న ఇతడు నటుడిగా, దర్శకుడిగా, సంగీత కారుడిగా కూడా యువతను అలరించాడు. ఇతడు నటించిన ‘లా లా ల్యాండ్‌’, ‘ద బిగ్‌ షార్ట్‌’, ‘బ్లేడ్‌ రన్నర్‌2049’, ‘ద నోట్‌బుక్‌’, ‘హాఫ్‌ నెల్సన్‌’, ‘లార్స్‌ అండ్‌ ద రియల్‌ గర్ల్‌’, ‘బ్లూ వాలెంటైన్‌’, ‘క్రేజీ స్టుపిడ్‌ లవ్‌’, ‘ఆర్యూ ఎఫ్రైడ్‌ ఆఫ్‌ ద డార్క్‌?’ లాంటి సినిమాలు అతడి వైవిధ్యమైన అభినయానికి మెచ్చుతునకలు. కెనడాలో 1980 నవంబర్‌ 12న పుట్టిన ఇతగాడు, చిన్నప్పుడే డిస్నీ ఛానెల్‌లోని ‘ద మిక్కీ మౌస్‌ క్లబ్‌’ టీవీ షో ద్వారా మెరిశాడు. ఆపై బుల్లితెరపై ఇంటింటి ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే తొలిసారిగా ‘ద బిలీవర్‌’ (2001) సినిమాతో వెండితెరపై కనిపించాడు. గాయకుడిగా ‘డెడ్‌ మేన్స్‌ బోన్స్‌’ బ్యాండ్‌ ద్వారా ఆల్బమ్‌లు విడుదల చేసి యువతను ఉర్రూతలూగించాడు. దర్శకుడిగా కూడా సినిమాలు తీసి మెప్పించాడు. సామాజిక సేవలో కూడా చురుగ్గా ముందకు సాగుతున్నాడు.

అంతర్జాతీయ నటుడు


ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులను ఆకట్టుకున్న ఎన్నో సినిమాల్లో అతడు విలక్షణమైన పాత్రల్లో నటించి మెప్పించాడు. అతడే విలియం హోల్డెన్‌. ‘ద బ్రిడ్జి ఆన్‌ ద రివర్‌ క్వాయ్‌’, ‘సన్‌సెట్‌ బౌలెవార్డ్‌’, ‘సబ్రీనా’, ‘ద వైల్డ్‌ బంచ్‌’, ‘ప్యానిక్‌’, ‘నెట్‌వర్క్‌’లాంటి సినిమాలు అతడి అభినయ వైవిధ్యాన్ని చాటుతాయి. ‘స్టలాగ్‌ 17’ సినిమాకు గాను ఉత్తమ నటుడిగా ఆస్కార్‌ అవార్డు అందుకున్నాడు. 1950వ దశకంలో ఇతడు నటించిన సినిమాలు అత్యధిక వసూళ్లు సాధించాయి. ‘టాప్‌ టెన్‌ స్టార్స్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ గుర్తింపును ఇతడు ఆరుసార్లు సాధించడం విశేషం. అమెరికా ఫిలిం ఇనిస్టిట్యూట్‌ రూపొందించిన ‘25 గ్రేటెస్ట్‌ మేల్‌ స్టార్స్‌’ జాబితాలో ఇతడు స్థానం సంపాదించుకున్నాడు. అమెరికాలో 1918 ఏప్రిల్‌ 17న పుట్టిన ఇతడు మొదట రేడియో నాటకాల ద్వారా గుర్తింపు తెచ్చుకుని ఆపై నాటకాలు, బుల్లితెరలపై అవకాశాలు మెరుగుపరుచుకుని సినీ రంగంలోకి ప్రవేశించి అంచెలంచెలుగా ఎదిగాడు. విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న ఇతడు 1981 నవంబర్‌ 12న తన 63వ ఏట మరణించాడు.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.