నవంబర్‌ 14..(సినీ చరిత్రలో ఈరోజు)

* టీవీ నెట్‌వర్క్‌లో గందరగోళం!


-అమెరికా వినోద రంగంలోనే నాణ్యతా ప్రమాణాలను నెలకొల్పిన చిత్రంగా ఎంపిక!
-యుఎస్‌ నేషనల్‌ ఫిల్మ్‌ రిజిస్ట్రీలో భద్రపరిచిన చిత్రం!
-నాలుగు ఆస్కార్‌లు అందుకున్న చిత్రం!
-సినిమా చరిత్రలోనే గొప్ప స్కీన్ర్‌ప్లే ఉన్న మేటి పది చిత్రాల్లో ఒకటిగా గుర్తింపు!
-వంద గొప్ప అమెరికా చిత్రాల్లో ఒకటిగా స్థానం సంపాదించిన సినిమా!
... ఇన్ని ఘనతలు, ప్రత్యేకతలు సాధించిన సినిమా గురించి చెప్పుకోకపోతే ఎలా? ఆ సినిమా పేరు ‘నెట్‌వర్క్‌’!

ఒక విధంగా మీడియా నెట్‌వర్క్‌పై వ్యంగ్యాత్మక ధోరణిలో తీసిన సినిమా. రచయిత ప్యాడీ చయస్కీ, దర్శకుడు సిడ్నీ లుమెట్‌. ఓ కాల్పనిక టెలివిజన్‌ నెట్‌వర్క్‌లో అతి తక్కువ రేటింగ్స్‌ను పెంచడానికి ఏం చేశారనేదే కథ. ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ సహాయనటి, ఉత్తమ స్కీన్ర్‌ప్లేలకు ఆస్కార్‌లు ఎగరేసుకుపోయిన ఈ సినిమా, 1976 నవంబర్‌ 14న విడుదలై 3.8 మిలియన్‌ డాలర్ల పెట్టుబడికి 23 మిలియన్‌ డాలర్లకు పైగా వసూలు చేసింది. రేటింగ్స్‌ తగ్గిపోవడంతో న్యూస్‌ యాంకర్‌ను తొలగించాలని నిర్ణయిస్తే, అతడు నిస్పృహతో తాగి లైవ్‌లో తాను ఆత్మహత్య చేసుకోనున్నట్టు ప్రకటించేస్తాడు. అతడిని తొలగించేద్దామనుకున్నా, చాలా కాలం నుంచి పని చేసిన కారణంగా గౌరవప్రదమైన వీడ్కోలు పలుకుదామనుకుంటారు. మరో లైవ్‌ కార్యక్రమంలో కూడా ఆ యాంకర్‌ తన బాధను, ఉద్వేగాన్ని ప్రకటించడంతో అమాంతం ఆ టీవీ రేటింగ్స్‌ పెరిగిపోతాయి. దాంతో అతడి కోపాన్ని, భావోద్వేగాలను ఉపయోగించుకునేలా ఓ కార్యక్రమం రూపొందిస్తే అది సూపర్‌హిట్‌ అయిపోతుంది. పీకేద్దామనుకున్న యాంకర్‌ కాస్తా, పెద్ద సెలబ్రిటీగా మారిపోతాడు. మరి అతడు చివరికి ఏమయ్యాడు? ఆ టీవీ నెట్‌వర్క్‌ ఏమైంది? లాంటి అంశాలతో కథ నడుస్తుంది.

* హ్యారీపాటర్‌ మరో మ్యాజిక్‌!


 హ్యారీపాటర్‌ కథలు, సినిమాలు ప్రపంచవ్యాప్తంగా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఆ సినిమాల పరంపరగా రెండోదిగా 2002లో విడుదలైన సినిమా ‘హ్యారీపాటర్‌ అండ్‌ ద ఛాంబర్‌ ఆఫ్‌ సీక్రెట్స్‌’. బ్రిటిష్‌ రచయిత్రి జేకే రౌలింగ్‌ నవల ఆధారంగా ఈ సినిమాను 100 మిలియన్‌ డాలర్ల వ్యయంతో తెరకెక్కిసేపేకంగా 879 మిలియన్‌ డాలర్లను రాబట్టి రికార్డు సృష్టించింది.

* నవలలు... సినిమాలు!


అమెరికా రచయిత్రి నాలుగు నవలలు రాసింది. అవి 37 భాషల్లోకి అనువాదమై 10 కోట్ల కాపీలు అమ్ముడయ్యాయి. ఆ నవలల ఆధారంగా 5 సినిమాలు తీశారు. అవన్నీ కలిసి 330 కోట్ల డాలర్లను వసూలు చేశాయి. ఆ రచయిత్రి సెఫినీ మేయర్‌ అయితే ఆమె రాసిన నవలలు ‘ట్విలైట్‌’ పేరుతో వచ్చాయి. ఆ సినిమాలు ‘టిలైట్‌ సాగా’ పేరుతో విడుదలయ్యాయి. వీటి పరంపరలో రెండోదిగా వచ్చిన ‘ద ట్విలైట్‌ సాగా: బ్రేకింగ్‌ డాన్‌2’ సినిమా 2012లో విడుదలై 136 మిలియన్‌ డాలర్ల పెట్టుబడికి 829 మిలియన్‌ డాలర్లకు పైగా కాసులు కురిపించింది. ఈ సినిమాల్లోని కథాంశమంతా రక్తపిశాచులు, మనుషుల మధ్య ప్రేమలు, మాయలు, శక్తుల మధ్య భయానక ప్రణయగాధలుగా రూపొందినవే కావడం విశేషం.  

* ఓ అమ్మాయి సాహస యాత్ర!

సలే వాల్ట్‌డిస్నీ సినిమా... ఆపై త్రీడీ యానిమేషన్‌ సాంకేతికత... ఇక కథంతా వింత దేవతలు, విచిత్ర పాత్రలతో కూడుకున్నది... ఆపై సినిమా అంతా పసిఫిక్‌ మహా సముద్రంపై ఓ చిన్న అమ్మాయి చేసే సాహసయాత్రగా నడుస్తుంది... ఇంకేం కావాలి, పిల్లలకీ పెద్దలకీ విపరీతంగా నచ్చేసి విజయవంతమై కాసులు కురిపించడానికి? అంతపనే చేసింది ‘మోవానా’ సినిమా! సుమారు 150 మిలియన్‌ డాలర్ల వ్యయంతో రూపొంది 2016లో విడుదలై, 643 మిలియన్‌ డాలర్లకు పైగా వసూలు చేసింది. పోలినేసియా పురాణ కథల నేపథ్యంలో సాగే ఈ సినిమాలో మోవానా అనే అమ్మాయి తన దీవిని దేవతల శాపం నుంచి కాపాడేందుకు సముద్రంపై ప్రయాణమవుతుంది. మధ్యలో ఆమెకు తారసపడే విచిత్రమైన పాత్రలు, దేవతలు, జలచరాల పాత్రల మధ్య అద్భుతమైన త్రీడీ యానిమేషన్‌ దృశ్యాలతో కనువిందు చేసేలా సినిమా నడుస్తుంది. Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.