నవంబర్‌ 17..(సినీ చరిత్రలో ఈరోజు)

* అబ్బాయి వేషంలో అమ్మాయి!


న జానపదాల్లో రాకుమారి యువకుడి వేషంలో దేశాటన చేసిన కథలు విన్నాం. చరిత్రలో మగవాడిగా పెరిగిన రుద్రమదేవి గురించి తెలుసుకున్నాం. ఇక సినిమాల్లో కాసేపయినా అబ్బాయి వేషం వేసుకున్న అమ్మాయిల సన్నివేశాలు చూశాం. కానీ ఆడపిల్లలకు చదువుకోవడం నిషేధమని తెలిసి, తండ్రి చనిపోయాక మగవాడిగా వేషం వేసుకుని కాలేజీలో చేరిన ఓ అమ్మాయి కథ తెలుసా? ఆ అమ్మాయే ‘యెంటిల్‌’. ఇదే పేరుతో 1983లో విడుదలైన సినిమా కథ ఇది. ఓ నాటకం ఆధారంగా వెండితెరకెక్కించిన ఈ సినిమా ఆస్కార్‌ అవార్డు గెలుచుకుంది. పోలండ్‌కు చెందిన ఓ జ్యూయిష్‌ అమ్మాయి కథగా ఇది ప్రేక్షకులను ఆకట్టుకుంది. మగవాడిగా మారి కాలేజీలో చేరిన అమ్మాయి ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంది, ఎవరితో ప్రేమలో పడింది, చదువుకోవాలనే తన కోరికను ఎలా నెరవేర్చుకుంది అనే అంశాలతో రొమాంటిక్‌ మ్యూజికల్‌ సినిమాగా రూపొందింది. బార్‌బ్రా స్ట్రీశాండ్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా 12 మిలియన్‌ డాలర్ల పెట్టుబడికి 40 మిలియన్‌ డాలర్లకు పైగా వసూలు చేసింది.

* హాలీవుడ్‌ మార్గదర్శకుడు!


  నటుడు దశాబ్దాల తరబడి చిత్రసీమలో కొనసాగడం సాధారణమే. కానీ ఓ దర్శకుడు అయిదు దశాబ్దాల పాటు, అందునా హాలీవుడ్‌లో కొనసాగడమే కాదు, అనేక అవార్డులు పొందడం విశేషమే. ఆ దర్శకుడే మార్టిన్‌ చార్లెస్‌ స్కోర్‌సెసె. సినీ చరిత్రలోనే ప్రభావవంతమైన, స్ఫూర్తిదాయకమైన దర్శకుడిగా పేరుపొందిన మార్టిన్, జీవన సాఫల్య పురస్కారాలతో పాటు ఆస్కార్, ప్రతిష్ఠాత్మకమైన పామె డి ఓర్, సిల్వర్‌ లయన్, గ్రామీ, ఎమ్మీ, గోల్డెన్‌గ్లోబ్, బాఫ్తా, డైరెక్టర్స్‌ గిల్డ్‌లాంటి అవార్డులెన్నో పొందాడు. మంచి సినిమాలను భద్రపరచడం కోసం లాభార్జన లేకుండా ప్రత్యేకంగా ‘ద ఫిల్మ్‌ ఫౌండేషన్‌’ స్థాపించిన సినీ ప్రేమికుడు. న్యూయార్క్‌ నగరంలో నవంబర్‌ 17, 1942లో పుట్టిన ఈయన ‘మీన్‌ స్ట్రీట్స్‌’, ‘టాక్సీడ్రైవర్‌’, ‘రేజింగ్‌ బుల్‌’, ‘ద కింగ్‌ ఆఫ్‌ కామెడీ’, ‘ఆఫ్టర్‌ అవర్స్‌’, ‘ద లాస్ట్‌ టెంప్టేషన్‌ ఆఫ్‌ క్రీస్ట్‌’, ‘గుడ్‌ఫెల్లాస్‌’, ‘కేప్‌ ఫియర్‌’, ‘క్యాసినో’, ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ న్యూయార్క్‌’, ‘ద వోల్ఫ్‌ ఆఫ్‌ వాల్‌ స్ట్రీట్‌’, ‘ద డిపార్టెడ్‌’, ‘ద ఏవియేటర్‌’లాంటి సినిమాల ద్వారా ప్రపంచ సినీ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

* నవ్వుల నాయకి!
(రోజా పుట్టిన రోజు-1972) 


రోజా  అనగానే ఎవరికైనా మొదట ఆమె నవ్వే గుర్తుకొస్తుంది. ఆ నవ్వుతోనే మాయ చేసి ప్రేక్షకుల హృదయాల్ని దోచిందామె. దక్షిణాదిలో అగ్ర కథానాయికగా ఓ వెలుగు వెలిగిన రోజా - అక్కినేని నాగేశ్వరరావు, రజనీకాంత్, కృష్ణ, శోభన్‌బాబు, మోహన్‌బాబు, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, జగపతిబాబు, రాజేంద్రప్రసాద్, మమ్ముట్టి, విజయ్, అజిత్‌ తదితరుల సరసన నటించి విజయాల్ని అందుకొన్నారు. దక్షిణాదిన దశాబ్దకాలంలో వంద సినిమాలు చేసిన కథానాయికగా 1990వ దశకంలో రికార్డు సృష్టించారు రోజా. అచ్చమైన తెలుగమ్మాయైన ఈమె అసలు పేరు శ్రీలతా రెడ్డి. 1972 నవంబరు 17న చిత్తూరు జిల్లా, చిన్నగొట్టిగల్లు మండలం, భాకరాపేటలో జన్మించారు. నాగరాజా రెడ్డి, లలిత ఆమె తల్లిదండ్రులు. తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో డిగ్రీ పూర్తి చేసిన రోజా, చిన్నప్పుడే కూచిపూడి నృత్యం నేర్చుకొన్నారు. ఆ తరువాత సినిమాపై మక్కువతో ‘ప్రేమతపస్సు’తో తెరకు పరిచయమయ్యారు. ‘సీతారత్నం గారి అబ్బాయి’, ‘సర్పయాగం’, ‘రక్షణ’ తదితర చిత్రాలతో రోజా మంచి గుర్తింపు తెచ్చుకొన్నారు. వరుసగా అవకాశాల్ని అందిపుచ్చుకొన్నారు. తమిళంలో ఆర్‌.కె.సెల్వమణి చేతులమీదుగా పరిచయమయ్యారు రోజా. ఆ తరువాత అక్కడ కూడా వరుసగా అవకాశాలు అందుకొన్నారు. కన్నడ, మలయాళంలోనూ ఆమెకి మంచి గుర్తింపు ఉంది. అక్కాచెల్లెళ్లుగా మీనా, రోజా పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకుల్ని అలరించారు. తమిళ దర్శకుడు ఆర్‌.కె.సెల్వమణిని వివాహం చేసుకొన్నారు రోజా. ఈ దంపతులకి ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. నటిగానే కాకుండా, నిర్మాతగా, రాజకీయ నాయకురాలిగా, టీవీ వ్యాఖ్యాతగా రోజా పేరు తెచ్చుకొన్నారు. 1999లో తెలుదేశం పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలిగా ఎన్నికైన ఆమె 2009 వరకు అదే పార్టీలో కొనసాగారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత వైకాపాలో చేరి, 2014లో నగరి అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రస్తుతం రాజకీయ నాయకురాలిగా కొనసాగుతూనే, టెలివిజన్‌ కార్యక్రమాల్లో పాలు పంచుకొంటూ సందడి చేస్తున్నారు. కథానాయికగా కెరీర్‌ ముగిశాక సహాయ పాత్రల్లోనూ నటిస్తూ పేరు తెచ్చుకొన్నారు.

(ప్రతేక్య వార్త కోసం క్లిక్ చేయండి..)
..................................................................................................................................................................

* పొట్టివాడైనా గట్టివాడే!


అతడి ఎత్తు 4 అడుగుల పది అంగుళాలంతే. ఎముకలు ఎదగని జన్యుపరమైన లోపం వల్ల పొట్టివాడుగా మిగిలిపోయాడు. అయితే ఆ పొట్టిదనాన్నే అతడు సానుకూలంగా, ఓ అవకాశంగా మలుచుకున్నాడు. నాటకరంగం, బుల్లితెర, వెండితెరలపై విలక్షణమైన పాత్రలు పోషించి అంతర్జాతీయ గుర్తింపు సాధించాడు. అతడే డేనీ డేవిటో. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా, స్క్రీన్‌ రచయితగా ఎదిగాడు. ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రియులను అలరించిన ‘మటిల్డా’, ‘మార్స్‌ అటాక్స్‌’, ‘ద వార్‌ ఆఫ్‌ ద రోజెస్‌’, ‘వన్‌ ఫ్ల్యూ ఒవర్‌ ద కుకూస్‌ నెస్ట్‌’, ‘థ్రో మామా ఫ్రమ్‌ ద ట్రైన్‌’, ‘ఎల్‌.ఎ. కాన్ఫిడెన్షియల్‌’, ‘మ్యాన్‌ ఆన్‌ ద మూన్‌’, ‘డుంబో’లాంటి చిత్రాల్లో తనదైన ముద్ర వేశాడు. న్యూజెర్సీలో 1944 నవంబర్‌ 17న పుట్టిన ఇతడు, నటనను అభ్యసించాడు. నాటకాల ద్వారా మెప్పించి టీవీ, వెండితెర అవకాశాలు పొందాడు.  


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.