నవంబర్‌ 20..(సినీ చరిత్రలో ఈరోజు)

*హుషారైన నటనకు చిరునామా!
(తుషార్‌ కపూర్‌ పుట్టిన రోజు-1976)తుషార్‌ కపూర్‌.. హుషారైన పాత్రలకు పెట్టింది పేరు. తెలుగు రీమేక్‌లతో బాలీవుడ్‌ బాక్సీఫీస్‌ వద్ద జోరు చూపించాడు. కొంటెదనం నిండిన పాత్రలతో ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టాడు. అడల్ట్‌ కామెడీ చిత్రాలతో యువతరాన్ని ఆకర్షించాడు. వైవిధ్యమైన పాత్రలతో సినీ ప్రయాణాన్ని సాగిస్తూ మీడియం రేంజు హీరోగా బాలీవుడ్‌లో కొనసాగుతున్నాడు. ప్రముఖ బాలీవుడ్‌ నటుడు, నిర్మాత జితేంద్ర నట వారసత్వంతో వెండితెరపై మెరిశాడు తుషార్‌ కపూర్‌. యూనివర్సిటీ ఆఫ్‌ మిచిగాన్‌ నుంచి డిగ్రీ పూర్తి చేసిన తుషార్‌.. నటుడిగా మారడానికి ముందు కొన్నాళ్ల పాటు డేవిడ్‌ ధావన్‌ వద్ద అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేశాడు. తొలిచిత్రం ‘ముఝే కుచ్‌ కెహనా’ (2001)తోనే బాక్సాఫీస వద్ద భారీ విజయాన్ని అందుకున్నాడు. ఇది పవన్‌కల్యాణ్‌ నటించిన హిట్‌ మూవీ ‘తొలిప్రేమ’కు హిందీ రీమేక్‌. ఇందులో కరణ్‌గా తుషార్‌ కనబర్చిన నటనకు.. ఉత్తమ నటుడిగా (డెబ్యూ) తొలి ఫిలింఫేర్‌ పురస్కారం లభించింది. ఈ చిత్ర విజయమిచ్చిన స్ఫూర్తితో.. ఆ తరువాత కూడా వరుసగా తెలుగు రీమేక్‌లతోనే ప్రేక్షకుల్ని అలరించాడు. ఈ క్రమంలో ‘క్యా దిల్‌ నే కహ’ (స్వయంవరం), ‘జీనా సిర్ఫ్‌ మేరే లియే’ (మనసంతా నువ్వే), ‘యే దిల్‌’ (నువ్వు - నేను) వంటి చిత్రాలతో బాలీవుడ్‌ సినీప్రియులకు దగ్గరయ్యాడు. తుషార్‌ కపూర్‌కు అడల్డ్‌ కామెడీ, రొమాంటిక్‌ చిత్రాల కథానాయకుడిగా యువతరంలో మంచి క్రేజ్‌ ఉంది. ఈ జోనర్లలో అతను చేసిన ‘గోల్‌మాల్‌’, ‘గోల్‌మాల్‌ ఎగైన్‌’, ‘మస్తీ జాదే’, ‘డర్టీ పిక్చర్స్‌’, ‘గోల్‌మాల్‌ 3’ వంటి చిత్రాలన్నీ బాక్సీఫీస్‌ వద్ద కాసుల వర్షం కురిపించాయి. ముఖ్యంగా ‘మస్తీ జాదే’ చిత్రంతో బాలీవుడ్‌లో అడల్ట్‌ కామెడీ చిత్రాలకు మంచి ఊపు తెచ్చాడు. కేవలం నటుడిగానే కాక వ్యక్తిగత జీవితంతోనూ ఓ ప్రత్యేక గుర్తింపు సాధించుకున్నాడు తుషార్‌ కపూర్‌. ఐవీఎఫ్, సరోగసి విధానంతో పెళ్లి కాకుండానే ఓ బిడ్డకు తండ్రిగా మారి అందరి దృష్టినీ ఆకర్షించాడు. ఇలా పెళ్లి కాకుండానే తండ్రైన తొలి భారతీయ నటుడు తుషారే. తన కొడుకుకు లక్ష్య అని పేరు పెట్టుకున్నాడు. ప్రస్తుతం నటుడిగా రాణిస్తూనే తన సోదరి ఏక్తా కపూర్‌తో కలిసి బాలాజీ టెలీ ఫిలింస్, బాలాజీ మోషన్‌ పిక్చర్స్‌ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. భారతీయ చిత్రసీమలో ఇంతటి ప్రత్యేక గుర్తింపు ఉన్న తుషార్‌.. జితేంద్ర, శోభా కపూర్‌ దంపతులకు 1976 నవంబరు 20న ముంబయిలో జన్మించాడు.

(ప్రత్యేక వార్త కోసం క్లిక్‌ చేయండి)

* జైలు పాలైన జేమ్స్‌బాండ్‌!


బ్రిటిష్‌ రహస్య గూఢచారి జేమ్స్‌బాండ్‌ పన్నెండోసారి వచ్చిన సినిమా ‘డై ఎనదర్‌ డే’. నార్త్‌ కొరియాకు ఓ మిషన్‌ మీద వెళ్లిన జేమ్స్‌బాండ్‌ మోసానికి గురై ఓ మిలిటరీ అధికారిని చంపేసి జైలు పాలవుతాడు. తిరిగి కొన్ని నెలల తరువాత ఖైదీల మార్పిడిలో విడుదలయ్యాక, తనను మోసగించిన దుండగులను ఎలా మట్టుబెట్టాడనేదే కథ. పనిలో పనిగా నార్త్‌ కొరియాలోని ఓ ఉగ్రవాదికి, ఓ వజ్రాల వ్యాపారికి మధ్య ఉన్న సంబంధాలను కనుగొన్ని అంతరిక్షలో ప్రయోగించే ఓ ఆయుధం రహస్యాన్ని కూడా ఛేదిస్తాడు. ఈ సినిమాలో బాండ్‌గా పియర్స్‌ బ్రాస్నన్‌ నటించాడు. బాండ్‌ గర్ల్‌గా హల్లే బెర్రీ నటించింది. జేమ్స్‌బాండ్‌ హంగామా 1962లో మొదలై 40 ఏళ్లు అయిన సందర్భంగా ఈ సినిమాలో పాత బాండ్‌ సినిమాల దృశ్యాలను జతపరచడం ఆకట్టుకుంటుంది. సినిమాను 145 మిలియన్‌ డాలర్లతో నిర్మిస్తే, ప్రపంచవ్యాప్తంగా 435 మిలియన్‌ డాలర్లు రాబట్టింది.

* తల్లీకూతుళ్ల బంధం!‌


ర్తపోయిన ఓ మహిళ తన కూతురు కోసం తిరిగి వివాహం చేసుకోకుండా ఉంటే, ఆ కూతురు తల్లిని ఎదిరించి పెళ్లి చేసుకుని వెళ్లిపోవడం, అయినా ఆ కూతురు కష్టాల్లో తల్లి తన బాధ్యతను నిర్వర్తించడం, చివరకి ఆ కూతురు తల్లి విలువను తెలుసుకోవడం... ఇదీ స్థూలంగా కథ. కానీ ఈ కథ చుట్టూ సన్నివేశాలు కల్పించుకుని, భావోద్వేగాలను ఒడిసిపట్టి, తరాల మధ్య అంతరాలను వాస్తవికంగా చెప్పేసరికి అది ఓ చక్కని సినిమాగా రూపొందింది. అదే ‘టెర్మ్స్‌ ఆఫ్‌ ఎండీర్మెంట్‌’. మూడు దశాబ్దాల కాలంలో ఓ తల్లీకూతుళ్ల జీవితాలు ఎలా మలుపులు తిరిగాయో ఆకట్టుకునేలా చెప్పిన ఈ సినిమా 11 ఆస్కార్‌ అవార్డులను నామినేషన్లు పొంది, ఐదింటిని గెలుచుకుంది. జేమ్స్‌ ఎల్‌. బ్రూక్స్‌ దర్శకనిర్మాతగా రూపొందిన ఈ సినిమా 1983లో విడుదలై సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ల్యారీ మెక్‌ముర్‌ట్రీ అనే రచయిత 1975లో రాసిన రాసిన నవల ఆధారంగా తీసిన ఈ సినిమా ఆస్కార్‌లతో పాటు నాలుగు గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డులను కూడా పొందింది. దాదాపు 8 మిలియన్‌ డాలర్లతో తీసిన ఈ సినిమా, 108 మిలియన్‌ డాలర్లకు పైగా ఆర్జించింది.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.