నవంబర్‌ 21.. (సినీ చరిత్రలో ఈరోజు)

* ఒక రూపాయికి...
225 రూపాయలు!

ఓ సినిమా...- నిర్మాణ వ్యయానికి 225 రెట్లు ఆర్జించింది...

- ఆ సినిమా నటుడిని సూపర్‌స్టార్‌ని చేసేసింది... - ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ప్రశంసలు పొందింది...

- మూడు ఆస్కార్‌ అవార్డులు అందుకుంది... - మరో ఆరు కొనసాగింపు సినిమాలకు నాంది పలికింది...


ఇన్ని ఘనతలు సాధించిన ఆ సినిమా ‘రాకీ’. సిల్వస్టర్‌ స్టాలోన్‌ కథ రాసి, కీలక పాత్రలో నటించిన ఈ సినిమా 1976లో విడుదలై సంచలనం సృష్టించింది. కేవలం ఒక మిలియన్‌ డాలర్ల ఖర్చుతో తీసిన ఈ సినిమా 225 మిలియన్‌ డాలర్లను ఆర్జించింది. క్రీడల నేపథ్యంలో వచ్చిన గొప్ప చిత్రాల్లో ఒకటిగా పేరు పొందింది. దీని తర్వాత ఆరు కొనసాగింపు సినిమాలు వచ్చి అన్నీ కాసుల వర్షం కురిపించాయి. వీటిలో అయిదింటిని సిల్వస్టర్‌ స్టాలోనే రాశాడు. నాలుగింటికి తనే దర్శకత్వం వహించాడు. ఈ అన్ని సినిమాల్లో తానే రాకీగా నటించాడు. ఓ వడ్డీ వ్యాపారి దగ్గర బాకీలు వసూలు చేసే ఓ యువకుడు అనుకోని అవకాశం వచ్చి, ఆరు వారాల వ్యవధిలో ప్రపంచ హెవీవెయిట్‌ ఛాంపియన్‌గా ఎలా మారాడనేదే కథ. సిల్వస్టర్‌ స్టాలోన్‌ టీవీలో మహమ్మద్‌ ఆలీ బాక్సింగ్‌ పోటీని చూసి స్ఫూర్తి పొంది కేవలం మూడు రోజుల్లో ఈ సినిమా కథను రాశాడు.

* వ్యాసం మారింది సినిమాగా!


ఓ వార పత్రికలో వచ్చిన ఓ వ్యాసం ఆధారంగా కథ అల్లుకుని తీసిన ఓ సినిమా ఏడు ఆస్కార్‌ అవార్డులు సాధించింది. ‘టైమ్‌’ పత్రికలో 1944లో ఓ వ్యాసం ప్రచురితమైంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇంటికి వచ్చిన సీనియర్‌ సైనికాధికారులు, తిరిగి సమాజ జీవనంలో ఒదిగిపోయేందుకు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారనేదే ఆ వ్యాసం. ఇది శామ్యూల్‌ గోల్డ్‌విన్‌ అనే వ్యక్తిని ఆకర్షించింది. ఇందులోని అంశాల ఆధారంగా ఓ సినిమా తీయాలనే ఆలోచన కలిగింది. గతంలో యుద్ధవార్తలు రాసిన ఓ జర్నలిస్ట్‌ను సంప్రదించి కథ రాయించాడు. దాన్ని తనే సినిమాగా తీశాడు. ఆ సినిమానే ‘ద బెస్ట్‌ ఇయర్స్‌ ఆఫ్‌ అవర్‌ లైవ్స్‌’ అనే సినిమా. విలియం వైలర్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా 1946లో విడుదలై 7 ఆస్కార్‌ అవార్డులతో పాటు మరెన్నో పురస్కారాలు అందుకోవడమే కాకుండా, 2 మిలియన్‌ డాలర్ల ఖర్చుకి, 23 మిలియన్‌ డాలర్లు ఆర్జించింది. ముగ్గురు సైనికాధికారులు విమానంలో తిరిగి వస్తూ తమ కుటుంబాల గురించి ఒకరికొకరు చెప్పుకుంటారు. వాళ్లు ఇంటికి వచ్చాక తమ కుటుంబాల్లో ఎన్నో మార్పులు జరిగాయని తెలుసుకుంటారు. ఆ మార్పులేంటి, వాటి వల్ల వారికెదురైన అనుభవాలేంటనేదే కథ.

* బాధ్యత గల నిర్మాత!
(వడ్డే రమేష్‌ వర్థంతి-2013)


డబ్బులు పెట్టి ఊరుకునే నిర్మాత కాదాయన. డబ్బు సంపాదించడానికి కూడా రాలేదు. కావలసినంత సంపద ఉన్నా సినిమా రంగంపై ఉన్న ప్రేమతో, పిచ్చితో, అభిమానంతో నిర్మాత అయిన వ్యక్తి. సినిమా రంగంలో ప్రతి విభాగం పనితీరు తెలియడమే కాదు, అధికారికంగా వాటి లోతుపాతులు క్షుణ్ణంగా తెలిసిన నిర్మాత. సెట్లో దర్శకుడికి నిక్కచ్చిగా తన అభిప్రాయాలు చెప్పగల సమర్ధుడు. అందుకే ఆయన తెలుగు, హిందీ భాషల్లో ప్రేక్షకాదరణ పొందిన సినిమాలను అందించారు. ఆయనే వడ్డే రమేష్‌. కృష్ణా జిల్లా ఎలమర్రులో 1947 అక్టోబర్‌ 11న పుట్టిన ఆయన సినీ రంగంలో తనదైన ముద్ర వేసి తన 66వ ఏట హైదరాబాద్‌లో 2013, నవంబర్ 21న  మరణించారు.

(ప్రేత్యేక వార్త కోసం క్లిక్‌ చేయండి...)Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.