నవంబర్‌ 22...(సినీ చరిత్రలో ఈరోజు)

* సినీ గాన గంధర్వుడు!
 బాలమురళీ కృష్ణ  (వర్థంతి)


ఆయనొక సంగీత స్రష్ట. కర్నాటక సంగీత ప్రపంచంలో తిరుగులేని ప్రభావం చూపిన గాన గంధర్వుడు. అయినా సినీ రంగంలో కూడా మరువలేని ముద్ర వేశారు. నటుడిగా పాత్రపోషణ చేసినా, గాయకుడిగా నేపథ్య గీతాలాపన చేసినా ఆయన తీరు విలక్షణం. చిరస్మరణీయం. ఆయనే పద్మ విభూషణుడు డాక్టర్‌ బాల మురళీ కృష్ణ. కొన్ని పాటలు పాడితే ఆయనే పాడాలనేంత గొప్పగా ఉంటాయి. మరి కొన్ని పాటలు ఆయన తప్ప ఎవరూ పాడలేనంత ఘనంగా ఉంటాయి. తూర్పుగోదావరి జిల్లా శంకరగుప్తంలో 1930 జులై 6న పుట్టిన బాలమురళీ కృష్ణ ఓ బాలమేధావి. ఆరేళ్ల నుంచే సంగీత సముద్రంతో ఈత ప్రారంభించిన ఘనత ఆయనది. తెలుగులో ‘భక్త ప్రహ్లాద’ (1967) చిత్రంలో నారదుడిగా ఆయన నటన మెప్పిస్తుంది. అందులోనే ‘ఆది అనాదియు నీవే దేవా...’ పాటతో మొదలుకొన్ని తెలుగు, తమిళ, సంస్కృత, కన్నడ చిత్రాల్లో వందలాది పాటలు పాడారు. సినీ సంగీతాన్ని సుసంపన్న చేసిన బాల మురళీకృష్ణ తన 86వ ఏట చెన్నైలో నవంబర్‌ 22, 2016లో మరణించారు. వెండితెరపై ఆయన గాత్రం ‘సలలిత రాగ సుధారస సారం’!

(ప్రత్యేక వార్త కోసం క్లిక్‌ చేయండి...)

* అజయ్‌ దేవగణ్‌ అరంగేట్రం!


తండ్రి ఓ స్టంట్‌ మాస్టర్, దర్శకుడు... తల్లి నిర్మాత... ఈ నేపథ్యం ఉంటే వెండితెరపైకి రావడం సులువే. కానీ తొలి చిత్రంతోనే సూపర్‌హిట్‌ ఇచ్చి, స్టార్‌ గుర్తింపు పొందడమే కష్టం. కానీ అజయ్‌ దేవగణ్‌ అదే సాధించాడు. బాలీవుడ్‌ యాక్షన్‌ కొరియోగ్రాఫర్, స్టంట్‌మాస్టర్‌ వీరూ దేవగన్‌ కొడుకుగా పరిచయమైనా అరంగేట్రంతోనే అదరగొట్టిన సినిమా ‘ఫూల్‌ ఔర్‌ కాంటే’. హేమమాలిని మేనకోడలు మధుబాలకి కూడా ఇదే తొలి సినిమా కావడం విశేషం. కుకు కోహ్లీ దర్శకత్వం వహించిన ఈ సినిమా సూపర్‌ హిట్‌ కావడమే కాకుండా అజయ్‌ దేవగన్‌కి ఉత్తమ కొత్త నటుడిగా ఫిలింఫేర్‌ అవార్డు కూడా వచ్చింది. దీన్నే తెలుగులో ‘వారసుడు’గా రీమేక్‌ చేశారు. ఈ సినిమాను చూశాక అజయ్‌ దేవగన్‌ని రోల్‌మోడల్‌గా భావించానని తెలుగు కథానాయకుడు మహేష్‌ బాబు ఎన్నో సార్లు చెప్పాడు. అప్పట్లో సౌండ్‌ట్రాక్, యాక్షన్‌ సన్నివేశాలలో కొత్త ఒరవడి సృష్టించిన సినిమాగా దీన్ని చెప్పుకున్నారు. ఇందులో రెండు బైక్‌ల మీద చెరో కాలూ వేసి బ్యాలన్స్‌ చేసుకుంటూ అజయ్‌ దేవగణ్‌ రావడాన్ని ఆ తరువాత ఎన్నో సినిమాల్లో అనుకరించారు. డాన్‌ సామ్రాజ్యానికి అధిపతి అయిన అమ్రీష్‌పురి తన తర్వాత వారసుడిగా తన కొడుకు అజయ్‌ దేవగన్‌ను ప్రకటించడం ఆ ముఠా వాళ్లకి నచ్చదు. దాంతో వాళ్లు అజయ్‌కు కొత్తగా పుట్టిన బాబును అపహరిస్తారు. ఆ బాబును ఎలా కాపాడుకున్నాడనేదే కథ. మూడు కోట్ల రూపాయలతో తీసిన ఈ సినిమా 12 కోట్ల రూపాయలను ఆర్జించింది. అజయ్‌ దేవగణ్‌కి ఓ మంచి యాక్షన్‌ హీరోగా గుర్తింపు తెచ్చింది. ‘ఫూల్‌ ఔర్‌ కాంటే’ ఈరోజు (నవంబర్‌ 22, 1991) విడుదలైంది.

* తొలి సీజీఐ సినిమా!


కంప్యూటర్ జెనరేటెడ్‌ ఇమేజరీ (సి.జి.ఐ) గురించి ఇప్పుడు ఎవరికీ చెప్పక్కర్లేదు. గ్రాఫిక్స్‌ పేరుతో ప్రాచుర్యం పొందిన ఈ సాంకేతిక విధానంలో తొలిసారిగా రూపొందిన పూర్తి స్థాయి ఫీచర్‌ ఫిల్మ్‌గా ‘టాయ్‌ స్టోరీ’ పేరుపొందింది. పిల్లలు ఆడుకునే రకరకాల బొమ్మలకు ప్రాణం వస్తే ఎలా ఉంటుందనే ఊహతో తీసిన ఈ సినిమా 1995లో విడుదలై సంచలన విజయాన్ని అందుకుంది. వాల్ట్‌డిస్నీ సంస్థ నుంచి వెలువడిన ఈ సినిమా 30 మిలియన్‌ డాలర్ల పెట్టుబడికి 373 మిలియన్‌ డాలర్లకు పైగా ఆర్జించింది. ఈ సినిమాకు కొనసాగింపుగా మరో నాలుగు సినిమాలు వచ్చాయి.

* హాలీవుడ్‌ సెక్స్‌ సింబల్!


అందాల శృంగార తారగా గుర్తింపు... వంద మంది మేటి సెలబ్రిటీల జాబితాలో ఎన్నో సార్లు ఫోర్బ్స్ పత్రిక ఎంపిక... హాలీవుడ్‌ వాక్‌ ఆఫ్‌ ఫేమ్‌లో స్టార్‌ హోదా... ప్రపంచంలోనే అత్యధిక పారితోషికం అందుకున్న నటి... అంతేకాదు, మనసున్న యువతి... ఎన్నో ఛారిటీ సంస్థలకు భారీ విరాళాల ఇచ్చిన నేపథ్యం...ఇన్ని విశేషాలు, ప్రత్యేకతలు ఉన్న నటి స్కార్లెట్‌ జొహాన్సన్‌. నటిగా, గాయనిగా ముద్ర వేసిన ఈ అందాల తార చిన్నప్పటి నుంచీ చురుకే. పాటలతో, డ్యాన్స్‌లతో పాటు నాటక రంగంపైకి చిన్న వయసులోనే అరంగేట్రం చేసింది. న్యూయార్క్‌లో 1984లో పుట్టిన స్కార్లెట్‌ పదేళ్ల వయసులోనే ‘నార్త్‌’ అనే సినిమాతో వెండితెరకు పరిచయం అయింది. ‘మన్నీ అండ్‌ లో’, ‘ద హార్స్‌ విస్పరర్‌’, ‘ఘోస్ట్‌ వరల్డ్‌’, ‘లాస్ట్‌ ఇన్‌ ట్రాన్స్‌లేషన్‌’, ‘గర్ల్‌ విత్‌ పెర్ల్‌ ఇయర్‌రింగ్‌’, ‘మ్యాచ్‌ పాయింట్‌’, ‘ద ప్రెస్టీజ్‌’ లాంటి ఎన్నో సినిమాల ద్వారా అందచందాలతోను, అభినయంతోను మెప్పించింది.

* కేవ్వు కేకల రాణి!


భయానక సినిమాల్లో ప్రధానంగా ఎవరు ఆకట్టుకుంటారు? అందమైన యువతులే. వాళ్లు భయంతో వణికిపోతూ కెవ్వుమని కేకలు వేస్తుంటే, థియేటర్లో ప్రేక్షకులు మరింత బాగా సినిమాని ఆస్వాదిస్తారు. ఇలాంటి సినిమాల్లో నటించి పేరు తెచ్చుకున్న నటిని హాలీవుడ్‌లో ‘స్క్రీమ్‌ క్వీన్‌’ అంటారు. ఆ గుర్తింపునే పొందింది జామీలీ కర్టిస్‌. నటిగా, రచయిత్రిగా, నిర్మాతగా, దర్శకురాలిగా, ఉద్యమకారిణిగా కూడా పేరు తెచ్చుకున్న ఈమె భయానక చిత్రం ‘హలోవీన్‌’ (1978) ద్వారా వెండితెరపైకి అడుగుపెట్టింది. ఆ సినిమాలోనే కెవ్వుమని కేకలు పెడుతూ ‘స్క్రీమ్‌ క్వీన్‌’గా మారిన ఈమె, ఆ తర్వాత ఇలాంటివే ‘ద ఫాగ్‌’, ‘ప్రోమ్‌ నైట్‌’, ‘టెర్రర్‌ ట్రైన్‌’, ‘హలోవీన్‌’ సీక్వెల్‌ సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. నిజానికి ఈమె భయానక సినిమాలే కాదు కామెడీ, యాక్షన్, రొమాంటిక్‌ చిత్రాల్లో కూడా మంచి నటిగా పేరు తెచ్చుకుంది. బాఫ్టా, గోల్డెన్‌గ్లోబ్, శాటర్న్‌ లాంటి అవార్డులెన్నో అందుకుంది. జేమ్స్‌కామెరాన్‌ దర్శకత్వంలో ఆర్నాల్డ్‌ ష్వాజ్‌నెగర్‌ నటించిన ‘ట్రూ లైస్‌’ సినిమాతో అంతర్జాతీయ ప్రేక్షకులను అలరించింది. ‘ట్రేడింగ్‌ ప్లేసెస్‌’, ‘ఎ ఫిష్‌ కాల్డ్‌ వాండా’, ‘బ్లూ స్టీల్‌’, ‘మై గర్ల్‌’, ‘ఫరెవర్‌ యంగ్‌’, ‘ద టైలర్‌ ఆఫ్‌ పనామా’, ‘ఫ్రీకీ ఫ్రైడే’, ‘బెవర్లీహిల్స్‌ చిహువాహువా’, ‘నైవ్స్‌ ఔట్‌’ లాంటి సినిమాలతో మెప్పించింది. నాటకాలు, టీవీల్లో సైతం పేరు తెచ్చుకుంది. కాలిఫోర్నియాలో 1958 నవంబర్‌ 22న పుట్టిన ఈమె తల్లి జానెట్‌లీ, తండ్రి టోనీ కర్టిస్‌ కూడా సినీ నటులే. ఈమె అక్క కెల్లీ కర్టిస్‌ కూడా నటిగా పేరు తెచ్చుకుంది. సామాజిక సేవలో కూడా ముందుంటుంది. పిల్లల కోసం ఎన్నో పుస్తకాలు రాసింది.

* ఏడు దశాబ్దాల ప్రస్థానంసెక్స్‌సింబల్‌గా ఆమె గుర్తింపు పొందింది. యువతను విపరీతంగా ఆకర్షించింది. నటిగా, గాయనిగా, రచయిత్రిగా, స్క్రీన్‌ రైటర్‌గా, కమేడియన్‌గా 70 ఏళ్ల పాటు వినోద ప్రపంచాన్ని ఏలింది. ఆమే మేరో జాన్‌ మే వెస్ట్‌. నాటక రంగం, రేడియో, టీవీ, సినిమా రంగాల్లో పేరు తెచ్చుకుంది. క్లాసిక్‌ అమెరికా చిత్రాల కాలంలో గ్రేటెస్ట్‌ ఫిమేల్‌ స్టార్‌ గుర్తింపు పొందింది. న్యూయార్క్‌లో 1893 ఆగస్టు 17న పుట్టిన ఈమె, ఐదేళ్ల వయసులోనే చర్చి కార్యక్రమాల్లో ప్రదర్శన ఇచ్చి బహుమతి అందుకుంది. పద్నాలుగేళ్లు వచ్చేసరికల్లా అనేక వినోద ప్రదర్శనల్లో పాల్గొని ‘బేబీ మే’గా ప్రాచుర్యం పొందింది. ‘నైట్‌ ఆఫ్టర్‌ నైట్‌’, ‘షి డన్‌ హిమ్‌ రాంగ్‌’, ‘ఐయామ్‌ నో ఏంజెల్‌’, ‘బెల్లే ఆఫ్‌ ద నైంటీస్‌’, ‘గోయింగ్‌ టు టౌన్‌’లాంటి సినిమాలతో అందాల తారగా ఆకర్షించింది. సినిమాల నుంచి విరామం తీసుకున్నాక, రచయిత్రిగా, టీవీ, రేడియో కార్యక్రమాల రూపకర్తగా పేరు తెచ్చుకున్న ఈమె, కాలిఫోర్నియాలో 1980 నవంబర్‌ 22న తన 87వ ఏట మరణించింది.

* ఇంక్రెడిబుల్‌ హల్క్‌ నటుడు


అంతర్జాతీయంగా ఆకట్టుకున్న ‘ద ఇంక్రెడిబుల్‌ హల్క్‌’ సినిమాలో డాక్టర్‌ డేవిడ్‌ బేనర్‌గా నటించి ప్రపంచ ప్రాచుర్యం పొందిన నటుడు బిల్‌బిక్స్‌బీ. హాలీవుడ్‌లో నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా తనదైన ముద్ర వేశాడు. మూడు దశాబ్దాలుగా వినోదరంగంలో నాటకం, బుల్లితెర, సినిమాల ద్వారా ఆకట్టుకున్నాడు. కాలిఫోర్నియాలో 1934 జనవరి 22న పుట్టిన ఇతడు చిన్నప్పుడే డ్యాన్స్‌ నేర్చుకుని ప్రదర్శనలు ఇచ్చాడు. ‘లోన్లీ ఆర్‌ ద బ్రేవ్‌’, ‘అండర్‌ ద యమ్‌ యమ్‌ ట్రీ’, ‘రైడ్‌ బియాండ్‌ వెంగెన్స్‌’, ‘స్పీడ్‌వే’లాంటి సినిమాలతో పేరు తెచ్చుకుని, ఎన్నో అవార్డులు అందుకున్న ఇతడు క్యాన్సర్‌ సోకి తన 59వ ఏట 1993 నవంబర్‌ 22న మరణించాడు.
Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.