నవంబర్‌ 23.. (సినీ చరిత్రలో ఈరోజు)

* దేనికైనా రెడీ..
మంచు విష్ణు (పుట్టిన రోజు)


‘ఢీ’, ‘దేనికైనా రెడీ’ చిత్రాలతో విజయాల్ని అందుకొన్న కథానాయకుడు మంచు విష్ణు. అగ్రనటుడు మోహన్‌బాబు వారసుడిగా తెరపైకొచ్చినా ఆ తరువాత సొంతంగా గుర్తింపు తెచ్చుకొన్నారు. వినోదం పండించడంలో తనకంటూ ఓ శైలి ఉందని చాటారు. ‘దూసుకెళ్తా’, ‘రౌడీ’, ‘పాండవులు పాండవులు తుమ్మెదా’, ‘అనుక్షణం’, ‘ఈడో రకం ఆడో రకం’ తదితర చిత్రాలతోనూ ప్రేక్షకుల్ని అలరించారు విష్ణు. కథానాయకుడిగానే కాకుండా నిర్మాతగా కూడా ఆయన రాణించారు. 1981 నవంబరు 23న చెన్నైలో జన్మించిన విష్ణు, తన తండ్రి మోహన్‌బాబు కథానాయకుడిగా నటించిన ‘రగిలే గుండెలు’ చిత్రంతో బాలనటుడిగా తెరంగేట్రం చేశారు. 2003లో ‘విష్ణు’ చిత్రంతో కథానాయకుడిగా పరిచయమయ్యారు. అయితే విజయం కోసం ‘ఢీ’ వరకు ఎదురు చూడాల్సి వచ్చింది. శ్రీనువైట్ల దర్శకత్వం వహించిన ‘ఢీ’లో విష్ణు చక్కటి వినోదాన్ని పండించి విజయాన్ని అందుకొన్నాడు. ఆ తరువాత కొన్ని పరాజయాలు ఎదురైనా ‘దేనికైనా రెడీ’తో మళ్లీ ఫామ్‌లోకి వచ్చారు. ఆ తరువాత చేసిన చిత్రాలన్నీ విష్ణుకి నటుడిగా మంచి పేరు తీసుకొచ్చాయి. ‘ఆచారి అమెరికా యాత్ర’ తరువాత ఆయన్నుంచి సినిమాలేమీ రాలేదు. భక్తి ప్రధానంగా సాగే ‘కన్నప్ప’ చిత్రం కోసం సన్నద్ధమవుతున్నారు. విష్ణు 2009లో వెరొనికా రెడ్డిని వివాహం చేసుకొన్నారు. వెరొనికా మాజీ ముఖ్యమంత్రి కీ.శే. వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి సోదరుడి కుమార్తె. ఈ దంపతులకి నలుగురు పిల్లలు. తన తండ్రి స్థాపించిన శ్రీ విద్యానికేతన్‌ బాధ్యతలు చూసుకొంటూనే, న్యూయార్క్‌ అకాడమీతో పాటు, స్పి్రంగ్‌ బోర్డ్‌ ఇంటర్నేషనల్‌ ప్రి స్కూల్‌ని స్థాపించి విద్యావేత్తగా రాణిస్తున్నారు విష్ణు. ఆయన భార్య కూడా ఈ సంస్థల నిర్వహణ బాధ్యతల్ని చూసుకొంటున్నారు. విష్ణు సోదరి లక్ష్మీప్రసన్న, సోదరుడు మంచు మనోజ్‌ నటులుగా రాణిస్తున్నారు. ప్రస్తుతం ‘మోసగాళ్లు’ చిత్రాన్ని అత్యున్నత సాంకేతిక విలువలతో జాతీయ స్థాయి చిత్రంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ప్రయత్నాల్లో ఉన్నారు విష్ణు. ఈ రోజు ఆయన పుట్టినరోజు.

(ప్రత్యేక కథనం కోసం క్లిక్‌ చేయండి)

 * కొత్త ‘మజిలీ’లో...
నాగచైతన్య (పుట్టిన రోజు)

అక్కినేని కుటుంబం నుంచి వచ్చిన వారసుడు నాగచైతన్య. నాగార్జున పెద్ద కొడుకైన ఈయన ప్రేమకథల్లో చక్కగా ఒదిగిపోతూ రాణిస్తున్నారు. ప్రముఖ కథానాయిక సమంతని వివాహం చేసుకొని కొత్త ‘మజిలీ’ని ఆస్వాదిస్తున్నారు. నాగచైతన్య 1986 నవంబరు 23న నాగార్జున, దగ్గుబాటి లక్ష్మిలకి చెన్నైలో జన్మించారు. అక్కడే పెరిగిన ఆయన హైదరాబాద్‌లో డిగ్రీ చదువుకొన్నారు. రెండో సంవత్సరంలో ఉండగానే నటనపై తనకున్న మక్కువని బయటపెట్టడంతో ముంబైలో శిక్షణ ఇప్పించారు. ఆ తరువాత లాస్‌ ఏంజిలిస్‌ వెళ్లి అక్కడ కూడా నటన, మార్షల్‌ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకొన్నారు. 2009లో దిల్‌రాజు నిర్మాణంలో, వాసు వర్మ దర్శకత్వం వహించిన ‘జోష్‌’తో కథానాయకుడిగా పరిచయమయ్యారు. తొలి చిత్రం సెట్స్‌పై ఉన్న దశలోనే రెండో చిత్రం ‘ఏ మాయ చేసావె’కి సంతకం చేశారు. ‘జోష్‌’ ఆశించిన ఫలితాన్నివ్వకపోయినా, ‘ఏమాయ చేసావె’ ఆయనకి మంచి విజయాన్ని అందించింది. ప్రేమకథల్లో చక్కగా ఒదిగిపోగలడనే పేరు తెచ్చింది. ఆ తరువాత సుకుమార్‌ తెరకెక్కించిన ‘100 % లవ్‌’తో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకొన్నాడు. ‘దడ’, ‘బెజవాడ’లాంటి పరాజయాలు ఎదురైనా, ‘తడాఖా’, ‘మనం’ చిత్రాలతో మళ్లీ సత్తా చాటారు. ‘ప్రేమమ్‌’, ‘సాహసం శ్వాసగా సాగిపో’, ‘రారండోయ్‌ వేడుక చూద్దాం’ చిత్రాలతో నటుడిగానూ తన ప్రతిభని చాటి చెప్పారు. ‘మహానటి’, ‘శైలజారెడ్డి అల్లుడు’, ‘సవ్యసాచి’ చిత్రాలతో 2018లో అలరించారు. సమంతతో కలిసి మూడు సినిమాల్లో నటించిన నాగచైతన్య ఆమెని ప్రేమించి 2017లో వివాహం చేసుకొన్నారు. తొలి చిత్రం ‘ఏమాయ చేసావె’ సమయంలోనే ఒకరినొకరం ఇష్టపడ్డామని ఈ జంట చెబుతుంటుంది. ఈ జోడీ ‘మజిలీ’ చిత్రంలో నటించింది. భార్యాభర్తలుగానే కాకుండా, నటన పరంగా కూడా కొత్త ‘మజిలీ’లో నటించారు.  ఈ రోజు నాగచైతన్య పుట్టినరోజు.

(ప్రత్యేక కథనం కోసం క్లిక్‌ చేయండి)

* కుర్రకారుకు కిర్రాకు!  


పాడితే కుర్రకారు వెర్రెత్తిపోయారు... ఆడితే ఆమె వెనుక చిందేశారు... వెండితెరపై కనిపిస్తే ఆరాధించారు... ఇలా అమెరికాలో ‘టీన్‌ ఐడల్‌’గా గుర్తింపు తెచ్చుకున్న నటి, గాయని, గీత రచయిత్రి మైలీ సైరస్‌. చిన్నప్పుడే టీవీ సిరీస్‌లో కనిపించి, వెండితెరపై కూడా వెలిగిన తార. టీవీలో అత్యంత ప్రాచుర్యం పొందిన ‘హనా మోంటానా’లో కనిపించి ఆకట్టుకుంది. ఆపై గాయనిగా ఆమె వెలువరించిన ఎన్నో ఆల్బమ్‌లు నెంబర్‌ వన్‌ స్థానంలో నిలిచాయి. అమెరికాలో 1992లో పుట్టిన మైలీ సైరస్‌ వెండితెరపై ‘హనా మోంటానా: ద మూవీ’ (2009), ‘ద లాస్ట్‌ సాంగ్‌’ (2010) లాంటి సినిమాలతో మెప్పించడంతో పాటు ఎన్నో అవార్డులు అందుకుంది.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.