నవంబర్‌ 25... (సినీ చరిత్రలో ఈరోజు)

* బుల్లితెర నుంచి వెండితెరకి!


చిన్నప్పుడే బుల్లితెరపై చలాకీగా కనిపించింది... ఏడేళ్లకే వెండితెర అవకాశం అందుకుంది... ఆపై నటిగా, నర్తకిగా మెరిసి అవార్డులు గెలుచుకుంది... ఈ నేపథ్యం క్రిష్టియానా యాపిల్‌గేట్‌ది. కాలిఫోర్నియాలో 1971 నవంబరు 25న పుట్టిన క్రిష్టియానా, ఏడేళ్ల వయసులోనే ‘జాస్‌ ఆఫ్‌ సాతాన్‌’ సినిమాలో నటించింది. ఆపై సినిమాలతో పాటు అనేక టీవీ సిరీస్‌లో నటించింది. ‘డోన్ట్‌ టెల్‌ మామ్‌ ద బేబీసిట్టర్‌ ఈజ్‌ డెడ్‌’, ‘ద బిగ్‌ హిట్‌’, ‘ద స్వీటెస్ట్‌ థింగ్‌’, ‘గ్రాండ్‌ థెఫ్ట్‌ పార్సన్స్‌’, ‘యాంకర్‌మేన్‌’, హాల్‌పాస్‌’, ‘వెకేషన్‌’, ‘బ్యాడ్‌ మామ్స్‌’ లాంటి సినిమాల్లో ప్రధాన పాత్రలు పోషించింది. ఎమ్మీ, టోనీ, గోల్డెన్‌ గ్లోబ్‌ లాంటి ఎన్నో ప్రతిష్ఠాత్మక అవార్డులు అందుకుంది.

* అద్భుత నృత్యకారుడు!


అమెరికా వినోద రంగంలో అతడొక గొప్ప నృత్యకారుడు. ‘ట్యాప్‌డ్యాన్స్‌’ ద్వారా ప్రపంచంలోనే మేటి కళాకారుడిగా పేరు పొందాడు. వెండితెరపై కూడా తనదైన ముద్ర వేశాడు. అతడే బిల్‌ రాబిన్‌సన్‌. కాలిబూట్లను నేల మీద లయబద్ధంగా తాటిస్తూ సంగీతానికి తగినట్టుగా చేసే నృత్యాన్నే ‘ట్యాప్‌డ్యాన్స్‌’ అంటారు. ఇందులో ఎన్నో రకాలు ఉన్నాయి. ఈ తరహా నృత్య ప్రదర్శనలకు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఆదరణ ఉంది. వర్జీనియాలో 1877 మే 25న పుట్టిన రాబిన్‌సన్‌ ఏడేళ్లకే చదువుకి స్వస్తి చెప్పి నాట్యంపై దృష్టి పెట్టాడు. సొంతంగా ‘స్టెయిర్‌ ట్యాప్‌’ విధానాన్ని ఆవిష్కరించి అత్యధిక పారితోషికం అందుకన్న కళాకారుడిగా ప్రాచర్యం పొందాడు. ‘డిక్సియానా’ (1930) సినిమాతో వెండితెర ప్రవేశం చేసి ‘షిర్లీ టెంపుల్‌’, ‘ద లిట్‌లెస్‌ రెబెల్‌’, ‘రెబెక్కా ఆఫ్‌ సన్నీబ్రూక్‌ ఫార్మ్‌’ లాంటి దాదాపు 15 చిత్రాల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులను అలరించాడు. అతడి పుట్టిన రోజును అమెరికా ‘నేషనల్‌ ట్యాప్‌ డ్యాన్సింగ్‌ డే’గా గుర్తించింది. డ్యాన్సర్‌గా, నటుడిగా, ఉద్యమకారుడిగా ప్రాచుర్యం పొందిన ఇతడు 1949 నవంబరు 25న తన 72వ ఏట మరణించాడు. ఈ రోజు అతడి వర్థంతి.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.