నవంబరు 26.. (సినీ చరిత్రలో ఈరోజు)

* నటనలో ‘రాక్‌ ఆన్‌’
 అర్జున్‌ రాంపాల్‌ (పుట్టినరోజు -1972)


సహాయ నటుడిగా అలరించాడు.. ప్రతినాయకుడిగా మెప్పించాడు. రొమాంటిక్‌ పాత్రలతో యువతరానికి కిర్రెక్కించాడు. పాత్ర ఏదైనా తనదైన నటనతో జీవం పోశాడు. మోడల్‌గా కెరీర్‌ను ప్రారంభించి.. బాలీవుడ్‌లో విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఉత్తమ సహాయ నటుడిగా జాతీయ అవార్డుతో పాటు ఫిలింఫేర్‌ను సొంతం చేసుకున్నాడు. ఇవన్నీ నటుడిగా అర్జున్‌ రాంపాల్‌ సాధించిన ఘనతలు. కేవలం నటుడిగానే కాక స్కీన్ర్‌ప్లే రైటర్‌గా, నిర్మాతగా, టెలివిజన్‌ వ్యాఖ్యాతగా బహుముఖ ప్రజ్ఞను చూపించాడు అర్జున్‌. కానీ, ఇటీవల కాలంలో తరుచూ వివాదాలతో వార్తల్లో వ్యక్తిగా నిలుస్తున్నాడు. 1972 నవంబరు 26న మధ్య ప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో ఓ పంజాబీ హిందూ కుటుంబంలో జన్మించాడు అర్జున్‌ రాంపాల్‌. గ్వేన్‌ రాంపాల్‌, అమర్‌జీత్‌ రామ్‌పాల్‌ అతని తల్లిదండ్రులు. దిల్లీ హిందూ కళాశాల నుంచి అర్థశాస్త్రంలో డిగ్రీ పూర్తిచేసిన రామ్‌పాల్, తొలుత మోడల్‌గా కెరీర్‌ను ప్రారంభించాడు. రాజీవ్‌ రాయ్‌ తెరకెక్కించిన రొమాంటిక్‌ చిత్రం ‘ప్యార్‌ ఇష్క్‌ మొహబ్బత్‌’ (2001)తో వెండితెరపై అడుగుపెట్టాడు. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఆశించిన ఫలితాన్నివ్వనప్పటికీ.. నటుడిగా అర్జున్‌ రాంపాల్‌కు మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. ఈ చిత్రంతో విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్‌కు నామినేట్‌ అయ్యాడు. ఆ తరువాత ‘దివానాపన్‌’, ‘దిల్‌ హై తుమ్హారా’, ‘ఆంఖే’, ‘దిల్‌ కా రిష్తా’ చిత్రాలతో నటుడిగా బాలీవుడ్‌లో స్థిరపడ్డాడు. ‘డాన్‌’, ‘ఓం శాంతి ఓం’, ‘రాక్‌ ఆన్‌’, ‘హౌస్‌ ఫుల్‌’, ‘రాజ్‌ నీతి’, ‘రా వన్‌’ చిత్రాలు అర్జున్‌ రామ్‌పాల్‌ కెరీర్‌లో మైలురాళ్లుగా నిలిచాయి. ముఖ్యంగా ‘రాక్‌ ఆన్‌’ చిత్రం అర్జున్‌కు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చి పెట్టింది. ఈ సినిమాలో అతను కనబర్చిన నటనకు ఉత్తమ సహాయ నటుడిగా జాతీయ అవార్డుతో పాటు తొలి ఫిలింఫేర్‌ను అందుకున్నాడు. దాదాపు 18 ఏళ్ల సినీ కెరీర్‌లో 40 చిత్రాల్లో నటించినప్పటికీ వాటిలో ఎక్కువగా సహాయ పాత్రలే ఉన్నాయి. ఈ ఏడాది ‘పల్తాన్‌’ సినిమాతో అలరించాడు. నటుడిగా బాలీవుడ్‌లో మంచి గుర్తింపు ఉన్నప్పటికీ ఇటీవల కాలంలో తరచూ వివాదాలతో వార్తల్లో నానుతున్నాడు. 1998లో మోడల్‌ మెహర్‌ జెసియాను వివాహం చేసుకున్న అర్జున్‌.. తన 20 ఏళ్ల వైవాహిక బంధాన్ని గత ఏడాది 2018 మేలో తెంచుకున్నాడు. వీరికి ఇద్దరు ఆడపిల్లలు (మహీకా (17), మైరా (14)) ఉన్నారు. గతంలో హృతిక్‌ రోషన్‌ దంపతులు విడిపోవడానికీ అర్జున్‌ రాంపాలే కారణమన్న విమర్శలు వచ్చాయి. ‘డాడీ’ చిత్రంలో అరుణ్‌ గావ్లీ అనే డాన్‌గా కనిపించిన రాంపాల్‌.. ఆ పాత్ర కోసం జైల్లో ఉన్న అరుణ్‌ గావ్లీ అనే గ్యాంగ్‌స్టర్‌ను అక్రమంగా కలిసినట్లు అప్పట్లో వార్తలొచ్చాయి.

(ప్రత్యేక వార్త కోసం క్లిక్‌ చేయండి...)

.......................................................................................................................................................

సినీ వీరలక్ష్మి ...
జి.వరలక్ష్మి  (వర్ధంతి)


(ప్రత్యేక వార్త కోసం క్లిక్‌ చేయండి...)

* యుద్ధం... క్లబ్‌... ప్రేమ! 


రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో అమెరికాలో చాలా సినిమాలు కథలు అల్లుకున్నాయి. ఓ వైపు యుద్ధ ప్రభావాలు, మరో పక్క ప్రాంతాల మధ్య వైషమ్యాలు, వాటి మధ్య నలిగిపోయే ప్రేమికుల కథలను అల్లుతూ వచ్చిన ఈ సినిమాల్లో చాలా మటుకు విజయవంతమయ్యాయి. అలా వచ్చిన మరో సినిమా ‘కసబ్లాంకా’ 1942లో విడుదలై మూడు ఆస్కార్‌ అవార్డులను సాధించింది. యుద్ధం నేపథ్యంలో ప్రాంతీయ, వర్ణ, వర్గ వైషమ్యాలు భగ్గుమంటున్న తరుణంలో కసబ్లాంకా అనే ఓ నైట్‌క్లబ్, వలస వచ్చిన యుద్ధబాధితులకు అడ్డాగా మారుతుంది. నాజీలకు వ్యతిరేకంగా అధికారులు తరచు చేసే దాడుల నేపథ్యంలో ఆ క్లబ్‌లోకి వచ్చిన ఓ యువ దంపతులను ఆ క్లబ్‌ అధినేత ఎలా అమెరికాకు తప్పించుకోడానికి సాయపడ్డాడనేదే కథ. ఆ యువతి ఆ క్లబ్‌ యజమాని మాజీ ప్రియురాలైన నేపథ్యంలో మానవ సంబంధాలు, ఆకర్షణలు, వ్యామోహాలు, విలువల నేపథ్యంలో అల్లుకున్న సన్నివేశాలు అందరినీ ఆకట్టుకుంటాయి.

* ఒక రూపకం... మూడు సినిమాలు


వేదికల మీద ప్రేక్షకులను అలరించిన ఓ సంగీత నృత్య రూపకం, వెండితెర మీద మూడు సినిమాలకు నాంది పలికింది. మూడు సార్లూ సినీ అభిమానులను ఆకట్టుకుంది. అదే ‘గర్ల్‌ క్రేజీ’. 1930లో వచ్చిన ఓ పుస్తకం ఆధారంగా పాటలు, నృత్యాలతో మలిచిన రూపకం అనేక ప్రదర్శనలు నోచుకుంది. దాని ఆధారంగా తొలిసారిగా 1932లో అదే పేరుతో ఓ సినిమాను తీశారు. ఆ తర్వాత మరో సినిమాను తీసి 1943 నవంబర్‌ 26న విడుదల చేశారు. ఆపై 1965లో ‘వెన్‌ ద బోయ్స్‌ మీట్‌ ద గర్ల్స్‌’ పేరుతో మరో సినిమాను తీశారు. ఓ ధనవంతుడు తన కొడుకు పాటలు, ఆటలు, అమ్మాయిలతో కాలక్షేపం చేస్తున్నాడనే ఉద్దేశంలో దరిదాపుల్లో ఆడపిల్లలెవరూ కనిపించని ఓ కాలేజీలో చేరుస్తాడు. ఆ మారుమూల ప్రాంతంలో ఓ పోస్ట్‌ఆఫీసులో పనిచేస్తున్న అమ్మాయితో ఆ కొడుకు ప్రేమలో పడతాడు. మరి వాళ్లని విడదీయడానికి ఆ తండ్రి ఏం చేశాడు, ప్రేమను నిలబెట్టుకోడానికి ఈ యువ జంట ఎలాంటి పాట్లు పడిందనేది సూత్రప్రాయమైన కథ.

* ఇద్దరు వివాహితుల ప్రేమకథ


ఆమెకు పెళ్లయి పిల్లలున్నారు. అతడికీ అంతే. ఇద్దరూ నడివయసులో వాళ్లే. అనుకోకుండా జరిగిన పరిచయం, స్నేహంగా మారి, ఆపై ప్రేమకు దారితీసింది. వీరి అనుబంధం ఎలాంటి పరిస్థితులు సృష్టించింది, చివరకి ఇద్దరూ ఏం చేశారనేదే కథ. ఆసక్తికి, మానవ సంబంధాల చిత్రీకరణకు, ఆకర్షణ, ప్రేమ, బంధాల మధ్య చర్చకు తావిచ్చే ఈ కథాంశంతో తీసిన సినిమా ‘బ్రీఫ్‌ ఎన్‌కౌంటర్‌’ (1945). డేవిడ్‌ లీన్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా బ్రిటన్‌ చలన చిత్ర చరిత్రలోనే ఓ మేటి సినిమాగా పేరుపొందింది. ఆస్కార్‌ అవార్డు అందుకున్న అందాల తార సెలియా జాన్సన్‌ నటించిన ఈ సినిమా ప్రేక్షకులను అలరించడంతో పాటు ఆర్థికంగా కూడా విజయవంతమైంది. ప్రతి వారం పల్లెటూరి నుంచి పట్నానికి వెళ్లే ఓ యువతి, ఆ పట్నానికే వారానికోసారి వచ్చే ఓ డాక్టర్‌ను అనుకోకుండా కలుస్తుంది. ఆ తర్వాత ఇద్దరూ క్రమం తప్పకుండా ప్రతి వారం కలుస్తూ స్నేహితులవుతారు. ఆపై సినిమాలకు, షికార్లకు వెళుతూ ప్రేమలో పడతారు. కానీ చివరకి తమ ప్రేమ బంధం, తమ కుటుంబాలతో అనుబంధానికి ఆటంకమవుతుందని గ్రహించి తిరిగి కలుసుకోకూడదని నిర్ణయించుకుని విడిపోతారు. ఆ మహిళ తన భర్తతో జరిగినదంతా చెబుతున్నట్లుగా సినిమా స్క్రీన్‌ప్లే ఉంటుంది. చివరికి ఆమె భర్త ఆమెను ప్రేమగా ఓదార్చడంతో సినిమా ముగుస్తుంది.

* మేటి చిత్రాల రూపశిల్పి


ఓ మంచి సినిమా చూస్తే ‘దర్శకుడు ఎవరు?’ అని తెలుసుకుని మరీ గుర్తు పెట్టుకుంటారు సినీ అభిమానులు. అలా ప్రపంచ వ్యాప్తంగా ఎందరికో మరుపురాని దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు బెర్నార్డో బెట్రొలూసి. ఇటలీకి చెందిన ఈయన మంచి కవి కూడా. అందువల్లనేనేమో, అతడి సినిమాలు కూడా కవితాత్మకంగా, రంగుల స్వప్నంలాగా ఉంటాయని చెబుతుంటారు అతడి అభిమానులు. ఆ ప్రతిభ ఏంటో తెలియాలంటే అంతర్జాతీయంగా ఆకట్టుకున్న ‘లిటిల్‌ బుద్ధ’, ‘ద లాస్ట్‌ ఎంపరర్‌’, ‘ద కన్ఫర్మిస్ట్‌’, ‘లాస్ట్‌ ట్యాంగో ఇన్‌ ప్యారస్‌’, ‘ద షెల్టరింగ్‌ స్కై’, ‘స్టీలింగ్‌ బ్యూటీ’, ‘ద డ్రీమర్స్‌’ లాంటి సినిమాలు చూడాలి. రెండు ఆస్కార్‌ అవార్డులతో పాటు కేన్స్‌ చిత్రోత్సవంలో ప్రతిష్ఠాత్మకమైన ‘పామె డిఓర్‌’ పురస్కారాన్ని కూడా పొందిన ఈయన, ఇటలీలో 1941 మార్చి 16న పుట్టి రోమ్‌లో పట్టభద్రుడయ్యేసరికే కవిగా, రచయితగా పేరు తెచ్చుకున్నాడు. ఇరవై రెండేళ్లకే మెగాఫోన్‌ పట్టుకుని దర్శకుడిగా మారాడు. ప్రత్యేకమైన దర్శకత్వ శైలికి పేరు పడిన ఈయన తన 77వ ఏట 2018 నవంబర్‌ 26న మరణించారు.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.