నవంబర్‌ 27... (సినీ చరిత్రలో ఈరోజు)

* మంచు రాణి కథ!


అమెరికాలో ఫెయిరీ టేల్స్‌ అంటే పిల్లలు, పెద్దలు చెవి కోసుకుంటారు. తరతరాలుగా అవి అద్భుతమైన నీతి కథలుగా ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందాయి. వాటి ఆధారంగా ఎన్నో టీవీ సీరియళ్లు, సినిమాలు రూపొందాయి. అలా వెండితెరపైకి వచ్చి అంతర్జాతీయంగా ఆకట్టుకుని కాసుల వర్షం కురిపించిన కథే ‘ద స్నో క్వీన్‌’. డచ్‌ రచయిత హ్యాన్స్‌ క్రిస్టియన్‌ ఆండెర్సన్‌ 1844లో రాసిన కథ ఆధారంగా వాల్ట్‌ డిస్నీ సంస్థ అందించిన 53వ యానిమేషన్‌ సినిమా ఇది. ‘ఫ్రోజెన్‌’ పేరుతో 2013లో విడుదలైన ఇది, 1.2 బిలియన్‌ డాలర్ల వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. రెండు ఆస్కార్‌లతో పాటు గోల్డెన్‌గ్లోబ్, బాఫ్తా, అయిదు యానీ, రెండు గ్రామీ, రెండు క్రిటిక్స్‌ ఛాయిస్‌ అవార్డులను కొల్లగొట్టింది. అక్కచెల్లెళ్లయిన ఎల్సా, అన్నాల కథగా ఇది ప్రపంచ వ్యాప్తంగా పిల్లల్ని, పెద్దల్ని కూడా ఆకట్టుకుంది. ఏది ముట్టుకున్నా మంచుగా మారిపోయే శక్తిగల తన అక్క వల్ల రాజ్యమంతా గడ్డకట్టుకుపోతే, ఆ దుస్థితిని తప్పించడానికి ఆమెను వెతుక్కుంటూ వెళ్లిన ఓ రాకుమారి సాహసాలే ఈ సినిమా కథ. త్రీడీ యానిమేషన్‌ పద్ధతిలో తీసిన ఈ సినిమా అద్భుత దృశ్యాలతో ఆకట్టుకుంటుంది.

* మెరుపు వీరుడు బ్రూస్‌ లీ.‌!!


కరాటే, కుంగ్‌ఫు లాంటి ఏ మార్షల్‌ ఆర్ట్స్‌ను తల్చుకున్నా, మొదట గుర్తొచ్చే పేరు బ్రూస్‌ లీ! మెరుపు పోరాటాలతో ప్రపంచమంతా ఆకట్టుకున్న బ్రూస్‌ లీ అనే వ్యక్తి లేకపోతే గత 40 యేళ్లకు పైగా ప్రపంచ సినిమా రంగంలో పోరాట విద్యల నేపథ్యంలో ఇన్నేసి సినిమాలు వచ్చి ఉండేవి కాదనడంలో ఎలాంటి సందేహం ఉండదు. నవంబర్‌ 27, 1940 శాన్‌ఫ్రాన్సిస్కోలో  పుట్టిన లీ జున్‌ ఫాన్, బ్రూస్‌ లీ పేరుతో వెండితెరపై అద్భుతాలు సృష్టించాడు. తల్లిదండ్రులతో చిన్నతనంలోనే హాంగ్‌కాంగ్‌ వెళ్లిపోయిన బ్రూస్‌ లీ ఐదేళ్ల వయసులోనే అక్కడి సినిమాల్లో కనిపించాడు. పన్నెండేళ్ల వయసులో కొందరు రౌడీ కుర్రాళ్లు చితకబాదడంతో బ్రూస్‌ లీ దృష్టి మార్షల్‌ ఆర్ట్స్‌పై పడింది. ఓ పక్క పోరాట విద్యల్లో ఆరితేరుతూనే ‘ఛాఛా’ నాట్యంలో ఆరితేరి ఛాంపియన్‌షిప్‌ సాధించాడు. ముక్కుమీద కోపంతో తరచు వీధి తగాదాల్లో పాల్గొనే బ్రూస్‌ లీని తల్లిదండ్రులు చదువు మిషతో అమెరికా పంపించారు. అక్కడ చదువుకుంటూనే కుంగ్‌ఫు స్కూల్‌ పెట్టి అనేక టోర్నమెంట్స్‌లో పాల్గొంటున్న బ్రూస్లీకి వెండితెర స్వాగతం పలికింది. అలా మొదలైన బ్రూస్‌ లీ ప్రస్థానం అతడిని విలక్షణ నటుడిగా, దర్శకుడిగా, పోరాట యోధునిగా, తత్వవేత్తగా తీర్చిదిద్దింది. ‘ద బిగ్‌బాస్‌’, ‘ఫిస్ట్‌ ఆఫ్‌ ఫ్యూరీ’, ‘వే ఆఫ్‌ ద డ్రాగన్‌’, ‘ఎంటర్‌ ద డ్రాగన్‌’, ‘ద గేమ్‌ ఆఫ్‌ డెత్‌’ లాంటి సినిమాల ద్వారా అంతర్జాతీయంగా అభిమానులను సంపాదించుకున్న బ్రూస్‌ లీ ఓ మందు వికటించి, తన 32వ ఏట 1973 జులై 20న మరణించడం విషాదకరం.

(ప్రత్యేక వార్త కోసం క్లిక్‌ చేయండి...)

* ఆస్కార్‌ అందుకున్న
తొలి దర్శకురాలు!!


ఒకే చిత్రానికి నాలుగు ప్రతిష్ఠాత్మకమైన అవార్డులు అందుకోవడం, అందునా వాటిని అందుకున్న తొలి దర్శకురాలు తనే కావడం విశేషమే. అదే సాధించింది కేథరిన్‌ బిగెలో. దర్శకురాలిగా, నిర్మాతగా, రచయితగా ఆమె ఎన్నో మంచి చిత్రాలను అందించింది. కాలిఫోర్నియాలో 1951లో పుట్టిన బిగెలో, చిన్నప్పుడే మంచి పెయింటర్‌గా పేరు సంపాదించింది. తరువాత ఫైన్‌ ఆర్ట్స్‌లో చేరి సినిమాను అభ్యసించింది. మొదట లఘుచిత్రాలు చేసి ఆపై వెండితెరకు ఎదిగింది. ‘నియర్‌ డార్క్‌’, ‘పాయింట్‌ బ్రేక్‌’, ‘స్ట్రేంజ్‌ డేస్‌’, ‘కె19: ద విడోమేకర్‌’, ‘ద హర్ట్‌ లాకర్‌’, ‘జీరో డార్క్‌ థర్టీ’, ‘డెట్రాయిట్‌’లాంటి సినిమాలు అందించింది. ‘ద హర్ట్‌ లాకర్‌’ (2008) చిత్రానికి ఉత్తమ దర్శకురాలిగా ఆస్కార్, డైరెక్టర్స్‌ గిల్డ్, బాఫ్తా, క్రిటిక్స్‌ ఛాయిస్‌ అవార్డులను అందుకున్న తొలి దర్శకురాలిగా చరిత్ర సృష్టించింది. అలాగే ‘స్ట్రేంజ్‌ డేస్‌’ సినిమాకు శాటర్న్‌ అవార్డు అందుకున్న తొలి దర్శ కురాలు కూడా ఆమే కావడం విశేషం.

*తెలుగు హాస్యనట చక్రవర్తి
రేలంగి (వర్థంతి)


(ప్రత్యేక వార్త కోసం క్లిక్‌ చేయండి...)

Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.