* మారణ హోమానికి దర్పణం!

మనుషుల మధ్య వైషమ్యాలు మారణహోమాలను సృష్టించిన ఆనవాళ్లు చరిత్రలో ఎన్నో. అలాంటి వాటిలో అతి అమానుషమైనది నాజీల చేతిలో యూదుల ఊచకోత. జర్మనీలో నియంత హిట్లర్ అధికారంలోకి వచ్చాక యూరప్‌లో 60 లక్షల మంది యూదుల్ని అమానుషంగా, అతి దారుణంగా చంపేశారు. 1941 నుంచి 1945 మధ్య కాలంలో జరిగిన ఈ మారణకాండ వల్ల యూరప్‌లో మూడింట రెండు వంతుల మంది యూదులు దారణంగా హత్యకు గురయ్యారు. ఈ అమానుష సంఘటనలకు అద్దం పట్టిన సినిమానే ప్రపంచ ప్రఖ్యాత దర్శక నిర్మాత స్టీవెన్ స్పీల్బర్గ్ తీసిన ‘షిండ్లర్స్ లిస్ట్’. ఆస్ట్రేలియా రచయిత థామస్ కెనెల్లీ 1982లో రాసిన ‘షిండ్లర్స్ ఆర్క్’ అనే నవల ప్రతిష్టాత్మకమైన బుకర్ ప్రైజ్ గెలుచుకుని అంతర్జాతీయంగా పాఠకులను ఆకట్టుకుంది. ఈ నవల ఆధారంగా 1993లో విడుదలైన ‘షిండ్లర్స్ లిస్ట్’ సినిమా అత్యున్నత చిత్రాల్లో ఒకటిగా పేరుపొందడంతో పాటు ఏడు ఆస్కార్ అవార్డులు సహా, ఏడు బాఫ్తా, మూడు గోల్డెన్గ్లోబ్లాంటి ఎన్నో ప్రతిష్ఠాత్మక పురస్కారాలు అందుకుంది. వ్యాపారాత్మకంగా కూడా విజయవంతమై 22 మిలియన్ డాలర్ల పెట్టుబడికి 321.2 మిలియన్ డాలర్లు ఆర్జించింది. ఆస్కార్ షిండ్లర్ అనే ఓ వ్యాపార వేత్త నాజీ పార్టీకి చెందిన వాడైనప్పటికీ, 1200 మంది యూదులను నాజీల ఊచకోత నుంచి ఎలా, ఎందుకు కాపాడాడనేది చిత్రాంశం. యూదుల సామూహిక హత్యాకాండను, వారు అనుభవించిన కష్టాలను కళ్లకు కట్టడం కోసం ఈ చిత్రంలో 20 వేల మంది ఎక్స్ట్రాలను ఉపయోగించారు. వీళ్ల కాస్ట్యూమ్స్ కోసం బహిరంగ ప్రకటలను ఇచ్చి ప్రజల వద్ద ఉన్న పురాతన దుస్తులను పెద్ద ఎత్తున కొనుగోలు చేశారు. ఈ సినిమా అత్యధిక వ్యయంతో తీసిన బ్లాక్ అండ్ వైట్ సినిమాగా రికార్డు సృష్టించింది. అంతక్రితం ఈ ఘనత ‘ద లాంగెస్ట్ డే’ (1962) సినిమాకు ఉండేది. ఈ సినిమా తీయాలనే ఆలోచన పదేళ్ల క్రితమే కలిగినా ఈ కథను తెరకెక్కించడానికి తగినంత అనుభవం, అవగాహన తనకు లేవనే ఉద్దేశంతో స్పీల్బర్గ్ పదేళ్లు నిరీక్షించాడు. ఈ సినిమా జర్మన్లను వ్యతిరేకంగా, యూదులకు అనుకూలంగా ఉందనే కారణంతో ముస్లింలు అధికంగా ఉండే మలేసియా, ఇండోనేషియా, ఈజిప్ట్ లాంటి దేశాల్లో నిషేధించారు. ...........................................................................................................................................................
* అయిదు భాషల్లో ‘ఆడపడుచు’ అనురాగం
(ప్రత్యేక వార్త కోసం క్లిక్ చేయండి...)
|
* వేగం అతడి పేరు! 
వేగం అంటే అతడికి ఇష్టం. చిన్నప్పటి నుంచి ఫుట్‌బాల్, సర్ఫింగ్ లాంటి చురుకైన ఆటలే ఆడుతూ పెరిగాడు. వెండితెరపై కూడా అదే వేగాన్ని చూపించాడు. ప్రపంచ వ్యాప్తంగా యువతను విపరీతంగా ఆకర్షించి విజయవంతమైన ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ సినిమాల పేరు చెబితే చాలు అతడే గుర్తొస్తాడు. అతడే పాల్ వాకర్. స్ట్రీట్ రేసింగ్‌ల నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాల సీక్వెల్స్‌లో అయిదింటిలో ప్రధాన పాత్ర పోషించడం ద్వారా అంతర్జాతీయ గుర్తింపు పొందాడు. కాలిఫోర్నియాలో 1973 సెప్టెంబర్ 12న పుట్టిన పాల్‌వాకర్ మొదట్లో టీవీల్లో నటించాడు. ఆ తరువాత ‘జాయ్ రైడ్’, ‘టైమ్‌లైన్’, ‘ఇన్ టు ద బ్లూ’, ‘ఎయిట్ బిలో’, ‘రన్నింగ్ స్కేర్డ్’లాంటి సినిమాల్లో మెప్పించాడు. రేసింగ్ సినిమాల ద్వారా పేరు సంపాదించిన పాల్ వాకర్ తన 40 ఏళ్ల వయసులో ఓ కారు ప్రమాదంలో 2013 నవంబర్ 30న చనిపోవడం విషాదకరం. ఇతడి మరణం తరువాత అతడు నటించిన మూడు సినిమాలు ‘అవర్స్’, ‘బ్రిక్ మాన్సన్స్’, ‘ఫ్యూరియస్7’ చిత్రాలు విడుదలయ్యాయి.
|
* మధుర గాయని! వాణీ జయరాం (పుట్టినరోజు)
‘అపర మీరా’ అనేది ఆమెకు లభించిన గుర్తింపు. అందుకు తగినట్టుగానే ఆమె గళం శ్రోతల మనసులలో మార్దవమైన ముద్ర వేస్తుంది. దక్షిణ భారత సినీరంంగంలో దశాబ్దాల పాటు చక్కని గాత్రంతో అలరించిన ఆ మధుర గాయని వాణీజయరాం. తమిళనాడులోని వెల్లూరులో 1945లో కళైవాణిగా సంగీత కళాకారుల కుటుంబంలో తల్లిదండ్రుల తొమ్మిది మంది సంతానంలో 5వ ఆడపిల్లగా పుట్టిన ఆమె చిన్నప్పటి నుంచే సంగీత సాధన చేసింది. ఎనిమిదేళ్ల వయసులోనే రేడియోలో కచేరీ ఇచ్చింది. చదువు తరువాత ఎస్బీఐలో ఉద్యోగం వచ్చినా, ఆ తరువాత వివాహమైనా సంగీత సాధన మాత్రం మరువలేదు. బాలీవుడ్ చిత్రం ‘గుడ్డి’ (1971)తో సినీ రంగప్రవేశం ఆమె హిందీ, తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, మరాఠీ, ఒడియా, గుజరాతీ, బెంగాలీ భాషల్లో పాటలు పాడారు. ఉత్తమ నేపథ్య గాయనిగా మూడుసార్లు జాతీయ బహుమతితో పాటు అనేక పురస్కారాలు సాధించారు.
(ప్రత్యేక వార్త కోసం క్లిక్ చేయండి...) |
* సినీ గీతాలకు భావ సౌరభం! వెన్నెలకంటి (పుట్టినరోజు)
 ఒక్క గీత రచయితగానే కాదు, మాటల రచయితగా కూడా తనదైన ముద్ర వేసిన ఘనత వెన్నెలకంటి రాజేంద్ర ప్రసాద్ సొంతం. అలతి పదాలతోనే అనల్ప భావాన్ని అద్ది సినీ అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న వెన్నెలకంటి దాదాపు మూడు వందల చిత్రాలకు పైగా పని చేశారు. విలక్షణమైన రచన, శబ్దాలతో చమత్కారం, భావుకత ఆయన ప్రత్యేకతలు. చిన్నప్పుడే పద్యాలతో శతకాలను రాయగలిగిన ఆయనకు నాటకాలు, సినిమాలంటే పిచ్చి. 1986లో సినీ రంగ ప్రవేశం చేసిన ఆయన మరువలేని ఎన్నో పాటలను అందించారు.
(ప్రత్యేక వార్త కోసం క్లిక్ చేయండి...) |