నవంబర్‌ 9.. (సినీ చరిత్రలో ఈరోజు)

* వెండితెరపై వెలిగిన అందం!


‘ఇంతవరకు ఇలాంటి అందమైన అమ్మాయిని సినిమాల్లో చూడలేదు’ అన్నారందరూ!

‘ఎంత అందమైన అమ్మాయైతే మాత్రం, ఛీ.. ఛీ.. ఇదేం పని?’ అని ఈసడించుకున్నారు చాలామంది!
అటు ప్రశంసల్ని, ఇటు విమర్శల్ని కూడా చూసిన ఆ తార మాత్రం నటనకే పరిమితం కాలేదు. ఓ పరిశోధకురాలిగా కూడా పేరు తెచ్చుకుంది.
ఆమె హాలీవుడ్‌ పేరు హెడీ లామర్‌. ఆస్టియ్రాలో పుట్టింది మాత్రం హెడ్విగ్‌ ఎవా కీస్లర్‌గా. పదిహేడేళ్లకే ఆస్టియ్రన్‌ సినిమాల్లో తెరంగేట్రం చేసింది కానీ ఉన్నట్టుండి ఆమె పేరు ప్రపంచ వ్యాప్తంగా మార్మోగిపోవడానికి కారణమైన సినిమా మాత్రం ‘ఎక్‌స్టసీ’(1933). ఓ చలన చిత్రంలో తొలిసారి నగ్నత్వాన్ని చూపించిన సినిమా అది. అందులో లామర్‌ నగ్నంగా నటించడం ఆ కాలంలో పెద్ద సంచలనమైపోయింది. ఓ ధనికుడైన వృద్ధుడిని పెళ్లి చేసుకుని అసంతృప్తితో విడాకులిచ్చి మరో యువకుడికి చేరువైన అమ్మాయి పాత్రలో ఆమె నటన సాహసోపేతంగా ఉందని కొందరంటే, కొన్ని దేశాలు మాత్రం ఆ సినిమానే నిషేధించాయి. నిజ జీవితంలో కూడా భర్త నుంచి రహస్యంగా పారిపోయి ప్యారిస్‌ చేరుకున్న ఈమెను ఓ ప్రయాణంలో హాలీవుడ్‌ చిత్ర నిర్మాత సంస్థ ఎమ్‌జీఎమ్‌ అధినేత చూసి సినిమా ఒప్పందం కుదుర్చుకున్నాడు. అలా హాలీవుడ్‌ తారగా మారిన లామర్‌ అందాన్ని చూసిన ప్రేక్షకులు మాత్రం మురిసిపోయారు. రెండు దశాబ్దాల పాటు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ‘శ్యామ్‌సన్‌ అండ్‌ డిలైలా’ (1949) సహా ‘అల్‌గియర్స్‌’ (1938), ‘బూమ్‌టౌన్‌’, ‘ఐ టేక్‌ దిస్‌ ఉమన్‌’, ‘కామ్రేడ్‌ ఎక్స్‌’, ‘కమ్, లివ్‌ విత్‌ మి’ లాంటి సినిమాల్లో అందాల రాశిగా పేరు పొందింది. సినిమాలతోనే ఆగిపోకుండా సైనికులు రహస్యంగా సందేశాలు ఇచ్చుకునే పరికరానికి సంబంధించిన పేటెంట్‌ పొందింది. ఈ సాంకేతిక ఆలోచన ఇప్పుడు మొబైల్‌ ఫోన్లలో వైఫై సౌకర్యానికి దగ్గరగా ఉండడం విశేషం. ‘సీక్రెట్‌ కమ్యూనికేషన్‌ సిస్టమ్‌’గా ఈమె పేటెంట్‌ తీసుకున్న ఆలోచన, రెండో ప్రపంచ యుద్ధంలో మిసైల్స్‌కి సంకేతాలు ఆపే శత్రు సైనికుల ఆటలు కట్టించేలా ఉపయోగపడుతుందని ఈమె ప్రకటించింది. ఈ పరిశోధన ద్వారా అందమే కాదు, అపారమైన తెలివితేటలు కూడా గల అమ్మాయిగా గుర్తింపు పొందింది లామర్‌.
.........................................................................................................................................

హిందీ ఖవ్వాలీ తెలుగు బజారు పాటగా...


(ప్రత్యేక వార్త కోసం క్లిక్‌ చేయండి...)

* చార్లీ చాప్లిన్‌ సరసన...


ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన హాస్య నటుడిగా పేరొందిన చార్లీ చాప్లిన్‌ కొన్ని మామూలు సినిమాల్లో కూడా నటించాడని కొంతమందికి మాత్రమే తెలుసు. అలా నటించేప్పుడు అతడి జోడీగా నటించిన నటిగా మేరీ డ్రెస్లర్‌ను చెప్పుకోవాలి. మూకీల కాలంలోనే ఉత్తమ నటిగా ఆస్కార్‌ అందుకున్న ఈమె ‘టిల్లీస్‌ పంక్చర్డ్‌ రొమాన్స్‌’ సినిమాలో చార్లీ చాప్లిన్‌తో కలిసి నటించి మెప్పించింది. నాటక రంగంలో కూడా మంచి పేరు సంపాందింది. సినీ చరిత్రలో తొలి పూర్తి నిడివి గల హాస్య చిత్రంలో నటించిన ఘనత ఆమెదే. కెనడాలో 1868 నవంబర్‌ 9న పుట్టిన ఈమె పద్నాలుగేళ్లకే ఇంటి నుంచి బయటకి వచ్చేసి నాటకాల్లో పాత్రలు ధరించిన సాహసికురాలు. అంత అందంగా లేకపోయినా ప్రేక్షకులను తన హావభావాలతో విపరీతంగా నవ్వించి రాణించింది. కొంతకాలం చిత్రాలకు దూరమైనా తిరిగి 59వ ఏట మళ్లీ వెండితెరపై మెరిసిన ఈమె ‘మిన్‌ అండ్‌ బిల్‌’ సినిమాకు ఆస్కార్‌ అందుకుంది. ప్రఖ్యాత ‘టైమ్‌’ పత్రికలో ముఖచిత్ర కథనంతో ప్రపంచం దృష్టికి ఆకట్టుకున్న ఆమె, 1934 జులై 28న తన 65వ ఏట కాలిఫోర్నియాలో మరణించింది.

* నాలుగు రంగాల్లో నటుడిగా...


నాటకం, రేడియో, టీవీ, సినిమా రంగాల్లో మంచి నటుడిగా మెప్పించిన వాడు ఆర్ట్‌ కార్నీ. ‘హ్యారీ అండ్‌ టోన్టో’ (1974) సినిమాలో నటనకు ఆస్కార్, గోల్డెన్‌గ్లోబ్‌ అవార్డులు అందుకున్నాడు. న్యూయార్క్‌లో 1918 నవంబర్‌ 4న ఆరుగురి సంతానంలో చివరివాడిగా పుట్టిన కార్నీ, రెండో ప్రపంచ యుద్ధంలో ఆర్మీలో కూడా పనిచేశాడు. యుద్ధంలో కాలికి గాయమైన అతడు ఆపై రేడియోలో హాస్యగీతాలు పాడుతూ ఆకట్టుకున్నాడు. బుల్లితెరపై కూడా తనదైన ముద్ర వేశాడు. ‘హౌస్‌ కాల్స్‌’, ‘డబ్ల్యూ డబ్ల్యూ అండ్‌ ద డిక్సీ డ్యాన్స్‌కింగ్స్‌’, ‘ద లేట్‌ షో’, ‘మూవీ మూవీ’, ‘గోయింగ్‌ ఇన్‌ స్టైల్‌’, ‘ద నేకెడ్‌ ఫేస్‌’, లాంటి సినిమా ద్వారా అంతర్జాతీయ గుర్తింపు పొందిన కార్నీ, 2003 నవంబర్‌ 9న తన 85వ ఏట మరణించాడు.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.