అక్టోబర్‌ 14.. (సినీ చరిత్రలో ఈరోజు)

* మై నేమ్‌ ఈజ్‌ సెకండ్‌ జేమ్స్‌బాండ్‌!

ప్రపంచ వ్యాప్తంగా ఆకట్టుకున్న జేమ్స్‌బాండ్‌ సినిమాల్లో సీన్‌కానరీ తరువాత ఆ పాత్ర పోషించిన ఇంగ్లిష్‌ నటుడు రోజర్‌మోర్‌. జేమ్స్‌బాండ్‌ పాత్రను సృష్టించిన ఇయాన్‌ఫ్లెమింగ్‌ నవలల ఆధారంగా 1973 నుంచి 1985 వరకు తీసిన ఏడు సినిమాల్లో బాండ్‌గా నటించాడు. బాండ్‌గా తొలి చిత్రం ‘లివ్‌ అండ్‌ లెట్‌ డై’. మోర్, బ్రిటిష్‌ ప్రభుత్వం తరఫున ఎలిజబెత్‌ రాణి చేతుల మీదుగా ప్రతిష్ఠాత్మక పురస్కారమైన ‘నైట్‌హుడ్‌’ అందుకున్నాడు. యూనిసెఫ్‌ గుడ్‌విల్‌ అంబాసిడర్‌గా వ్యవహరించాడు. బాండ్‌ సినిమాల కంటే ముందుగానే టీవీ, సినిమా రంగాల్లో చిర పరిచితుడు. లండన్‌లో 1927 అక్టోబర్‌ 14న పుట్టిన ఈ తెర గూఢచారి తండ్రి జార్జి ఆల్‌ఫ్రెడ్‌ మోర్‌ ఓ పోలీసు. తల్లి కలకత్తాలో పుట్టిన ఇంగ్లిషు వనిత. చదువు అయిన తరువాత ఓ యానిమేషన్‌ స్కూల్లో చేరితే అక్కడ పొరపాటు చేయడంతో తొలగించారు. ఓ సినిమా దర్శకుడి ఇంట్లో దొంగతనం కేసును తండ్రి జార్జి పరిష్కరిస్తే ఆ పరిచయంతో రోజర్‌మోర్‌కు ఆ దర్శకుడు ‘సీజర్‌ అండ్‌ క్లియోపాత్రా’ (1945) సినిమాలో ఓ ఎక్స్‌ట్రా వేషం ఇచ్చాడు. అదే అతడి మొదటి సినిమా అయినా, అమ్మాయిలను ఆకర్షించడాన్ని గమనించిన ఆ దర్శకుడు రోజర్‌మోర్‌ను ఓ యాక్టింగ్‌ స్కూల్లో చేర్పించాడు. పద్దెనిమిదేళ్ల వయసులో రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో రోజర్‌మోర్‌ను సైన్యంలోకి తీసుకున్నారు. యుద్ధం తరువాత తిరిగి సినిమా రంగానికి వచ్చి ‘పెర్‌ఫెక్ట్‌ స్ట్రేంజర్స్‌’ (1945), ‘గైటీ జార్జి’, ‘ట్రోటీ ట్రూ’ లాంటి సినిమాల్లో చిన్న చిన్న వేషాలు వేశాడు. తరువాత అమెరికా వచ్చి కొన్ని టీవీ సీరియల్స్‌లో పాల్గొన్నాడు. ఎంజీఎం నిర్మాణ సంస్థతో ఒప్పందం కుదిరి ‘ద లాస్ట్‌ టైమ్‌ ఐ సా ప్యారిస్‌’ (1954) సినిమాలో ఎలిజబెత్‌ టేలర్‌ సరసన నటించాడు. ఆపై ‘ఇంటరెప్టెడ్‌ మెలోడీ’, ‘ద కింగ్స్‌ థీఫ్‌’, ‘డయానే’, ‘ద మిరాకిల్‌’ లాంటి సినిమాల్లో నటిస్తూనే ఎన్నో టీవీ సీరియల్స్‌లో నటించాడు. తర్వాత జేమ్స్‌బాండ్‌ పాత్రలో మెరిశాడు. బాండ్‌ సినిమాలతో పాటు ఇతర సినిమాల్లో కూడా నటించాడు. బాండ్‌ సినిమాలకు ఓ సరికొత్త స్టైల్‌ను, ఓ హాస్య చతురతను, చిలిపితనాన్ని జోడించిన రోజర్‌మోర్‌ 2017 మే 23న తన 89 ఏళ్ల వయసులో మరణించాడు.

* నిజాన్ని నినదించిన పాటలు!
(జాలాది రాజారావు వర్థంతి-2011)

పదాలు తేలిగ్గానే ఉంటాయి... కానీ వాటిలో ఇమిడిన భావం బరువుగా ఉంటుంది... పాట సులువుగా పాడుకునేలాగే ఉంటుంది... కానీ ఆ పాటలోని ఉద్వేగం గుండెను ఊపేస్తుంది... నిజం నిప్పుల్లో కాల్చిన మొక్కజొన్నపొత్తుల్లాంటి ఆ గీతాలు, వేదాంత సారాన్ని చెవుల్లోంచి మెదడులోకి పాకిస్తాయి... అలాంటి పాటలు రాసిన అరుదైన గీత రచయిత జాలాది రాజారావు వర్థంతి ఈరోజు. దాదాపు 270 సినిమాల్లో ఆయన రాసిన 1500 పాటల్లో దేన్ని తీసుకుని విన్నా, అది ఏదో ఒక కొత్త ఆలోచనని మనసు మాగాణిలో విత్తనంలా నాటుతుంది.

(ప్రత్యేక వార్త కోసం క్లిక్‌ చేయండి...)

* ఉర్రూతలూగించిన స్టెప్పులు!
(నృత్య దర్శకుడు సలీం వర్థంతి-2011)


815 సినిమాల్లో 20 వేల పాటలు! ఏ పాటనైనా చూడండి... అందులో చిందులు వేసేది ఏ నటుడైనా సరే, చూసే ప్రేక్షకుడు మాత్రం ఉర్రూతలూగిపోతాడు. అదీ కొరియోగ్రాఫర్‌ సలీం ప్రతిభ. ఎన్టీఆర్, ఎన్నార్, ఎంజీఆర్, శివాజీగణేశన్, దిలీప్‌కుమార్, రజనీకాంత్, కమల్‌హాసన్, కృష్ణ, శోభన్‌బాబు, బాలకృష్ణ, చిరంజీవి... ఇలా వేర్వేరు భాషా సినిమాల్లో అగ్రహీరోలందరూ సలీం ఆడమన్నట్టల్లా ఆడినవారే. ఆయన చెప్పినట్టల్లా చిందులు వేసినవారే. మాస్‌ స్టెప్పులతో మ్యాజిక్‌ చేసిన సలీం నిరుపేద ముస్లిం కుటుంబం నుంచి వచ్చి సినిమా రంగంలో చెరగని ముద్ర వేశారు. కానీ ఓ షూటింగ్‌లో ప్రమాదవశాత్తూ ఎడమ చెయ్యిని కోల్పోయి, క్రమేణా అవకాశాలు, ఆస్తులతో పాటు ఆప్తుల్ని కూడా కోల్పోయి అనాథగా మిగిలారు.

(ప్రత్యేక వార్త కోసం క్లిక్‌ చేయండి...)

* వినోద రంగంలో వినూత్నంగా...


అతడు ‘తొలి మల్టీమీడియా స్టార్‌’గా ప్రాచుర్యం పొందాడు...

పదిహేనేళ్ల పాటు వరసగా అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల్లో నటుడిగా గుర్తింపు పొందాడు...

ఆస్కార్, ఎమ్మీలాంటి ఎన్నో ప్రతిష్ఠాత్మకమైన పురస్కారాలు అందుకున్నాడు...

అత్యధిక అమ్మకాలు సాధించిన పాటల గాయకుడిగా అలరించాడు...
అతడే బింగ్‌ క్రాస్బీ. అమెరికా గాయకుడిగా, కమేడియన్‌గా, నటుడిగా రేడియో, టీవీ, సినీ, సంగీత రంగాల్లో రాణించి వివిధ వినోద మాధ్యమాల్లో మేటి కళాకారుడిగా ప్రపంచ వ్యాపంగా ప్రాచుర్యం పొందాడు. ‘గోయింగ్‌ మై వే’ సినిమాలో ఉత్తమ నటుడిగా ఆస్కార్‌ అవార్డు అందుకున్నాడు. గాయకుడిగా గ్రామీ గ్లోబల్‌ ఎచీవ్‌మెంట్‌ అవార్డు సాధించాడు. హాలీవుడ్‌ వాక్‌ ఆఫ్‌ ఫేమ్‌లో త్రీస్టార్‌ గౌరవాన్ని పొందాడు. వాషింగ్టన్‌లో 1903 మే 3న ఏడుగురి సంతానంలో ఒకడుగా పుట్టిన క్రాస్బీ, చిన్నప్పటి నుంచే గాయకుడిగా, డ్యాన్సర్‌గా పేరు పొందాడు. ఆ పేరే అతడిని రేడియో, టీవీ, నాటకం, సినీ రంగాల్లోకి వేలు పట్టుకుని నడిపించింది. ‘రోడ్‌ పిక్చర్స్‌’గా ప్రపంచ వ్యాప్తంగా ఆకట్టుకున్న ‘రోడ్‌ టు సింగపూర్‌’, ‘రోడ్‌ టు మొరాకో’, ‘రోడ్‌ టు ఉటోపియా’... లాంటి ఏడు సినిమాల్లో కమేడియన్‌గా ఆకట్టుకున్నాడు. వీటితో పాటు ‘వెరైటీ గర్ల్‌’, ‘హై టైమ్‌’, ‘ద బెల్స్‌ ఆఫ్‌ సెయింట్‌ మేరీస్‌’, ‘వైట్‌ క్రిస్ట్‌మస్‌’లాంటి సినిమాల ద్వారా అంతర్జాతీయ గుర్తింపు పొందాడు. ఓ సర్వే ప్రకారం తన సినిమాల ద్వారా ఏకంగా 107 కోట్లకు పైగా సినిమా టిక్కెట్ల అమ్మకం సాధించిన అరుదైన నటుల్లో ఒకడిగా ప్రాచుర్యం పొందాడు. గాయకుడిగా 23 గోల్డ్‌ ప్లాటినమ్‌ రికార్డులు అందుకున్నాడు. అతడి పాటలతో రేడియోలు, టీవీలు, టేప్‌రికార్డర్లు మోతెక్కిపోయేవి. టీవీ రంగంలో కూడా అతడి ముద్ర చెప్పుకోదగ్గదే. ఇంకా గుర్రపు స్వారీ, క్రీడల్లో సైతం రాణించిన ఇతగాడు, 1977 అక్టోబర్‌ 14న స్పెయిన్‌లో తన 74వ ఏట మరణించాడు.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.