అక్టోబర్‌ 10.. (సినీ చరిత్రలో ఈరోజు)

* దర్శకధీరుడు
(ఎస్‌.ఎస్‌. రాజమౌళి పుట్టిన రోజు-1973)


తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచం నలుమూలలా చాటిన దర్శకధీరుడు... ఎస్‌.ఎస్‌.రాజమౌళి. తెలుగు సినిమా స్థాయిని పెంచి, ప్రపంచం మొత్తం మన చిత్ర పరిశ్రమ గురించే మాట్లాడుకొనేలా చేసిన ఘనత ఈయనది. అపజయం అన్నదే ఎరుగని దర్శకుడు రాజమౌళి. ‘స్టూడెంట్‌ నెంబర్‌ 1’ చిత్రంతో మెగాఫోన్‌ చేతపట్టిన ఆయన హిట్టు వదలని విక్రమార్కుడు అనిపించుకొన్నాడు. తాను విజయం అందుకోవడమే కాదు... ప్రతి చిత్రంతోనూ తెలుగు సినిమా స్థాయిని పెంచుతూ, అత్యున్నత సాంకేతికతతో కూడిన చిత్రాల్నీ మేమూ తీయగలమని చాటి చెప్పారు. ఒకొక్క చిత్రంతో ఒక్కో రకమైన కథని తెరపైన ఆవిష్కరిస్తూ ఇంటిల్లి పాదినీ మెప్పిస్తుంటారు రాజమౌళి. ‘సింహాద్రి’, ‘సై’, ‘ఛత్రపతి’, ‘విక్రమార్కుడు’, ‘యమదొంగ’, ‘మగధీర’, ‘మర్యాద రామన్న’, ‘ఈగ’, ‘బాహుబలి’ చిత్రాలతో తన సత్తా చాటారు. ఆయన తీసిన చిత్రాలన్నీ ఒకెత్తైతే... రెండు భాగాలుగా వచ్చిన ‘బాహుబలి’ చిత్రాలు మరో ఎత్తు. అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా ‘బాహుబలి: ది కన్‌క్లూజన్‌’ రికార్డులు సృష్టించింది. అగ్ర రచయిత విజయేంద్ర ప్రసాద్‌ తనయుడే ఎస్‌.ఎస్‌.రాజమౌళి. 1973 అక్టోబరు 10న రాయచూరులో జన్మించారు. శ్రీశైల శ్రీ రాజమౌళి అసలు పేరు. తెలుగు చిత్రసీమలో ఆయన్ని జక్కన్నగా పిలుచుకొంటుంటారు. తొలినాళ్లలో ప్రముఖ ఎడిటర్‌ కోటగిరి వెంకటేశ్వరరావు దగ్గర సహాయ ఎడిటర్‌గా పనిచేసిన రాజమౌళి, అనంతరం ఈటీవీలో ప్రసారమైన ‘శాంతినివాసం’ ధారావాహికని తెరకెక్కించారు. ‘స్టూడెంట్‌ నెంబర్‌ 1’తో దర్శకుడిగా పరిచయమైన తక్కువ సమయంలోనే స్టార్‌ మేకర్‌గా గుర్తింపు తెచ్చుకొన్నారు. భారత ప్రభుత్వం అందించే అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన ‘పద్మశ్రీ’ గౌరవాన్ని స్వీకరించిన రాజమౌళి ‘మగధీర’ చిత్రానికిగానూ ఉత్తమ దర్శకుడిగా నంది పురస్కారాన్ని అందుకొన్నారు. ఆయన తీసిన ‘ఈగ’ ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ పురస్కారానికి ఎంపికైంది. ‘బాహుబలి ది బిగినింగ్‌’ జాతీయ ఉత్తమ చిత్రంగా నిలిచింది. రాజమౌళికి భార్య రమాతో పాటు, పిల్లలు కార్తికేయ, మయూఖ ఉన్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్‌ చరణ్‌లతో ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈరోజు రాజమౌళి పుట్టినరోజు.

(ప్రత్యేక వార్త కోసం క్లిక్‌ చేయండి...)

* సరదాల సరసుడు!
(అలీ పుట్టిన రోజు-1968)


‘ఎంద చాట... కాట్రవల్లి’ అంటూ అలీ అర్థం కాని భాషతో సంభాషణలు చెప్పినా సరే ప్రేక్షకులు కడుపుబ్వా నవ్వుకొంటారు. ముఖ కవళికలతోనే నవ్వులు పండించగల అరుదైన నటుడు అలీ. ఆయన కనిపిస్తే చాలు... ప్రేక్షకుల మొహాల్లో నవ్వు ప్రత్యక్షమవుతుంది. 1100కి పైగా చిత్రాల్లో నటించి భాషతో సంబంధం లేకుండా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకొన్నారు అలీ. ఆయన తూర్పు గోదావరి జిల్లాలోని రాజమండ్రిలో మహమ్మద్‌ బాషా, జైతున్‌ బీబీ దంపతులకి 1970 అక్టోబరు 10న జన్మించారు. చదువుపై పెద్దగా ఆసక్తి లేని అలీకి సినిమాలంటే ప్రాణం. హిందీ చిత్రాలు, ఎన్టీఆర్‌... ఏఎన్నార్‌ల చిత్రాలు చూస్తూ పెరిగారు. చిన్నప్పుడే పలువురు నటుల శైలిని అనుకరించేవారట. ఆయన అభిరుచిని తెలుసుకొన్న తండ్రి తాను నడిపే టైలరింగ్‌ దుకాణం దగ్గరికి వచ్చే సంగీత కళాకారుడు శ్రీపాద జిత్‌ మోహన్‌ మిత్రాకు విషయం చెప్పారు. దాంతో ఆయన తాను నడిపే ఆర్కెస్టా్ర బృందంలోకి అలీని తీసుకొన్నారు. ఒకసారి రాజమండ్రి పరిసరాల్లో ‘ప్రెసిడెంట్‌ పేరమ్మ’ చిత్రీకరణ జరుగుతుంటే ఆ సినిమా బృందానికి వినోదం పంచడం కోసం శ్రీపాద జిత్‌ మోహన్‌ మిత్రా బృందం వెళ్లింది. అక్కడే అలీ చేసిన ప్రదర్శనని చూసిన ప్రముఖ దర్శకుడు కె.విశ్వనాథ్‌ అందులో బాలనటుడిగా నటించే అవకాశాన్నిచ్చారు. ఆ తరువాత ‘దేవుడు మావయ్య’, ‘ఘరానా దొంగ’, ‘సిరిమల్లె నవ్వింది’, ‘ముక్కోపి’ తదితర చిత్రాల్లో బాలనటుడిగా మెరిసి గుర్తింపు తెచ్చుకొన్నారు. అయితే ఆయన కెరీర్‌ ‘సీతాకోక చిలుక’ చిత్రంతో మలుపు తిరిగింది. భారతీరాజా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కథానాయకుడి స్నేహితుల బృందంలో ఒకడిగా నటించి పేరు తెచ్చుకొన్నారు అలీ. ఆ తరువాత వెనుదిరిగి చూడలేదు. ‘రాజేంద్రుడు గజేంద్రుడు’, ‘మాయలోడు’, తదితర చిత్రాల్లో హాస్య పాత్రలతో అదరగొట్టిన ‘యమలీల’, ‘ఘడోత్కచుడు’ తదితర చిత్రాలతో కథానాయకుడిగా కూడా విజయాలు అందుకొన్నారు. ఒక పక్క కథానాయకుడిగా నటిస్తూనే, మరో పక్క హాస్య పాత్రల్నీ వదిలి పెట్టకుండా ప్రేక్షకుల్ని నవ్వించాడు. తెలుగుతో పాటు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లోనూ అలీ నటించి పేరు తెచ్చుకొన్నారు. టెలివిజన్‌తోనూ అలీకి అనుబంధం ఉంది. ‘అలీ 369’, ‘అలీతో సరదాగా’, ‘అలీతో జాలీగా’ వంటి కార్యక్రమాలతో బుల్లితెర ప్రేక్షకులకి వినోదం పంచుతున్నాడు. అలీ తమ్ముడు ఖయ్యూమ్‌ కూడా నటుడే. అలీకి భార్య జుబేదాతో పాటు, ఇద్దరమ్మాయిలు, ఒక అబ్బాయి ఉన్నారు. అలీ తన తండ్రి మహమ్మద్‌ బాషా చారిటబుల్‌ ట్రస్ట్‌ పేరుతో ఓ స్వచ్ఛంద సంస్థని ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. ఆయనకి రాజకీయ రంగంతోనూ అనుబంధం ఉంది. తెలుగుదేశం పార్టీలో చురుగ్గా పనిచేసిన అలీ, తదుపరి ఎన్నికల్లో పవన్‌కల్యాణ్‌ స్థాపించిన ‘జనసేన’ నుంచి పోటీ చేసే అవకాశాలున్నాయి అనుకున్నారు. కానీ చివరకు ‘వైయస్సార్‌ కాంగ్రెస్‌’ పార్టీలో చేరి ఆ పార్టీ విజయానికి కృషి చేశారు. ఈ రోజు అలీ పుట్టినరోజు.

(ప్రత్యేక వార్త కోసం క్లిక్‌ చేయండి...)

* తరగని అందం... చెరగని అభినయం!
(రేఖ పుట్టినరోజు-1954)


అందాల పోటీకి సిద్ధమవుతున్న యువతరం ప్రతినిధిలా కనిపిస్తుందామె. కానీ వయసు చూస్తే 64. వయసుకు లొంగని అందంతో, అంతకు మించిన అభినయంతో ఆకట్టుకునే ఆ అభినేత్రి భానురేఖా గణేశన్‌. రేఖగా వెండితెరను వెలిగించిన ఆమె తెలుగు సినిమా ‘రంగుల రాట్నం’తో పరిచయమయ్యారు. హిందీ సినిమా ‘సావన్‌ బంధో’ (1970)తో హీరోయిన్‌ అయ్యారు. ఆ తరువాత ఆమె నటించిన 180 చిత్రాలూ ఆమె అందానికి, అభినయానికీ గీటురాళ్లే. ‘ఉమ్రావ్‌ జాన్‌’ (1981) ఆమెను జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా నిలబెట్టింది. ‘పద్మశ్రీ’ ఆమె వెండితెర సేవలకు గుర్తుగా నిలిచింది.

(ప్రత్యేక వార్త కోసం క్లిక్‌ చేయండి...)

* విలక్షణ హాస్యనటుడు!
(రఘుబాబు పుట్టిన రోజు-1960)


హాస్యనటులకి పెట్టింది పేరు తెలుగు చిత్రసీమ. నవ్వించేందుకు ఎంత మంది వచ్చినా మరొకరికి చోటు మిగిలే ఉంటుంది. అయితే తెలుగులో ఎంత మంది హాస్యనటులున్నా... వాళ్లందరికీ ఒకొక్కరికీ ఒక్కో ప్రత్యేకమైన శైలి ఉంది. తెలుగు హాస్యనటుల్లో రఘుబాబు శైలి ప్రత్యేకం. ఆయన గళం, ఆయన హావభావాల్ని మరొకరితో పోల్చలేం. అందుకే ఆయన విశిష్టమైన నటుడిగా పేరు తెచ్చుకొన్నారు. ప్రముఖ నటుడు గిరిబాబు తనయుడే రఘుబాబు. ప్రతినాయకుడిగా, హాస్య నటుడిగా, క్యారెక్టర్‌ నటుడిగా తెలుగు చిత్ర పరిశ్రమపై తనదైన ముద్ర వేశారు. ప్రకాశం జిల్లా, రావినూతల గ్రామంలో గిరిబాబుకి తొలి సంతానంగా రఘుబాబు 1960 అక్టోబరు 10న జన్మించారు. రఘుబాబుకి చిన్నప్పట్నుంచే నాటకాలపై మక్కువ. పదేళ్ల వయసులో ‘శ్రీకృష్ణ తులాభారం’ నాటకం వేసి అందులో వసంతకుడి పాత్ర చేశారు. ఒక్క యేడాదిలో ఆ నాటకాన్ని 22 సార్లు ప్రదర్శించి పేరు తెచ్చుకొన్నారు. గిరిబాబు నటుడిగా మద్రాసులో ఉన్నప్పటికీ రఘుబాబు మాత్రం తన తాతయ్య, నాన్నమ్మల దగ్గరే రావినూతలలో ఉండేవారు. ఆరో తరగతి తర్వాతే మద్రాసు వెళ్లారు. గిరిబాబు నటుడే అయినా తన పిల్లల్ని సినిమా వాతావరణానికి దూరంగా ఉంచేవారట. అయితే గిరిబాబు సొంతం సినిమా నిర్మిస్తుంటే తండ్రికి ఆర్థిక వ్యవహారాల్లో సాయంగా ఉండేందుకని రఘుబాబు సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. తొలినాళ్లలో ఎప్పటికీ ఓ మంచి నిర్మాతగా ఎదగాలనే కోరిక ఉండేదట. అయితే అనుకోకుండా ‘దొంగలున్నారు జాగ్రత్త’ చిత్రంతో రఘుబాబు కథానాయకుడిగా మారారు. అయితే ఆ సినిమా తరువాత పదేళ్ల వరకు మళ్లీ కెమెరా ముందుకు రాలేదు. ‘మురారి’ సమయంలో కృష్ణవంశీ దృష్టిలో పడిన రఘుబాబుకి ఓ విలక్షణమైన పాత్రని చేసే అవకాశం ఇచ్చారు. ఆ పాత్రతో రఘుబాబుకి మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ఆయన్ని వరుసగా వ్యతిరేక ఛాయలున్న పాత్రలు వరించాయి. ‘ఆది’ తర్వాత ఇక ఆయన వెనుదిరిగి చూసుకోలేదు. హాస్య పాత్రల్లోనూ, ప్రతినాయక పాత్రల్లోనూ, క్యారెక్టర్‌ నటుడిగానూ బిజీ అయిపోయారు. ‘టాటా బిర్లా మధ్యలో లైలా’, ‘నేనింతే’, ‘మీ శ్రేయోభిలాషి’, ‘గుడుంబా శంకర్‌’, ‘అదిరిందయ్యా చంద్రం’, ‘జగడం’, ‘కృష్ణ వందే జగద్గురుమ్‌’... ఇలా వందలాది చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకున్నారు రఘుబాబు. ఈయనకి టెలివిజన్‌తోనూ అనుబంధం ఉంది. ‘వసంత కోకిల’, ‘ముత్తైదువ’, ‘లేడీ డిటెక్టివ్‌’ ధారావాహికల్లో నటించి ఇంటింటికీ చేరువైన రఘుబాబు పుట్టినరోజు ఈ రోజు.


* తొలిసారి విరిసిన స్వర్ణకమలం!


జాతీయ చలన చిత్ర అవార్డుల చరిత్రలో తొలిసారిగా ఉత్తమ చిత్రంగా ‘స్వర్ణ కమలం’ అందుకున్న ఘనత ఓ మరాఠీ సినిమాకి దక్కింది. అదే ‘శ్యామ్‌చి ఆయి’. మరాఠీ రచయిత, సామాజిక ఉద్యమకారుడు పాండురంగ సదాశివ సానే గురూజీ రాసిన నవల ఆధారంగా రూపొందిన ఈ సినిమాకు పె.కె.ఆత్రే దర్శకత్వం వహించారు. శ్యామ్‌ అనే కుర్రవాడి కథగా ఈ సినిమా ఉంటుంది. అతడి జీవితంపై తల్లి ప్రభావం ఎలా పనిచేసిందనే అంశం చుట్టూ కథ నడుస్తుంది. పేదరికం లాంటి దుర్భర పరిస్థితుల్లో కూడా నమ్ముకున్న విలువల్ని విస్మరించకూడదని చాటి చెబుతుంది. తొలి జాతీయ చలన చిత్ర అవార్డుల కార్యక్రమం 1954 అక్టోబర్‌ 10న న్యూదిల్లీలో జరిగింది. ఈ కార్యక్రమానికి అప్పటి రాష్ట్రపతి డాక్టర్‌ రాజేంద్ర ప్రసాద్‌ హాజరై పురస్కారాలు అందించారు.

* జేమ్స్‌బాండ్‌... రెండోసారి!


ప్రపంచ గూఢచారి జేమ్స్‌బాండ్‌ రెండోసారి వెండితెరపై సందడి చేశాడు. 1962లో వచ్చిన ‘డాక్టర్‌ నో’ సినిమా మొదటి బాండ్‌ చిత్రమైతే, మరుసటి సంవత్సరమే విడుదలైన సినిమా ‘ఫ్రమ్‌ రష్యా విత్‌ లవ్‌’. మొదటి సినిమా దర్శకుడు టెరెన్స్‌ యంగ్‌ దీనికీ దర్శకత్వం వహించాడు. సీన్‌కానరీ బాండ్‌ పాత్రలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. 1963 అక్టోబర్‌ 10న విడుదలైన ఈ సినిమా రెండు మిలియన్‌ డాలర్ల బడ్జెట్‌కు 79 మిలియన్‌ డాలర్లు రాబట్టింది. ఈ సినిమాలోనే జేమ్స్‌బాండ్‌కి రకరకాల విచిత్ర వస్తువులను అందించే ‘క్యూ’ పాత్ర పరిచయమైంది. ఈ పాత్రలో డెస్‌మండ్‌ లెవ్‌లిన్‌ 1999లో వచ్చిన ‘ద వరల్డ్‌ ఈజ్‌ నాట్‌ ఇనఫ్‌’ సినిమా వరకు దాదాపు 36 ఏళ్లు నటించాడు.


* పిడుగు దేవుడి హంగామా!


సూపర్‌ హీరోల సినిమాలంటేనే చెప్పలేనంత హడావుడి. మాయలు, మానవాతీత శక్తులు, పోరాటాలు, వింత ఆకారాలు... వగైరాలన్నీ వెండితెరపై సందడి చేయాల్సిందే. అలాంటి మరో సినిమానే ‘థార్‌: రాగ్నరాక్‌’. అమెరికా సూపర్‌ హీరోలందరూ కామిక్‌ పుస్తకాల్లోంచి పుట్టుకొచ్చి, యానిమేషన్‌ సినిమాలుగా, టీవీ ధారావాహికల్లా అలరించి వెండితెరపైకి దూకి విజృంభించిన వాళ్లే. అలా ‘మార్వెల్‌’ కామిక్‌ పుస్తకాల్లో పుట్టిన వాడే థార్‌. గ్రీకు పురాణాల ప్రకారం పిడుగు దేవుడు. తుపానులు, పిడుగులు, మెరుపులు, సునామీలు అన్నీ అతడి మహిమలే. అలాంటి దేవుడు కాస్తా కామిక్‌ పుస్తకాల్లో సూపర్‌హీరో అయిపోయాడు. ఇతడి పాత్రతో వచ్చిన మూడు సినిమాల్లో ఇది మూడోది. మొదటి రెండూ 2011, 2013ల్లో వస్తే మూడోదిగా వచ్చిన ఇది 2017 అక్టోబర్‌ 10న విడుదలై ఆకట్టుకుంది. మూడు సినిమాలోకెల్లా అత్యధిక వసూళ్లు సాధించింది. అగ్గి రాక్షసుడైన సుర్తుర్, మృత్యు రాకాసి అయిన హెలాల నుంచి థార్‌ ఎలా అస్‌గార్డ్‌ రాజ్య ప్రజల్ని కాపాడాడనేదే కథ. విచిత్ర శక్తులుండే సూపర్‌ హీరోలు, సూపర్‌ విలన్లు వెండితెరపై తెగబడి పోరాడుతుంటే థియేటర్లలో కాసులు కురిసిపోయాయి. 180 మిలియన్‌ డాలర్లతో తీసిన ఈ సినిమా 854 మిలియన్‌ డాలర్లు ఆర్జించింది.

* క్లాసిక్‌ చిత్రాల దర్శకుడు!
(గురుదత్‌ వర్థంతి-1964)


అద్భుత చిత్రాల దర్శకుడు... సున్నిత భావోద్వేగాలను పండించే నటుడు... మంచి అభిరుచి గలిగిన చిత్రాలను నిర్మించిన నిర్మాత... ఈ ముగ్గురూ ఒకరిలో ఉంటే అది గురుదత్‌! అసలు పేరు వసంత్‌ కుమార్‌ శివశంకర్‌ పదుకొణే. గొప్ప భారతీయ క్లాసిక్‌ చిత్రాలుగా పేరు పొందిన ‘ప్యాసా’, ‘కాగజ్‌ ఏ ఫూల్‌’, ‘సాహిబ్‌ బీబీ ఔర్‌ గులామ్‌’, ‘చౌద్విన్‌కా చాంద్‌’ చిత్రాలను అందించిన మేధావిగా గురుదత్‌ పేరు చిరస్మరణీయం.

(ప్రత్యేక వార్త కోసం క్లిక్‌ చేయండి...)

* ముక్కోణపు ప్రేమ కథ


అందాల తార ఎలిజబెత్‌ టేలర్‌ ఉంటే ముక్కోణపు ప్రేమలేం ఖర్మ, అనేక కోణా‍ల్లో ప్రేమ కథ తీయవచ్చు. అయితే దర్శకడు జార్జి స్టీవెన్స్‌ మాత్రం ముక్కోణపు ప్రేమ కథతోనే సరిపెట్టాడు. అదే ‘జెయింట్‌’ (1956) సినిమా. ఆస్కార్‌ అవార్డు అందుకున్న ఈ సినిమాలో ఎలిజబెత్‌ టేలర్‌తో పాటు హాలీవుడ్‌ క్లాసిక్‌ హీరోగా పేరొందిన రాక్‌ హడ్సన్, కల్చరల్‌ ఐకాన్‌గా యువతరం ప్రతినిధిగా ప్రాచుర్యం పొందిన జేమ్స్‌ డీన్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. జేమ్స్‌డీన్‌ ఓ కారు ప్రమాదంలో అనూహ్యంగా మరణించిన తర్వాత ఈ సినిమా విడుదల కావడం విషాదం. ఇందులో నటనకి అతడు ఆస్కార్‌ నామినేషన్‌ పొందాడు. పులిట్జర్‌ బహుమతి గ్రహీత అయిన అమెరికా నవలా రచయిత్రి ఎడ్నా పెర్బర్‌ రాసిన నవల ఆధారంగా ఈ సినిమాను తీశారు. పది ఆస్కార్‌ నామినేషన్లు పొందిన ఈ సినిమాను 5.4 మిలియన్‌ డాలర్ల వ్యయంతో తీస్తే 39 మిలియన్‌ డాలర్లను వసూలు చేసింది. ఓ మంచి జాతి గుర్రాన్ని కొనడానికి తమ ప్రాంతానికి వచ్చిన సంపన్నుడితో ఎలిజబెత్‌ టేలర్‌ ప్రేమలో పడుతుంది. అతడిని పెళ్లి చేసుకుని టెక్సాస్‌ వెళ్లిపోయిన ఆమెను ఓ కార్మికుడు ఇష్టపడతాడు. అది గమనించి అతడిని తరిమేస్తాడు ఆ సంపన్నుడు. అయితే అనుకోకుండా ఆ కార్మికుడి పొలంలో చమురు పడడంతో అతడు అత్యంత ధనికుడిగా మారిపోతాడు. ఇలా అంతస్తుల ఆంతర్యాల మధ్య, ఒకే యువతిని ప్రేమించిన ఇద్దరి మగవారి మధ్య, అనుబంధాలు ప్రేమలు కోరికల నేపథ్యంలో కథ సాగుతుంది. అమెరికాలో ‘వందేళ్లు... వంద మేటి చిత్రాలు’ జాబితాలో ఈ సినిమా స్థానాన్ని సంపాదించుకుంది.

* అందాల నటి అరుదైన ప్రస్థానం- 80 ఏళ్ల సుదీర్ఘ సినీ ప్రస్థానం...

- ‘ఫస్ట్‌ లేడీ ఆఫ్‌ అమెరికన్‌ థియేæర్‌’ గుర్తింపు...
- ప్రతిష్ఠాత్మక అవార్డులు అన్నీ అందుకున్న అరుదైన నటి...
- అమెరికా అధ్యక్షుడి నుంచి అత్యున్నత పురస్కారం... ఇన్ని ఘనతల నటి హెలెన్‌ హేయస్‌. అందంతో, అభినయంతో అంతర్జాతీయ గుర్తింపు పొంది ఎనిమిది దశాబ్దాల పాటు నటనా ప్రస్థానం సాగించిన నటి. హాలీవుడ్‌లో ప్రతిష్ఠాత్మక అవార్డులుగా ఎమ్మీ, గ్రామీ, ఆస్కార్, టోనీ అవార్డులను పేర్కొంటారు. సినీ చరిత్రలో ఈ నాలుగింటినీ అందుకున్న వారు కేవలం 15 మంది మాత్రమే ఉంటే వారిలో హెలెన్‌ హేయస్‌ ఒకరు. ఆమె పేరిట ఏటా ఔత్సాహికులకు అవార్డులను ఇప్పటికీ ఇస్తుండడం విశేషం. న్యూయార్క్‌లో ఓ ప్రాంతానికి ఆమె గౌరవార్థం ఆమె పేరును పెట్టారు.. నటనా రంగంలో 20వ శతాబ్దంలోనే ఓ గొప్ప కళాకారిణగా ఆమెకు గుర్తింపు ఉంది. అక్టోబర్‌ 10, 1900న వాషింగ్టన్, డీసీలో జన్మించిన హెలెన్, ఐదేళ్ల వయసులోనే గాయనిగా వేదికెక్కడం విశేషం. తొమ్మిది సంవత్సరాల వయసులోనే ‘జీన్‌ అండ్‌ ది కాలికో డాల్‌’ చిత్రంతో సినీ రంగప్రవేశం చేసింది. పెద్దయ్యాక ‘ద సిన్‌ ఆఫ్‌ మెడెలన్‌ క్లాడెట్‌’ సినిమాకి ఉత్తమ నటిగా ఆస్కార్‌ అందుకుంది. ‘యారోస్మిత్‌’, ‘ఎ ఫేర్‌వెల్‌ టు ఆర్మ్స్‌’, ‘ద వైట్‌ సిస్టర్‌’, ‘ఎనదర్‌ లాంగ్వేజ్‌’, ‘వాట్‌ ఎవ్రీ ఉమన్‌ నోస్‌’, ‘వెనెస్సా: హెర్‌ లవ్‌ స్టోరీ’, ‘మై సన్‌ జాన్‌’, ‘అనాటాసియా’, ‘సీజర్‌ అండ్‌ క్లియోపాత్రా’ లాంటి సినిమాలతో అంతర్జాతీయ గుర్తింపు పొందింది. వేర్వేరు సంస్థలకు విరాళాలు ఇవ్వడం ద్వారా సామాజిక సేవలో కూడా పాల్గొంది. మూకీ చిత్రాల నుంచి టాకీ చిత్రాల దాకా తన ప్రస్థానాన్ని కొనసాగించిన హెలెస్‌ హేయస్‌ తన 92వ యేట 1993 మార్చి 17న 1993 న్యూయార్క్‌లో కన్నుమూసింది.
..............................................................................................................................................................................

* గుండు వేషం గొప్ప అభినయం


ప్రపంచవ్యాప్తంగా గొప్ప నటుడిగా పేరు ప్రఖ్యాతులు పొందిన ‘యుల్‌ బ్రైనర్‌’ తెలుసా? - అని అడిగితే... ఎవరూ చెప్పలేరు! అదే... ప్రపంచ సినీ చరిత్రలోనే అత్యుత్తమ చిత్రాల్లో ఒకటైన ‘టెన్‌ కమాండ్‌మెంట్స్‌’లో ఈజిప్టు చక్రవర్తి పరోవా రామెసెస్‌2 పాత్రధారుడు... అని చెబితే మాత్రం వెంటనే గుర్తుపట్టేస్తారు. ఆస్కార్, టోనీ లాంటి ప్రతిష్ఠాత్మక అవార్డులు అందుకున్న ఇతడి ‘గుండు వేషం’ కూడా ఎంతో ప్రాచుర్యం పొందింది. అప్పట్లో ఇతడి అభిమానులు చాలా మంది ఇతడిలాగే గుండు కొట్టించుకోవడం విశేషం. ఈ ఫ్యాషన్‌ ‘యుల్‌ బ్రైనర్‌ లుక్‌’గా పేరొందడం చిత్రం. రష్యాలో ఓ మారుమూల ప్రాంతంలో జులై 11, 1920న రష్యాలో పుట్టిన బ్రైనర్‌ను విధి చైనాకి, ప్యారిస్‌కి, న్యూయార్క్‌కి తిప్పి హాలీవుడ్‌లో మేటి నటుడిగా మార్చింది. నాన్న మరొకరిని పెళ్లిచేసుకుని కుటుంబాన్ని వదిలేస్తే, అమ్మతోపాటు చైనా వచ్చేసి, రెండో ప్రపంచ యుద్ధ భయంవల్ల ప్యారిస్‌కి మారిన బాల్యం ఇతడిది. ప్యారిస్‌ క్లబ్బుల్లో గిటార్‌ వాయించినా, ఫ్రెంచి సర్కస్‌లో ఐదేళ్లు పనిచేసినా అదంతా పొట్ట కూటికోసమే. ఆ సమయంలోనే లుకేమియా బారిన పడిన ఇతడిని తీసుకుని అమ్మ న్యూయార్క్‌ వలస వచ్చింది. విలక్షణ కంఠస్వరం ఉన్న బ్రైనర్‌ రేడియో ఎనౌన్సర్‌గా, నాటకాల్లో వేషధారుడిగా పనిచేశాడు. టీవీ కార్యక్రమాలకు దర్శకుడిగా కూడా మారాడు. అప్పుడే అతడికి ‘ద కింగ్‌ అండ్‌ ఐ’ అనే నాటకంలో కింగ్‌ మోంగ్‌కట్‌ వేషం వచ్చింది. ఆ పాత్ర కోసమే అతడు తొలిసారి ‘గుండు’ కొట్టించుకున్నాడు. ఆ నాటకం విజయవంతం కావడంతో అదే పాత్రను వేదికలపై ఏకంగా 4,625 సార్లు ప్రదర్శించడం విశేషం. ‘గుండు’ నచ్చడంతో నిజ జీవితంలో కూడా అలాగే ఉండిపోయిన బ్రైనర్, అదే కింగ్‌ పాత్రతో 1956లో వెండితెర నటుడిగా మారాడు. ఆ సినిమాకి ఆస్కార్‌ అవార్డు అందుకున్నాడు. వెంటనే ‘టెన్‌ కమాండ్‌మెంట్స్‌’ సినిమాలో ఈజిప్టు చక్రవర్తి పాత్ర లభించింది. దీంతో అతడి ఖ్యాతి ప్రపంచమంతా పాకింది. ఆపై ఇతడు ‘ద మ్యాగ్నిఫియంట్‌ సెవెన్‌’, ‘రిటర్న్ ఆఫ్‌ ద సెవెన్‌’, ‘వెస్ట్‌ వరల్డ్‌’, ‘అనస్టాషియా’, ‘ద జర్నీ’, ‘ఫ్యూచర్‌ వరల్డ్‌’, లాంటి చిత్రాలతో అంతర్జాతీయ గుర్తింపు అందుకున్నాడు. నటుడిగా, దర్శకుడిగానే కాక ఫొటోగ్రఫీలో కూడా కృషి చేసి రెండు పుస్తకాలు కూడా రచించాడు. విలక్షణ నటుడిగా ప్రపంచ సినీ ప్రేక్షకుల అభిమానాన్ని పొందిన యుల్‌ బ్రైనర్‌ 1985 అక్టోబర్‌ 10న తన 65 ఏళ్ల వయసులో ఊపిరితిత్తుల వ్యాధితో న్యూయార్కులో కన్నుమూశాడు.
...........................................................................................................................................................................

కవితాత్మక నటుడు...సహజ నటన, అద్భుత నటన, అద్వితీయ నటన, విలక్షణ నటన... ఇలా రకరకాలుగా పేర్లు చెబుతుంటారు. కానీ కవితాత్మకంగా నటిస్తాడనే పేరు పొందిన వాడు రాల్ఫ్‌ రిచర్డ్‌సన్‌. ఇతడిని ‘మ్యాజికల్‌ యాక్టర్‌’ అని కూడా అంటారు. నాటకాల్లో అదరగొట్టి, వెండితెరపైకి వచ్చి భిన్నమైన రీతిలో అభినయాన్ని చూపించిన వాడుగా ఇతడు హాలీవుడ్‌లో చరిత్ర సృష్టించాడు. ఇంగ్లండ్‌లో 1902 డిసెంబర్‌ 19న పుట్టిన రిచర్డ్‌సన్‌ను తల్లి క్రైస్తవ మత గురువుగా మారుద్దామనుకుంటే అతడు ఆ శిక్షణ నుంచి పారిపోయాడు. ఆపై చిత్రలేఖనం స్కూల్లో చేర్పిస్తే అక్కడా ఇమడలేకపోయాడు. ఏవేవో ఉద్యోగాలు చేస్తూ చివరికి నాటక రంగంవైపు దృష్టి మరల్చాడు. అలా ఇరవయ్యో శతాబ్దంలో నాటక రంగంలో మంచి నటుడిగా దశాబ్దాల పాటు ప్రాచర్యం పొందాడు. సినిమాల్లో మొదట ఎక్స్‌ట్రా వేషాలు వేసినా క్రమేణా మంచి పాత్రల్లో రాణించాడు. ‘థింగ్స్‌ టు కమ్‌’, ‘ద ఫాలెన్‌ ఐడల్‌’, ‘లాంగ్‌ డేస్‌ జర్నీ ఇంటూ నైట్‌’, ‘డాక్టర్‌ జివాగో’, ‘ద హైరెస్‌’, ‘గ్రేస్టోక్‌: ద లెజెండ్‌ ఆఫ్‌ టార్జాన్‌’, ‘లార్డ్‌ ఆఫ్‌ ద ఏప్స్‌’, ‘ద సౌండ్‌ బారియర్‌’లాంటి సినిమాలతో అంతర్జాతీయ గుర్తింపు పొందాడు. ఎన్నో అవార్డులు అందుకున్నాడు. కొన్ని పాత్రలకు ఇతడు మాత్రమే సరిపోతాడనేంత పేరు తెచ్చుకున్న రిచర్డ్‌సన్‌ 1983 అక్టోబర్‌ 10న మరణించాడు.
...........................................................................................................................................................................

* వినోద మాధ్యమాల్లో విలక్షణంగా...రేడియో, నాటకం, టీవీ, సినిమా, సాహిత్యం... ఇలా వివిధ వినోద మాధ్యమాల్లో రాణించిన వాడిగా ఆర్సన్‌ వెల్స్‌ గురించి చెప్పుకోవాలి. నటుడిగా, దర్శకుడిగా, రచయితగా, నిర్మాతగా గుర్తుండిపోయే ముద్ర వేశాడు. గొప్ప దర్శకుల్లో ఒకడుగా ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందాడు. దర్శకుడిగా అతడి తొలి సినిమా ‘సిటిజన్‌ కానే’ సినీ చరిత్రలోనే మేటి చిత్రంగా పేరొందింది. ఈ సినిమా కథకుడు, నిర్మాత, నటుడు, దర్శకుడు కూడా ఇతడే కావడం మరో విశేషం. ‘ద మ్యాగ్నిఫిసెంట్‌ అంబర్‌సన్స్‌’, ‘ద లేడీ ఫ్రమ్‌ షాంగాయ్‌’, ‘టచ్‌ ఆఫ్‌ ఈవిల్‌’, ‘ద ట్రయల్‌’, ‘కైమ్స్‌ ఎట్‌ మిడ్‌నైట్‌’, ‘ఎఫ్‌ ఫర్‌ ఫేక్‌’, ‘ద అదర్‌సైడ్‌ ఆఫ్‌ ద విండ్‌’ లాంటి సినిమాలు అతడికి అంతర్జాతీయ గుర్తింపును తెచ్చిపెట్టాయి. అమెరికాలో 1915 మే 6న పుట్టిన జార్జి ఆర్సన్‌ వెల్స్, తండ్రి తాగుడు వ్యసనం వల్ల ఆర్ధిక ఇబ్బందుల మధ్య పెరిగాడు. తల్లి పియానో నేర్పుతో కుటుంబాన్ని అరకొర ఆదాయం మధ్య నెట్టుకొచ్చేది. తొమ్మిదేళ్ల వయసులో తల్లి, పదిహేనేళ్ల వయసులో తండ్రి చనిపోవడంతో సంగీత, నాటక రంగాల కేసి దృష్టి సారించాడు. చిన్న చిన్న పాత్రలతో నటనపై పట్టు సాధించాడు. అలా నాటకం, రేడియో, టీవీల ద్వారా అంచెలంచెలుగా ఎదిగాడు. క్రమేణా సినిమా రంగంలో ప్రవేశించి విలక్షణంగా ముద్ర వేశాడు. ప్రతిష్ఠాత్మకమైన అనేక అవార్డులను అందుకున్న ఇతడు, కాలిఫోర్నియాలో 1985 అక్టోబర్‌ 10న తన 70వ ఏట మరణించాడు.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.