అక్టోబర్‌ 18...(సినీ చరిత్రలో ఈరోజు)

* చంద్రముఖి
 జ్యోతిక (పుట్టినరోజు-1977)


జ్యోతిక అంటే కథానాయకుడు సూర్య భార్యగానే ఇప్పుడు గుర్తుకొస్తారు కానీ... అంతకంటే ముందు ఈమె తెలుగు ప్రేక్షకులకు కథానాయికగా పరిచయం. చిరంజీవితో కలిసి ‘ఠాగూర్‌’, నాగార్జునతో కలిసి ‘మాస్‌’ చిత్రాల్లో నటించి విజయాల్ని సొంతం చేసుకొన్నారు. ‘చంద్రముఖి’తో ఈమె తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. ‘ఠాగూర్‌’, ‘మాస్‌’, ‘షాక్‌’ చిత్రాల తర్వాత జ్యోతికకి తెలుగులో అవకాశాలు వెల్లువెత్తాయి. కానీ సూర్యతో వివాహానికి ముహూర్తం దగ్గర పడటంతో ఆ చిత్రాలకి నో చెప్పాల్సి వచ్చింది. లేదంటే నాగార్జున ‘శ్రీరామదాసు’లోనూ, వెంకటేష్‌ ‘లక్ష్మి’లోనూ, ‘ఆడవారి మాటలకి అర్థాలే వేరులే’ చిత్రాల్లోనే జ్యోతికనే కనిపించి అలరించేవారు. తెలుగుతో పాటు, కన్నడ, మలయాళం, హిందీ చిత్రాల్లోనూ నటించి పేరు తెచ్చుకొన్నారు జ్యోతిక. ప్రియదర్శన్‌ దర్శకత్వం వహించిన హిందీ చిత్రం ‘డోలి సజా కే రఖ్‌నా’తో తెర ప్రవేశం చేసింది జ్యోతిక. ఆ తర్వాత తమిళంలో ‘వాలి’లో నటించింది. అప్పట్నుంచి వరుసగా తమిళంలోనే సినిమాలు చేస్తూ బిజీ అయిపోయింది. సూర్య సరసన ఏడు చిత్రాల్లో నటించిన జ్యోతిక ఆయనతో ప్రేమలో పడింది. ఆ తర్వాత ఇద్దరూ పెళ్లి చేసుకొన్నారు. ప్రస్తుతం ఈ జంటకి పాప దియాతో పాటు, అబ్బాయి దేవ్‌ ఉన్నారు. జ్యోతిక అసలు పేరు జ్యోతిక సదానా. 1977 అక్టోబరు 18న జన్మించారు. సైకాలజీలో డిగ్రీ చేసిన జ్యోతిక సినిమా రంగ ప్రవేశం చేశారు. ప్రముఖ కథానాయికలు నగ్మా ఈమెకి అక్క కాగా, రోషిణి చెల్లెలు. ప్రియదర్శన్‌ దగ్గర సహాయ దర్శకుడిగా పనిచేస్తున్న సూరజ్‌ ఈమెకి సోదరుడు. సూర్యతో వివాహం తర్వాత కొన్నాళ్లు తెరకు దూరమైన జ్యోతిక ఇటీవలే మళ్లీ రెండో ఇన్నింగ్స్‌ని ప్రారంభించారు. ‘36 వయదినిలే’, ‘మగలిర్‌ మట్టుమ్‌’, ‘నాచియార్‌’ తదితర చిత్రాల్లో కథానాయిక ప్రాధాన్యమున్న పాత్రలు చేశారు. ‘నాచియార్‌’ తెలుగులో ‘ఝాన్సీ’ పేరుతో విడుదలై అలరిచింది. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘నవాబ్‌’లోనూ కీలక పాత్ర పోషించారు జ్యోతిక. ఈ సంవత్సరం ‘రాచ్చసి’, ‘జాక్‌పాట్‌’ చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం తమిళంలో పేరు పెట్టని రెండు చిత్రాల్లో నటిస్తుంది. ఈరోజు జ్యోతిక పుట్టినరోజు.

(ప్రత్యేక వార్త కోసం క్లిక్‌ చేయండి...)

* విలక్షణకు పెట్టింది పేరు!
 ఓంపురి (జయంతి- 1950)


సినిమా చూస్తున్నప్పుడు పాత్ర మాత్రమే కనిపించి నటుడు గుర్తుకు రాకపోవడమనేది, గొప్ప నటనకు గీటురాయి అనుకుంటే ఓంపురి నటించిన ఏ సినిమా చూసినా దాన్ని ఒప్పుకోవలసిందే. అది సమాంతర సినిమా కావచ్చు, వాణిజ్య చిత్రం కావచ్చు, టీవీ ధారావాహిక కావచ్చు, రంగస్థల నాటకం కావచ్చు ఏ వేదిక మీద ఓంపురి నటించినా ఆ పాత్రకో విలక్షణత చేకూరుతుంది. ఓ సహజత్వం అబ్బుతుంది. ఓ వాస్తవికత కళ్ల ముందు కనిపిస్తుంది. ‘ఆక్రోష్‌’, ‘ఆరోహణ్‌’, ‘అర్థ్‌సత్య’, ‘తమస్‌’, ‘సద్గతి’లాంటి సినిమాలు ఆయన అద్వితీయ నటనకు కొన్ని గీటురాళ్లు. వినోదాన్ని పండించడంలోనూ ఆయన వెనుకంజ వేయడని ‘జానేభీదో యారో’, ‘చాచీ 420’లాంటి సినిమాలు నిరూపిస్తాయి. భారతీయ సినిమాల్లోనే కాక అమెరికా, బ్రిటన్, పాకిస్థాన్‌ చిత్రాల్లో కూడా కనిపించిన ఓంపురి 1950 అక్టోబర్‌ 18న పంజాబ్‌లో పుట్టారు. భారత ప్రభుత్వం ఆయనను ‘పద్మశ్రీ’తో సత్కరిస్తే, బ్రిటిష్‌ ప్రభుత్వం ‘ఆర్డర్‌ ఆఫ్‌ ద బ్రిటిష్‌ ఎంపైర్‌’ పురస్కారంతో గౌరవించింది. తండ్రి ఏదో నేరం మీద జైలుకెళితే వీధి పాలైన కుటుంబంలో ఓంపురి బాల్యం దుర్భరంగా గడిచింది. సంపాదన కోసం టీ దుకాణంలో పనిచేసినా, రైల్వే ట్రాక్‌ నుంచి బొగ్గులు ఏరుకొచ్చినా, దాబాలో పని వెతుక్కున్నా... చదువును మాత్రం మానలేదు ఓంపురి. ప్రాథమిక విద్య తరువాత థియేటర్‌ ఆర్ట్‌ స్కూల్లో నటన దిద్దుకున్నాడు. తొలిసారిగా ఓ పిల్లల సినిమా ‘చోర్‌ చోర్‌ చుప్‌జా’ సినిమాలో కనిపించాడు. ఆపై వెండితెరపై గొప్ప నటుడిగా ఎదిగాడు. ఈ విలక్షణ భారతీయ నటుడు 2017 జనవరి 6న తన 66వ ఏట ముంబైలో మరణించాడు.

(ప్రత్యేక వార్త కోసం క్లిక్‌ చేయండి...)

* యాక్షన్‌ చిత్రాల వీరుడు!


జీన్‌ క్లాడ్‌ కేమిల్లే ఫ్రాంకోయిస్‌ వాన్‌ వరేన్‌బెర్గ్‌’ అంటే తెలియడం కష్టమే. కానీ ‘వాన్‌ డమ్మీ’ అంటే వెంటనే హాలీవుడ్‌ యాక్షన్‌ చిత్రాలెన్నో గుర్తొచ్చేస్తాయి. ఇతడి పేరు సంక్షిప్త పదాలైన ‘జేసీవీడీ’గా కూడా ఇతడిని పిలుస్తుంటారు. బెల్జియం నటుడు. మార్షల్‌ ఆర్ట్‌ విద్యల్లో ఆరితేరాడు. స్కీన్ర్‌ప్లే రచయితగా, నిర్మాతగా, దర్శకుడిగా కూడా పేరు పొందాడు. ‘బ్లడ్‌స్పాట్‌’ (1988), ‘కిక్‌ బాక్సర్‌’ సినిమాలు ఏడు (1989-2018), ‘లయన్‌ హార్ట్‌’ (1990), ‘డబుల్‌ ఇంపాక్ట్‌’ (1991), ‘యూనివర్శల్‌ సోల్జర్‌’ సినిమాలు ఆరు (1992-2012), ‘హార్డ్‌ టార్గెట్‌’ (1993), ‘స్ట్రీట్‌ ఫైటర్‌’ (1994), ‘టైమ్‌ కాప్‌’ (1994), ‘సడన్‌ డెత్‌’ (1995), ‘జేసీవీడీ’ (2008), ‘ద ఎక్స్‌పెండబుల్స్‌2’, ‘సిక్స్‌ బుల్లెట్స్‌’(2012)లాంటి విజయవంతమైన చిత్రాలెన్నో వాన్‌డమ్మీకి యాక్షన్‌ హీరోగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చాయి. పదేళ్లకే కరాటే స్కూల్లో చేరిన వాన్‌డమ్మీ, పదహారేళ్లకల్లా బాడీబిల్డర్‌గా కండలు తిరిగిన శరీరాన్ని పెంచుకున్నాడు. అంతటితో ఆగకుండా టైక్వాండో, థాయ్‌ బాక్సింగ్‌ కూడా నేర్చుకున్నాడు. మార్షల్‌ ఆర్ట్‌ పోటీల్లో పాల్గొన్నాడంటే, ప్రత్యర్థిని కొట్టాల్సిందే, పతకం పట్టాల్సిందే. తొలిసారిగా ‘ఉమన్‌ బిట్వీన్‌ వోల్ఫ్‌ అండ్‌ డాగ్‌’ సినిమాలో చిన్న పాత్రలో కనిపించాడు. ‘నో రిట్రీట్‌ నో సరెండర్‌’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘బ్లడ్‌స్పాట్‌’ సినిమాతో అంతర్జాతీయ స్టార్‌గా ఎదిగాడు. వ్యక్తిగత జీవితానికి వస్తే ఇతను మొదట మారియా రోడ్‌గ్జ్రి అనే మహిళను 1980లో పెళ్లి చేసుకున్నాడు. తరువాత 1984లో విడిపోయారు. నటి, బాడీ బిల్డర్‌ అయిన గ్లాడీస్‌ పోర్చ్‌గీస్‌ని 1987న రెండవ వివాహం చేసుకొని 1992న విడాకులు తీసుకున్నారు. ముచ్చటగా ముడోసారి నటి, మోడల్‌ అయిన డ్రాసీ లాఫియర్‌ని 1994లో పెళ్లి చేసుకొని 1997లో విడాకులు తీసుకున్నారు. డమ్మీకి మొత్తం ముగ్గురు సంతానం. ఈ సంవత్సరంలో విడుదలైన ‘వుయ్‌ డై యంగ్‌’ అనే చిత్రంలో మత్తు మందు మాఫియాతో పోరాడే వ్యక్తి పాత్రలో కనిపించి మెప్పించారు. ఇవాళ వాన్‌ డమ్మీ పుట్టినరోజు.

* స్పీల్‌బర్గ్‌కి నచ్చిన చిత్రం


దర్శకుడు స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌ సినిమాల కోసం ప్రపంచమంతా ఎదురుచూస్తుంటుంది. అంత ప్రాచుర్యం పొందిన ఆ దర్శకుడికి ఓ చిత్రం బాగా నచ్చేసింది. దాంతో ఆయన దాన్ని రీమేక్‌ చేస్తున్నాడు. ఆ చిత్రమే ‘వెస్ట్‌ సైడ్‌ స్టోరీ’ (1961). ఈ సినిమా కూడా మామూలుదేం కాదు. పదకొండు ఆస్కార్‌ నామినేషన్లు పొంది, పది ఆస్కార్‌ అవార్డులను అందుకుంది. ఇదో మ్యూజికల్‌ చిత్రం. అంటే... అందులోనే పాటలు ఉంటాయని అర్థం. మనకంటే పాటలు లేని సినిమాలు ఉండవు కానీ, హాలీవుడ్‌లో పాటలతో కూడిన సినిమాలను మ్యూజికల్‌ ఫిల్మ్స్‌ అని ప్రత్యేకంగా చెబుతారు. పాటలకు ఎక్కువ ఆస్కార్లు అందుకున్న చిత్రం కూడా ఇదే కావడం విశేషం. ఆస్కార్‌ గ్రహీత, ప్రపంచ వ్యాప్తంగా ఆకట్టుకున్న ‘సౌండ్‌ ఆఫ్‌ మ్యూజిక్‌’ చిత్ర దర్శకుడు రాబర్ట్‌ వైజ్, మరో దర్శకుడు జెరోమ్‌ రాబిన్స్‌ కలిసి దీన్ని రూపొందించారు. యువనటీనటులతో కేవలం 6 మిలియన్‌ డాలర్లతో తీసిన ఈ సినిమా, 44.1 మిలియన్‌ డాలర్లను వసూలు చేసింది.

ఓ నగరంలో జెట్స్‌ అనీ, షార్క్స్‌ అనీ రెండు గ్యాంగ్స్‌ ఉంటాయి. వాటి మధ్య ఆధిపత్య పోరాటం తరచు జరుగుతుంటుంది. అలాంటి ఓ పోరులో రెండు గ్యాంగుల సభ్యులూ ఓ డ్యాన్స్‌ పోటీలో తలపడాలని సవాలు విసురుకుంటాయి. ఓ గ్యాంగ్‌ నుంచి ఓ అందగాడు, రెండో గ్యాంగ్‌ నుంచి ఓ అందాల భామ డ్యాన్స్‌ పోటీలకు సిద్ధమవుతారు. తర్వాత చెప్పేదేముందీ, ఇద్దరూ ప్రేమలో పడతారు. గ్యాంగ్‌ లీడర్లను అనుమానం రాకుండా రహస్యంగా కలుసుకుని మాట్లాడుకుంటూ ఉంటారు. ప్రేమ ముదిరే సరికి ఇద్దరూ కలిసి ఈ ముఠాపోరాటాలకు దూరంగా పారిపోదామనుకుంటారు. కానీ ఆ సంగతి తెలిసి రెండు ముఠాలు వెంటపడతాయి. చివరికేం జరిగిందనేదే కథ. యువతీ యువకుల పోరాటాలు, డ్యాన్స్‌లు, పాటలు నేపథ్యంలో తీసిన ఈ సినిమా సహజంగానే యూత్‌కి పట్టేసింది. దాంతో వసూళ్లతో పాటు అనేక పురస్కారాలు అందుకుంది. ‘వందేళ్లు... వంద సినిమాలు’ జాబితాలో స్థానం సంపాదించింది.

* సినిమాల్లో ఎవరెస్ట్‌!


ఆ చిత్రం... -‘సినిమాల్లోనే ఎవరెస్ట్‌’ అనే గుర్తింపు పొందింది!
-‘మరణించేలోగా చూసి చూడాల్సిన సినిమాల్లో ఒకటి’గా ప్రశంసలు అందుకుంది!
-‘ప్రపంచాన్ని కుదిపేసిన మేటి సినిమాలు’ జాబితాలో స్థానం సాధించింది!
-అనేక అవార్డులు, పురస్కారాలు అందుకుంది!
-ప్రపంచ పత్రికలన్నీ దాన్ని సినీ చరిత్రలోనే మేటి చిత్రంగా అభివర్ణించాయి!

ఆ సినిమా స్వీడన్‌ భాషలో వచ్చిన ‘పెర్సోనా’ (1966). దాన్ని చూసిన కొందరు దాన్నొక ప్రయోగాత్మక సినిమా అన్నారు... కొందరు బూతు చిత్రం అన్నారు... మరి కొందరు మనోవిశ్లేషణాత్మ చిత్రం అన్నారు... కొందరైతే భయంకరమైనదన్నారు... ఎవరేమన్నా దాన్ని మాత్రం ఓ గొప్ప చిత్రంగా అంగీకరించారు. ఆ సినిమా మాతృత్వాన్ని, లైంగిక స్వేచ్ఛని, స్వలింగ సంపర్కాన్ని, గర్భస్రావ సమస్యని, మానసిక భావజాలాన్ని... ఇంకా అనేక అంశాలను స్పృశించిందన్నారు. ఓ ప్రముఖ సినీ విశ్లేషకుడైతే... ‘ఆ సినిమా గురించి ఎవరేం చెప్పినా, అది వివాదాస్పదమే అవుతుంది. ఎందుకంటే ఎవరి అభిప్రాయానికైనా వ్యతిరేకమైనది కూడా ఆ సినిమాలోనే ఉంటుంది’ అన్నాడు!

ఇలా ఇన్ని రకాల అభిప్రాయాలకి, చర్చలకి, ప్రశంసలకి, విమర్శలకి, సమీక్షలకి మూలమైన ఈ సినిమాను స్వీడన్‌ దర్శకుడు ఇంగ్‌మర్‌ బెర్గ్‌మన్‌ తీశాడు. ప్రధానంగా రెండే మహిళా పాత్రలు. ఒకరు రోగి. మరొకరు నర్స్‌. రోగి పేరు మోసిన నాటక రంగ నటి. కానీ ఎందుకనో మాట్లాడ్డం మానేసింది. ఆమెకు వైద్యం చేసే డాక్టర్, ఆమెకొక నర్స్‌ను కేటాయించి ప్రకృతి ఒడిలోని ఓ ప్రశాంత కేంద్రానికి పంపిస్తాడు. నర్స్‌ ఒట్టి వాగుడుకాయ. ఇప్పటి వరకు ఆమె మాట్లాడింది విన్నవారే లేరు. ఇప్పుడు ఆమెకో నేస్తం దొరికింది. ఆమెతో పదే పదే మాట్లాడుతూ ఆమెను కూడా మాట్లాడేలా చేయడమే ఆ నర్స్‌ బాధ్యత. ఇక తన చిన్నప్పటి విషయాలతో మొదలు పెట్టి, తన వ్యక్తిగత స్నేహాలు, అనుబంధాలు, తన శృంగార అనుభవాలు... ఇలా అన్నీ ఏకరువు పెడుతూ ఉంటుంది. నెమ్మదిగా ఆ ఇద్దరి మహిళల మధ్య అనుబంధం ఏర్పడుతుంది. తర్వాత ఆ రోగి భర్త వస్తాడు. అతడు నర్స్‌ను చూసి ఇష్టపడతాడు. ఇద్దరూ సన్నిహితులవుతారు కూడా. ఈ నేపథ్యంలో చివరకి ఏం జరిగింది? రోగి మాట్లాడిందా? ఆమె అసలెందుకు మాట్లాడ్డం మానేసింది? ఇలాంటి ప్రశ్నలకు సమాధానమే సినిమా. కథ సంగతి అలా ఉంచితే ఈ సినిమా టేకింగ్, ఎడిటింగ్, సౌండ్స్, కెమేరా యాంగిల్స్‌... ఇలా అనేక అంశాల్లో కూడా ప్రయోగాత్మకమైనదనే పేరు పొందింది. ఇది అనేక అవార్డులను అందుకుంది. కొసమెరుపేమంటే... ఇందులో రోగి, నర్స్‌లుగా నటించిన ఇద్దరు నటీమణులు కూడా సినిమా చిత్రీకరణ పూర్తయ్యేసరికి ఒకరితో ఒకరు ప్రేమలో పడడం నిజంగా వైచిత్య్రమే!

* ఇద్దరు స్నేహితుల ప్రయాణం


ఆ సినిమా అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో అనేక ప్రశంసలు పొందింది. ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకాదరణ అందుకుంది. ముఖ్యంగా ‘ఎల్‌జీబీటీ’ (లెస్బియాన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్‌జెండర్‌) సభ్యుల హర్షామోదాలు పొందింది. అదే ‘మై ఓన్‌ ప్రైవేట్‌ ఇడహో’ (1991). అనాధలైన ఇద్దరు యువకులు తమ మూలాలు కనుక్కుంటూ తమ సొంత ప్రాంతాలకు ప్రయాణించడమే సినిమా. వీరిలో ఒకడు సెక్స్‌ వర్కర్‌. ఓసారి ఓ సంపన్న యువతి అతడిని తన ఇంటికి తీసుకువెళితే అక్కడ తనలాంటి మరొకడు పరిచయమవుతాడు. ఇద్దరూ తాడూబొంగరం లేని వాళ్లే కావడంతో సన్నిహితులవుతారు. తర్వాత ఇద్దరూ తమ కథలను ఒకరికి ఒకరు చెప్పుకుని, తమ మూలాలు తెలుసుకోడానికి ప్రయాణం ప్రారంభిస్తారు. ఒకరు తన తల్లిని, మరొకరు తన తండ్రిని కలుసుకుంటారు. కానీ అంతవరకు అనాధల్లా వీధుల్లో అల్లరిచిల్లరిగా తిరగిన వాళ్లు కుటుంబాల్లో ఇమడగలిగారా? ఒకరితో ఒకరి సాన్నిహిత్యాన్ని మర్చిపోయి సమాజ కట్టుబాట్ల మధ్య జీవనం సాగించగలిగారా?... అనేదే కథ.

* ఆస్కార్‌ ఇస్తే తీసుకోను!


ప్రపంచవ్యాప్తంగా ప్రతిష్ఠాత్మకంగా పరిగణించే ఆస్కార్‌ అవార్డు కోసం అర్రులు చాచే నటులు ఎందరో ఉంటే, ‘నాకు ఆస్కార్‌ ఇవ్వకండి. ఇచ్చినా తీసుకోను’ అని ముందే హెచ్చరించిన నటుడు జార్జి క్యాంప్‌బెల్‌ స్కాట్‌. అమెరికాలో నాటక, సినీ రంగాల నటుడుగా, దర్శకుడిగా, నిర్మాతగా పేరు పొందిన జార్జి సి. స్కాట్‌ ఈ మాటను అహంకారంతో అనలేదు. ‘ఎవరి నటనా మరొకరి నటనకు సాటిరాదు. ప్రతి వారి అభినయం ప్రత్యేకమైనదే’ అనే అభిప్రాయంతోనే. అతడికి ‘ప్యాటన్‌’ అనే సినిమాలో యూఎస్‌ జనరల్‌ జార్జి ఎస్‌. ప్యాటన్‌ అనే పాత్రలో అభినయానికి ఆస్కార్‌ ప్రకటించారు. కానీ చెప్పినట్టుగానే అతడు తీసుకోలేదు. ‘డాక్టర్‌ స్ట్రేంజ్‌లవ్‌’, ‘ఎ క్రిస్ట్‌మస్‌ కేరోల్‌’, ‘ద ఎక్జార్సిస్ట్‌3’ సినిమాల్లో అతడి నటన ప్రపంచ సినీ ప్రేక్షకులను అలరించింది.

వర్జీనియాలో 1927 అక్టోబర్‌ 18న పుట్టిన స్కాట్, చిన్నప్పుడు పెద్ద రచయితను కావాలనుకునేవాడు. అనుకున్నట్టుగానే కొన్ని కథలు రాశాడు కానీ ఎక్కడా ప్రచురితం కాలేదు. పెద్దయ్యాక నవల రాయాలనుకున్నాడు కానీ తనకే సంతృప్తిగా అనిపించిక పూర్తి చేయలేకపోయాడు. తర్వాత పాత్రికేయం, అభినయంపై మక్కువ పెంచుకున్నాడు. నాటకాల్లో, టీవీలో మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. వెండితెరపై ‘ద హేంగింగ్‌ ట్రీ’, ‘అనాటమీ ఆఫ్‌ ఎ మర్డర్‌’, ‘ద హస్టియర్‌’, ‘ద లిస్ట్‌ ఆఫ్‌ ఆడ్రియన్‌ మెస్సెంజర్‌’లాంటి ఎన్నో సినిమాల్లో విలక్షణమైన నటనతో ఆకట్టుకున్నాడు. ఎన్నో అవార్డులు అందుకున్న స్కాట్‌ 1999 సెప్టెంబర్‌ 22న తన 71 ఏళ్ల వయసులో మరణించాడు.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.