అక్టోబరు 23.. (సినీ చరిత్రలో ఈరోజు)

* ‘సాహో‘రే ప్రభాస్‌!
(పుట్టిన రోజు-1979)


కటౌట్‌ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డూడ్‌...అంటాడు ‘మిర్చి’లో ప్రభాస్‌. ఆరున్నర అడుగుల ఈ అందగాడు తెరపై ఎలాంటి విన్యాసాలు చేసినా నమ్మేలాగే ఉంటాయి. కథానాయకుడంటే ఇలా ఉండాల్రా అనిపించే రూపం ప్రభాస్‌ సొంతం. భారతీయ తెరకి దొరికిన మరో హీమ్యాన్‌. భళిరా భళీ... అంటూ ‘బాహుబలి’ చిత్రాలతో బాక్సాఫీసు దగ్గర సరికొత్త రికార్డుల్ని లిఖించాడు. ఆ చిత్రాలతోనే ఆయనకి దేశవ్యాప్తంగా అభిమానులు ఏర్పడ్డారు. ఇప్పుడు ప్రభాస్‌ అంటే ఓ బ్రాండ్‌. బహుభాషల్లో సినిమాలు చేస్తూ పాన్‌ ఇండియా స్టార్‌గా ఎదిగారు. ఖండాంతరాల్లోనూ ఆయనకి గుర్తింపు లభించింది.

1979 అక్టోబరు 23న సూర్య నారాయణరాజు, శివకుమారి దంపతులకి జన్మించారు ప్రభాస్‌. ఆయన సొంతూరు పశ్చిమ గోదావరి జిల్లా, మొగల్తూరు. ప్రముఖ కథానాయకుడు కృష్ణంరాజు ప్రభాస్‌కి పెదనాన్న. ఇంట్లో సినిమా వాతావరణం ఉన్నప్పటికీ సినిమాల్లో నటిస్తానని ఎప్పుడూ అనుకోలేదట ప్రభాస్‌. సిగ్గరి అయిన ఆయన ‘ఈశ్వర్‌’తో తెరంగేట్రం చేశారు. ఈ సినిమాతోనే ప్రముఖ నటుడు విజయ్‌ కుమార్‌ కుమార్తె శ్రీదేవి తెలుగులోకి అడుగు పెట్టింది. అందులో మంచి అభినయాన్ని ప్రదర్శించిన ప్రభాస్‌ భవిష్యత్తున్న కథానాయకుడు అనిపించుకొన్నారు. ఆ తరువాత ‘రాఘవేంద్ర’ పరాజయాన్ని చవి చూసినప్పటికీ, ‘వర్షం’తో ఘన విజయాన్ని సొంతం చేసుకొన్నారు. ఆ చిత్రంతో ఆయనకి మహిళల్లోనూ అభిమానులు ఏర్పడ్డారు. బాక్సాఫీసు దగ్గర సరికొత్త రికార్డుల్ని సృష్టించిన ఆ చిత్రం ప్రభాస్‌కి మంచి క్రేజ్‌ని తీసుకొచ్చింది. ఆ తరువాత ‘అడవిరాముడు’, ‘చక్రం’లాంటి చిత్రాలు అంతంత మాత్రం ఫలితాల్నే అందించినా... ‘ఛత్రపతి’తో ప్రభాస్‌లో అసలు సిసలు మాస్‌ కోణం బయటికొచ్చింది. మళ్లీ కొన్నాళ్లపాటు ఆయన్ని పరాజయాలు వెంటాడినా... ‘బుజ్జిగాడు’తో మరోసారి ఫామ్‌లోకి వచ్చాడు. ‘బిల్లా’, ‘ఏక్‌ నిరంజన్‌’, ‘డార్లింగ్‌’, ‘మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌’ చిత్రాలతో వరుసగా విజయాలు సొంతం చేసుకొన్నాడు. కొరటాల శివ దర్శకత్వం వహించిన ‘మిర్చి’తో ఘన విజయాన్ని సొంతం చేసుకొన్నాడు. మధ్యలో ‘రెబెల్‌’ చిత్రంతో పరాజయం ఎదురైనా ఆ ప్రభావం ఆయన కెరీర్‌పై ఏమాత్రం పడలేదు. ఇక ‘బాహుబలి’ చిత్రాలతో చరిత్రనే సృష్టించాడు. అమరేంద్ర బాహుబలిగా, మహేంద్ర బాహుబలిగా ఆయన చేసిన విన్యాసాలు ప్రేక్షకులకి కనువిందు చేశాయి. ప్రభాస్‌ క్రేజ్‌ ఖండాంతరాలు దాటేలా చేసింది. ఈమధ్యనే ప్రభాస్‌ నటించిన ‘సాహో’ చిత్రం తెరపైకి వచ్చి సందడి చేసింది.ఈ చిత్రం తెలుగు, తమిళం, హిందీ, మలయాళం భాషల్లోనూ విడులైంది. ప్రభాస్‌ బాలీవుడ్‌లో కొన్ని ప్రాజెక్టులు చేయబోతున్నారని ప్రచారం సాగుతోంది. టాలీవుడ్‌లో మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌గా గుర్తింపు పొందిన కథానాయకుడు ప్రభాస్‌. ఆయన పెళ్లి గురించి తరచుగా వార్తలొస్తుంటాయి. మరి ఆయన్నుంచి పెళ్లి కబురు ఎప్పుడు వినిపిస్తుందో చూడాలి. ప్రభాస్‌కి సోదరుడు ప్రమోద్‌తోపాటు, సోదరి ప్రగతి ఉన్నారు. గోపీచంద్, అల్లు అర్జున్, రానా దగ్గుబాటి... ప్రభాస్‌కి మంచి స్నేహితులు. ఈ రోజు ప్రభాస్‌ పుట్టినరోజు.

(ప్రత్యేక కథనం కోసం క్లిక్‌ చేయండి...)

* ఎగిరే ఏనుగు కథ!


వాల్ట్‌డిస్నీ అంటే చాలు ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి కలుగుతుంది. ఆ సంస్థ నుంచి వచ్చిన సినిమాలే అందుకు కారణం. యానిమేషన్‌ సినిమాలతో పెద్దల్ని, పిల్లల్ని విశేషంగా ఆకర్షించిన వాల్ట్‌డిస్నీ నిర్మించిన నాలుగో యానిమేషన్‌ ఫీచర్‌ సినిమా ‘డుంబో’. జుంబో అనే ఓ సర్కస్‌ ఏనుగు కథ ఇది. దాని పెద్ద పెద్ద చెవుల్ని చూసి అందరూ వెటకారాలు చేస్తుంటారు. కానీ వాళ్లకి తెలియని విషయం ఏమిటంటే ఆ ఏనుగు ఆ చెవుల సాయంతో ఆకాశంలో ఎగరగలదని. ఈ ఏనుగు ఏకైక స్నేహితుడు ఓ చిట్టెలుక. 1941 అక్టోబర్‌ 23న విడుదలైన ఈ సినిమా విజయవంతమైంది. ఇప్పుడు ఇదే సినిమాను లైవ్‌యాక్షన్‌ సినిమాగా తిరిగి రూపొందించిన ఈ చిత్రం 2019 మార్చి 19న విడుదలై ప్రేక్షకులను అలరించింది.

* చార్లీ చాప్లిన్‌ నవ్వుల బాణం!


పేరు వినగానే నవ్వు కలిగే నటుడు చార్లీ చాప్లిన్‌. ఇక తెరపై కనిపిస్తే అట్టహాసాలే! ప్రపంచవ్యాప్తంగా హాస్య నటనకు ఆద్యుడిగా, స్ఫూర్తిప్రదాతగా నిలిచే చాప్లిన్‌ అమెరికాలో తీసిన ఆఖరి సినిమా ‘లైమ్‌లైట్‌’. ఈ సినిమాకి చాప్లిన్‌ రచయిత, నిర్మాత, దర్శకుడు, నటుడుగానే కాదు సంగీతం కూడా సమకూర్చాడు. ఇందులో చాప్లిన్‌ పాత్ర కూడా హాస్యగాడి పాత్రే. ఒకప్పుడు వేదికలపై నవ్విస్తూ ఓ వెలుగు వెలిగిన ఓ కమేడియన్‌ అవకాశాలు కోల్పోయి నిరాశలో కూరుకుపోతాడు. ఆ దశలో తనలాగే నిరాశలో ఉన్న ఓ నృత్యతారను ఆత్మహత్యా ప్రయత్నం నుంచి కాపాడుతాడు. ఆమెకు ఆత్మవిశ్వాసం నూరిపోస్తూ, తాను కూడా ధైర్యం తెచ్చుకుంటాడు. ఆమెను తిరిగి గొప్ప నృత్యతారగా మారుస్తాడు. చివరికి ఆమె ప్రోద్బలంతో ఓ కార్యక్రమంలో అద్భుతంగా హాస్య ప్రదర్శన చేస్తూ వేదికపైనే గుండెపోటు వచ్చి ప్రాణాలు విడుస్తాడు. ఓ పక్క నవ్విస్తూనే, మరో పక్క విషాదాన్ని చూపించిన ఈ సినిమా చాప్లిన్‌ అద్భుతమైన స్కీన్ర్‌ప్లేకు నిదర్శనంగా నిలిచింది. 1952 అక్టోబర్‌ 23న విడుదలైన ఈ సినిమా అప్పట్లో కొన్ని రాజకీయ కారణాల వల్ల అమెరికాలో నిషేధానికి గురై నష్టాలు కలిగించినా, తిరిగి 1972లో విడుదలై 45వ ఆస్కార్‌ వేడుకల్లో ఇతర చిత్రాలతో పోటీ పడి మరీ ఆస్కార్‌ను అందుకోవడం విశేషం.

* ఓ గాయకుడి కథ


ఆ గాయకుడు ఎంత సంచలనం సృష్టించాడో, అతడి జీవితం ఆధారంగా తీసిన ఆ సినిమా కూడా అంతటి సంచలనాన్ని సృష్టించింది. ఆ గాయకుడు బ్రిటిష్‌కి చెందిన ఫ్రెడ్డీ మెర్క్యురీ అయితే, అతడి బయోపిక్‌గా విడుదలైన చిత్రం ‘బహమియన్‌ రాప్సొడీ’ (2018). ఈ సినిమాను 50 మిలియన్‌ డాలర్లతో తెరకెక్కిస్తే, ఇది ప్రపంచ వ్యాప్తంగా 903.7 మిలియన్‌ డాలర్లు ఆర్జించింది. నాలుగు ఆస్కార్‌ అవార్డులు సహా గోల్డెన్‌గ్లోబ్, బాఫ్తా, స్క్రీన్‌ యాక్టర్స్‌ గిల్డ్, ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌ లాంటి ప్రతిష్ఠాత్మక పురస్కారాలెన్నో గెలుచుకుంది.

ఇండియాకి చెందిన పార్సీ దంపతులకు టాంజానియాలో పుట్టి, గొప్ప రాక్‌ గాయకుడిగా, సాంగ్‌ రైటర్‌గా అంతర్జాతీయ ప్రాచుర్యం పొందిన ఫ్రెడ్డీ మెర్క్యురీ జీవిత కథగా తీసిన ఈ సినిమాకు బ్రియాన్‌ సింగర్‌ దర్శకత్వం వహించగా, గాయకుడి పాత్రలో రామి మాలేక్‌ నటించాడు. బ్రిటన్‌లో ‘క్వీన్‌’ అనే రాక్‌ బ్యాండ్‌ స్థాపించి ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శనలు ఇస్తూ, సంగీత ప్రియులను ఉర్రూతలూగించిన మెర్క్యురీ జీవితంలోని అనేక కోణాలను ఆవిష్కరించిన ఈ సినిమా, ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.

* టెర్మినేటర్‌ నటి


ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రియులను ఆకట్టుకున్న టెర్మినేటర్‌ సినిమాలో భవిష్యత్తు నుంచి వర్తమానంలోకి వచ్చిన రోబో దాడి చేసేందుకు ప్రయత్నించిన సారా కానర్‌ పాత్ర గుర్తుందా? ఆమెకు పుట్టిన కొడుకు రాబోయే కాలంలో రోబోలను నియంత్రిస్తాడని తెలిసి భవిష్యత్తులోంచి వచ్చిన రోబోను ఎదుర్కొన్న పాత్రలో ‘టెర్మినేటర్‌ జెనిసిస్‌’ (2015) సినిమాలో నటించి మెప్పించిన నటి ఎమిలియా క్లార్క్‌. అలాగే ‘మి బిఫోర్‌ యు’, ‘సోలో: ఎ స్టార్‌వార్స్‌ స్టోరీ’ సినిమాలతో ఈమె అంతర్జాతీయ గుర్తింపు పొందింది. టైమ్‌ మ్యాగజీన్‌ ఈమెకు ప్రపంచంలో ప్రభావశీలురైన 100 మంది జాబితాలో స్థానం కల్పించి గౌరవించింది. లండన్‌లో 1986 అక్టోబర్‌ 23న పుట్టిన క్లార్క్, మూడేళ్ల వయసు నుంచే నటన పట్ల ఆకర్షితురాలైంది. లండన్‌ డ్రామా స్కూల్లో నటనను అభ్యసించి నాటకాలు, లఘచిత్రాలు, టీవీ సీరియల్స్‌ ద్వారా మంచి నటిగా అలరించింది.

..................................................................................................................................................................

* ఐటెం పాటలకు చిరునామా..
(మలైకా అరోరా పుట్టినరోజు-1973)

                                           
                                                                                                                       
 
‘‘డబ్బులు ఎవరికీ ఊరికే రావు..’’ అని ఓ వాణిజ్య ప్రకటనలో అన్నట్లు.. చిత్రసీమలో పేరు, ప్రఖ్యాతులు కూడా అంత సులభంగా ఏం దక్కవు. ఎంతటి ప్రతిభ ఉన్నా.. దాన్ని చూపించ దగ్గ పాత్ర, సరైన సమయం రాకపోతే.. ఎన్నేళ్లయినా చిత్రసీమలో మరుగున పడిపోయి ఉండాల్సిందే. బాలీవుడ్‌ నటి మలైకా అరోరా కూడా ఇలాంటి కోవకు చెందినదే. 1973 అక్టోబర్‌ 23న మహారాష్ట్రలోని థానేలో జన్మించిన ఈ ముద్దుగుమ్మ. 1998లో షారుఖ్‌ కథానాయకుడిగా నటించిన ‘దిల్‌ సే’ సినిమాతో వెండితెరపై తళుక్కున మెరిసింది. ఇందులో ‘‘చల్‌ ఛయ్య ఛయ్య ఛయ్యా ఛయ్యా’’ గీతానికి కింగ్‌ ఖాన్‌తో స్టెప్పులేసింది. తొలి ఐటెం గీతంతోనే కుర్రకారుకు కిరాకునెక్కించే కిక్కు అందించింది. ఏఆర్‌ రహమాన్‌ సంగీత సారథ్యంలో రూపొందిన ఈ ప్రత్యేక గీతంతో అలైకా ఒక్కసారిగా దేశవ్యాప్తంగా క్రేజ్‌ సంపాదించుకుంది. ‘దిల్‌సే’ విజయంలో ఎంతో కీలకంగా నిలిచిన ఈ పాట.. తరువాతి కాలంలో మలైకాను ఐటెం గీతాల మహరాణిగా మార్చివేసింది.

                                                                                                                                                     
ఈ జోరులోనే ‘‘గురు నాలా ఇష్క్‌ మిఠా’’, ‘‘మాహీ వే..’’, ‘‘కాల్‌ ధమాల్‌..’’ వంటి ప్రత్యేక గీతాలతో బాలీవుడ్‌ సినీ ప్రియులను ఒక ఊపు ఊపేసింది. మత్తెక్కించే చూపులు, చూపు తిప్పుకోనివ్వని స్టెప్పులతో వెండితెరపై మలైకా చేసే మాయాజాలం సినీ ప్రియులపై ఓ సమ్మోహన అస్త్రంలా పనిచేసేది. ప్రతి చిత్రంలో మలైకా తెరపై కనిపించేది కొద్ది నిమిషాల పాటలోనే అయినా.. ఆ తక్కువ సమయంలోనే తన అందం, అభినయం, అద్భుతమైన హావభావాలతో ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసేది. ఇక 2000 సంవత్సరం తర్వాత వచ్చిన ‘మా తుఝే సలామ్‌’, ‘ఓమ్‌ శాంతి ఓమ్‌’, ‘ఈఎంఐ’, ‘హెలో ఇండియా’, ‘హౌస్‌ ఫుల్‌’ చిత్రాల్లో చిన్నా చితకా పాత్రల్లో మెరిసినా అవి మలైకా కెరీర్‌కు ఏమాత్రం ఉపయోగపడలేదు. ఇలాంటి సమయంలో తన భర్త అర్బాజ్‌ ఖాన్‌తో కలిసి నిర్మించిన ‘దబాంగ్‌’ చిత్రంతో మరోసారి దేశం మొత్తాన్ని తనవైపు చూసేలా చేసింది. సల్మాన్‌ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రంలో ‘‘మున్నీ బదనాం హూయి’’ ఐటెం సాంగ్‌తో సినీ ప్రియులను మరోసారి ఉర్రూతలూగించింది. ఈపాట అప్పట్లో యూట్యూబ్‌లో అత్యధిక వ్యూస్‌ దక్కించుకున్న తొలి భారతీయ పాటగానూ అరుదైన రికార్డును దక్కించుకోవడం విశేషం. ఈ సినిమాకు గానూ ఉత్తమ వినోదాత్మక చిత్రంగా ఫిలింఫేర్‌ అవార్డును అందుకుంది మలైకా. ఈ సినిమాను తెలుగులో పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా ‘గబ్బర్‌ సింగ్‌’ పేరుతో తెరకెక్కించగా.. ఇందులో ‘‘కెవ్వు కేక’’ గీతంతో పవన్‌ సరసన స్టెప్పులు వేసి తెలుగు ప్రేక్షకుల చేత కేకలు పెట్టించింది. ‘దబాంగ్‌2’, ‘డాలి కి డోలి’ ‘పటాఖ’ చిత్రాల తర్వాత పూర్తిగా వెండితెరకు దూరమైన ఈ ప్రత్యేక సుందరి. ప్రస్తుతం బుల్లితెరపై పలు డ్యాన్స్‌ కార్యక్రమాలకు న్యాయ నిర్ణేతగా చేస్తోంది. మరోవైపు కొత్త ప్రియుడు, తన కంటే చాలా చిన్నవాడైన అర్జున్‌ కూపూర్‌తో కలిసి ప్రేమ వ్యవహారం నడుపుతుందని సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి.

(ప్రత్యేక కథనం కోసం క్లిక్‌ చేయండి...)
Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.