అక్టోబర్‌ 28...(సినీ చరిత్రలో ఈరోజు)

అమ్మో... గయ్యాళిగంప!
 సూర్యకాంతం (జయంతి-1924)

ఆమె భార్య అయితే భర్త నోరు లేవదు... ఆమె సవతి తల్లి అయితే ఆ బిడ్డల కష్టాలకు లెక్కే ఉండదు... ఆమె అత్తగారయితే కోడళ్లు కుక్కిన పేనుల్లా పడి ఉండాల్సిందే... అసలామె సినిమాలో ఉందంటే చాలు, మిగతా పాత్రలు కలవర పడాల్సిందే! ఆమే సూర్యకాంతం! తెలుగు సినిమాల్లో ఎన్నో గయ్యాళి పాత్రలకు, నోరెట్టుకుని పడిపోయే పాత్రలకు, శాపనార్థాలు పెట్టే పాత్రలకు, ఆరళ్లు పెట్టే పాత్రలకు ప్రాణం పోసి ప్రేక్షకుల తిట్లతో పాటు అభిమానాన్ని కూడా సంపాదించిన అసాధారణ నటి. ఆమె పాత్రల ధాటికి జడిసి తెలుగు నాట చాలామంది తమ కూతుళ్లకు సూర్యకాంతం అనే పేరే పెట్టలేదు. కానీ తెరపై భరించలేనంత అసూయాద్వేషాలను ప్రదర్శించే సూర్యకాంతం మంచి మనసుకు మారుపేరని ఆమెను వ్యక్తిగతంగా ఎరిగిన వాళ్లకు మాత్రమే తెలుసు. కాకినాడ దగ్గర వెంకట కృష్ణరాయ పురంలో 1924 అక్టోబర్‌ 28న పుట్టిన సూర్యకాంతం, తల్లిదండ్రుల సంతానంలో 14వ బిడ్డ. అంతకు ముందు పుట్టిన పదిమంది చనిపోతే తల్లితండ్రులు గారాబంగా పెంచి నృత్యం, సంగీతం నేర్పించారు. హైకోర్టు న్యాయమూర్తి పెద్దిభొట్ల చలపతిరావును వివాహమాడిన సూర్యకాంతం, ‘చంద్రలేఖ’ సినిమాతో తెరంగ్రేటం చేశారు. అప్పటి ఆమె పారితోషికం 75 రూపాయలు. తర్వాత ‘నారద నారది’, ‘గృహప్రవేశం’ సినిమాల్లో నటించాక తొలిసారిగా గయ్యాళి అత్త పాత్రలో ‘సంసారం’లో కనిపించింది. ఆపై అలాంటి పాత్రలకు ఆమే చిరునామాగా మారింది. ఆమె తన 72వ ఏట 1996 డిసెంబర్‌ 17న మరణించారు.

(ప్రత్యేక వార్త కోసం క్లిక్‌ చేయండి...)

అందాల మహిళ!


హాలీవుడ్‌లో ‘ప్రెట్టీ ఉమన్‌’ ఎవరని అడిగితే జులియా రాబర్ట్స్‌ పేరే చెబుతారు. ఆ సినిమాలో పాత్రతో ఆమె అంతటి ప్రేక్షకాదరణకు నోచుకుంది. అందంగా, అమాయకంగా ఆమె నటించిన ‘ప్రెట్టీ ఉమన్‌’ సినిమా ప్రపంచవ్యాప్తంగా 464 మిలియన్‌ డాలర్లను వసూలు చేసింది. మంచి నటనటకు పెట్టింది పేరైన జులియా నాలుగు గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డులు అందుకుంది. ఉత్తమ నటిగా ‘ఎరిన్‌ బ్రొకోవిచ్‌’ సినిమాలో నటనకు ఆస్కార్‌ అందుకుంది. ఆమె నటించిన సినిమాలు 2.8 బిలియన్‌ డాలర్లు రాబట్టి ఆమెను బాక్సాఫీస్‌ యువరాణిని చేశాయి. ఆమెను అత్యధిక పారితోషికం అందుకున్న నటిగా మార్చాయి. అంతకు ముందు ఏ హీరోయిన్‌ అందుకోనంతగా 25 మిలియన్‌ డాలర్ల పారితోషికాన్ని జులియా ‘మోనాలిసా స్మైల్‌’ (2003) చిత్రానికి అందుకుంది. ‘మిస్టిక్‌ పిజా’, ‘స్టీల్‌ మాగ్నోలియాస్‌’, ‘స్లీపింగ్‌ విత్‌ ద ఎనిమీ’, ‘ద పెలికాన్‌ బ్రీఫ్‌’, ‘మై బెస్ట్‌ ఫ్రెండ్స్‌ వెడ్డింగ్‌’, ‘నాటింగ్‌ హిల్‌’, ‘రన్‌ ఎవే బ్రైడ్‌’, ‘వాలెంటైన్స్‌ డే’ లాంటి సినిమాలు జులియా విలక్షణ నటనకు గీటురాళ్లుగా నిలుస్తాయి. జార్జియాలో 1967 అక్టోబర్‌ 28న పుట్టిన జులియాను ప్రపంచంలోనే అందమైన మహిళగా ‘పీపుల్‌’ పత్రిక ద్వారా అయిదుసార్లు ఎంపికవడం ఓ రికార్డు.

* బొగ్గు గనుల్లో ఆస్కార్లు


బొగ్గు గనుల్లో పనిచేసే కార్మికుల జీవితాలు... వాళ్ల కష్టాలు... కన్నీళ్లు... వీటితో సినిమా తీయాలంటే సాహసం కావాలి. కానీ అది విజయవంతం కావాలంటే మాత్రం సాహసంతో పాటు సృజనాత్మకత కూడా ఉండాలి. ఇవి రెండూ పుష్కలంగా ఉన్నాయి కాబట్టే ‘హౌ గ్రీన్‌ వాజ్‌ మై వ్యాలీ’ (1941) సినిమా కాసులు కురిపించడమే కాదు, పది ఆస్కార్‌ నామినేషన్లు పొంది అయిదు అవార్డులను గెలుచుకుంది. మరెన్నో పురస్కారాలను కొల్లగొట్టింది. ‘వందేళ్లు... వంద గొప్ప సినిమాలు’ జాబితాలో స్థానం సాధించింది. అమెరికా రచయిత రిచర్డ్‌ లెవెలిన్‌ 1939లో రాసిన నవలకు వెండితెర రూపం ఇది. వేల్స్‌ బొగ్గు గనుల్లో పనిచేసే కార్మికుల జీవితాలను ప్రతిబింబిస్తూ ఓ కుటుంబం కథగా ఇది ఉంటుంది. గనుల్లో పనిచేసే ఇద్దరు దంపతులు తమ కొడుకు, కూతురు ఇలాంటి కష్టాలు పడకూడదని ఏం చేశారనే నేపథ్యంలో కథ సాగుతుంది.

* బ్లాక్‌ బస్టరా?లాక్‌ లస్టరా?

ఓ సినిమా...
-50 మేటి చిత్రాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది!
-500 గొప్ప చిత్రాల్లో ఒకటిగా స్థానం పొందింది!
-ఆ సినిమా వీడియోలను విడుదల చేస్తే కోటికి పైగా అమ్ముడైపోయాయి!
- విమర్శకుల ప్రశంసలు పొందింది!
ఇదంతా చూస్తే ఆ సినిమా ఓ ‘బ్లాక్‌ బస్టర్‌’ అనుకుంటారు...
కానీ ఆ సినిమా... వ్యాపారాత్మకంగా అంతగా విజయవంతం కాలేదు. దాంతో దాన్ని ‘లాక్‌ లస్టర్‌’ అన్నారు కొందరు.

ఇలా అటూ ఇటూ కాని పేరు పొందిన సినిమా ‘డోనీ డార్కో’ (2001). ఇదొక సైన్స్‌ఫిక్షన్‌ అయినా ఉత్కంఠభరితంగా, హారర్‌ సినిమాగా తెరకెక్కింది. ఆ సినిమాలో కథ కేవలం 28 రోజుల్లో జరిగేది. చిత్రంగా ఆ సినిమా చిత్రీకరణ కూడా 28 రోజుల్లోనే పూర్తయింది. కథ విషయానికి వస్తే... డోనీ అనే కుర్రాడు పొద్దున్నే లేవగానే ఇంటి బయట నుంచి ఓ వింత గొంతు పిలుస్తుంది. వెళ్లి చూస్తే నిలువెత్తున ఉన్న రాకాసి కుందేలు కనిపిస్తుంది. ‘ఈ ప్రపంచం మరో 28 రోజుల, 6 గంటల, 42 నిమిషాల, 12 సెకండ్లకు అంతం కాబోతోంది’ అని చెబుతుంది. మర్నాడు ఉదయం అతడు లేచేసరికి ఇంట్లో కాకుండా ఓ పచ్చిక బయలులో పడుకుని ఉంటాడు. ఆశ్చర్యంగా ఇంటికి వెళ్లే ఆ రాత్రి అతడి పడక గదిపై ఓ జెట్‌ విమానం ఇంజను కూలి పోయి ఉంటుంది. అక్కడే ఉంటే చచ్చిపోయేవాడే. ఆ తర్వాత ఆ రాకాసి కుందేలు అతడికి మాత్రమే కనిపిస్తూ కొన్ని నేరాలు చేయమని ప్రోద్బలం చేస్తూ ఉంటుంది. తల్లిదండ్రులు అతడి ప్రవర్తన గమనించి ఓ సైకియాట్రిస్ట్‌ దగ్గరకు తీసుకువెళతారు. మరి ఆయన ఈ కుర్రాడిని బాగు చేశాడా? చివరకి ఏమైంది? అనేదే సినిమా. ఓ పక్క అంతుపట్టని మిస్టరీగా, మరో పక్క సైకలాజికల్‌గా, ఇంకో పక్క సైన్స్‌ ఫిక్షన్‌గా ఈ సినిమా కథ ఉత్కంఠభరితంగా సాగుతుంది.

* గ్లాడియేటర్‌ విలన్‌


ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన ‘గ్లాడియేటర్‌’ సినిమాలో కమోడస్‌ పాత్రలో గుర్తుండిపోయే నటుడు జొయాక్విన్‌ ఫీనిక్స్‌. నటుడిగా, నిర్మాతగా, ఉద్యమకారుడిగా పేరు తెచ్చుకున్నాడు. ప్రతిష్ఠాత్మకమైన అనేక అవార్డులు పొందాడు. ఆస్కార్, గోల్డెన్‌గ్లోబ్, గ్రామీ, బ్రిటిష్‌ అకాడమీ, బాఫ్తా, స్క్రీన్‌ యాక్టర్స్‌ గిల్డ్, క్రిటిక్స్‌ ఛాయిస్, ఇండిపెండెంట్‌ స్పిరిట్, కేన్స్, వెనిస్‌ ఫిలిం ఫెస్టివల్‌లాంటి ఎన్నో పురస్కారాలు అతడి సొంతమయ్యాయి. సోదరుడు రివర్‌ ఫీనిక్స్, సోదరి సమ్మర్‌ ఫీనిక్స్‌లతో కలిసి బుల్లితెరపై గుర్తింపు తెచ్చుకున్న ఇతడు వెండితెరపై ‘స్పేస్‌క్యాంప్‌’, ‘టు డై ఫర్‌’, ‘క్విల్స్‌’, ‘గ్లాడియేటర్‌’, ‘వాక్‌ ద లైన్‌’, ‘ద మాస్టర్‌’, ‘సైన్స్‌’, ‘ద విలేజ్‌’, ‘హెర్‌’, ‘జోకర్‌’ లాంటి సినిమాల ద్వారా అంతర్జాతీయ గుర్తింపు పొందాడు. సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటాడు. ప్యుయర్టోరికోలో 1974 అక్టోబర్‌ 28న ఐదుగురు సంతానంలో మూడోవాడిగా పుట్టిన ఇతడు పేదరికాన్ని అనుభవించాడు. కుటుంబం గడవడం కోసం సహోదరులతో కలిసి వీధుల్లో ప్రదర్శనలు ఇచ్చేవాడు. ఆటా, పాటా, నటనలతో ఎదిగిన ఇతడు కమర్షియల్స్, టీవీల్లో అవకాశాలు పొందాడు. ఎనిమిదేళ్లకే సోదరుడితో కలిసి టీవీ సీరియల్స్‌లో నటించాడు. క్రమేణా వెండితెర ఆహ్వానం అందుకుని అంచెలంచెలుగా ఎదిగాడు.

('గ్లాడియేటర్'పై ప్రత్యేక కథనం )


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.