మార్చి 10.. (సినీ చరిత్రలో ఈరోజు)

* ఆల్‌రౌండర్‌

(ఆర్పీ పట్నాయక్‌ పుట్టిన రోజు)

సంగీత దర్శకుడిగా ప్రయాణం మొదలుపెట్టిన ఆర్పీ పట్నాయక్‌... గాయకుడిగా, నటుడిగా, దర్శకుడిగానూ తెలుగు చిత్ర పరిశ్రమపై తనదైన ముద్ర వేశారు. తెలుగుతో పాటు, కన్నడ, తమిళం, హిందీ భాషల్లోనూ సంగీత దర్శకుడిగా రాణించారు. ‘గాజువాక పిల్లా మేం గాజులోళ్లం కాదా...’ (నువ్వు నేను), ‘రాను రానంటూ చిన్నదో చిన్నదో...’ (జయం), ‘తూనీగా తూనీగా...’ (మనసంతా నువ్వే), ‘డిల్లీ నుంచి గల్లీ దాకా...’ (చిత్రం), ‘తొలిసారిగా కలగన్నదీ నిన్నే కదా...’ (సంతోషం). - ఇలాంటి విజయవంతమైన ఎన్నో బాణీలు ఆర్పీ పట్నాయక్‌ నుంచి వచ్చినవే. 80 పైచిలుకు చిత్రాలకి సంగీత దర్శకత్వం వహించిన ఆర్పీ పట్నాయక్, 300కిపైగా గీతాల్ని ఆలపించారు. 25 మందికిపైగా గాయకుల్ని పరిచయం చేశారు. తండ్రి ఉద్యోగం రీత్యా ఒడిశాలో ఉన్నప్పుడు అక్కడే మార్చి 10, 1972న జన్మించారు ఆర్పీ పట్నాయక్‌. ఆయన అసలు పేరు రవీంద్ర ప్రసాద్‌ పట్నాయక్‌. ఒడిశాలోనే బీఎస్సీ పూర్తి చేశారు. అనంతరం ఆంధ్రా విశ్వవిద్యాలయం నుంచి స్పేస్‌ ఫిజిక్స్‌లో పీజీ చేశారు. దర్శకుడు కావాలనే లక్ష్యంతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. కానీ సంగీత దర్శకుడిగా ప్రయాణం ప్రారంభించారు. శ్రీనువైట్ల దర్శకత్వం వహించిన ‘నీ కోసం’తో స్వరకర్తగా పరిచయమైన ఆయన, తేజ దర్శకత్వం వహించిన ‘చిత్రం’తో తొలి విజయాన్ని అందుకొన్నారు. ఆ తర్వాత తేజ - ఆర్పీ పట్నాయక్‌ కలయికలో వచ్చిన పలు చిత్రాలు ప్రేక్షకుల్ని అలరించాయి. ‘మనసంతా నువ్వే’, ‘నువ్వు లేక నేను లేను’, ‘జయం’, ‘జెమినీ’, ‘నీ స్నేహం’, ‘దిల్‌’, ‘సంబరం’, ‘ఆ నలుగురు’ ఇలా చాలా చిత్రాలు ఆర్పీ పట్నాయక్‌కి పేరు తీసుకొచ్చాయి. వాటిలోని గీతాలు ఇప్పటికీ వినిపిస్తుంటాయి. అగ్ర సంగీత దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ఆర్పీ, 2004లో ‘శీను వాసంతి లక్ష్మి’ చిత్రంతో నటుడిగా మారారు. ‘బ్రోకర్‌’, ‘తులసీదళం’, ‘మనలో ఒకడు’ చిత్రాల్లో ప్రధాన పాత్రధారిగా నటించి ప్రేక్షకుల మెప్పు పొందాడు. దర్శకుడిగా పరిచయమైన ‘అందమైన మనసులో’ కూడా డాక్టర్‌గా నటించారు. ఈ చిత్రం ప్రేక్షకాదరణ సొంతం చేసుకోలేకపోయినా... ఉత్తమ కథా రచయితగా నంది అవార్డుని తెచ్చిపెట్టింది. ఆ తర్వాత తెరకెక్కించిన ‘బ్రోకర్‌’ చిత్రానికి కూడా ఉత్తమ కథా రచయితగా నంది లభించింది. ‘మనలో ఒకడు’ చిత్రానికి తృతీయ ఉత్తమ చిత్రంగా నంది కైవసం చేసుకుంది. ‘నువ్వు నేను’ చిత్రానికిగానూ ఉత్తమ సంగీత దర్శకుడిగా పురస్కారం అందుకున్నారు. చిత్ర పరిశ్రమకి వచ్చిన కొత్తలో దర్శకుడు త్రివిక్రమ్, నటుడు సునీల్‌తో కలిసి ఓ గదిలో ఉండేవారట ఆర్పీ పట్నాయక్‌. ఆయన సోదరుడు గౌతమ్‌ పట్నాయక్‌ కూడా దర్శకుడే. ‘కెరటం’ అనే చిత్రంతో ఆయన దర్శకుడిగా పరిచయమయ్యారు. ఈ రోజు ఆర్పీ పట్నాయక్‌ పుట్టినరోజు.

(ప్రత్యేక వార్త కోసం క్లిక్‌ చేయండి...)

* పొగరున్న అమ్మాయి కథ

అందం... కళ్లు తిప్పుకోలేనంత. డబ్బు... తరతరాలకు చాలినంత. ప్రతిష్ఠ... సమాజం ఈర్ష్యపడేంత. అన్నీ ఉన్న అమ్మాయి ఆమె. కానీ వీటన్నింటితో పాటు ఆమెకు పొగరుంది... అది ఎవరూ భరించలేనంత! అహంకారం ఉంది... ఎవరూ సహించలేనంత! అందుకే ఆ అమ్మాయి ప్రేమకు దూరమైంది. అన్నీ ఉన్నా ఒంటరిదైంది. ఎన్ని ఉన్నా వ్యక్తిత్వం ఎంత ముఖ్యమో చెప్పే కథ ఆ అమ్మాయిది. ఆ కథే ‘జెజేబెల్‌’ (1938) సినిమా. అరవై ఏళ్ల పాటు సినీరంగంలో గొప్ప నటీమణిగా గుర్తింపు పొందిన అందాల తార బెట్టే డేవిస్‌ కథానాయికగా విలియం వైలర్‌ దర్శకత్వంతో తెరకెక్కిన ఈ సినిమా విశేషంగా ఆకట్టుకున్న ఓ నాటకం ఆధారంగా రూపుదిద్దుకుంది. ఉత్తమ నటి, ఉత్తమ సహాయ నటి విభాగాల్లో రెండు ఆస్కార్‌ అవార్డులు అందుకున్న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకాదరణ పొందింది. చిత్రోత్సవాల్లో పురస్కారాలు అందుకుంది.

* బ్రూస్‌లీతో కలిసి నటించాడు...

యునైటెడ్‌ ఎయిర్‌ఫోర్స్‌లో పనిచేశాడు...ఆపై మార్షల్‌ ఆర్ట్స్‌ నేర్చుకుని ఆరితేరాడు... యుద్ధవిద్యలపై ఓ స్కూలును స్థాపించి ఎందరికో శిక్షణ ఇచ్చాడు... ఇవి చాలదన్నట్టు నటుడిగా మెప్పించాడు... నిర్మాతగా, స్క్రీన్‌ రచయితగా ఆకట్టుకున్నాడు... టీవీ రంగంలోనూ ముద్ర వేశాడు... పైగా మార్షల్‌ ఆర్ట్స్, ఫిట్‌నెస్, ఫిజియాలజీ, పోలిటిక్స్, క్రిస్టియానిటీ, వ్యక్తిత్వ వికాశం లాంటి అంశాలపై ఎన్నో పుస్తకాలు రాసి రచయితగా కూడా అలరించాడు... ఇన్ని రకాలుగా నైపుణ్యాలకు పదును పెట్టుకున్న వ్యక్తిగా కార్లస్‌ రే నోరిస్‌ స్ఫూర్తిదాయకుడు. చక్‌నోరిస్‌గా ప్రసిద్ధుడైన ఇతడు, ప్రముఖ మార్షల్‌ ఆర్ట్స్‌ నటుడు బ్రూస్‌లీతో కలిసి ‘వే ఆఫ్‌ ద డ్రాగన్‌’ సినిమాలో నటించాడు. గొప్ప యాక్షన్‌ హీరోగా పేరుతెచ్చుకున్నాడు. ‘గుడ్‌ గైస్‌’, ‘వేర్‌ బ్లాక్‌’, ‘ద ఆక్టాగన్‌’, ‘లోన్‌ ఊల్ఫ్‌ మెకేడ్‌’, ‘కోడ్‌ ఆఫ్‌ సైలెన్స్‌’, ‘ద డెల్టా ఫోర్స్‌’, ‘ద హిట్‌ మ్యాన్‌’, ‘ఫైర్‌వాకర్‌’, ‘సైడ్‌కిక్స్‌’, ‘మిస్సింగ్‌ యాక్షన్‌’ లాంటి సినిమాలతో ప్రపంచ సినీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఒక్లహోమాలో 1940 మార్చి 10న పుట్టిన ఇతగాడు తన 78 ఏళ్ల వయసులో కూడా ఉత్సాహంగా వేర్వేరు కార్యక్రమాల్లో పాల్గొంటూ స్ఫూర్తిని పంచుతున్నాడు.

* రెండు తెరలపై ఉత్తమ నటన

బుల్లితెర, వెండితెరలపై మంచి నటన కనబరచి ఆకట్టుకున్న నటుడు జోనాథన్‌ డేనియల్‌ హమ్‌. జాన్‌ హమ్‌గా పేరొందిన ఇతడు ‘మ్యాడ్‌ మెన్‌’ సిరీస్‌ ద్వారా గోల్డెన్‌గ్లోబ్, ఎమ్మీ అవార్డులు అందుకున్నాడు. సైన్స్‌ ఫిక్షన్‌ ‘ద డే ద ఎర్త్‌ స్టుడ్‌ స్టిల్‌’ (2008) సినిమాతో అంతర్జాతీయ గుర్తింపు పొందాడు. ‘స్టోలెన్‌’, ‘మిలియన్‌ డాలర్‌ ఆర్మ్‌’, ‘కీపింగ్‌ అప్‌ విత్‌ ద జోనెసెస్‌’, ‘బీరట్‌’, ‘ద టౌన్‌’, ‘సక్కర్‌ పంచ్‌’, ‘బ్రైడ్స్‌మైడ్స్‌’, ‘బేబీ డ్రైవర్‌’, ‘ట్యాగ్‌’లాంటి సినిమాలతో మెప్పించాడు. మిస్సోరీలో 1971 మార్చి 10న పుట్టిన ఇతగాడు ఫస్ట్‌గ్రేడ్‌లో ఉండగానే ‘విన్నీ ద పూ’ పాత్రలో నటించి ఆకట్టుకున్నాడు. పదహారేళ్లకల్లా నాటక రంగంలో పాత్రలు ధరించాడు. ఓ పక్క క్రీడల్లో రాణిస్తూనే ప్రకటనలు, టీవీల్లో నటించి రాణించాడు.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.