సెప్టెంబర్‌ 11 (సినీ చరిత్రలో ఈరోజు)

* ‘ఇష్టం’తో వచ్చి... ఇష్టమైపోయి!
(శ్రియ పుట్టిన రోజు-1982)


వయసు మీదపడినా... వన్నె తరగని అందాల భామల జాబితాని తయారు చేస్తే అందులో శ్రియ శరణ్‌ మొదటి వరుసలో ఉంటుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఆమె వయసు 35 యేళ్లు. కానీ నవతరం భామలకి దీటైన అందంతో తెరపై మెరుస్తుంటుంది. అవకాశాల్ని అందుకోవడంలోనూ ఆమె జోరును ప్రదర్శిస్తోంది. ఉషాకిరణ్‌ మూవీస్‌ నిర్మించిన ‘ఇష్టం’తో తెరకు పరిచయమైందీ భామ. తొలి చిత్రంతోనే తన అందంతో కుర్రకారు మనసు దోచుకొంది. దాంతో వెంటనే అవకాశాలు వరుస కట్టాయి. ‘సంతోషం’ చిత్రంలో నాగార్జున సరసన నటించి విజయాన్ని సొంతం చేసుకొంది. ఇక అక్కడ్నుంచి ఆమె జైత్రయాత్ర కొనసాగుతూనే ఉంది. తెలుగుతో పాటు, మిగతా దక్షిణాది భాషలన్నింటిలోనూ నటించి పేరు తెచ్చుకొంది. హిందీ, ఇంగ్లిష్‌ చిత్రాల్లోనూ మెరిసింది. డెహ్రాడూన్‌లో సెప్టెంబరు 11, 1982లో జన్మించిన శ్రియ, హరిద్వార్‌లో పెరిగింది. ఈమె పూర్తి పేరు శ్రియశరణ్‌ భట్నాగర్‌. దిల్లీలోని లేడీ శ్రీరమ్‌ కాలేజ్‌లో డిగ్రీ చదువుకుంది. చిన్నప్పట్నుంచే డ్యాన్స్‌పై పట్టు పెంచుకొన్న శ్రియ కథక్, రాజస్థాన్‌ ఫోక్‌ డ్యాన్స్‌ నేర్చుకుంది. కాలేజీలో చదువుతున్నప్పుడే డ్యాన్స్‌ మాస్టర్‌ ప్రోత్సాహంతో ఓ మ్యూజిక్‌ వీడియోలో కనిపించే అవకాశం లభించింది. ఆ వీడియోనే ఆమెకి సినిమా అవకాశాలు తెచ్చిపెట్టింది. 2003లో ‘తుఝే మేరీ కసమ్‌’ చిత్రంతో హిందీలోకి అడుగుపెట్టింది. ఆ చిత్రం కూడా శ్రియకి మంచి పేరు తీసుకొచ్చింది. తెలుగులో ‘నువ్వే నువ్వే’తో పాటు, ‘ఠాగూర్‌’, ‘నీ మనసు నాకు తెలుసు’, ‘నేనున్నాను’, ‘అర్జున్‌’, ‘బాలు ఏబీసీడీఈఎఫ్‌జి’, ‘నా అల్లుడు’, ‘సదా మీ సేవలో’, ‘సోగ్గాడు’, ‘సుభాష్‌ చంద్రబోస్‌’, ‘మొగుడు పెళ్లాం ఓ దొంగోడు’, ‘ఛత్రపతి’, ‘భగీరథ’ ఇలా జయాపజయాలతో సంబంధం లేకుండా అవకాశాల్ని అందుకుంది శ్రియ. గత నాలుగేళ్లుగా ఆమె ‘మనం’, ‘గోపాల గోపాల’, ‘గౌతమీపుత్ర శాతకర్ణి’, ‘పైసావసూల్‌’ వంటి తెలుగు చిత్రాల్లో నటించి ప్రేక్షకుల్ని అలరించింది. నారా రోహిత్తో కలిసి ‘వీరభోగ వసంతరాయలు’ అనే చిత్రంలో నటించింది. 'ఎన్.టి.ఆర్: కథానాయకుడు'లో నాటి కథానాయిక ప్రభగా నటించింది. రష్యన్‌ బాయ్‌ఫ్రెండ్‌ ఆండ్రీ కొశ్చీవ్‌ని 12 మార్చి 2018లో వివాహం చేసుకొన్న శ్రియ, ఆ తర్వాత కూడా సినిమా ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. తమిళంలో ‘నరగాసూరన్‌’, హిందీలో ‘తడ్కా’ చిత్రాలు చేస్తోంది శ్రియ. ఈరోజు శ్రియ పుట్టినరోజు.

(పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి...)

* అయిదుగురు అక్కచెల్లెళ్ల కథ!


ప్రజాదరణ పొందిన నవలల్ని సినిమాలుగా తీయడం హాలీవుడ్‌లోనూ ఉంది.అలా 1813లో జానె ఆస్టెన్‌ రాసిన ‘ప్రైడ్‌ అండ్‌ ప్రిజుడీస్‌’ నవలను 2005లో సినిమాగా తీశారు. సంపన్న వర్గానికి చెందిన ఓ కుటుంబంలో పుట్టిన అయిదుగురు అక్కచెల్లెళ్లు వాళ్ల ఆశలు, వాస్తవాలు, ప్రేమలు, పెళ్లిళ్ల చుట్టూ అల్లిన కథ ఇది. జో రైట్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రాన్ని స్టూడియో కెనాల్, వర్కింగ్‌ టైటిల్‌ ఫిల్మ్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇందులో అక్కాచెల్లెళ్లుగా (బెన్నెట్స్‌) ఎలిజబెత్‌ బెన్నెట్‌గా కైరా నైట్లీ, జెనె బెన్నెట్‌గా రోష్‌ముండ్‌ పైక్, కిట్టిగా కారే ముల్లిగన్, లిడియాగా జెనా మలోన్‌లు నటించారు. 22 మిలియన్ల డాలర్స్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 121 మిలియన్‌ డాలర్లకు పైగా ఆర్జించింది. డారియో మరియోనెల్లి సంగీతం అందించారు. ఈ చిత్రానికి కియారా నైట్లీ 78వ అకాడమీ అవార్డ్సుకి నామినేట్‌ అయ్యింది. ఎన్నో అవార్డులు సాధించిన ఈ సినిమా 2005లో సెప్టెంబర్‌ 11న విడుదలై మంచి విజయాన్నే సాధించింది.

* అంగారకుడిపై కంగారు కథ!


అది 2035వ సంవత్సరం... అప్పటికి మానవులు అంగారక గ్రహంపైకి చేరుకున్నారు... అక్కడ 31 రోజుల పాటు పరిశోధనలు చేయాలనుకున్నారు... అనూహ్యంగా ఓ రోజు పెద్ద ఇసుక తుపాను చెలరేగుతుంది... ఒక వ్యోమగామి అందులో చిక్కు పడిపోతాడు... అతడి నుంచి సంకేతాలు ఆగిపోతాయి... మిగిలిన వ్యోమగాములు అతడు చనిపోయాడనుకుని, ఇక అక్కడుంటే ప్రమాదమని తాము వచ్చిన అంతరిక్షనౌకలోనే బయల్దేరిపోతారు. తుపానులో చిక్కుపడిపోయిన వ్యోమగామి బతుకుతాడు కానీ అంగారకుడు (మార్స్‌)పై తాత్కాలిక నివాసంలో ఒంటరిగా మిగిలిపోతాడు. భూమితో సంకేతాలు నిలిచిపోతాయి. మళ్లీ భూమి మీదకు రావాలంటే మరో మార్స్‌ మిషన్‌ ద్వారా వ్యోమగాములు వస్తే కానీ వీలు పడదు. కొన్నేళ్లు పడుతుంది. అతడి అత్యవసర సమస్య ఆహారం. మార్స్‌ మట్టి మీద వ్యోమగాముల విసర్జితాలనే ఎరువుగా వేసి, రాకెట్‌ ఇంధనం నుంచి హైడ్రోజన్‌ను తీసుకుని ఆక్సిజన్‌ నిల్వల సాయంతో నీటిని తయారు చేసుకుని బంగాళా దుంపలు లాంటివి పండించే ఏర్పాటు చేసుకుంటాడు. అక్కడ ఉన్న రోవర్లు, ఇతర పరికరాలతో భూమికి సంకేతాలు పంపే వ్యవస్థను తయారు చేసుకుంటాడు. తాను బతికే ఉన్నానని సంకేతాలు పంపిస్తాడు. మరి మళ్లీ మార్స్‌ యాత్ర సాధ్యమైందా? అంతవరకు ఒంటరి వ్యోమగామి ఎలా బతికాడు? ఇవన్నీ తెలియాలంటే ‘ద మార్షియన్‌’ సినిమా చూడాల్సిందే. సైన్స్‌ ఫిక్షన్‌గా తెరకెక్కించిన ఈ సినిమాను ఓ నవల ఆధారంగా తీశారు. 2015లో సెప్టెంబర్‌ 11న విడుదలైన ఈ సినిమా 630 మిలియన్‌ డాలర్లకు పైగా వసూలు చేయడంతో పాటు అనేక అవార్డులు పొందింది.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.