సెప్టెంబర్‌ 19.. (సినీ చరిత్రలో ఈరోజు)

* నేర ప్రపంచం మూలాలు!


తెలిసీ తెలియని వయసులో సరదాల కోసమో, సంపాదన కోసమో నేరప్రపంచానికి దగ్గరైన యువకులు ఎలా పతనమవుతారో ఆకట్టుకునేలా చెప్పిన సినిమా ‘గుడ్‌ఫెల్లాస్‌’. రచయిత నికొలాస్‌ పిలేగి కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా రాసిన ‘వైజ్‌ గై’ అనే నవల ఆధారంగా, మార్టిన్‌ స్కోర్సెస్‌ దర్శకత్వంలో రూపొందించిన ఈ సినిమా, 1990లో ఇదే రోజు విడుదలై విజయవంతమైంది. ఈ సినిమాలో నటించిన రాబర్ట్‌ డెనీరో, జో పెసీ, రే లాయిటాలు రచయితను కలిసి, నేర ప్రపంచపు మూలాల గురించి తెలుసుకుని మరీ తమ పాత్రలకు పదును పెట్టుకోవడం విశేషం. ఆరు ఆస్కార్‌ నామినేషన్లు, రెండు ఆస్కార్‌ అవార్డులు, బ్రిటిష్‌ అకాడమీ నుంచి అయిదు అవార్డులు పొందిన ఈ సినిమాను అమెరికా ప్రభుత్వం జాతీయ ఫిలిం రిజిస్ట్రీలో భద్రపరిచింది.

* అవార్డుల నటుడు


అతడు నాటకాల్లో నటిస్తే ఆ రంగంలో ప్రతిష్ఠాత్మకమైన టోనీ అవార్డు వచ్చింది... టీవీల్లో నటిస్తే ఎమ్మీ అవార్డు వచ్చింది... సినిమాల్లో నటిస్తే ఆస్కార్‌ అవార్డు వచ్చింది... వీటితో పాటు ఎన్నో పురస్కారాలు, అంతకుమించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న నటుడు జెరెమీ జాన్‌ ఐరన్స్‌. ‘ద ఫ్రెంచ్‌ ల్యూటినెంట్స్‌ ఉమన్‌’, ‘మూన్‌లైటింగ్‌’, ‘బెట్రేయల్‌’, ‘ద మిషన్‌’, ‘దెడ్‌ రింగర్స్‌’, ‘రివర్సల్‌ ఆఫ్‌ ఫార్ట్యూన్‌’, ‘ద హౌస్‌ ఆఫ్‌ ద స్పిరిట్స్‌’, ‘డైహార్డ్‌ విత్‌ ఎ వెంగెన్స్‌’, ‘లొలితా’, ‘ద మేన్‌ ఇన్‌ ద ఐరన్‌ మాస్క్‌’, ‘డేంజరస్‌ అండ్‌ డ్రాగన్స్‌’, ‘ద మర్చంట్‌ ఆఫ్‌ వెనిస్‌’, ‘ఎరగాన్‌’, ‘బ్యాట్‌మేన్‌ వెర్సెస్‌ సూపర్‌మేన్‌’ లాంటి సినిమాల్లో అతడి నటన ప్రపంచ సినీ అభిమానులకు చిరపరిచితమే. నాటకం, టీవీ, సినీ రంగాల్లో ఉత్తమ నటనకు ఇచ్చే అత్యున్నత పురస్కారాలైన టోనీ, ఎమ్మీ, అకాడమీ అవార్డులను అందుకోవడం ద్వారా ‘ట్రిపుల్‌ క్రౌన్‌ ఆఫ్‌ యాక్టింగ్‌’ గుర్తింపును పొందిన అతి తక్కువ మంది నటుల్లో ఒకడుగా నిలిచాడు. ఇంగ్లండ్‌లో 1948 సెప్టెంబర్‌ 19న పుట్టిన ఇతడు, స్కూలు రోజుల నుంచే నటుడిగా పేరుతెచ్చుకుని అంచెలంచెలుగా ఎదిగాడు.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.