సెప్టెంబర్‌ 21.. (సినీ చరిత్రలో ఈరోజే)

* ప్రయోగం సృజనాత్మకం!
సింగీతం (పుట్టినరోజు-1931)


‘పు
ష్పక విమానం’... మాటలు నేర్చిన సినిమాకి మౌనం గుర్తు చేసింది! ‘విచిత్ర సహోదరులు’... మరుగుజ్జు పాత్రలోకి హీరోని కుదించి ఆశ్చర్యానికి గురి చేసింది! ‘మైకేల్‌ మదన కామ రాజు’... ఒక హీరోని నాలుగు పాత్రల్లో చూపించి విస్తుపోయేలా చేసింది! ‘మయూరి’... కాలు కోల్పోయిన ఓ నర్తకి నిజజీవితాన్ని కథని కళ్ల ముందు నిలిపి స్ఫూర్తిని పంచింది! ‘ఆదిత్య 369’... కథను భూత, భవిష్యత్, వర్తమానాల్లోకి నడిపించి అలనాటి కృష్ణదేవరాయల్ని కళ్ల ముందు నిలిపి ఆకట్టుకుంది! ‘భైరవద్వీపం’... జానపదాలను మర్చిపోయిన ప్రేక్షకులకు ఆ మజాను మరోసారి చవిచూపించింది!

- ఇలా ఒకటా.. రెండా... ఆ దిగ్దర్శకుడు చేసిన ప్రతి ప్రయోగం జనరంజకమై అలరించింది. ఆయనే సృజనాత్మకతకు మారుపేరుగా పేరొందిన సింగీతం శ్రీనివాసరావు. దర్శకుడిగా, నిర్మాతగా, స్కీన్ర్‌ రైటర్‌గా, కంపోజర్‌గా, గాయకుడిగా, గీత రచయితగా, నటుడిగా బహుముఖ ప్రతిభను చూపించి ఆయన తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ చిత్ర సీమల్లో తనదైన ముద్ర వేశారు. జాతీయ అవార్డులతో పాటు ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. ఆయన తీసిన యానిమేషన్‌ చిత్రాలు ‘సన్‌ ఆఫ్‌ అలాద్దీన్‌’, ‘ఘటోత్కచ్’ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రశంసలు అందుకున్నాయి. గూడూరులో 1931 సెప్టెంబర్‌ 21న పుట్టిన సింగీతం శ్రీనివాసరావు, తెలుగు సినీ పరిశ్రమ ప్రతి దశను చూశారు.

(ప్రత్యేక వార్త కోసం క్లిక్‌ చేయండి...)

* కపూర్ల కుటుంబంలో కలికితురాయి!
కరీనా (పుట్టినరోజు-1980)


ప్రే
మ కథలైనా... కామెడీ కథలైనా... క్రైమ్‌ స్టోరీలైనా... ఇట్టే ఇమిడిపోతుంది కరీనా కపూర్‌. బాలీవుడ్‌లో తరతరాలుగా వినోదరంగాన్ని అలరిస్తున్న కపూర్స్‌ కుటుంబానికి చెందిన మెరుపుతీగ ఈమె. రణధీర్‌ కపూర్, బబితల తనయగా వెండితెరపైకి వచ్చినా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సాధించిందనడానికి ఆమె అందుకున్న అవార్డులే గీటురాళ్లు. బాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం అందుకుంటున్న నాయికల్లో ఒకరిగా నిలిచిన కరీనా, ‘రెఫ్యూజీ’ (2000) సినిమాతో రంగ ప్రవేశం చేసింది. ఆపై ‘అశోకా’, ‘కభీ ఖుష్‌ కభీ ఘమ్‌’, ‘ఛమేలీ’, ‘ఓంకారా’, ‘జబ్‌ వుయ్‌ మెట్‌’, ‘త్రీ ఇడియట్స్‌’, ‘భజరంగి భయ్‌జాన్‌’, ‘ఉడ్తా పంజాబ్‌’ లాంటి సినిమాలతో తానేంటో నిరూపించుకుంది. సైఫ్‌ అలీఖాన్‌ను పెళ్లాడి ఓ బిడ్డకు తల్లి అయినా, అందం, అభినయంతో మిగతా కథానాయికలకు పోటీ ఇస్తోంది.  1980 సెప్టెంబర్‌ 21న ముంబైలో పుట్టిన కరీనా కపూర్‌ వన్నెతరగని ప్రతిభతో మరింతగా దూసుకుపోవాలని ఆమె పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు కోరుకుంటున్నారు.

(ప్రత్యేక వార్త కోసం క్లిక్‌ చేయండి...)

* ఓ యువకుడి అసాధారణ జీవితం


సం
పన్నులైన తల్లిదండ్రులు... ఆత్మీయత గల కుటుంబం... ఇలాంటి నేపథ్యంలోంచి వచ్చిన ఏ మామూలు యువకుడైనా ఏం చేస్తాడు? హాయిగా చదువుకుని మంచి ఉద్యోగంలో స్థిరపడి, జీవితాన్ని సుఖంగా, ఆనందంగా గడిపేస్తాడు. కానీ... క్రిస్టోఫర్‌ మెక్‌కాండిల్స్‌ మామూలు యువకుడు కాడు. ఈ బంధాలు, బాధ్యతల జీవితం నుంచి బయటపడి తనేంటో తాను తెలుసుకోవాలనుకున్నాడు. నిజమైన స్వేచ్ఛను అనుభవించాలనుకున్నాడు. అన్నీ వదిలేసి అడవులు, కొండలు, కోనలు, నదులు దాటుకుంటూ నచ్చిన పని చేస్తూ నచ్చిన చోట ఉంటూ తనకు నచ్చినట్టు దేశమంతా తిరిగాడు. ఆ యువకుడి కథను అమెరికా రచయిత ‘ఇన్‌ టు ద వైల్డ్‌’ అనే పుస్తకంగా రాశాడు. అందరినీ ఆకట్టుకున్న ఆ పుస్తకం ఆధారంగా అదే పేరుతో 2007లో ఓ సినిమా తీస్తే అది జనాదరణ పొందడంతో పాటు అనేక పురస్కారాలు అందుకుంది. కాలేజీలో డిగ్రీ పూర్తయ్యాక అమ్మానాన్నా కానుకగా ఇచ్చిన కొత్త కారును తిరస్కరించిన మెక్‌కాండిల్‌్్స, ఆ తర్వాత ఎవరికీ తెలియకుండా, తన గుర్తింపు కార్డులన్నీ చింపేసి, తను దాచుకున్న డబ్బంతా దానం చేసి, ఏమీ లేకుండా ఉత్తర అమెరికా అంతా తిరగాలని బయల్దేరుతాడు. ఎప్పటికప్పుడు ఏదో ఒక పని చేసి ఎంతో కొంత సంపాదించుకోవడం, దాన్ని ఖర్చు పెట్టుకుంటూ నచ్చిన చోటుకి సాగిపోవడం... ఇదీ అతడి లక్ష్యం. ప్రకృతితో మమేకమై జీవితం గడపాలనే ఉద్దేశంతో అడవులు, కొండలు, కోనల్లో సాహసాల ప్రయాణం మొదలు పెడతాడు. మధ్యలో ఎందరినో కలుసుకుంటాడు, ఎన్నో ప్రమాదాలు ఎదుర్కొంటాడు. అతడి అసాధారణ ప్రయాణమే కథగా తీసిన ఈ సినిమాను 20 మిలియన్‌ డాలర్లతో తీస్తే, 56 మిలియన్‌ డాలర్లను ఆర్జించింది. ప్రతిష్ఠాత్మకమైన ఎన్నో అవార్డులు, ప్రశంసలు అందుకుంది.

* నవ్వుల నటుడు


వ్వులు పండిస్తూ అమెరికాలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన వాడు విలియం జేమ్స్‌ముర్రే. టీవీలు, నాటకాలు, సినిమాల్లో అతడి అభినయం అనేక అవార్డులను తెచ్చిపెట్టింది. ‘ఘోస్ట్‌ బస్టర్స్‌’ సినిమాలతో అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్న ఇతడు ‘మీట్‌బాల్స్‌’, ‘క్యాడీషాక్‌’, ‘స్ట్రైప్స్‌’, ‘టూటైజ్‌’, ‘వాటెబౌట్‌ బాబ్‌’, ‘గ్రౌండ్‌హాగ్‌ డే’, ‘క్విక్‌ ఛేంజ్‌’, ‘రష్‌మోర్‌’లాంటి సినిమాల ద్వారా కమేడియన్‌గా ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు. నటుడిగా, కమేడియన్‌గా, నిర్మాతగా, రచయితగా ఎదిగాడు. ఎమ్మీ, గోల్డెన్‌గ్లోబ్, బాఫ్టా, మార్క్‌ట్వైన్‌ ప్రైజ్‌ ఫర్‌ అమెరికన్‌ హ్యూమర్‌ లాంటి ఎన్నో పురస్కారాలు అందుకున్నాడు. ఇల్లినాయిస్‌లో 1950 సెప్టెంబర్‌ 21న ఎనిమిది మంది సంతానంలో ఒకడిగా పుట్టిన ఇతడు కాలేజీ రోజుల్లో హాస్య ప్రదర్శనల వైపు ఆకర్షితుడయ్యాడు. ఆపై టీవీలు, సినిమాల ద్వారా ప్రాచర్యం పొందాడు. ఇతడి తోబుట్టువులైన జాన్‌ ముర్రే, జోయల్‌ ముర్రే, బ్రియాన్‌ డోయల్‌ ముర్రేలు కూడా నటులుగా గుర్తింపు పొందడం విశేషం.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.