సెప్టెంబర్‌ 22.. (సినీ చరిత్రలో ఈరోజు)

* మనసును దోచే మార్దవం!
 పి.బి.శ్రీనివాస్‌ (జయంతి-1930)


ప్రతివాది భయంకర శ్రీనివాస్‌ అంటే ఎవరో అనుకుంటారు. అదే పి.బి.శ్రీనివాస్‌ అంటే సినీ గాయకుడుగా పోల్చుకుంటారు. పి.బి.శ్రీనివాస్‌ ఏ పాట పాడినా, ఆయన గళంలోని మార్దవం శ్రోతల మనసుల్ని దోచుకునేది. కాకినాడలో పుట్టిన పీబీ, కన్నడ, తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, తులు, కొంకణి భాషల్లో దాదాపు 3000 పాటలు పాడారు. ప్రభుత్వ అధికారి కావాలనే కోరికతో తండ్రి చదివిస్తే, పీబీ శ్రీనివాస్‌ అడుగులు సినీ రంగంవైపు పడ్డాయి. అమ్మ పాడే కీర్తనలు, రేడియోలో పాటలు వింటూ, నేర్చుకుంటూ, పాడుతూ పెరిగిన ఆయన బాలీవుడ్‌ గాయకుడు మహమ్మద్‌ రఫీని ఎంతగానో ఇష్టపడేవారు. పన్నెండేళ్ల వయసులో తొలిసారిగా ఓ నాటకంలో పాట పాడారు. ప్రఖ్యాత వీణ కళాకారుడు ఈమని శంకరశాస్త్రి వీరి కుటుంబానికి సన్నిహితుడు కావడంతో ఆయన పీబీ శ్రీనివాస్‌ను జెమినీ స్టూడియో అధినేత ఎస్‌ఎస్‌ వాసన్‌కు పరిచయం చేశారు. అలా 1952లో జెమినీ వారు తీసిన హిందీ సినిమా ‘మిస్టర్‌ సంపత్‌’తో పీబీ సినీ నేపథ్య గాయకుడిగా మారారు. కన్నడంలో అత్యధిక పాటలు పాడిన పీబీ శ్రీనివాస్‌. తెలుగులో ఆణిముత్యాల్లాంటి ఎన్నో పాటలు ఆలపించారు. ‘బుజ్జి బుజ్జి పాపాయి బుల్లి బుల్లి పాపాయి’, ‘ఓ హంస నడల దానా’, ‘వెన్నెలకేలా నాపై కోపం సెగలై ఎగసినది’, ‘ఎవరికి ఎవరు కాపాలా’, ‘ఊరు మారినా ఉనికి మారినా’, ‘ఏవేవో చిలిపి తలపులురుకుతున్నవి’, ‘ఓహో గులాబి బాలా’, ‘అది ఒక ఇదిలే’, ‘ఆనాటి చెలిమి ఒక కల’, ‘తలచినదే జరిగినదా దైవం ఎందులకు’, ‘వెన్నెల రేయి ఎంతో చలిచలి’, ‘చిగురాకుల ఊయలలో’, ‘నీలికన్నుల నీడల లోన’లాంటి ఎన్నో పాటలు తెలుగు ప్రేక్షకుల మదిలో ఇప్పటికీ మారుమోగుతూ ఉంటాయి. గాయకుడిగానే కాకుండా పీబీ శ్రీనివాస్‌ కవిగా కూడా ముద్ర వేశారు. ఎనిమిది భాషల్లో అనర్గళంగా మాట్లాడగలగడమే కాదు, వాటిలో కవిత్వాలు రాయగలిగిన పండితుడు. మార్దవానికి మారుపేరైన శ్రీనివాస్‌ 2013 ఏప్రిల్‌ 14న తన 82వ ఏట చెన్నైలో మరణించారు. ఈరోజు పీబీ జయంతి.

(ప్రత్యేక వార్త కోసం క్లిక్‌ చేయండి...)

* అభినయంలో
ముని... పాల్‌ముని!


ఎప్పుడో 125 ఏళ్ల క్రితం పుట్టిన ఓ నటుడి గురించి ఇప్పటికీ అభినయ రంగంలో ఉన్నవాళ్లు గౌరవంగా తల్చుకుంటారంటే అతడి ప్రతిభ అనన్య సామాన్యమైనదని అర్థం అవుతుంది. అటువంటి మహోన్నత నటుడే పాల్‌ముని. తెలుగు చిత్రసీమలో గురుతుల్యుడైన నాగయ్యను అప్పట్లో ‘పాల్‌ముని ఆఫ్‌ ఇండియా’ అని పేర్కొనేవారంటే పాల్‌ముని ప్రభావం ఎంతటితో తెలుస్తుంది. నాటకంలో కానీ, సినిమాలో కానీ అతడు పనిచేయడానికి ఒప్పుకుంటే ఏ పాత్ర కావాలో అతడినే ఎంచుకోమనేంత స్వేచ్ఛను అతడికి ఇచ్చేవారు అప్పటి దర్శక నిర్మాతలు. అంతటి గౌరవాన్ని అందుకున్న పాల్‌ముని ఎన్నో చిరస్మరణీయమైన పాత్రలకు ప్రాణం పోశాడు. ఓ నటుడు ఓ పాత్రను ఒప్పుకుంటే దర్శకుడు చెప్పినట్టు చేస్తే చాలనుకుంటాడు. కానీ పాల్‌ముని అలా కాదు. ఆ పాత్ర గురించి సమస్త సమాచారాన్ని సేకరించేవాడు. ఆ పాత్రకు సంబంధించిన పుస్తకాలన్నీ చదివేవాడు. ఆ పాత్రతో పరిచయం ఉన్నవారిని కలిసి, మాట్లాడి శరీర భాష, మాట్లాడే తీరులాంటి ఎన్నో సంగతులను ఆకళింపు చేసుకునేవాడు. ఆ తర్వాతనే ఆ పాత్రను పోషించేవాడు. అందుకే అతడు ధరించిన జీవిత పాత్రలు ఇన్నాళ్లకీ అద్భుతంగా కనిపిస్తాయి. ఉక్రెయిన్‌ దగ్గరి లెంబర్గ్‌లో 1895 సెప్టెంబర్‌ 22న పుట్టిన పాల్‌ముని తల్లిదండ్రులిద్దరూ నాటక రంగంలో నటీనటులే. చిన్నప్పటి నుంచీ ఆ వాతావరణంలో పెరిగిన పాల్‌ముని నటన మీద విపరీతమైన ఆసక్తిని పెంచుకున్నాడు. తల్లిదండ్రులతో కలిసి షికాగోలో చిన్నప్పుడే నటనా ప్రస్థానం మొదలు పెట్టాడు. ముఖ్యంగా మేకప్‌పై అతడి శ్రద్ధ, అధ్యయనం అతడిని ఓ విలక్షణ నటుడిగా తీర్చిదిద్దాయి. పన్నెండేళ్ల వయసులో అతడు వేసిన మొదటి వేషమేంటో తెలుసా? 80 ఏళ్ల వృద్ధుడి వేషం. ఆ పాత్ర పోషణ కోసం అతడు వేసుకున్న మేకప్, శరీర భాష, సంభాషణలు పలికిన తీరు చూసి పెద్ద పెద్ద నటులు కూడా ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత అభినయ రంగంలో అతడొక సంచలనంగా మారిపోయాడు. తొలి సినిమా ‘ద వేలియంట్‌’ (1929)లో నటనకే అతడికి ఆస్కార్‌ నామినేషన్‌ లభించింది. ఆపై ‘శాక్రిఫైజ్‌’, ‘ఐ యామ్‌ ఫ్యుగిటివ్‌ ఫ్రమ్‌ ఎ చైన్‌గ్యాంగ్‌’ లాంటి సినిమాలు అతడిలోని ప్రతిభను చిత్రసీమకు పరిచయం చేశాయి. ప్రముఖ శాస్త్రవేత్త జీవితాధారంగా తీసిన ‘ద స్టోరీ ఆఫ్‌ లూయిస్‌ పాశ్చర్‌’ సినిమాతో అతడి ఖ్యాతి ప్రపంచ దేశాలకు పాకింది. తర్వాత బయోపిక్‌ సినిమాలకు అతడే చిరునామా అయ్యాడు. ‘డిజ్రాయిల్‌’, ‘అలగ్జాండర్‌ హ్యామిల్టన్‌’, ‘వోల్టైర్‌’, ‘ద లైఫ్‌ ఆఫ్‌ ఎమిలే జోలా’, ‘జ్యువారెజ్‌’, ‘ద గుడ్‌ ఎర్త్‌’లాంటి బయోపిక్స్‌లో అతడి నటన జేజేలు అందుకుంది. ఓ పక్క సినిమాల్లో విలక్షణ పాత్రలు పోషిస్తూనే, నాటకాలు, టీవీల ద్వారా మేటి నటుడిగా ప్రాచుర్యం పొందాడు. ఆస్కార్‌ సహా ఎన్నో ప్రతిష్ఠాత్మక పురస్కారాలను అందుకున్నాడు. ‘నటన అనేది అతడికి వ్యాపకం కాదు... పిచ్చి’ అనేవాళ్లు అందరూ అతడి అంకితభావాన్ని, తపనను చూసి. అభినయ రంగంలో తన పేరు సువర్ణాక్షరాలతో లిఖించుకున్న పాల్‌ముని, 1967 ఆగస్టు 25న తన 71 ఏట కాలిఫోర్నియాలో కన్నుమూశాడు. ఈరోజు పాల్‌ముని జయంతి.

(ప్రత్యేక వార్త కోసం క్లిక్‌ చేయండి...)  

..............................................................................................................................................................

మాతృత్వానికి మారు పేరు
దుర్గాఖొటే (వర్ధంతి -1991)(ప్రత్యేక వార్త కోసం క్లిక్‌ చేయండి...)  


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.