మార్చి 15 (సినీ చరిత్రలో ఈరోజు)...

* సినీ చరిత్రలో మేటి సినిమా!


- ప్రపంచ సినీ చరిత్రలోనే ఓ గొప్ప సినిమాగా పేరొందింది...

- ఎన్నో భాషల్లో వచ్చిన ఎన్నో మాఫియా కథలకు నాందిగా నిలిచింది...

- మూడు ఆస్కార్‌లతో పాటు మరెన్నో ప్రతిష్ఠాత్మకమైన పురస్కారాలు గెల్చుకుంది...

- మరో రెండు సీక్వెల్‌ సినిమాలకు మూలమైంది...

- 6.5 మిలియన్‌ డాలర్లతో నిర్మితమై, ఏకంగా 286 మిలియన్‌ డాలర్లు కురిపించింది...

- జాతీయ సినీ గ్రంథాలయంలో చోటు సంపాదించింది...
 
-ఆ సినిమానే ‘ది గాడ్‌ఫాదర్‌’ (1972).అమెరికా, ఇటలీలలో వేళ్లూనుకుపోయిన నేర సామ్రాజ్యాలు, నేరగాళ్ల ముఠాలనే నేపథ్యంలో తీసుకుని అమెరికాకు చెందిన రచయిత, జర్నలిస్ట్‌ మారియో పుజో 1969లో రాసిన నవల ఆధారంగా ఈ సినిమాను తీశారు. ప్యారమౌంట్‌ పిక్చర్స్‌ సంస్థ తీసిన ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు ఫ్రాన్సిస్‌ ఫోర్డ్‌ కొప్పాలా దర్శకత్వం వహించాడు. ప్రధాన పాత్రలో ప్రముఖ నటుడు మార్లన్‌ బ్రాండో నటించాడు. మాఫియా నాయకుడి కథగా ఇది, చీకటి సామ్రాజ్యంలో ఎత్తులు, పైఎత్తులు, ఆధిపత్యం కోసం పోరాటాలు వంటి అంశాలతో ఉత్కంఠభరితంగా సాగుతుంది. దీనికి కొనసాగింపుగా ‘ద గాడ్‌ఫాదర్‌ 2’ (1974), ‘ది గాడ్‌ఫాదర్‌ 3’ (1990) సినిమాలు వచ్చి విజయవంతమయ్యాయి.

* హాలీవుడ్‌ అందగత్తె


‘హాలీవుడ్స్‌ మోస్ట్‌ బ్యూటిఫుల్‌ ఉమన్‌’ అనే గుర్తింపు ఆమె సొంతం. నటిగా, నిర్మాతగా, దర్శకురాలిగా, ఉద్యమ కారిణిగా, వ్యాపారవేత్తగా ఆమె ప్రతిభ బహుముఖంగా విస్తరించింది. ఆ అందాల తార ఎవా లాంగోరియా. బుల్లితెర ద్వారా ఇంటింటి నటి అయిన ఈమె, ఆ నటనకు గోల్డెన్‌గ్లోబ్, స్క్రీన్‌ యాక్టర్స్‌ గిల్డ్‌ అవార్డులు పొందింది. వెండితెరపై ఆమె అందం, అభినయం చూడాలంటే ‘ద సెంటినెల్‌’, ‘ఓవర్‌ హెర్‌ డెడ్‌బాడీ’, ‘ఫర్‌ గ్రేటర్‌ గ్లోరీ’, ‘ఫ్రాంటెరా’, ‘లోరైడ్స్‌’, ‘ఓవర్‌బోర్డ్‌’ సినిమాలు చూడాలి. టెక్సాస్‌లో 1975 మార్చి 15న పుట్టిన ఈమె, వ్యాపార వేత్తగా రాణిస్తూనే సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ, సామాజిక కారణాలపై ఉద్యమిస్తూ... తనకు అందమైన శరీరంలో అందమైన మనసుకూడా ఉందని నిరూపించుకుంటోంది.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.