జూన్‌ 9.. (సినీ చరిత్రలో ఈరోజు)

* సొగసు చూడతరమా
(సోనమ్‌ కపూర్‌ పుట్టిన రోజు-1985)


బాలీవుడ్‌లో తండ్రికి తగ్గ తనయగా పేరు తెచ్చుకుంది నటి సోనమ్‌ కపూర్‌. అగ్రకథానాయకుడు అనిల్‌ కపూర్‌ ముద్దుల కుమార్తె ఈమె. వరుస హిట్లతో ముందుకు దూసుకుపోతూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది. ప్రస్తుతం భారీ పారితోషికం తీసుకుంటున్న నటీమణుల్లో ఆమె ఒకరు. నటించింది కొన్ని సినిమాలైనా ఎక్కువ హిట్లు అందుకుంది. తొలిసారిగా ‘బ్లాక్‌’ అనే సినిమాకు సంజయ్‌లీలా భన్సాలీ దగ్గర సహాయ దర్శకురాలిగా బాలీవుడ్‌లో రంగప్రవేశం చేసింది. ఆ తర్వాత హీరోయిన్‌గా రణ్‌బీర్‌ కపూర్‌తో కలసి ‘సావరియా’లో నటించి మెప్పించింది. ‘రాంజానా’లో సిగ్గుపడుతూ మురిపించింది. బాలీవుడ్‌లో ఆమెకు అవకాశాలొచ్చేలా చేసిందీ చిత్రం. ఇక ‘భాగ్‌ మిల్కా భాగ్‌’తో భారీ విజయాన్నుందుకుంది. ‘బేవకూఫియాన్‌’లో అల్లరిపిల్లగా అందరినీ మంత్రముగ్థుల్ని చేసింది. ఈ మూడు చిత్రాలతో హ్యాట్రిక్‌ హిట్టందుకుంది. ‘డోలీ కీ డోలీ’లో మంచి ప్రతిభ కనబరిచింది. ఇక సోనమ్‌ కేరీర్‌లో బ్లాక్‌ బాస్టర్‌గా నిలిచిన చిత్రం ‘ప్రేమ్‌ రతన్‌ ధన్‌ పాయో’. దీంతో ఆమె రెమ్యూనరేషన్‌ అమాంతం పెరిగిపోయింది. ఉగ్రవాదులు హైజాక్‌ చేసిన విమానం నుంచి ప్రయాణికులను రక్షించిన ప్రముఖ మోడల్‌ నీరజా భనోట్‌ పాత్రను ‘నీరజా’ చిత్రంలో ఒక సామాజిక కోణాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. ఈ చిత్రానికి సోనమ్‌ జాతీయ పురస్కారంతోపాటు ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులు వరించాయి. ‘పాడ్‌మ్యాన్‌’లో అక్షయ్‌ కుమార్‌కు అక్షయపాత్రలా సాయమందిస్తూ మంచి ప్రతిభ కనబరిచింది. ఈ చిత్రంలో నటనకుగాను దాదాసాహెబ్‌ ఫాల్కే ఫౌండేషన్‌ పురస్కారాన్ని అందుకుందామె. నటిగా సోనమ్‌ ఎన్నో అవార్డులను కైవసం చేసుకుంది. 2018 ‘వీరే దీ వెడ్డింగ్‌’లో నటించింది. ‘సంజు’లో రణ్‌బీర్‌ సింగ్‌ ప్రేమికురాలిగా నటించింది. సోనమ్‌ కపూర్‌ గత ఏడాది ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ అహూజాను వివామాడింది. ఇవాళ సోనమ్‌ (జూన్‌ 9న 1985) పుట్టినరోజు.

* కహోనా... ప్యారీ
(అమీషా పటేల్‌ పుట్టిన రోజు-1975)


బాలీవుడ్‌లో అమాయకపు చూపులతో అభిమానులను ఆకట్టుకునే నటి అమీషా పటేల్‌. ‘కహోనా ప్యార్‌ హై’తో ప్రేక్షకుల మనసులో ఒదిగిపోయిందీ అందాల తార. ఆమె హిందీ, తెలుగు, తమిళ భాషల్లో పలు చిత్రాల్లో నటించింది. మోడల్‌గా జీవితాన్ని ప్రారంభించి నిర్మాతగా మారిందీ ముద్దుగుమ్మ. వాళ్ల నాన్న స్కూల్‌మేట్‌ అయిన రాకేష్‌ రోషన్‌ కుమారుడు హృతిక్‌ రోషన్‌తో కలసి తొలిసారిగా రొమాంటిక్‌ థ్రిల్లర్‌ సినిమా ‘కహోనా ప్యార్‌ హై’లో నటించి అందరినీ ఆకట్టుకుంది. నిజానికి ఈ సినిమా కోసం 500 మంది అమ్మాయిలను ఆడిషన్స్‌ కోసం పిలవగా అందులో అమీషా పటేలే ఎంపిక కావడం విశేషం. అనుకోకుండానే ఈ చిత్రం భారీ విజయాన్నందుకుని బాలీవుడ్‌లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చింది. వెంటనే తెలుగులో పవన్‌కల్యాణ్‌ సరసన ‘బద్రీ’లో నటించింది. కానీ ఇదంతగా ఆడలేదు. మరో ప్రేమకథా చిత్రం ‘గదర్‌: ఏక్‌ ప్రేమ్‌ కథ’తో విమర్శకుల ప్రశంసలందుకుంది. దీనికిగాను ఆమెను తొలి ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు వరించింది. తర్వాత వరుస పరాజయాలతో సతమతమయ్యింది. ఇక ‘హమ్‌రాజ్‌’తో బ్లాక్‌ బాస్టర్‌ హిట్టుకొట్టింది. తెలుగులో సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబుతో ‘నాని’లో నటించి ఓకే అనిపించింది. ఎన్టీఆర్‌తో చేసిన ‘నర్సింహుడు’లో అంతగా మెప్పించలేకపోయింది. ఆ తర్వాత అక్షయ్‌ కుమార్‌తో నటించిన ‘భూల్‌ భులాయియా’ చిత్రంతో అగ్ర కథానాయకుల జాబితాలో చోటుదక్కించుకుంది. ఆ రోజుల్లో బాలీవుడ్‌లో శృంగారతారంటే అందరికీ గుర్తొచ్చే నటి అమీషా పటేల్‌ మాత్రమే. ఆ తర్వాత వరుస పరాజయాలతో జైత్రయాత్రను కొనసాగించలేకపోయింది. తర్వాత కొన్ని చిత్రాల్లో ప్రత్యేక పాత్రల్లో అలా కనిపిస్తూ వచ్చింది. సల్లూభాయ్‌ ‘రేస్‌ 2’ చిత్రంలో ప్రత్యేకంగా కనిపించింది. జంతు సంరక్షణ కోసం ఉద్యమం నిర్వహించింది. 2004లో దేశంలో సునామీ సంభవించినప్పుడు ఆర్ధిక సాయమందించింది. ప్రముఖ నటులు జాన్‌ అబ్రహం, కిరణ్‌ ఖేర్‌లతో కలసి ఐక్యరాజ్యసమితి ప్రతినిధిగా మానవ అక్రమ రవాణా, మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రచారం చేసింది. తాజాగా ఆమె కథానాయకురాలిగా రొమాంటిక్‌ హాస్య చిత్రం ‘దేశీ మ్యాజిక్‌’ను నిర్మిస్తోంది. మరో హాస్య చిత్రం ‘భయ్యాజీ సూపర్‌హిట్‌’లో నటించింది.కనవ్‌ పూరితో ప్రేమ వ్యవహారం నడిపిన అమీషా ఇంత వరకూ పెళ్లి చేసుకోలేదు. ఎత్తుపల్లాలతో సాగిన అమీషా జీవితం విభిన్నమైంది. ఇవాళ ఆమె (జూన్‌ 9, 1975) పుట్టినరోజు.

* భలే బాతు


డొనాల్డ్‌ డక్‌ పేరు వినని వారెవరూ ఉండరు. కార్టూన్‌ పాత్రగా ప్రపంచవ్యాప్తంగా పిల్లల్ని, పెద్దల్ని ఆకట్టుకున్న ఈ బాతు పాత్ర తొలిసారిగా 1934లో ఇదే రోజు ‘ద వైజ్‌ లిటిల్‌ హెన్‌’ చిత్రం ద్వారా వెండితెరపై వెలుగులీనింది. వాల్ట్‌డిస్నీ ప్రొడక్షన్స్‌ సంస్థ దొనాల్డ్‌ డక్‌ను సృష్టించింది. అతి తెలివితో, తెంపరితనంగా మాట్లాడుతూ ఆకట్టుకునే ఈ కొంటె బాతు పాత్ర, డిస్నీ వాళ్లే సృష్టించిన ‘మిక్కీ మౌస్‌’తో సమానంగా ప్రపంచాన్ని ఆకర్షించింది. యాభై మేటి కార్టూన్‌ పాత్రల్లో ఒకటిగా నిలిచింది. రెండు దశాబ్దాల్లో దాదాపు 150 సినిమాల్లో నవ్వించి అలరించింది. ఆస్కార్‌ అవార్డుల వేడుకల్లో ఎన్నోసార్లు గుర్తింపు పొందింది. ఆస్ట్రేలియాకు చెందిన క్రికెట్‌ క్రీడాకారుడు డొనాల్డ్‌ బ్రాడ్‌మన్‌ అమెరికా పర్యటనలో ఆడుతూ డక్‌ అవుట్‌ అవడాన్ని గమనించిన వాల్ట్‌డిస్నీ తన కార్టూన్‌ పాత్రకు ఇలా పేరు పెట్టాడని చెబుతారు.

* ప్రపంచంలోనే గొప్ప నటుడు

అతడికి ‘వరల్డ్స్‌ బిగ్గెస్ట్‌ ఫిల్మ్‌ స్టార్‌’ అనే గుర్తింపు ఉంది...
అతడి సినిమాలు ప్రపంచవ్యాప్తంగా 10 బిలియన్‌ డాలర్లను వసూలు చేశాయి...
అతడికి ప్రపంచంలోనే అత్యధిక పారితోషికం అందుకున్న నటుడిగా గిన్నిస్‌ రికార్డు ఉంది...

ఇన్ని విశేషణాలు ఉన్న ఆ నటుడు ఎవరో తెలుసా? జాన్‌ క్రిస్టోఫర్‌ డెప్‌2. టూకీగా జానీ డెప్‌. ఈ పేరు వినగానే సినీ అభిమానులకు అతడి సినిమాలు కళ్ల ముందు కదులుతాయి. ‘పైరేట్స్‌ ఆఫ్‌ ద కరీబియాన్‌’, ‘చార్లీ అండ్‌ ద చాకొలెట్‌ ఫ్యాక్టరీ’, ‘ఎలైస్‌ ఇన్‌ వండర్‌ల్యాండ్‌’, ‘ఫెంటాస్టిక్‌ బీస్ట్స్‌: ద క్రైమ్స్‌ ఆఫ్‌ గ్రిండేల్‌వాల్డ్‌’లాంటి ప్రపంచ ప్రఖ్యాత సినిమాల్లో విలక్షణ నటనతో ఆకట్టుకున్నాడు జానీ డెప్‌. కెంటకీలో 1963 జూన్‌ 9న పుట్టిన జానీ డెప్‌ నటుడిగా, నిర్మాతగా, మ్యుజిషియన్‌గా తనదైన ముద్ర వేశాడు. బుల్లితెర, వెండితెరలపై ఎన్నో పాత్రల ద్వారా మెప్పించాడు. పన్నెండేళ్ల వయసులో అమ్మ కొనిచ్చిన గిటారుతో రాక్‌ మ్యుజీషియన్‌గా ఎదిగాడు. ఆల్బమ్స్‌ విడుదల చేశాడు. తోటి గాయనిని పెళ్లి చేసుకుని ఆమె ద్వారా హాలీవుడ్‌ నటుడు నికొలాస్‌ కేజ్‌కు పరిచయమై సినీ అవకాశాలు పొందాడు. తొలిసారిగా ‘ఎ నైట్‌మేర్‌ ఆన్‌ ద ఎల్మ్‌ స్ట్రీట్‌’ (1984)తో వెండితెరపై మెరిసి, ఆపై అంచెలంచెలుగా ఎదిగాడు.

* అందాల... ఆస్కార్‌ నటి

ఒక ఆస్కార్‌ అవార్డు, రెండు గోల్డెన్‌గ్లోబ్‌ అవార్డులు, బాఫ్టా అవార్డు, శాగా అవార్డు, బ్రిటిష్‌ అకాడమీ, స్క్రీన్‌ యాక్టర్స్‌ గిల్డ్‌ లాంటి ఎన్నో అవార్డులు అందుకున్న నటిగా మాత్రమే చెప్పుకుంటే, నటాలీ పోర్ట్‌మన్‌ని అవమానపరిచినట్టే. వేర్వేరు పాత్రల్లో అందంతో పాటు చక్కని అభినయంతో ఆకట్టుకున్న నటాలీని... వణ్యప్రాణుల హక్కుల కోసం, పర్యావరణం కోసం, మహిళల హక్కుల కోసం పోరాడే మంచి మనసున్న యువతిగా కూడా చెప్పుకోవాల్సిందే. ఒప్పుకోవల్సిందే. నటిగా, నిర్మాతగా, రచయిత్రిగా, దర్శకురాలిగా ఎదిగిన నటాలీ గురించి ‘స్టార్‌వార్స్‌’ సినిమాల అభిమానులకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ సినిమాల ద్వారా ఆమె అంతర్జాతీయ నటిగా గుర్తింపు తెచ్చుకుంది. జెరూసలెంలో 1981 జూన్‌ 9న పుట్టిన నటాలీ, హైస్కూలు రోజుల్లోనే ‘లియోన్‌ ద ప్రొఫెషనల్‌’ (1994) ద్వారా వెండితెరపై తళుక్కుమంది. ‘ఎనీవేర్‌ బట్‌ హియర్‌’ (1999), ‘క్లోజర్‌’ (2004), ‘వి ఫర్‌ వెండెట్టా’ (2006), ‘ద బొలియిన్‌ గర్ల్‌’ (2008), ‘బ్లాక్‌ స్వాన్‌’ (2010), ‘నో స్ట్రింగ్స్‌ ఎటాచ్డ్‌’ (2011), ‘థార్‌’ ‘జాకీ‘ (2016) లాంటి సినిమాల ద్వారా మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.