జులై 27... (సినీ చరిత్రలో ఈరోజు)

  

అన్నపూర్ణ కంఠాభరణం... దుక్కిపాటి  (జయంతి)


 
(ప్రత్యేక వార్త కోసం క్లిక్‌ చేయండి...)


79 ఏళ్ల నట ప్రస్థానం!


ఓ పాత్ర... 79 ఏళ్లుగా అలరిస్తూనే ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం సంపాదించింది. అమెరికా కల్చరల్‌ ఐకన్‌గా పేరుతెచ్చుకుంది. లఘుచిత్రాలు, సినిమాలు, వీడియోగేములు, పుస్తకాలు, టీవీ సీరియళ్లు ఇలా ఎన్నో రకాల వేదికలపై కనిపిస్తూనే ఉంది. తొలి చిత్రంతోనే ఆస్కార్‌ నామినేషన్‌ సాధించింది. ఇంతకీ ఆ పాత్ర ఏంటో తెలుసా? ఓ అల్లరి కుందేలు! అంటే ‘బగ్స్‌ బన్నీ’! బగ్స్‌బన్నీ అంటే తరతరాలుగా పిల్లలకి, పెద్దలకి ఇష్టమైన పాత్రే. అవడానికి కార్టూన్‌ పాత్రే కానీ అది సృష్టించిన సంచలన అంతా, ఇంతా కాదు. కామిక్‌ పుస్తకాల్లో 1930ల్లో అల్లరి కుందేలుగా బగ్స్‌బన్నీ తొలిసారిగా వెండితెరపై పరిచయమైన చిత్రం ‘ఎ వైల్డ్‌ హేర్‌’, 1940లో జులై 27న విడుదలైంది. అప్పటి నుంచి ఇప్పటి దాకా రకరకాల వేదికలపై దాని ప్రస్థానం కొనసాగుతూనే ఉంది.

నాలుగో సింహం
(సాయికుమార్‌ పుట్టిన రోజు-1960)


కనిపించే మూడు సింహాలు సత్యానికీ, న్యాయానికీ, ధర్మానికీ ప్రతిరూపాలైతే... కనిపించని నాలుగో సింహమేమేరా ఈ పోలీస్‌. - ఈ సంభాషణ ఎక్కడ ఎవరు పలికినా గుర్తుకొచ్చేది సాయికుమారే. తాను కథానాయకుడిగా నటించిన ‘పోలీస్‌ స్టోరీ’లో చెప్పిన ఆ సంభాషణతో సాయికుమార్‌ తెలుగు ప్రేక్షకులకు నాలుగోసింహమే అయ్యాడు. కథానాయకుడిగా, డబ్బింగ్‌ కళాకారుడిగా, టెలివిజన్‌ వ్యాఖ్యాతగా తెలుగు, కన్నడ, తమిళ ప్రేక్షకులకు సుపరిచితుడు సాయికుమార్‌. ప్రముఖ నటుడు, డబ్బింగ్‌ కళాకారుడైన పి.జె.శర్మ, పూడిపెద్ది కృష్ణజ్యోతి దంపతులకి (జులై 27, 1960) జన్మించిన సాయికుమార్‌ ఎమ్‌.ఎ వరకు చదువుకొన్నారు. కాలేజీలో ఎన్‌.సి.సి విద్యార్థి అయిన సాయికుమార్, చదువు పూర్తయ్యాక నటనపై దృష్టిపెట్టారు. తన తండ్రి అడుగు జాడల్లో నడుస్తూ మొదట డబ్బింగ్‌ ఆర్టిస్టుగానే ప్రయాణం మొదలుపెట్టారు సాయికుమార్‌. సుమన్, రాజశేఖర్‌లకి గళం అందించారు. ‘పోలీస్‌ స్టోరీ’ చిత్రంతో కన్నడలో కథానాయకుడిగా ఘన విజయాన్ని సొంతం చేసుకొన్నారు. ఆ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో కూడా అనువాదమై విశేష ఆదరణని చూరగొంది. ఆ తర్వాత ఆయనకి కన్నడ నుంచి అవకాశాలు వెల్లువెత్తాయి. ‘అగ్ని ఐపీఎస్‌’, ‘కుంకుమ భాగ్య’, ‘పోలీస్‌ స్టోరీ2’, ‘లాకప్‌ డెత్‌’, ‘సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌’, ‘సెంట్రల్‌ జైల్‌’, ‘పోలీస్‌ బేటే’, ‘మనే మనే రామాయణ’ చిత్రాలతో కన్నడలో స్టార్‌ హీరోగా ఎదిగారు. ఇటీవల ‘రంగి తరంగి’తోనూ మంచి విజయాన్ని సొంతం చేసుకొన్నారు. తెలుగులో బాపు దర్శకత్వం వహించిన ‘స్నేహం’తో నటుడిగా మంచి గుర్తింపును తెచ్చుకొన్నారు. ఆతర్వాత ఆయనకి వరుసగా అవకాశాలు వచ్చాయి. పలు చిత్రాల్లో ప్రతినాయకుడిగా, సహ నటుడిగా మెరిసి ప్రేక్షకులకు చేరువయ్యారు. టెలివిజన్‌లో పలు కార్యక్రమాలకి వ్యాఖ్యాతగా కూడా వ్యవహరించి ఇంటింటికీ చేరువయ్యారు. ‘సామాన్యుడు’తో ఉత్తమ విలన్‌గా నంది పురస్కారాన్ని సొంతం చేసుకొన్నారు. ‘ప్రస్థానం’తో ఉత్తమ సహనటుడిగా నంది అందుకొన్నారు. సాయికుమార్‌ తమ్ముళ్లు పి.రవిశంకర్, అయ్యప్ప.పి.శర్మలు కూడా నటులుగా డబ్బింగ్‌ కళాకారులుగా కొనసాగుతున్నారు. సురేఖని వివాహం చేసుకొన్న సాయికుమార్‌కి ఇద్దరు సంతానం. తనయుడు ఆది కథానాయకుడిగా కొనసాగుతుండగా, తనయ జ్యోతిర్మయి వైద్య వృత్తిలో ఉన్నారు.

(ప్రత్యేక వార్త కోసం క్లిక్‌ చేయండి...)

సంగీత సరస్వతి
(గాయని చిత్ర పుట్టిన రోజు-1963)


ఉత్తమ నేపథ్య గాయనిగా అత్యధిక జాతీయ పురస్కారాలు అందుకొన్న గాయకురాలు. నాలుగు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఉత్తమ నేపథ్యగాయనిగా పురస్కారాలు అందుకొన్న తొలి గాయని. బ్రిటిష్‌ పౌర్లమెంట్‌లో హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌ నుంచి గౌరవం పొందిన తొలి భారతీయ మహిళ. చైనా ప్రభుత్వం నుంచి షాంఘై ఇంటర్నేషనల్‌ మ్యూజిక్‌ పురస్కారం అందుకొన్న ఒకే ఒక్క భారతీయ గాయని. లండన్‌లోని రాయల్‌ అల్బర్ట్‌ హాల్‌లో జరిగే ప్రతిష్టాత్మక సంగీత ప్రదర్శనలో పాల్గొన్న తొలి దక్షిణ భారతదేశ గాయని. 25 వేలకి పైగా పాటలు ఆలపించిన గాయని. - ఈ ఘనతలన్నింటినీ సాధించిన ఆ ప్రఖ్యాత గాయని ఎవరో కాదు... మన కె.ఎస్‌.చిత్ర. అవును... కేరళలోని తిరువనంతపురంలో జన్మించిన ఆమె ఏ భాషలోకి వెళ్లిన మన చిత్రే అంటారు. అంతగా ఆమె శ్రోతలకి చేరువయ్యారు. తెలుగు, మలయాళం, కన్నడ, తమిళం, హిందీ, బెంగాలీ, పంజాబీ, గుజరాతీ, తులు, ఉర్దూ, సంస్కృతం, బడగ భాషలతో పాటు, విదేశీ భాషలైన మలయ్, లాటిన్, అరబిక్, సింహళీస్, ఇంగ్లిష్‌ భాషల్లో కూడా ఆమె పాటలు ఆలపించి, తన స్వర మాధుర్యాన్ని ప్రపంచం నలమూలల్లోని శ్రోతలకి రుచి చూపించారు. భారత ప్రభుత్వం అందజేసే అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన పద్మశ్రీ గౌరవం ఆమె పొందారు. తిరువనంతపురంలోని సంగీత కుటుంబంలో పుట్టి పెరిగారు చిత్ర. ఆమె పూర్తి పేరు కృష్ణన్‌ నాయర్‌ శాంతకుమారి చిత్ర. ఆమె తండ్రి కృష్ణన్‌ నాయరే తన తొలి గురువు అని చెబుతుంటారు చిత్ర. ఆమె అక్క కె.ఎస్‌.బీన, తమ్ముడు కె.మహేష్‌ కూడా నేపథ్య గాయకులే. తల్లి శాంత వీణ వాయిద్యకారులు. చిన్నప్పట్నుంచి ఆమె దగ్గర కూడా పాఠాలు నేర్చుకొన్నారు చిత్ర. డా.ఒమనకుట్టి దగ్గర కర్ణాటక సంగీతంలో శిక్షణ తీసుకొన్న చిత్ర యూనివర్సిటీ ఆఫ్‌ కేరళ నుంచి సంగీతంలో బి.ఎ పట్టా అందుకొన్నారు. ఆ తర్వాత మాస్టర్స్‌ కూడా చేసి కేంద్ర ప్రభుత్వ నేషనల్‌ టాలెంట్‌ స్కాలర్‌షిప్‌కి ఎంపికయ్యారు. 1979లోనే మలయాళంలో ఎం.జి.రాధాకృష్ణన్‌ సారథ్యంలో ప్రైవేట్‌ ఆల్బమ్స్‌లో పాడారు. ‘అట్టహాసమ్‌’, ‘స్నేహపూర్వమ్‌ మీర’, ‘అంజన్‌ ఎక్కనరు’ చిత్రాల్లోనూ పాటలు ఆలపించారు. ఆతర్వాత ప్రముఖ గాయకుడు కె.జె.యేసుదాస్‌తో కలిసి దేశంలోనూ, విదేశాల్లోనూ సంగీత ప్రదర్శనల్లో పాల్గొన్నారు. 1992లో ‘రోజా’ చిత్రం కోసం తెలుగులో నాగమణీ నాగమణీ... అనే పాట ఆలపించి శ్రోతలకి చేరువయ్యారు. ఆ తర్వాత ఎస్పీ బాలసుబ్రమణ్యంతో కలిసి పలు చిత్రాల్లో గీతాలు ఆలపించి విశేషంగా పేరు తెచ్చుకొన్నారు. ‘రుద్రవీణ’, ‘ఘర్షణ’, ‘వారసుడొచ్చాడు’, ‘మరణమృదంగం’, ‘గీతాంజలి’, ‘శివ’, ‘స్టూవర్టుపురం పోలీస్‌స్టేషన్‌’, ‘రుద్రనేత్ర’, ‘కోకిల’, ‘ప్రేమపావురాలు’, ‘అల్లుడుగారు’, ‘బొబ్బిలిరాజా’, ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’, ‘కొండవీటి దొంగ’, ‘లారీడ్రైవర్‌’, ‘దొంగ దొంగ’, ‘సూపర్‌ పోలీస్‌’, ‘డ్యూయెట్‌’, ‘మెత్తు’, ‘ప్రేమతో’.. ఇలా ఎన్నో తెలుగు చిత్రాల్లో ఆమె పాటలు ఆలపించారు. ఈమధ్య విడుదలైన ‘శతమానం భవతి’, ‘దువ్వాడ జగన్నాథమ్‌’ చిత్రాల్లోనూ చిత్ర ఆలపించారు. ఆస్కార్‌ అవార్డు గ్రహీత ఎ.ఆర్‌.రెహమాన్‌ సంగీత దర్శకత్వంలో ఎక్కువ గీతాలు ఆలపించిన గాయని చిత్రనే కావడం విశేషం. ఇళయరాజా స్వరకల్పనలోనూ ఎక్కువ గీతాలు ఆలపించారు చిత్ర. తెలుగురాష్ట్రాల్లో సంగీత సరస్వతిగా కీర్తి ప్రతిష్టలు అందుకొంటున్న చిత్ర ఇంజినీర్, వ్యాపారవేత్త అయిన విజయ్‌శంకర్‌ని వివాహం చేసుకొన్నారు. వీరికి ఒక్కగానొక్క సంతానమైన నందన దుబాయ్‌లో ప్రమాదవశాత్తూ నీటి తొట్టిలో పడి మృతిచెందారు. ఎ.ఆర్‌.రెహమాన్‌ సారథ్యంలో జరుగుతున్న సంగీత ప్రదర్శన కోసం చిత్ర వెళ్లగా, ఈ ప్రమాదం చోటు చేసుకొంది. 20 దేశాల్లో సంగీత ప్రదర్శనలు ఇచ్చి శ్రోతల్ని ఉర్రూతలూగించారు చిత్ర.

(ప్రత్యేక వార్త కోసం క్లిక్‌ చేయండి...)


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.