ఫిబ్రవరి 10 (సినీ చరిత్రలో ఈరోజు)...

* పిల్లీ ఎలకా పుట్టాయ్‌...ప్రపంచాన్ని ఏలాయ్‌!


వ్వించే తెలివైన ఎలక... దాన్ని పట్టుకోవాలని ప్రయత్నించి విఫలమయ్యే పిల్లి... ఈ రెండూ కలిసి ప్రపంచ వినోద రంగంలో సంచలనం సృష్టించాయి. దేశదేశాల్లో తరతరాలుగా పిల్లల్నీ, పెద్దల్నీ ఆకట్టుకుని నవ్వులు పంచాయి. ఆ పిల్లి టామ్‌ అయితే, ఆ ఎలుక జెర్రీ. ఇవి రెండూ ‘టామ్‌ అండ్‌ జెర్రీ’గా కార్టూన్‌ సినిమాలు, టీవీ సీరియల్స్, వెండితెర సినిమాలుగా కోట్లాది మందిని అలరించాయి. వీటికి విలియం హన్నా, జోసెఫ్‌ బార్బెరా అనే ఇద్దరు కలిసి 1940 ఫిబ్రవరి 10న ప్రాణం పోశారు. మెట్రో గోల్డ్‌విన్‌ మేయర్‌ (ఎంజీఎం) సంస్థతో కలిసి వీరు 1940 నుంచి 1958 వరకు తీసిన 114 లఘుచిత్రాలు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించడంతో పాటు ఏడు ఆస్కార్లు గెల్చుకున్నాయి. ఆ తర్వాత కూడా వీటి హవా కొనసాగింది. అప్పట్లో అత్యధిక వసూళ్లు సాధించిన యానిమేటెడ్‌ షార్ట్‌ ఫిల్మ్స్‌గా ఇవి రికార్డు సృష్టించాయి. మొత్తం మీద ఇవి రెండూ కలిసి మొత్తం 164 షార్ట్స్‌ ద్వారా అలరించాయి. టెలివిజన్‌ సీరియల్స్‌గా కూడా ఇంటింటికీ వినోదాన్ని పంచాయి. తర్వాత ఇవి తొలిసారిగా 1992లో ‘టామ్‌ అండ్‌ జెర్రీ: ద మూవీ’ ఫీచర్‌ మూవీగా వెండితెరపై వెలిగాయి. ఆపై 2002 నుంచి మరో 13 డైరెక్ట్‌ వీడియో సినిమాలుగా విడుదలయ్యాయి.

* సీక్వెల్‌ సినిమాల తార


ప్రపంచ వ్యాప్తంగా ఆకట్టుకున్న హాలీవుడ్‌ సీక్వెల్స్ ‘ద హంగర్‌ గేమ్స్‌’, ‘పిచ్‌ పెర్‌ఫెక్ట్‌’ సినిమాలను చూసేవారికి ఎలిజబెత్‌ బ్యాంక్స్‌ గురించి వేరే చెప్పక్కర్లేదు. అమెరికన్‌ నటిగా, దర్శకురాలిగా, నిర్మాతగా ఆమె సినీ ప్రస్థానం విజయవంతం. దర్శకురాలిగా తొలి సినిమాతోనే అత్యధిక వసూళ్లు సాధించిన రికార్డు ఆమెదే. ఆమె దర్శకురాలిగా రూపొందించిన ‘పిచ్‌ పెర్ఫెక్ట్‌’ (2015), తొలి వారాంతానికే 69 మిలియన్‌ డాలర్లు వసూలు చేసింది. మసాచుసెట్స్‌లో 1974 ఫిబ్రవరి 10న పుట్టిన ఎలిజబెత్‌ ఐరీన్‌ మిచెల్‌ చిన్నప్పటి నుంచీ చురుగ్గా ఉండేది. బేస్‌బాల్‌లాంటి ఆటలు ఆడడంతో పాటు గుర్రపుస్వారీ కూడా చేసేది. ‘సరెండర్‌ డొరోతీ’ (1998)తో వెండితెరకు పరిచయమై, ‘వెట్‌ హాట్‌ అమెరికన్‌ సమ్మర్‌’, ‘స్పైడర్‌ మ్యాన్‌ ట్రయాలజీ’, ‘సీ బిస్కట్‌’, ‘ద 40 ఇయర్‌ ఓల్డ్‌ వర్జిన్‌’, ‘స్లిదర్‌’, ‘రోల్‌ మోడల్స్‌’, ‘పవర్‌ రేంజర్స్‌’లాంటి చిత్రాలతో అంతర్జాతీయ ప్రేక్షకులను ఆకట్టుకుంది. నటిగా, దర్శకురాలిగా పలు అవార్డులు అందుకుంది.

* చిన్న కథ... పెద్ద సినిమా

ప్పుడంటే రైళ్లు, విమానాల్లో ప్రయాణాలు సాగుతున్నాయ. కానీ ఇవేమీ లేని రోజుల్లో గుర్రపు బగ్గీలే సాధనాలు. నాలుగేసి గుర్రాలు లాగే ఇలాంటి బగ్గీలను ‘స్టేజ్‌కోచ్‌’అని పిలిచేవారు. పాత్యాశ్చ దేశాల్లో ఒకప్పుడు వీటి కోసం ప్రత్యేకమైన స్టేషన్లు కూడా ఉండేవి. ఆయా స్టేషన్లలో అలసిపోయిన గుర్రాలను మార్చి కొత్త గుర్రాలను పూన్చి దూరపు ప్రయాణాలు సాగించేవారు. అలాంటి ప్రయాణంలో జరిగిన ఉత్కంఠ భరిత సంఘటనల నేపథ్యంలో వచ్చిన ‘స్టేజ్‌కోచ్‌’ సినిమా 1939లో విడుదలై ఆకట్టుకుంది. అందాల తార క్లైర్‌ ట్రెవర్, ప్రముఖ నటుడు జాన్‌ వానే నటించిన ఈ చిత్రం, అప్పట్లో రెట్టింపు లాభాలను రాబట్టుకుంది. రెండు ఆస్కార్‌ అవార్డులు సహా పలు పురస్కారాలు గెలుచుకుంది. మేటి పది క్లాసిక్‌ అమెరికా సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఎర్నెస్ట్‌ హేకాక్స్‌ అనే రచయిత రాసిన ‘ద స్టేజ్‌ టు లార్డ్‌బర్గ్‌’ అనే చిన్న కథ ఆధారంగా దీనిని తీశారు. ఈ సినిమాను అమెరికా జాతీయ లైబ్రరీలో భద్రపరిచారు.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.