ఫిబ్రవరి 7 (సినీ చరిత్రలో ఈరోజు)...

* చార్లీ చాప్లిన్‌ వేషానికి నాంది...


ప్రపంచంలో ఎక్కడైనా చార్లీచాప్లిన్‌ వేషధారణలో పోటీ పెట్టి చూడండి... అందరూ వదులుగా ఉండే ప్యాంటు, బిగుతుగా ఉండే కోటు, చిన్న టోపీ, పెద్ద బూట్లు వేసుకుని వచ్చేస్తారు. అంతగా ఆ వేషం ప్రాచుర్యం పొందింది. ఈ వేషంతోనే చాప్లిన్‌ ప్రపంచ సినీ అభిమానులను కడుపుబ్బ నవ్వించాడు. ఇంతకీ ఆ వేషాన్ని ఏమంటారో తెలుసా? ‘లిటిల్‌ ట్రాంప్‌’ అంటారు. చూడగానే నవ్వొచ్చే ఈ విచిత్ర వేషంతో చార్లీ చాప్లిన్‌ తొలిసారిగా వెండితెరపై కనిపించిన మూకీ సినిమా ‘కిడ్‌ ఆటో రేసెస్‌ ఎట్‌ వెనిస్‌’ (1914). ఈ సినిమా నిడివి 6.19 నిమిషాలు. నిజానికి ఈ వేషాన్ని మరో చిన్న సినిమా కోసం చాప్లిన్‌ అనుకోకుండా కనిపెట్టాడు. ‘స్ట్రేంజ్‌ ప్రెడికమెంట్‌’ అనే సినిమాలో నటిస్తున్న చాప్లిన్‌ను ఆ చిత్ర దర్శకుడు కొన్ని సన్నివేశాల కోసం ఏదైనా ఒక నవ్వొచ్చే వేషం వేసుకుని రమ్మన్నాడు. చాప్లిన్‌ మేకప్‌ గదిలోకి వెళ్లి అక్కడున్న దుస్తుల్లోంచి తనకు కావలసినవి ఎంచుకుని ‘లిటిల్‌ ట్రాంప్‌’ వేషంతో వచ్చాడు. ఆ వేషం అక్కడి వారందరికీ నచ్చింది. దాంతోనే అందులో నటించాడు కూడా. అయితే ఆ సినిమా కన్నా రెండు రోజులు ముందుగా ‘కిడ్‌ ఆటో...’ సినిమా విడుదల కావడంతో అదే ఆ వేషానికి తొలి చిత్రంగా గుర్తింపు తెచ్చుకుంది. ఆ వేషానికి అమాయకత్వం, పేదరికాన్ని కప్పి పుచ్చుకుంటూనే నాగరికత తెలిసిన పెద్ద మనిషిగా ప్రవర్తించే తీరు, మానవత్వం, హాస్యం కలగలిపి చాప్లిన్‌ దాన్నొక గొప్ప పాత్రగా మలుచుకున్నాడు.* అబద్దాలాడితే ముక్కు సాగిపోయే పిల్లాడి కథ!


నగనగా ఓ వడ్రంగి చెక్కతో ఓ పిల్లాడి బొమ్మను చెక్కుతాడు. అది బాగా రావడంతో ‘ఇది నిజమైన పిల్లాడిగా మారిపోతే బాగుణ్ణు’ అనుకుంటాడు. అతడి కోరికను ఓ దేవత విని ‘తథాస్తు’ అంటుంది. వెంటనే ఆ చెక్కబొమ్మకి ప్రాణం వస్తుంది. కానీ చెక్కబొమ్మలాగే ఉంటుంది. అప్పుడు ఆ దేవత, ‘నవ్వు ధైర్యంగా, అబద్ధాలాడకుండా, నిజాయితీగా, స్వార్థం లేకుండా ఉంటే నిజం పిల్లాడిగా మారిపోతావు’ అని చెబుతుంది. వడ్రంగి తన కోరిక నిజమైనందుకు సంతోషించి ఆ బొమ్మకి ‘పినాకియో’ అని పేరు పెడతాడు. స్కూల్లో వేస్తాడు. ఆపై పినాకియో ఏమైనా అబద్దాలాడితే అతడి ముక్కు పొడవుగా పెరిగిపోతూ ఉంటుంది. మళ్లీ నిజం చెబితే చిన్నదైపోతుంటుంది. అలా ఆ పినాకియో స్నేహాలు, సాహసాలతో కూడిన సినిమా ‘పినాకియో’. వాల్ట్‌డిస్నీ తీసిన రెండో యానిమేషన్‌ సినిమా. ఆస్కార్‌ అవార్డు అందుకున్న తొలి యానిమేషన్‌ సినిమాగా రికార్డు పొందింది. తొలి విడుదలలో అంతగా వసూళ్లు రాకపోయినా ఆ తర్వాత ఇది బాగా విజయవంతమైంది. మేటి యానిమేషన్‌ సినిమాల్లో ఒకటిగా ప్రాచుర్యం పొందింది.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.