అక్టోబర్‌ 12... (సినీ చరిత్రలో ఈరోజు)

* ‘ఎక్స్‌మెన్‌’ నటుడు!


‘ఎక్స్‌మెన్‌’ సినిమాల పరంపరతో అంతర్జాతీయ గుర్తింపు పొందిన నటుడు హగ్‌ మైకేల్‌ జాక్‌మన్‌. అతీత శక్తులు, జంతువులకుండే అసాధారణ సామర్థాలు కలిగి ఉండే ‘వోలెరిన్‌’ పాత్రలో ఇతగాడు ‘ఎక్స్‌మెన్‌’ సినిమాల్లో అందరినీ మెప్పించాడు. ఆస్ట్రేలియాలో 1968 అక్టోబర్‌ 12న పుట్టిన జాక్‌మన్‌ ‘కేట్‌ అండ్‌ లెపార్డ్‌’, ‘వాన్‌ హీసింగ్‌’, ‘ద ప్రిస్టీజ్‌’, ‘ద ఫౌంటేన్‌’, ‘ఆస్ట్రేలియా’, ‘ప్రిజనర్స్‌’, ‘ద గ్రేటెస్ట్‌ షోమేన్‌’ లాంటి సినిమాలతో విలక్షణ నటుడిగా పేరు పొందాడు. ఉత్తమ నటుడిగా అవార్డులు అందుకున్నాడు. నాటక రంగంపై కూడా ఎన్నో పాత్రలు పోషించి అవార్డులు పొందాడు. ఆస్కార్‌ అవార్డుల వేడుకలో హోస్ట్‌గా వ్యవహరించాడు.

* బాపు బొమ్మ! (స్నేహ పుట్టిన రోజు-1981)
చందమామ లాంటి మోము... నువ్వు పూవ్వులాంటి ముక్కు... దొండ పండు లాంటి పెదవి.. కలవపూల వంటి కళ్ళు... జామ పండులాంటి బుగ్గ... బెల్లం ముక్కలాంటి గడ్డం... వలపు శంఖమంటి కంఠం... అంటూ ‘రాధాగోపాలం’ సినిమాలో స్నేహ అందాన్ని అణువణువునా వర్ణించారు. బాపు బొమ్మకి ఉండాల్సిన లక్షణాలన్నీ స్నేహలో కనిపిస్తుంటాయి. అందుకే ఆమె కూడా బాపు సినిమా కథానాయికగా వెండితెరపై మెరిశారు. అచ్చమైన తెలుగందం స్నేహది. దక్షిణాది ప్రేక్షకుల హృదయాల్ని కొల్లగొట్టింది. కొన్ని రోజులపాటు స్టార్‌ కథానాయికగా వెలిగింది. ప్రస్తుతం సహాయ నటిగా మెరుస్తున్నా ఆమె అందం మాత్రం చెక్కు చెదరలేదు. స్నేహ అసలు పేరు సుహాసిని రాజారాం. 1981 అక్టోబరు 12న ముంబైలో జన్మించారు. స్నేహ మూలాలు రాజమండ్రిలో ఉన్నాయి. ఆమె తాతల కాలంలో కుటుంబం రాజమండ్రిలో నివసించేవారు. తల్లిదండ్రులు రాజారాం, పద్మావతి ముంబైలో స్థిరపడ్డారు. అక్కడ్నుంచి దుబాయి వెళ్లారు. స్నేహని చూసిన మలయాళ దర్శకుడు పాజిల్‌ ప్రమేయంతో వెండితెర ప్రవేశం చేశారు స్నేహ. మొదట ‘ఇంగానే ఒరు నిలపక్షి’ అనే తమిళ చిత్రంలో మెరిసిన స్నేహ ఆ తర్వాత తమిళంలో ‘ఎన్నావలే’, తెలుగులో ‘తొలివలపు’ చిత్రంలో నటించి పేరు తెచ్చుకొన్నారు. ప్రియమైన నీకు, హనుమాన్‌జంక్షన్, వెంకీ, సంక్రాంతి చిత్రాలతో విజయాల్ని అందుకొన్న స్నేహ తెలుగులో ఓ వెలుగు వెలిగారు. పద్ధతైన పాత్రల్లోనే మెరిసిన ఆమె, ‘శ్రీరామదాసు’, ‘రాధాగోపాలం’, ‘పాండురంగ’ వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకుల హృదయాల్ని కొల్లగొట్టారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం చిత్రాలతో పాటు, బుల్లితెరపై కూడా మెరిశారు. పలు రియాలిటీ షోలకి వ్యాఖ్యాతగా, న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు. 2012లో నటుడు ప్రసన్నని వివాహం చేసుకొన్నారు. ఒక సినిమాలో నటిస్తూ ప్రేమలో పడిన ఈ జంట పెళ్లితో ఒక్కటైంది. ప్రస్తుతం వీళ్లకి విహాన్‌ అనే ఓ బాబు ఉన్నారు. ఈరోజు స్నేహ పుట్టినరోజు.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.