ఫిబ్రవరి 11.. (సినీ చరిత్రలో ఈరోజు)

* అధిక వసూళ్ల తార 


-హైస్కూలు రోజుల్లోనే నాటకాల్లో మెరిసింది...

-హాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం అందుకుంది...

-అత్యధిక వసూళ్లు సాధించిన తారగా అలరించింది...

-నటిగా, నిర్మాతగా, వ్యాపారవేత్తగా ఎదిగింది...

-ఈ ఘనతలన్నీ జెన్నిఫర్‌ అనిస్టన్‌వి!


ఈమె పేరు వినగానే... ‘బ్రూస్‌ ఆల్‌మైటీ’, ‘ద బ్రేక్‌ అప్‌’, ‘మార్లీ అండ్‌ మి’, ‘జస్ట్‌ గో విత్‌ ఇట్‌’, ‘హారిబుల్‌ బాసెస్‌’, ‘ఉయ్‌ ఆర్‌ ద మిల్లర్స్‌’ సినిమాలు గుర్తొస్తాయి. ఇవన్నీ ప్రపంచ వ్యాప్తంగా 200 మిలియన్‌ డాలర్లకు పైగా వసూలు చేసినవే. అమ్మానాన్నా ఇద్దరూ నటులే. కానీ తొమ్మిదేళ్ల వయసులో విడిపోయారు. చిన్నారి జెన్నీఫర్‌ సొంత ఆర్జన కోసం టెలీమార్కెటర్, వెయిట్రెస్, బైక్‌ మెస్సెంజర్‌ లాంటి రకరకాల పనులు చేసింది. కాలిఫోర్నియాలో 1969 ఫిబ్రవరి 11న పుట్టిన జెన్నీఫర్‌ పందొమ్మిదేళ్లకే ‘మ్యాక్‌ అండ్‌ మి’ సినిమాలో చిన్న పాత్ర ద్వారా వెండితెరకు పరిచయమైంది. మరో పక్క టీవీల ద్వారా కూడా ఆకట్టుకుంది. ‘ఫ్రెండ్స్‌’ టీవీ సీరియల్‌ ద్వారా ఎమ్మీ, గోల్డెన్‌గ్లోబ్, స్క్రీన్‌ యాక్టర్స్‌ గిల్డ్‌ లాంటి అవార్డులు అందుకుంది. ప్రముఖ నటుడు బ్రాడ్‌పిట్‌ను పెళ్లాడి అయిదేళ్ల తర్వాత విడిపోయింది.

* గిన్నిస్‌ రికార్డులకెక్కి... బాత్‌టబ్‌లో మునిగి!


-అత్యధిక అవార్డులు అందుకున్న మహిళగా గిన్నిస్‌ రికార్డు ఆమె సొంతం!

-అత్యధిక అమ్మకాలు సాధించిన గాయనిగా ప్రపంచ రికార్డు ఆమెదే!

-గాయనిగా, వెండితెర నటిగా వెలిగిన ప్రాచుర్యం ఆమెది!

-ఇవన్నీ విట్నీ హౌస్టన్‌ ఘనతలే!

హైస్కూలు రోజుల్లోనే గాయనిగా గుర్తింపు తెచ్చుకుంది. పంతొమ్మిదేళ్లకల్లా సొంతంగా రెండు ఆల్బమ్స్‌ విడుదల చేస్తే అవి రెండూ నెంబర్‌ వన్‌ స్థానంలో నిలిచాయి. ప్రపంచంలోనే బెస్ట్‌ సెల్లింగ్‌ ఆల్బమ్స్‌గా నిలిచాయి. ఓ వేపు సంగీత సునామీలు సృష్టిస్తూనే ‘ద బాడీగార్డ్‌’ (1992) సినిమా సౌండ్‌ట్రాక్‌ కోసం ఏడు పాటలు రికార్డు చేస్తే అది కూడా అమ్మకాల్లో సంచలనం సృష్టించింది. ‘వెయిటింగ్‌ టు ఎక్జేల్‌’, ‘ద ప్రీచర్స్‌ వైఫ్‌’లాంటి సినిమాల్లో మెరిసింది. ఆమె వెలువరించిన ఏడు స్టూడియో ఆల్బమ్స్, రెండు సౌండ్‌ట్రాక్‌ ఆల్బమ్స్‌కూడా డైమండ్, మల్టీ ప్లాటినం, ప్లాటినం, గోల్డ్‌ రికార్డులు సాధించడం విశేషం. చిన్న వయసులోనే తారాపథానికి దూసుకుపోయిన ఈ సంచలన తార అనూహ్యంగా మరణించడం విషాదం. న్యూజెర్సీలో 1963 ఆగస్టు 9న పుట్టిన విట్నీ, 2012 ఫిబ్రవరి 11న తన 48 ఏళ్ల వయసులో బాత్‌టబ్‌లో మునిగిపోయి చనిపోయింది. మత్తుపదార్థాల వాడకంతో గుండె ఆగిపోవడమే కారణం.
Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.