జూన్‌ 26 (సినీ చరిత్రలో ఈరోజు)
* ఉదయకిరణం..
వచ్చీ రావడంతోనే వెండితెరకి ఓ కొత్త మెరుపునిచ్చిన యువకిరణం... ఉదయ్‌కిరణ్‌. ఉషాకిరణ్‌ మూవీస్‌ సంస్థ నిర్మించిన ‘చిత్రం’తో ఆయన ప్రయాణం మొదలైంది. తొలి సినిమానే ఘన విజయం సాధించడంతో ఉదయ్‌కిరణ్‌ పేరు మార్మోగిపోయింది. అవకాశాలు వరుసకట్టాయి. విజయాలు వెంటపడ్డాయి. ‘నువ్వు నేను’, ‘మనసంతా నువ్వే’ చిత్రాలతో హ్యాట్రిక్‌ హీరో అనిపించుకొన్నారు. మూడు విజయాలతో దిష్టి తగిలిందో ఏమో ఆ తర్వాత పరాజయాలు పలకరించాయి. ఆయన కెరీర్‌లో ‘నీ స్నేహం’ చివరి విజయమైంది. 1980 జూన్‌ 26న హైదరాబాద్‌లో జన్మించిన ఆయన సికింద్రాబాద్‌ వెస్లీ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు. కాలేజీ నుంచే మోడలింగ్‌ మొదలుపెట్టిన ఆయన తేజ దృష్టిలో పడి ‘చిత్రం’లో నటించే అవకాశాన్ని అందుకొన్నాడు. ‘నువ్వు నేను’ చిత్రంలో నటనకిగానూ ఆయన ఉత్తమ నటుడుగా ఫిల్మ్‌ ఫేర్‌ పురస్కారం లభించింది. ‘నీ స్నేహం’, ‘శ్రీరామ్‌’ చిత్రాల్లో ఉదయ్‌కిరణ్‌ నటనకి ప్రశంసలు లభించాయి. తెలుగుతోపాటు తమిళంలోనూ నటించారు ఉదయ్‌కిరణ్‌. కె.బాలచందర్‌ దర్శకత్వంలో ‘పొయ్‌’తో ‘వాంబు శాండై’, ‘పెన్‌ సింగమ్‌’ చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకున్నారు. 2012లో విషితతో ఆయన వివాహం జరిగింది. వరుస పరాజయాలు... ఆర్థిక ఇబ్బందులతో మానసిక ఆందోళనకి గురైన ఉదయ్‌కిరణ్‌ 2014లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొన్నారు. ఆయన మరణం చిత్ర పరిశ్రమలోనూ, అభిమానుల్లోనూ తీవ్ర విషాదాన్ని నింపింది. ఎంతో ఎత్తుకు ఎదుగుతాడనుకొన్న ఉదయ్‌కిరణ్‌ 33 యేళ్లకే తనువు చాలించి అందరినీ శోకసంద్రంలో ముంచెత్తారు. ఆయన జయంతి ఈ రోజు.
* చార్లీ చాప్లిన్‌కి ఇష్టమైన సినిమా..
ప్రపంచ ప్రఖ్యాత హాస్య నటుడు చార్లీ చాప్లిన్‌ అంటే తెలియని వారు ఉండరు. చాప్లిన్‌ రచయితగా, నిర్మాతగా, దర్శకుడిగా, నటుడిగా రూపొందించిన ‘ద గోల్డ్‌ రష్‌’ సినిమా 1925లో ఇదే రోజు విడుదలైంది. అంటే 93 ఏళ్ల నాటి సినిమా అన్నమాట. ఇప్పటికీ ఈ సినిమాను ఓ క్లాసిక్‌గా ప్రపంచవ్యాప్తగా అభిమానించే వాళ్లు ఉన్నారు. చాప్లిన్‌ అనగానే గుర్తొచ్చే వదులు ప్యాంటు, బిగుతు కోటు, పెద్ద బూట్లు, టోపీలతో కూడిన వేషంతో తొలిసారి కనిపించింది ఈ సినిమాతోనే. దీన్ని ‘లిటిల్‌ ట్రాంప్‌’ వేషం అంటారు. ఈ సినిమా ఆలోచన వెనుక ఓ నేపథ్యం ఉంది. అప్పట్లో కెనడాలోని క్లోండైక్‌ అనే ప్రాంతంలో బంగారం గనులున్నాయని కనుగొన్నారు. ఆ వార్త తెలియగానే ఆ బంగారం కోసం దాదాపు లక్ష మంది ఆ ప్రాంతానికి వలసపోవడం మొదలెట్టారు. మంచు పర్వతాల మయమైన ఆ ప్రాంతంలో మంచు తుపానుల్లో చిక్కుకుని తిండిలేక అల్లాడారు. ఆఖరికి తమ బూట్లు తామే తినే స్థితికి వచ్చారు. ‘గోల్డ్‌రష్‌’ అనే శీర్షికతో ప్రచురితమైన ఈ వార్తను చదివిన చాప్లిన్‌కి ఈ నేపథ్యంతో సినిమా తీయాలనే ఆలోచన కలిగింది. విషాదం, హాస్యం పక్కపక్కనే ఉంటాయనే సిద్ధాంతంతో దీన్ని ఓ అద్భుత నిశ్శబ్ద చిత్రంగా మలిచాడు చాప్లిన్‌. ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ చిత్రం తను తీసినవాటిలోకెల్లా తనకిష్టమైనదని చాప్లిన్‌ చాలా సార్లు చెప్పాడు. అప్పట్లోనే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 4 మిలియన్‌ డాలర్లు ఆర్జించి అత్యధిక వసూళ్లు సాధించిన నిశ్శబ్ద చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. దీనీకి శబ్దాన్ని, సంగీతాన్ని జోడించి చాప్లిన్‌ తిరిగి 1942లో విడుదల చేశారు. ఇందులో చాప్లిన్‌ చేసిన ‘రోల్‌ డ్యాన్స్‌’ను చలన చిత్ర చరిత్రలోనే అపురూపమైనదిగా ఇప్పటికీ చెప్పుకుంటారు.

* అంతరిక్షంలో గూఢచారి పోరాటం..
‘ఈ భూమ్మీద మనుషులందరినీ తుడిచిపెట్టేయాలి. మళ్లీ కొత్తగా కొత్త సృష్టి చేయాలి...’ - జేమ్స్‌బాండ్‌ సినిమాల్లో విలన్ల ఆలోచనలు ఇలాగే ఉంటాయి. అందుకోసం కావాలంటే వాళ్లు అంతరిక్ష నౌకల్ని కూడా దొంగతనం చేస్తారు. దుష్టతలంపుల్ని రోదసి మార్గం పట్టిస్తారు. ఇలాంటి వాళ్ల పని పట్టాలంటే బ్రిటిష్‌ గూఢచారి జేమ్స్‌బాండ్‌ 007కే సాధ్యం. ఈ మొత్తం కలిపితే ‘మూన్‌రేకర్‌’ సినిమా. బాండ్‌ సినిమాలో 11వది. బాండ్‌గా రోజర్‌మూర్‌కి నాలుగోది. చిత్రమేమంటే బాండ్‌ పాత్రని సృష్టించి రచయిత ఇయాన్‌ ఫ్లెమింగ్‌ ఈ నవల పూర్తవకుండానే ఇది సినిమాగా రావాలని కోరుకున్నాడు. అందుకు తగినట్టుగానే పకడ్బందీగా స్క్రీన్‌ప్లే తరహాలో 1954లోనే నవలను రాశాడు. అతడి కలను నెరవేరుస్తూ ఈ సినిమా 1979లో ఇదే రోజు లండన్‌లో తొలి ప్రదర్శనతో మొదలైంది. అప్పటి వరకు తీసిన బాండ్‌ సినిమాల్లోనే అత్యధిక వ్యయం 34 మిలియన్‌ డాలర్లతో తీసిన ఈ సినిమా ప్రపంచ వ్యాపంగా ఏకంగా 210 మిలియన్‌ డాలర్లు వసూలు చేసి సంచలనం సృష్టించింది.

* మంచు యుగంలో కాసుల వర్షం..
కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం మన భూమ్మీద ఖండాలన్నీ ఇప్పట్లా విడివిడిగా ఉండేవి కావు. అన్నీ కలిసి ముద్దగా ఒకే చోట ఉండేవి. దాన్ని ‘పాంజియా’ ఖండం అని పిలిచారు శాస్త్రవేత్తలు. ఆ మంచుయుగం నాటి కాలంలో ప్రత్యేకమైన జంతువులు ఉండేవి. ఆ మంచు యుగం ముగిసే సమయానికి మంచంతా కరిగిపోవడం మొదలైంది. అప్పుడు ఆ నాటి జంతువులు ఏం చేశాయి? అది తెలియాలంటే ‘ఐస్‌ ఏజ్‌’ సినిమాలను చూసి తెలుసుకోవాల్సిందే. అద్భుతమనిపించే యానిమేషన్‌తో, విజువల్‌ ఎఫెక్ట్స్‌తో అయిదు సీక్వెల్‌ సినిమాలుగా వచ్చి ప్రపంచ మంతా ఆకట్టుకున్నాయివి. వాటిలో నాలుగవ సినిమా అయిన ‘ఐస్‌ఏజ్‌: కాంటినెంటల్‌ డ్రిఫ్ట్‌’ సినిమా 2012లో ఇదే రోజు విడుదలైంది. త్రీడీ కంప్యూటర్‌ యానిమేటెడ్‌ కామిడీ ఎడ్వంచర్‌ సినిమాగా వచ్చిన దీన్ని 95 మిలియన్‌ డాలర్ల వ్యయంతో తీస్తే ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 877 మిలియన్‌ డాలర్లను వసూలు చేసి కాసుల వర్షం కురిపించిందీ సినిమా. ఈ సీక్వెల్‌ సినిమాల్లో మొదటిది 2006లో విడుదలైతే, ఐదవది 2016లో వచ్చింది.
Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.