జూన్‌ 27.. (సినీ చరిత్రలో ఈరోజు)
* సాలీడు లక్షణాల నటుడు..
సూపర్‌హీరో ‘స్పైడర్‌ మ్యాన్‌’ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా ఆకట్టుకున్నాయి. వాటిలో సాలీడు లక్షణాలు పొందిన హీరో పీటర్‌పార్కర్‌ పాత్రలో నటించిన నటుడు టోబీ మెగ్వైర్‌ 1975లో ఇదే రోజు కాలిఫోర్నియాలో పుట్టాడు. నిర్మాతగా కూడా రాణించిన ఇతగాడు మూడు స్పైడర్‌మ్యాన్‌ సినిమాలతో పాటు ‘ప్లెజెంట్‌ విల్లే’, ‘ద సైడర్‌ హౌస్‌ రూల్స్‌’, ‘వండర్‌ బాయ్స్‌’, ‘సీ బిస్కట్‌’, ‘ద గుడ్‌ జర్మన్‌’, ‘బ్రదర్స్‌’, ‘ద గ్రేట్‌ గాట్స్‌బీ’ లాంటి చిత్రాల్లో కూడా ఆకట్టుకున్నాడు.* ఉర్రూతలూగించిన సంగీతకారుడు..
రాహుల్‌ దేవ్‌ బర్మన్‌ అంటే చాలా మందికి తెలియకపోవచ్చు అదే... ‘ఆర్‌.డి. బర్మన్‌’ అంటే చాలు... హిందీ సినిమాల్లో యువతరాన్ని వెర్రెత్తించే పాటలు గుండెల్లో మార్మోగుతాయి. ఆయన స్వరపరచిన ప్రతి గీతం నాటికీ, నేటికీ అభిమానుల గుండెల్లో నిలిచిపోయింది. మూడు దశాబ్దాల పాటు హుషారైన పాటలెన్నో స్వరపరిచిన ఈయన దాదాపు సుమారు 331 చిత్రాలకు బాణీలను సమకూర్చారు. ఆర్డీ బర్మన్‌ ముద్దు పేరు ‘పంచందా’ (చిన్నప్పుడు ఆయన ఏడిస్తే స్వరం పంచమం స్థాయిలో ఉండేదని) అలా పిలిచేవారట. ప్రముఖ సంగీత దర్శకుడు సచిన్‌ దేవ్‌ బర్మన్‌ కుమారుడు. కొత్త ఒరవడి సృష్టించిన స్వరకర్త, గాయకుడు. పాటల్ని ‘డిస్కో’, ‘రాక్‌’ వంటి కొత్తపుంతలను తొక్కించి భారతీయ సినిమా రంగాన్ని ఓలలాడించాడు. తెలుగు, తమిళ, మళయాళ, బెంగాలీ, ఒరియా, మరాఠీ భాషల చిత్రాలకూ సంగీతాన్ని అందించారు. వైవిధ్య భరితంగా సీసాలతో, వెదురు బొంగులతో, గరుకు కాగితాలతో కూడా సంగీతాన్ని సృష్టించారు. తండ్రి ఎస్‌డీ బర్మన్‌ వద్ద కొంతకాలం సహాయకుడిగా పనిచేశాడు. బెంగాలీ అయినప్పటికీ బర్మన్‌కు హిందీ చిత్రాలంటే మక్కువ. తెలుగులో ‘అంతం’ సినిమాకు సహాయ సంగీత దర్శకులుగా బర్మన్‌ వద్ద కీరవాణి, మణిశర్మలు పనిచేశారు. డార్జిలింగ్‌లో షూటింగ్‌ సమయంలో పరిచయమైన అభిమాని రీతూపటేల్‌ను వివాహం చేసుకొన్నా, ఆ తరువాత విడాకులు తీసుకున్నారు. 1980లో గాయని ఆశాభోస్లేను వివాహం చేసుకొన్నారు. బర్మన్‌ సంగీతం సమకూర్చిన మొదటిచిత్రం ‘తీస్రీమంజిల్‌’(1966)లో అన్ని పాటలూ ఆకట్టుకునేవే. ముఖ్యంగా ‘అజాజా...’ పాట ఇప్పుడు విన్నా యువత ఊగిపోతారు. ‘పడోసన్‌’ (1968) చిత్రంలో ‘మెరె సామ్‌నవాలే కిడికీ మే... ఎక్‌ చాంద్‌కి టుకడా రెహతా హై...’, ‘ఏక్‌ చతురనార్‌... బడె హోషియార్‌...’ లాంటి పాటలు అప్పట్లో ప్రేక్షకులను విపరీతంగా ఆకర్షించాయి. 1980 వరకు బర్మన్‌ ప్రస్థానం సాగింది. ఆయన స్వరాలు సమకూర్చిన ఆఖరు చిత్రం ‘1942 ఎ లవ్‌ స్టోరీ’ (1994). ఈ సినిమా ఆయన మరణించిన తరువాత విడుదలైంది. 2013లో భారత ప్రభుత్వం ఆయన గౌరవార్థం తపాలా బిళ్లను విడుదల చేసింది. 1939లో జన్మించిన బర్మన్‌ తన 79వ ఏట 1994లో మరణించారు. నేడు ఆయన జయంతి.* రోజర్‌మూర్‌ బాండ్‌ అవతారం..
జేమ్స్‌బాండ్‌ సినిమాలంటే తొలి రోజుల్లో సీన్‌కానరీయే గుర్తుకొస్తాడు. ఆ తర్వాత వచ్చిన రోజర్‌మూర్‌ బాండ్‌ పాత్రకి గాంభీర్యంతో పాటు హాస్యాన్ని కూడా జత చేశాడు. రోజర్‌మూర్‌ తొలిసారిగా జేమ్స్‌బాండ్‌గా కనిపించిన ‘లివ్‌ అండ్‌ లెట్‌ డై’ సినిమా 1973లో ఇదే రోజు విడుదలైంది. బాండ్‌ సినిమాల్లో ఎనిమిదవదైన దీన్ని ఇయాన్‌ ఫ్లెమింగ్‌ ఇదే పేరుతో రాసిన నవల ఆధారంగా తీశారు. 7 మిలియన్‌ డాలర్లతో డ్రగ్స్‌ మాఫియా నేపథ్యంలో తీసిన ఈ సినిమా 161 మిలియన్‌ డాలర్లకు పైగా వసూలు చేసింది. అలాగే... 15వ బాండ్‌ సినిమాగా టిమోతీ డాల్టన్‌ జేమ్స్‌బాండ్‌గా నటించిన ‘ద లివింగ్‌ డేలైట్‌్్స’ సినిమా ప్రీమియర్‌ను 1987లో ఇదే రోజు లండన్‌లో ప్రదర్శించారు.

Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.