మే 20.. (సినీ చరిత్రలో ఈరోజు)


 తెలుగు పాటపై ‘సిరివెన్నెల’ కురిపించారుఅక్షరాన్ని అందలం ఎక్కించిన నేర్పరి. పాటని గంగా ప్రవాహంగా మార్చి పరవళ్లు తొక్కించిన కూర్పరి. తెలుగు సినీ వనంలో పద కుసుమాలను పూయించి, సిరివెన్నెలను చిలికించిన గీతకారుడు సీతారామశాస్త్రి. సరసం, శృంగారం, వేదన, ఆర్దత్ర, ఆలోచన... ఇలా కవిత్వానికి ఎన్ని ఒంపులు ఉన్నాయో, అక్షరంలో ఎన్ని అందాలు ఉన్నాయో అన్నీ తెలిసిన చిత్రకారుడు.. సిరివెన్నెల. ‘విధాత తలపున ప్రభవించినదీ’ అంటూ ఏ క్షణాన ఆయన తెలుగు సినిమా పాట కోసం కలం పట్టుకున్నారో, అప్పుడే ఆయన తెలుగు పాటకు ముద్దు బిడ్డ అయిపోయారు. అప్పటి సినీ సంగీత ప్రయాణం నిర్విరామంగా సాగుతూనే ఉంది. ‘సరస స్వర సుర ఝరీ గమనమైన’ ప్రయాణం ఆయనది. ‘అమృతగానమది అధరముదా, అమితానందపు యదసడిదా’ అని ఆశ్చర్యపరిచిన గీత రచన ఆయనది. ఆయన పాటలతో ప్రశ్నించారు, జోల పాడారు, మేల్కొలిపారు. సంక్లిష్టమైన సన్నివేశానికి సైతం... అందమైన, అర్థవంతమైన పదాలతో, సామాన్యుడికి కూడా అర్థమయ్యేలా సాహిత్యాన్ని అందించారు. అందుకే ఆయన్ని ప్రతిష్టాత్మక ‘పద్మశ్రీ’ పురస్కారం వరించింది. తన తొలి చిత్రం పేరు ‘సిరివెన్నెల’నే, తన ఇంటి పేరుగా మార్చుకొన్న సీతారామశాస్త్రి... చేంబోలు వేంకటయోగి, సుబ్బలక్ష్మి దంపతులకి ప్రథమ సంతానంగా 1955 మే 20న మధ్యప్రదేశ్‌లోని శివినిలో జన్మించారు. అనకాపల్లిలో హైస్కూలు విద్యాభ్యాసం, కాకినాడ ఆదర్శ జూనియర్‌ కళాశాలలో ఇంటర్మీడియట్‌ పూర్తి చేశారు. విశాఖపట్నంలోని ఆంధ్ర వైద్యకళాశాలలో చేరి ఒక యేడాది ఎమ్‌.బి.బి.ఎస్‌ చదివాక టెలిఫోన్స్‌ శాఖలో అసిస్టెంటుగా ఉద్యోగంలో చేరారు. కాకినాడలో ఉద్యోగం చేస్తున్నప్పుడే ఆంధ్రా విశ్వవిద్యాలయం లో ఎమ్‌.ఎ చేశారు. అక్కడే పలువురు సాహితీవేత్తలతో ఆయనకి స్నేహం బలపడింది. భరణి అనే కలం పేరుతో పలు పత్రికల్లో కథలు, కవితలు రాశారు. 1985లో కె.విశ్వనాథ్‌ దర్శకత్వం వహించిన ‘సిరివెన్నెల’ చిత్రంతో సీతారామశాస్త్రి గీత రచయితగా సినీ రంగ ప్రవేశం చేశారు. తొలి చిత్రంతోనే తెలుగు సినిమా రంగంపై ప్రభావం చూపించారు. ఆ తర్వాత ‘స్వయంకృషి’, ‘రుద్రవీణ’, ‘స్వర్ణకమలం’, ‘శృతిలయలు’, ‘శివ’, ‘క్షణక్షణం’, ‘గాయం’, ‘గులాబి’, ‘మనీ’, ‘శుభలగ్నం’... ఇలా ఎన్నో చిత్రాల్లో గీతాలు రాశారు. తరాలు మారుతున్నా సరే... సీతారామశాస్త్రి కలం మాత్రం శ్రోతల్ని అలరిస్తూనే ఉంది. సినిమాకీ, అందులో సందర్భానికి తగ్గట్టే కాకుండా... సమాజాన్ని కూడా ప్రతిబింబించేలా పాట రాయడం సిరివెన్నెల ప్రత్యేకత. ఆయన ఉత్తమ గీత రచయితగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మక నంది పురస్కారాలు పది సార్లు అందుకొన్నారు. ఈ రోజు సిరివెన్నెల పుట్టినరోజు.

 

తాతకు తగ్గ మనవడు... ఎన్టీఆర్‌


   
                                                                  (ప్రత్యేక కథనం కోసం క్లిక్‌ చేయండి...)

‘కూచిపూడికైనా.. కుంగ్‌ఫూలకైనా... దేనికైనా రెడీ’ అంటూ ఎన్టీఆర్‌ ‘స్టూడెంట్‌ నెంబర్‌ 1’లో పాట పాడుకొన్నారు. ఆ పాట సినిమాలోని పాత్రకే కాదు, స్వతహాగా ఎన్టీఆర్‌కి కూడా వర్తిస్తుంది. డ్యాన్సుల్లోనైనా.. ఫైట్లలోనైనా... భావోద్వేగాలు పండించడంలోనైనా.. వినోదం పండించడానికైనా... ఇలా దేనికైనా ఎన్టీఆర్‌ రెడీనే. తాత పోలికలతో పుట్టిన ఎన్టీఆర్‌... నటన పరంగా తాతకి తగ్గ మనవడు అనిపించుకొన్నాడు. నూనూగు మీసాల వయసులోనే బాక్సాఫీసుని ప్రభావితం చేసిన ఘనత ఆయనది. తొలి అడుగుల్లోనే స్టార్‌ కథానాయకుడిగా ఎదిగాడు. ఆ తర్వాత ఆటు పోట్లు ఎదురైనా... పడి లేచిన కెరటంలా మళ్లీ నిలదొక్కుకున్నాడు. ప్రస్తుతం దక్షిణాదిలో అత్యంత శక్తిమంతమైన స్టార్‌ కథానాయకుల్లో ఒకరిగా కొనసాగుతున్నారు ఎన్టీఆర్‌. సినిమా రంగంపైనే కాకుండా... బుల్లితెరపై కూడా ఆయన తనదైన ముద్ర వేశారు. నటన పరంగానే కాకుండా.. గాయకుడిగా కూడా తన ప్రావీణ్యం ప్రదర్శించారు. ‘నాన్నకు ప్రేమతో’ చిత్రంతో 25 సినిమాల మైలురాయిని అధిగమించిన ఆయన ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ చేస్తూ బిజీగా గడుపుతున్నారు. నందమూరి హరికృష్ణ, షాలిని దంపతులకి 1983, మే 20న హైదరాబాద్‌లో జన్మించిన ఎన్టీఆర్‌.. విద్యారణ్య హైస్కూల్‌లో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేశారు. సెంట్‌ మేరీస్‌ కాలేజీలో ఇంటర్‌మీడియట్‌ పూర్తి చేశారు. చిన్నప్పుడే కూచిపూడి నృత్యంలో ప్రావీణ్యం సంపాదించారు. బాలనటుడిగా ‘బాలరామాయణం’తో ఎంట్రీ ఇచ్చిన ఆయన, తొలి అడుగులోనే నందితో మెరిసి వెండితెరను పులకింపజేశాడు. అంతకు ముందే తాత నందమూరి తారక రామారావు సారథ్యంలో ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’లో అద్భుతమైన నటనను కనబర్చి నటసార్వభౌముడినే మెప్పించాడు. చిరు ప్రాయంలోనే చిరుతలా తెలుగు తెరపై నట విశ్వరూపాన్ని చూపించిన ఎన్టీఆర్‌ కథానాయకుడిగా తెరంగేట్రం చేశాక మరింత జోరు చూపించాడు. ‘నిన్నుచూడాలని’తో తొలిప్రయత్నంలో నిరాశపర్చినా ‘స్టూడెంట్‌ నెం.1’తో నటుడిగా తనలోని ప్రతిభను తొలిసారి సినీ ప్రియులకు రుచిచూపించాడు. భవిష్యత్‌ టాలీవుడ్‌ నెం.1 కథానాయకుడిని తానేనంటూ ఆనాడే చెప్పకనే చెప్పాడు ఎన్టీఆర్‌. ‘ఆది’ కేశవ రెడ్డిగా రికార్డుల తొడగొట్టి.. ‘సింహాద్రి’తో విజయదరహాసం చేసి.. ‘ఆంధ్రావాలా’గా తెలుగువారి మదిని దోచుకున్నాడు. ఆ తర్వాత మూడేళ్లపాటు పరాజయాలతో ఉక్కిరిబిక్కిరయినా ‘యమదొంగ’తో పడిలేచిన కెరటంలా వెండితెరపై మెరుపులు మెరిపించాడు యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌. ఆ తర్వాత ‘అదుర్స్‌’ అనిపించే కథలతో ‘బృందావనం’లో కృష్ణుడిగా అపజయమెరుగని సినీ ప్రయాణం సాగిస్తూ ‘ఊసరవెల్లి’లా వైవిధ్యమైన పాత్రలతో అభిమానులకు మరింత చేరువయ్యాడు. చిత్ర సీమలోకి వచ్చిన అతికొద్ది కాలంలోనే స్టార్‌ కథానాయకుడిగా టాలీవుడ్‌లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. ఇటీవల కాలంలో ‘టెంపర్‌’, ‘నాన్నకు ప్రేమతో’, ‘జనతాగ్యారేజ్‌’, ‘జై లవకుశ’, ‘అరవింద సమేత’ చిత్రాలతో వరుసగా విజయాలు అందుకొన్నారు. ‘యమదొంగ’తో పాటు... ‘కంత్రి’, ‘అదుర్స్‌’, ‘రభస’, ‘నాన్నకు ప్రేమతో’ చిత్రాల్లో గీతాలు ఆలపించి గాయకుడిగా కూడా మెప్పించారు ఎన్టీఆర్‌. తెలుగులోనే కాకుండా కన్నడలో పునీత్‌ రాజ్‌కుమార్‌ కథానాయకుడిగా నటించిన ‘చక్రవ్యూహం’ అనే చిత్రంలో కూడా ఎన్టీఆర్‌ పాట పాడారు. లక్ష్మీప్రణతిని 2011 మే 5న వివాహం చేసుకొన్న ఎన్టీఆర్‌కి నందమూరి అభయ్‌రామ్, భార్గవరామ్‌ ఉన్నారు.


 ‘బిందాస్‌’ మనోజ్‌


నవ్వించాలంటే ‘బిందాస్‌’గా కెమెరా ముందుకొస్తాడు మంచు మనోజ్‌. యాక్షన్‌ కథలైతే చాలు... ‘పోటుగాడు’గా మారిపోయి పాత్రల్ని రక్తి కట్టిస్తాడు. ‘నేను మీకు తెలుసా?’, ‘ఊ కొడతారా ఉలిక్కిపడతారా?’ అంటూ ప్రేక్షకుల్ని థ్రిల్‌ చేయడం కూడా ఆయనకి తెలుసు. ‘కరెంటుతీగ’లో ఉన్నంత పవర్‌ మనోజ్‌లో కనిపిస్తుంటుంది. మంచు కుటుంబ వారసుడిగా తెరపైకి వచ్చిన ఆయన మాస్‌ కథానాయకుడిగా ఎదిగారు. ఈమధ్య వరుస పరాజయాలు ఆయన జోరును కాస్త తగ్గించాయి. కానీ సినిమాపై ఆయనకున్న ప్యాషన్‌లో మాత్రం ఏం మార్పులేదు. ఎప్పుడైనా మళ్లీ కెమెరా ముందుకు రావొచ్చు. ప్రముఖ నటుడు మంచు మోహన్‌బాబు రెండో కుమారుడైన మంచు మనోజ్‌ 20 మే 1983లో జన్మించారు. సౌత్‌ ఈస్టర్న్‌ ఓక్లహామా విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్స్‌ డిగ్రీ అందుకొన్న మనోజ్‌... చిన్నప్పుడే ‘మేజర్‌ చంద్రకాంత్‌’ చిత్రంలో నటించారు. ఎన్టీఆర్‌తో కలిసి ఆ చిత్రంలో నటించడం మరిచిపోలేని అనుభూతి అంటుంటారు మనోజ్‌. ఆ తర్వాత ‘అడవిలో అన్న’, ‘ఖైదీగారు’ చిత్రాల్లోనూ బాలనటుడిగా మెరిశారు. 2004లో ‘దొంగ దొంగది’ చిత్రంతో కథానాయకుడిగా పరిచయమయ్యారు. ఆ తర్వాత ‘శ్రీ’, ‘రాజుభాయ్‌’, ‘నేను మీకు తెలుసా?’, ‘ప్రయాణం’, ‘బిందాస్‌’, ‘వేదం’, ‘ఝుమ్మంది నాదం’, ‘మిస్టర్‌ నూకయ్య’, ‘ఊ కొడతారా ఉలిక్కిపడతారా’, ‘పోటుగాడు’, ‘పాండవులు పాండవులు తుమ్మెద’, ‘కరెంట్‌ తీగ’, ‘దొంగాట’, ‘శౌర్య’, ‘అటాక్‌’, ‘గుంటూరోడు’ చిత్రాలు చేశారు. ‘ఒక్కడు మిగిలాడు’ తర్వాత ఆయన సినిమాలేమీ చేయలేదు. ప్రణతిరెడ్డిని ప్రేమించిన మనోజ్‌ ఆమెని 20 మే 2015న పెళ్లాడారు. ఈ రోజు మనోజ్‌ పుట్టినరోజు.

తొలి సినిమా ప్రొజెక్టర్‌సరిగ్గా 128 సంవత్సరాల క్రితం...

తొలి మూవీ ప్రొజెక్టర్‌ ద్వారా ప్రదర్శన జరిగింది!

సినీ చరిత్రలో అదొక మైలురాయిగా నిలిచింది!!

అప్పటికి ఫొటోల్లో బొమ్మ కనిపించడమే ఓ విచిత్రం. అలాంటిది ఆ బొమ్మ కదలడం ఓ అద్భుతమే!

ఆ అద్భుతాన్ని ఆవిష్కరించిన పరికరం పేరు ‘కినెటోస్కోప్‌’. దీన్ని మూవీ ప్రొజెక్టర్‌ అని విస్తృతార్థంలో అనలేకపోయినా, దానికి నాంది పలికిన పరికరం అనుకోవచ్చు. ఆ పరికరానికి ఉన్న ఓ చిన్న కన్నంలోంచి వీక్షకుడు చూసినప్పుడు, అందులోని ఫిలిం వేగంగా కదులుతూ అందులోని ఓ తెరపై కదిలే బొమ్మ కనిపిస్తుంది. దీన్ని తయారు చేసినవాడు ప్రముఖ అమెరికా శాస్త్రవేత్త థామస్‌ ఆల్వా ఎడిషన్‌. దీన్ని తొలిసారిగా ఓ క్లబ్‌లోని మహిళల ముందుకు 1891 మే 20న తీసుకువచ్చారు. దాని ద్వారా ప్రదర్శించిన మూవీ నిడివి కేవలం 3 సెకన్లు మాత్రమే! ఎడిసన్‌ అనుచరుడు డిక్సన్‌ తన తల మీది టోపీని తీసి తలవంచి నవ్వడం అందులో కనిపిస్తుంది. అందుకే దీన్ని ‘డిక్సన్‌ గ్రీటింగ్‌’ అని అంటారు. ఆ తర్వాత దీన్ని మరింత అభివృద్ధి చేసి 1893 మే 9న బ్రూక్లిన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్సెస్‌లో ప్రేక్షకులకు మూవీ ప్రదర్శన చేశారు.

క్లాసిక్‌ హీరో


సినిమా చరిత్రలో అత్యంత గౌరవాన్ని పొందిన నటుడు జేమ్స్‌ స్టెవార్ట్‌. హాలీవుడ్‌ క్లాసిక్‌ సినిమాలతో పరిచయం ఉన్నవారెవరూ అతడి నటనలోని విలక్షణతని, హుందాతనాన్ని మర్చిపోలేరు. నటుడిగా, సైనికాధికారిగా కూడా వ్యవహరించిన ఇతడు రెండు రంగాల్లోనూ తనదైన ముద్ర వేశాడు. దాదాపు 62 ఏళ్ల పాటు నటనా ప్రస్థానం కొనసాగించిన జేమ్స్‌ స్టెవార్ట్, ఆస్కార్‌ సహా ఎన్నో ప్రతిష్ఠాత్మకమైన అవార్డులు అందుకున్నాడు. అమెరికా మధ్య తరగతి వ్యక్తుల ఆశలకు, ఆకాంక్షలకు వెండితెరపై భాష్యం చెప్పిన ఇతడి అభినయానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ‘ద ఫిలడెల్ఫియా స్టోరీ’ (1940) చిత్రంతో ఆస్కార్‌ అందుకున్న ఇతడు, 1985లో అకాడమీ లైఫ్‌టైమ్‌ ఎఛీవ్‌మెంట్‌ అవార్డు పొందాడు. హాలీవుడ్‌లో గొప్ప నటుడిగా పేరొందిన జేమ్స్‌ స్టెవార్ట్‌ నటన చూడాలంటే, ‘ఇట్స్‌ ఎ వండర్‌ఫుల్‌ లైఫ్‌’, ‘రేర్‌ విండో’, ‘వర్టిగో’, ‘మిస్టర్‌ స్మిత్‌ గోస్‌ టు వాషింగ్టన్‌’, ‘హార్వే’, ‘ఎలాటమీ ఆఫ్‌ ఎ మర్డర్‌’ లాంటి సినిమాలు చూడాలి. దాదాపు 92 సినిమాల్లో నటించిన ఇతడు రెండో ప్రపంచ యుద్ధం, వియత్నాం యుద్ధాల్లో పైలెట్‌గా, బ్రిగేడియర్‌ జనరల్‌గా వ్యవహరించాడు. అమెరికా అధ్యక్షుడు రొనాల్డ్‌ రీగన్‌ నుంచి ప్రెసిడెన్షియల్‌ ఆఫ్‌ ఫ్రీడమ్‌ పురస్కారాన్ని అందుకున్నాడు. పెన్సిల్వేనియాలో 1908 మే 20న పుట్టిన జేమ్స్‌ స్టెవార్ట్‌ సినీ చరిత్రలో విలక్షణమైన ముద్ర వేసి, కాలిఫోర్నియాలో తన 89వ ఏట 1997 జులై 2న మరణించాడు.

 పాప్‌ దేవత


మీడియా ఆమెను ‘గాడెస్‌ ఆఫ్‌ పాప్‌’గా అభివర్ణిస్తుంది. మగవాళ్ల ఆధిపత్యం అధికంగా ఉండే పాప్‌ సంగీత ప్రపంచంలో ఒక మహిళగా విజయ కేతనాలు ఎగరేయడమే కాకుండా, మంచి హాలీవుడ్‌ నటిగా కూడా ముద్ర వేసింది. ఆమే ఛెర్‌. పూర్తి పేరు ఛెర్లిన్‌ సర్కిసియన్‌. ఆరు దశాబ్దాలు సుదీర్ఘమైన ప్రస్థానంలో ఆమె గాయనిగా ఉర్రూతలూగించింది, నటిగా నాటకాలు, టీవీలు వెండితెరలపై మెప్పించింది. ఆమె ఆల్బమ్‌లు, పాటలు 10 కోట్లు అమ్ముడుపోయి, పాప్‌ సంగీత ప్రపంచంలో ఓ ప్రభంజనాన్నే మిగిల్చాయి. ‘సిల్క్‌వుడ్‌’, ‘మాస్క్‌’, ‘ద విచెస్‌ ఆఫ్‌ ఈస్ట్‌విక్‌’, ‘మూన్‌స్ట్రక్‌’లాంటి ఎన్నో సినిమాల్లో మెప్పించింది. ఉత్తమ నటిగా ఆస్కార్‌ అవార్డుతో పాటు, ఆమె తన కెరీర్‌లో గ్రామీ, ఎమ్మీ, గోల్డెన్‌గ్లోబ్, కేన్స్, కెన్నడీ సెంటర్‌ లాంటి అవార్డులు, పురస్కారాలు గెలుచుకుంది. కాలిఫోర్నియాలో 1946 మే 20న పుట్టిన ఆమె ఇప్పుడు తన 72వ పుట్టిన రోజును జరుపుకుంటోంది.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.