ఫిబ్రవరి 5.. (సినీ చరిత్రలో ఈరోజు)

* బిగ్‌బి నట వారసుడు..
(అభిషేక్‌ బచ్చన్‌ పుట్టినరోజు - 1975)

నట వారసత్వమన్నది చిత్రసీమలో అడుగుపెట్టడానికి ఓ గోల్డెన్‌ ఛాన్స్‌. అది కష్టాలు లేని సులభమైన సినీ ప్రవేశాన్నే మాత్రమే అందించగలదు.. కానీ, స్టార్‌గా ఎదగాలంటే స్వయం కృషి తప్పదు. ఒకటి రెండు సినిమాలతో సక్సెస్‌ను దక్కించుకొని తన ప్రతిభను నిరూపించుకోలేక పోతే ఎంత పెద్ద స్టార్‌ వారసుడైనా సినీప్రియుల తిరస్కరణకు గురి కావాల్సిందే. దీనికి ఓ ఉదాహరణ అభిషేక్‌ బచ్చన్‌. బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ నట వారసుడిగా తెరపై మెరిసినా.. బిగ్‌బిలా వెండితెరను శాసించలేకపోయాడు. సినీప్రియుల మదిలో ఓ సాధారణ నటుడిగానే మిగిలిపోయాడు. జె.పి.దత్తా దర్శకత్వంలో వచ్చిన ‘రెఫ్యూజీ’ (2000)తో అభిషేక్‌ తొలిసారి బాలీవుడ్‌కు పరిచయమయ్యాడు. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద పెద్దగా ఆకట్టుకోనప్పటికీ.. అభిషేక్‌ నటనకు మంచి పేరు తెచ్చిపెట్టింది. దీని తర్వాత కూడా దాదాపు డజనుకుపైగా సినిమాల్లో నటించినా సరైన విజయాన్ని మాత్రం అందుకోలేకపోయాడు. ఓ దశలో అభిషేక్‌పై ప్లాప్‌ చిత్రాల హీరో అన్న ముద్ర పడింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ‘యువ’, ‘ధూమ్‌’ చిత్రాలు అభిషేక్‌కు మంచి పేరు తీసుకొచ్చాయి. వీటిలో ‘యువ’ (2003) సినిమాతో ఉత్తమ సహాయ నటుడిగా తొలి ఫిలింఫేర్‌ను అందుకోగా.. ‘ధూమ్‌’ (2004) తర్వాత నుంచి వరుస హిట్లను ఖాతాలో వేసుకున్నాడు. 2004 తర్వాత అభిషేక్‌ నుంచి వచ్చిన ‘బంటి ఔర్‌ బబ్లి’, ‘సర్కార్‌’, ‘దస్‌’, ‘బ్లఫ్‌ మాస్టర్‌’ తదితర చిత్రాలన్నీ వరుస విజయాలను అందుకున్నాయి. 2006లో అభిషేక్‌ నటించిన ‘కభి అల్విదా నా కెహనా’.. ఆ సంవత్సరంలోనే అత్యధిక వసూళ్లు నమోదు చేసిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. అంతేకాదు ఉత్తమ సహాయ నటుడిగా రెండో ఫిలింఫేర్‌ను అందుకున్నాడు. ‘పా’ సినిమాలో తన తండ్రి అయిన అమితాబ్‌కు తండ్రిగా నటించి అభిషేక్‌ అందరి ప్రశంసలను అందుకున్నారు. ఈ మూవీతోనే అభి నిర్మాతగానూ మారాడు. కేవలం నటుడు, నిర్మాతగానే కాక గాయకుడిగానూ అభిషేక్‌ పలు చిత్రాల్లో సందడి చేశారు. 2016లో వచ్చిన ‘హౌస్‌ఫుల్‌ 3’ తర్వాత రెండేళ్లపాటు అవకాశాలు రాకపోవడంతో సినిమాలకు దూరమైన అభిషేక్‌.. ఇటీవలే ‘మన్మార్జియాన్‌’ చిత్రంతో బాక్సాఫీస్‌ వద్దకు రీ ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం తన భార్య ఐశ్వర్య రాయ్‌తో కలిసి అనురాగ్‌ కశ్యప్‌ దర్శకత్వంలో ‘గూలాబ్‌ జామున్‌’ అనే సినిమా చేయబోతున్నాడు. 1975 ఫిబ్రవరి 5న ప్రముఖ బాలీవుడ్‌ నటులు అమితాబ్‌ బచ్చన్, జయ బచ్చన్‌ దంపతులకు జన్మించిన అభిషేక్‌ బచ్చన్‌.. చిన్నతనంలో డిస్లెక్సియా అనే వ్యాధితో బాధపడేవాడు. 2007లో బాలీవుడ్‌ నటి, మాజీ విశ్వసుందరి ఐశ్వర్య రాయ్‌ను ప్రేమ వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం వీరిద్దరికీ ఆరాధ్య అనే కుమార్తె ఉంది.

* చార్లీ చాప్లిన్‌ వ్యంగ్యాస్త్రం!


నవ్వుల చక్రవర్తి చార్లీ చాప్లిన్‌ తీసిన ఆఖరి నిశ్శబ్ద చిత్రం...
పారిశ్రామిక విప్లవంపై ఎక్కుపెట్టిన వ్యంగ్యాస్త్రం...
ఫ్యాక్టరీ కార్మికుల కష్టాల నేపథ్యంలో చిందిన హాస్యం...
అదే ‘మోడర్న్‌ టైమ్స్‌’ (1936) సినిమా!

చార్లీ చాప్లిన్‌ రచించి, స్వీయ దర్శకత్వంలో అద్భుతంగా నటించిన ఈ చిత్రం ఇప్పటికీ అలరిస్తుంది.
ప్రపంచంలోని అన్ని సమస్యలకూ పారిశ్రామిక విప్లవమే పరిష్కారమని భావించే పెట్టుబడిదారుల వాదనకు ఈ సినిమా వ్యంగ్యాత్మక సమాధానం. ఓ పక్క టాకీలు విజృంభిస్తున్నా చాప్లిన్‌కు ఎందుకో నిశ్శబ్ద చిత్రాలంటేనే మక్కువ. కానీ మాట్లాడే సినిమా ప్రభావానికి చాప్లిన్‌ కూడా తన పంధాను మార్చుకోక తప్పలేదు. ‘మోడర్న్‌ టైమ్స్‌’ సినిమా కూడా మాటలు లేని సినిమానే అయినా సౌండ్‌ ఎఫెక్ట్స్‌ను పుష్కలంగా వాడాడు చాప్లిన్‌. ఆర్థిక మాంద్యం దేశదేశాల్లో ప్రభావం చూపిస్తున్న కాలంలో ఓ ఫ్యాక్టరీలోని సగటు కార్మికుడి పరిస్థితికి అద్దం పడుతూ చాప్లిన్‌ నవ్వులు పండించాడు. ఆధునికతను అర్థం చేసుకోలేని కార్మికుడిగా రకరకాల ఉద్యోగాలు మారుతూ చేరిన ప్రతిచోట హాస్యం చిందిస్తాడు.

* చాప్లిన్‌ తీసిన గొప్ప చిత్రాల్లో ఒకటిగా పేరుతెచ్చుకున్న ఈ సినిమా ప్రపంచంలోని మేటి హాస్య చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.
* ప్రతి వ్యక్తి మరణించేలోపు చూసి తీరాల్సిన ‘1001’ సినిమాల జాబితాలో ఇది కూడా ఉంది.
* సినిమాలో ఆటోమేటిక్‌ ఫీడింగ్‌ మెషిన్‌ యంత్రాన్ని పరీక్షించడానికి చాప్లిన్‌ను ఎంచుకున్నప్పుడు అది విఫలమయ్యే సన్నివేశం చిత్రానికే హైలైట్‌గా నిలుస్తుంది. దీని చిత్రీకరణకు ఏడు రోజులు పట్టింది.
* ఓ డిపార్ట్‌మెంట్‌ స్టోర్‌ నాలుగో అంతస్తులో చాప్లిన్‌ కళ్లకు గంతలు కట్టుకుని రోలర్‌స్కేటింగ్‌ చేసే సన్నివేశం అద్భుతంగా ఉంటుంది. ఇందుకోసం చాప్లిన్‌ 8 రోజులు ప్రాక్టీస్‌ చేసి మరీ ఆ దృశ్యాలను పండించాడు.

* విలేకరుల ప్రేమ కథ!


అమెరికాలోని ‘న్యూయార్క్‌ క్రానికల్‌’లో రాజకీయ వార్తలు రాసే విలేకరి టెస్‌ హార్డింగ్‌ చాలా చురుకైన అమ్మాయి. అదే పత్రికలో క్రీడా వార్తలు రాసే పాత్రికేయుడు శ్యామ్‌. ఇద్దరి నేపథ్యాలు వేరు. ఇద్దరికీ పడదు. కానీ ఓ ఈవెంట్‌ కోసం ఇద్దరూ కలిసి పనిచేయాల్సి వస్తుంది. ఆ ప్రయత్నంలో ఒకరినొకరు ఇష్టపడతారు. ప్రేమించుకుని పెళ్లి కూడా చేసుకుంటారు. కానీ ఆమెకు పనే సర్వస్వం. ఎప్పుడూ ఇంటర్వ్యూలంటూ, ప్రత్యేక కథనాలంటూ తిరుగుతూ ఉంటుంది. అతడో సగటు మగవాడు. మామూలు వ్యక్తిగత దాంపత్య జీవితాన్ని కోరుకుంటాడు. దాంతో ఇద్దరికీ మనస్పర్థలు మొదలవుతాయి. ఆమె ఓ అనాధ పిల్లాడిని పెంచుకోడానికి ఇంటికి తీసుకొస్తే, అతడికది రుచించకపోయినా ఆ కుర్రాడిని క్రీడాకారుడిగా తీర్చిదిద్దాలనుకుంటాడు. ఈలోగా ఆమెకు ‘ఈ ఏటి మేటి మహిళ’ అవార్డు వస్తుంది. ఆ వేడుకకు అనాథ కుర్రాడిని తీసుకువెళ్లనంటుంది. అతడు తీసుకువెళ్లాలంటాడు. ఇలా మనస్పర్థలు పెరిగి ఇద్దరూ విడిపోతారు. ఇద్దరి మధ్య ఉండలేక అనాధ తన ఆశ్రమానికి వెళ్లిపోతాడు. చివరికి ఆ కుర్రాడి కోసం ఇద్దరూ కలుస్తారు. మానవ సంబంధాలను చక్కగా చిత్రీకరించిన చిత్రం 'వుమన్ ఆఫ్ ది ఇయర్' (1942). ఈ సినిమా ఆస్కార్‌ గెలుచుకోవడంతో పాటు ప్రేక్షకులను ఆకట్టుకుంది.

* సీరియల్‌ సినిమా


టీవీ సీరియల్స్‌ గురించి విన్నారు కానీ, సినిమా సీరియల్స్‌ గురించి విన్నారా? ఒకప్పుడు సినిమా థియేటర్లలో కొన్ని సినిమాలను ఇలా సీరియల్‌లాగా ప్రదర్శించేవారు. వీటిలో పిల్లలకు నచ్చే యానిమేషన్‌ చిత్రాలు, కామిక్‌ హీరోల చిత్రాలు ఉండేవి. ఇలా సీరియల్‌గా వచ్చిన సినిమానే ‘కెప్టెన్‌ అమెరికా’. ఇదొక సూపర్‌హీరో సినిమా. కెప్టెన్‌ అమెరికా పాత్ర మొదట మార్వెల్‌ కామిక్‌ పుస్తకాల ద్వారా ప్రాచుర్యం పొందింది. అతీత శక్తులుంగే ఈ సూపర్‌ హీరో ప్రతి కథలోను దుండగులను ఎదుర్కొని ప్రజలను, దేశాన్ని రక్షిస్తూ ఉంటాడు. ఇది 1944లో విడుదలై సీరియల్‌ సినిమాలుగా ఆకట్టుకుంది. ప్రతి కథలోను కొన్ని పాత్రలు అవే ఉన్నా, కథ మారుతుంటుంది. కెప్టెన్‌ అమెరికా ఎప్పటికప్పుడు చేసే సాహసాలే ఇతివృత్తం.

* ఆస్కార్‌ అందుకున్న తొలి బయోపిక్‌ హీరో!


ఓసారి ఓ నటుడు కోర్టుకు హాజరవ్వాల్సి వచ్చింది. బోనులో నుంచుని ప్రమాణం చేస్తూ... ‘‘ప్రపంచంలోనే గొప్ప నటుడిని అయిన నేను, అంతా నిజమే చెబుతాను...’’ అంటూ ప్రమాణం చేశాడు. అంత ఆత్మవిశ్వాసాన్ని నిజ జీవితంలో చూపించిన నటుడు జార్జి ఆర్లిస్‌. బ్రిటన్‌లో పుట్టి ఆస్కార్‌ అందుకున్న వాళ్లలో తొలి నటుడు కూడా ఇతడే. అంతేకాదు, ఓ బయోపిక్‌ సినిమాలో నటించి తొలిసారి ఆస్కార్‌ అందుకున్న రికార్డు కూడా ఇతడిదే. బ్రిటిష్‌ ప్రధాన మంత్రి బెంజమిన్‌ డిస్‌రైలీ పాత్రలో ఇతడు 1921లో తీసిన ఓ నిశ్శబ్ద చిత్రంలోను, 1929లో తీసిన ఓ టాకీలోను ఇతడే నటించడం విశేషం. లండన్‌లో 1868లో పుట్టిన ఇతడు నటుడిగా, రచయితగా, నాటక కర్తగా, సినీ నిర్మాతగా విజయాలు అందుకున్నాడు. ‘ద డెవిల్‌’ (1921)లో వెండితెరకు పరిచయమైన ఇతడు అటు మూకీల్లోను, ఇటు టాకీల్లోను పలు చిత్రాల ద్వారా గుర్తింపు పొందాడు. ప్రపంచంలోని అరుదైన తొలితరం నటుడిగా పేరొందిన ఇతడు 1946 ఫిబ్రవరి 5న తన 77వ ఏట లండన్‌లో మరణించాడు.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.