మే 25.. (సినీ చరిత్రలో ఈరోజు)


‘పెద్దల’ కథకి మూడు ఆస్కార్లు!


ఆ సినిమా ‘పెద్దలకు మాత్రమే’ తీసిన ‘ఎక్స్‌’ రేటెడ్‌ చిత్రం!
ఇద్దరు పురుషుల అనుబంధంతో కూడిన చిత్రం!
శృంగారం చుట్టూ అల్లుకున్న కథాంశం!
అయితేనేం?
అది మూడు ఆస్కార్‌ అవార్డులను అందుకుంది!
పెద్దల కథతో ఉత్తమ చిత్రంగా నిలిచిన తొలి సినిమాగా గుర్తింపు పొందింది!
ఆస్కార్‌ అందుకున్న తొలి ‘ఎల్‌జీబీటీ’ (లెస్బియాన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్‌జెండర్‌) సినిమాగా నిలిచింది!
100 మేటి సినిమాల జాబితాలో స్థానం సాధించింది!
అమెరికా జాతీయ చలనచిత్ర గ్రంథాలయంలోకి చేరింది!
ఇన్ని విశేషాలున్న ఆ సినిమానే ‘మిడ్‌నైట్‌ కౌబాయ్‌’ (1969).
అమెరికా రచయిత జేమ్స్‌ లియో హెర్లిహై 1965లో రాసిన నవల ఆధారంగా అదే పేరుతో దీన్ని తెరకెక్కించారు.

ఉపాధి కోసం న్యూయార్క్‌ చేరిన ఇద్దరు యువకులు ఎలాంటి మార్గాల్లో ప్రయాణించారనేదే కథ. వారిలో ఒకరు పురుష వ్యభిచారిగా మారితే, మరొకరు గారడీలతో ఇతరులను మోసం చేస్తుంటాడు. ఇద్దరూ స్నేహితులవుతారు. దీన్ని 3.2 మిలియన్‌ డాలర్ల ఖర్చుతో తీస్తే 44.8 మిలియన్‌ డాలర్లు వసూలు చేయడమే కాకుండా మూడు ఆస్కార్లు, ఒక గోల్డెన్‌గ్లోబ్, ఆరు బ్రిటిష్‌ అకాడమీ, ఇంకా పలు ప్రతిష్ఠాత్మకమైన అవార్డులను అందుకుంది.

 

స్టార్‌వార్స్‌ తొలి సందడి!


సినిమా ప్రేక్షకులను తొలిసారిగా నక్షత్ర మండలాలు, గ్రహాంతర వాసులు, నక్షత్ర సామ్రాజ్యాల లోకంలోకి తీసుకుపోయిన సినిమా ‘స్టార్‌వార్స్‌’. ప్రముఖ దర్శకనిర్మాత జార్జిలూకాస్‌ ఊహల్లోంచి పుట్టుకొచ్చిన ఈ కథ కాసుల వర్షం కురిపించడంతో ఆ తర్వాత అదే నేపథ్యంలో ప్రీక్వెల్స్, సీక్వెల్స్‌ బోలెడు వచ్చాయి. ఇంతటి వ్యాపారాత్మక సంచలనానికి నాంది పలికిన ‘స్టార్‌వార్స్‌’ సినిమా 1977లో విడుదలై సంచలన విజయం అందుకుంది. దీనికి సీక్వెల్స్‌గా మరో రెండు సినిమాలు, ప్రీక్వెల్స్‌గా మూడు సినిమాలు వచ్చాయి. తర్వాత దీని పేరును ‘స్టార్‌వార్స్‌: ఎపిసోడ్‌ 4- ఎ న్యూహోప్‌’గా మార్చారు. కేవలం 11 మిలియన్‌ డాలర్లతో తీసిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 775.4 మిలియన్‌ డాలర్లు వసూలు చేసింది. అంతక్రితం ‘జాస్‌’ (1975) పేరిట ఉన్న రికార్డును తిరగరాసింది.

విచిత్ర జీవులతో పోరాటం


భవిష్యతులోని కథ. ఓ అంతరిక్ష నౌక భూమికి తిరిగి వస్తుంటే, ఏదో గ్రహం నుంచి ఓ ప్రమాదానికి సంబంధించిన సంకేతం అందుతుంది. అదేమిటో తెలుసుకుందామని ఆ గ్రహం మీదకి దిగిన వారికి ఓ భయంకరమైన వింత జీవులు కనిపిస్తాయి. వాటిని ఎదుర్కొని ఎలా బయట పడ్డారనేదే కథ. సైన్స్‌ఫిక్షన్‌ హారర్‌ సినిమాగా రూపొందిన ‘ఎలియన్‌’ (1979) కథ ఇది. అకాడమీ, శాటర్న్, హగోలాంటి ఎన్నో అవార్డులను గెలుచుకున్న ఈ సినిమా 11 మిలియన్‌ డాలర్ల పెట్టుబడికి 201.6 మిలియన్‌ డాలర్లు వసూలు చేసింది. దీనికి సీక్వెల్‌్్సగా ‘ఎలియన్స్‌’ (1986), ‘ఎలియన్‌3’ (1992), ‘ఎలియన్‌ రిసరెక్షన్‌’ (1997) సినిమాలు వచ్చాయి. అలాగే ‘ఎలియన్‌ వెర్సెస్‌ ప్రిడేటర్‌’ (2004), ‘ఎలియన్స్‌ వెర్సెస్‌ ప్రిడేటర్‌: రెక్వియమ్‌’(2007), ‘ప్రోమెథియస్‌’ (2012) సినిమాలు కూడా వచ్చాయి.


మహిళా దర్శకురాలి జయకేతనం!అప్పటిదాకా సూపర్‌మ్యాన్‌ మాత్రమే ప్రేక్షకులకు తెలుసు. ఏం, అలాంటి శక్తులు ఓ మహిళకు ఉండకూడదా? ఆ మహిళ తన అపూర్వ శక్తులతో దుష్టులను దునుమాడకూడదా? ఈ ఆలోచనను వెండితెరపైకి తర్జుమా చేసిన సినిమా ‘వండర్‌ ఉమన్‌’ (2017). దీనికి ఓ మహిళ దర్శకత్వం వహించడం విశేషం.అందుకే ఇది తొలిసారిగా ఒక మహిళ దర్శకత్వం వహించిన సూపర్‌హీరో చిత్రంగా గుర్తింపు పొందింది. దీనికి ప్యాటీ జెన్‌కిన్స్‌ దర్శకత్వం వహించారు. అందాల తార గాల్‌గాడట్‌ నటించిన ఈ సినిమా 150 మిలియన్‌ డాలర్ల పెట్టుబడికి ప్రపంచవ్యాప్తంగా 821 మిలియన్‌ డాలర్లు వసూలు చేసింది. దీనికి సీక్వెల్‌గా ‘వండర్‌ ఉమన్‌ 1984’ సినిమాను 2020 జూన్‌ 5న విడుదల చేయనున్నారు. అమెజాన్‌ దీవిలో ఓ యోధురాలిగా ఎదిగిన యువరాణికి కూలిపోయిన విమానంలోని పైలట్‌ ద్వారా తన జన్మ రహస్యం తెలుస్తుంది. ఆమె తన శక్తులేంటో తెలుసుకుని ప్రపంచానికి ఎదురైన ముప్పును నివారించడమే కథ.

మరువలేని గాయకుడు
 టి.ఎమ్‌. సౌందరరాజన్‌ (వర్ధంతి-2013).తొగులువ మీనాక్షి ఐయ్యంగార్‌ సౌందరరాజన్‌ గొప్ప కర్ణాటిక సంగీతకారుడిగా, సినీగాయకుడిగా ఆరు దశాబ్దాల పాటు ఎన్నో గీతాలు పాడారు. దక్షిణ భారత సినీ దిగ్గజాలైన ఎమ్‌.జి. రామచంద్రన్, ఎన్‌.టి. రామారావు, జెమినీ గణేశన్, అక్కినేని నాగేశ్వరరావు తదితరులతో పాటు, కమలహాసన్, రజనీకాంత్‌ తదితర కథానాయకులకు కూడా గాత్రదానం చేశారు. పదకొండు భాషల్లో పాటు పాడారు. ఆయన సంగీత దర్శకత్వంలో ఎన్నో జనరంజకమైన పాటలు, భక్తిగీతాలు వెలువడ్డాయి. 88 ఏళ్ల వయసులో సుశీలతో కలసి చివరిసారిగా పాడారు. తన 91 ఏళ్ల వయసులో అనారోగ్యంతో చెన్నైలో మరణించారు.


సృజనాత్మక సంతకం!
కరణ్‌ జోహార్‌ (పుట్టినరోజు)
దర్శకుడిగా, నిర్మాతగా, రచయితగా, కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా, నటుడిగా, టీవీ వ్యాఖ్యాతగా వ్యవహరించే బహుముఖ సృజనశీలి కరణ్‌ జోహార్‌. బాలీవుడ్‌ నిర్మాత, ధర్మాప్రొడక్షన్స్‌ అధినేత యాష్‌జోహార్‌ కుమారుడు. కరణ్‌ సరోగసీ విధానం ద్వారా కుమారుడు యాష్, కూతురు రూహిలకు తండ్రయ్యాడు. తొలిసారి ‘కుచ్‌కుచ్‌ హోతాహై’ (1998)తో దర్శకుడయ్యాడు. ఇది సూపర్‌ హిట్టయ్యింది. బెస్ట్‌ పాపులర్‌ సినిమాగా దీనికి జాతీయ అవార్డు కూడా వచ్చింది. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడి విభాగాల్లో ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులు కూడా అందుకుంది. ‘కభీ కుషీ కభీ ఘమ్‌’ (2001), ‘కభి అల్విదనా కెహనా’ (2006), ‘మై నేమ్‌ ఈజ్‌ ఖాన్‌’ (2010), ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ (2012), ‘ఏ దిల్‌హై ముష్కిల్‌’ (2016) తదితర చిత్రాలు కరణ్‌వే. గతేడాది ‘లస్ట్‌ స్టోరీస్‌’, ‘రాజీ’, ‘ధడక్‌’, ‘సింబా’ వంటి చిత్రాలతో బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ వద్ద వరుస విజయాలు అందుకున్న కరణ్‌.. ఈ ఏడాది ‘కేసరి’ చిత్రంతో మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు. ఇక భారీ అంచనాల మధ్య విడుదలైన ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2’, ‘కళంక్‌’ మాత్రం తీవ్రంగా నిరాశపరిచాయి. ప్రస్తుతం ఈ స్టార్‌ డైరెక్టర్‌ కం ప్రొడ్యూసర్‌ ‘గుడ్‌ న్యూస్‌’, ‘డ్రైవ్‌’, ‘బ్రహ్మాస్త్ర’, ‘తఖ్త్‌’ వంటి క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఈయన బుల్లితెర వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘కాఫీ విత్‌ కరణ్‌’ కార్యక్రమం అత్యంత ప్రజాదరణ పొందింది. 1972 మే 25న జన్మించిన కరణ్‌.. నేడు 48వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు.

మేటి అవార్డుల నటుడు!


ఆరు లారెన్స్‌ ఆలివర్‌ అవార్డులు... ఒక టోనీ అవార్డు... ఓ గోల్డెన్‌గ్లోబ్‌ అవార్డు... స్క్రీన్‌ యాక్టర్స్‌గిల్డ్‌ అవార్డు... బ్రిటిష్‌ ఇండిపెండెంట్‌ ఫిలిం అవార్డు... రెండు శాటర్న్‌ అవార్డులు... నాలుగు డ్రామా డెస్క్‌ అవార్డులు... రెండు క్రిటిక్స్‌ ఛాయిస్‌ అవార్డులు... బ్రిటిష్‌ ప్రభుత్వం నుంచి ‘ఆర్డర్‌ ఆఫ్‌ ద బ్రిటిష్‌ ఎంపైర్‌’ గౌరవంతో పాటు ‘సర్‌’ బిరుదు...
ఇన్నేసి పురస్కారాలతో ప్రపంచ వ్యాప్తంగా గురింపు పొందిన నటుడే ఇయాన్‌ మెకొల్లన్‌. బ్రిటన్‌కు చెందిన గొప్ప నటుల్లో ఒకరైన ఇయాన్‌ మెకొల్లెన్‌ ‘లార్డ్‌ ఆఫ్‌ ద రింగ్స్‌ ’, ‘ఎక్స్‌మెన్‌’, ‘ద డావిన్సీ కోడ్‌’ చిత్రాల ద్వారా అంతర్జాతీయ సినీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇంగ్లండ్‌లో 1939 మే 25న పుట్టిన ఇతడు నాటక రంగం, బుల్లితెర, వెండితెరలపై విలక్షణ నటుడిగా తనదైన ముద్ర వేశాడు.

 

బాల నటుడిగా వచ్చి... కథానాయకుడిగా మెప్పించి
 కునాల్‌ఖేము (పుట్టిన రోజు)


కథానాయకుడిగా చేసింది పట్టుమని పాతిక చిత్రాలే అయినా నటుడిగా బాలీవుడ్‌ తెరపై తనదైన ముద్ర వేశాడు కునాల్‌ ఖేము. 1993లో వచ్చిన ‘సర్‌’ చిత్రంతో బాల నటుడిగా వెండితెరపై మెరిసిన ఈ యువ నట కిరణం.. ఆ తర్వాత ఆమీర్‌ ఖాన్‌ ‘రాజా హిందుస్థాని’, సునీల్‌ శెట్టి ‘భాయ్‌’, అజయ్‌ దేవగణ్‌ ‘జఖ్మ్‌’ వంటి హిట్‌ చిత్రాల్లో హీరో చిన్నప్పటి పాత్రల్లో కనిపించి మెప్పించాడు. ఇక కునాల్‌ తొలిసారి కథానాయకుడిగా నటించిన తొలి చిత్రం ‘కల్‌యుగ్‌’. హాలీవుడ్‌ హిట్‌ మూవీ ‘8ఎంఎం’ స్ఫూర్తితో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద మిశ్రమ ఫలితాన్ని అందుకున్నప్పటికీ నటుడిగా ఖేముకు మంచి పేరు తెచ్చిపెట్టింది. దీని తర్వాత ‘ట్రాఫిక్‌ సిగ్నల్‌’ చిత్రంతో తొలిసారి సోలో హీరోగా తెరకు పరిచయమయ్యాడు. ఈ సినిమా బాక్సాఫీస్‌ ముందు మంచి విజయం సాధించడంతో కునాల్‌కు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ చిత్రానికి గానూ దర్శకుడు మధు బండార్కర్‌ బెస్ట్‌ డైరెక్టర్‌గా జాతీయ అవార్డును కూడా అందుకున్నారు. దీని తర్వాత వచ్చిన ‘ధోల్‌’ కూడా కునాల్‌కు మంచి విజయాన్ని అందించింది. ఇక ఇక్కడి నుంచి పడుతూ లేస్తూ సాగిన ఖేము సినీ ప్రయాణంలో ‘99’, ‘గోల్‌మాల్‌ 3’, ‘గో గోవా గాన్‌’, ‘గోల్‌మాల్‌ ఎగైన్‌’ వంటి చెప్పుకోదగ్గ విజయాలున్నాయి. తాజాగా ‘కళంక్‌’ చిత్రంతో సందడి చేసిన కునాల్‌ ఖేము.. ప్రస్తుతం ‘గో గోవా గాన్‌ 2’ చిత్రంలో నటించబోతున్నాడు. 2015లో నటి సోహా అలీ ఖాన్‌ను వివాహం చేసుకున్నాడు. 1983 మే 25న జన్మించిన కునాల్‌.. నేడు 36వ జన్మదినాన్ని జరుపుకుంటున్నాడు.

 బహుముఖ ప్రజ్ఞాశాలి...
సునీల్‌ దత్‌ (వర్ధంతి)


బాలీవుడ్‌ నటుడు, దర్శకుడు, రాజకీయ నాయకుడు సునీల్‌ దత్‌ వర్థంతి. ‘యాదే’, ‘మదర్‌ ఇండియా’, ‘ఖాన్‌దాన్‌’ ‘వక్త్‌’, ‘గుమ్‌రాహ్‌’ తదితర చిత్రాల ద్వారా చిరపరిచితుడు. తన 75వ ఏట 2005లో మరణించారు. నర్గీస్‌ను వివాహమాడిన ఈయనకు కొడుకు సంజయ్‌దత్, కూతుళ్లు ప్రియాదత్, నమ్రత దత్‌ సంతానం.

(ప్రత్యేక కథనం కోసం క్లిక్‌ చేయండి...)Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.